నేరాలకు అడ్డుకట్ట వేయండి
– త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
కర్నూలు: నేరాల సంఖ్య తగ్గించడానికి విధుల్లో చురుగ్గా పని చేయాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. ఆదివారం ఉదయం నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకొని త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సీఐ మధుసూదన్‌రావుకు సూచించారు. వివిధ నేరాల్లో పట్టుబడి సీజ్ చేసిన వాహనాల వివరాలను పూర్తిగా సేకరించి సంబంధిత యజమానులకు అప్పగించాలని అందుకు ఎవరూ ముందుకు రాకపోతే వేలం వేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సూచించారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
నిరాశ్రయుల వసతి గృహానికి అనాథలు :
బళ్లారి చౌరస్తాలోని ఫ్లైఓవర్ బ్రిడ్జీ కింద అనాథగా జీవనం సాగిస్తున్న లక్ష్మిని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదివారం నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించారు. ప్రేమించిన వ్యక్తి వివాహం చేసుకున్నప్పటికీ అతను వదిలేయడంతో లక్ష్మి ఫ్లై ఓవర్ బ్రిడ్జీ కింద ముగ్గురు పిల్లలతో రోడ్డున పడి జీవనం సాగిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ ఆకె రవికృష్ణ అక్కడికి చేరుకొని నాల్గవ పట్టణ పోలీసులు 1098 చైల్డ్‌లైన్ సిబ్బందిని పిలిపించి లక్ష్మి వివరాలను సేకరించారు. ఆమెకు జీవన సదుపాయం కల్పించేందుకు సీతారామ్‌నగర్ దగ్గర గల శకుంతలమ్మ ఆధ్వర్యంలో నడుస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించారు. నాల్గవ పట్టణ సీఐ నాగరాజురావు, చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంటు అధికారి వరలక్ష్మి, 1098 చైల్డ్‌లైన్ డైరెక్టర్ మోహన్‌రాజు, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలక్ష్మినారాయణ, అంగన్‌వాడీ టీచర్ వెంకటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు.