మెజార్టీ పోలీసులకు నేను మిత్రున్ని..
♦ జిల్లా ఎస్పీ రవికృష్ణను ఏనాడూ కించపరిచి మాట్లాడలేదు
♦ చట్టం గురించి ప్రశ్నిస్తే సంకెళ్లా
♦ రూల్స్ పోలీసులకు వర్తించవా
♦ వీడియో పుటేజీ ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
♦ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి
రాజకీయ పార్టీల గాలికి వ్యతిరేకంగా గెలుపు
కులమతాలకు అతీతంగా తమ గెలుపులో ప్రజలు కీలక భూమిక పోషించారన్నారు. రాజకీయ పార్టీల గాలికి వ్యతిరేకంగా గెలిచిన ఘనత కూడా తమ కుటుంబానికే దక్కిందన్నారు. ఎస్పీ ఇప్పుడు చేస్తున్న ప్రచారం, తన ప్రత్యర్థులు ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ చేసి విఫలమయ్యారన్నారు. నిజంగానే డీఎస్పీ దేవదానం కులం తనకు తెలియదన్నారు. ఆయనపై అంతటి అభిమానమే ఉంటే రెగ్యులర్ డీఎస్పీగా ఎందుకు నియమించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి డీఎస్పీ దేవదానం కులాన్ని పదేపదే చెప్పడం ఎస్పీకి తగదన్నారు.
నంద్యాల : మూడు దఫాలు పార్లమెంట్‌కు, నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికయ్యానంటే ప్రజాబలంతోనే సాధ్యమైందని.. దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఇన్నిసార్లు గెలుపు వరించేది కాదనే విషయం జిల్లా ఎస్పీ రవికృష్ణ గుర్తుంచుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నంద్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధులను, రెవెన్యూ అధికారులను పోలీసులు డామినేట్ చేసినప్పుడు.. చట్ట ప్రకారం తాను ప్రశ్నిస్తే ఎస్పీ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల విధుల్లోని రెవెన్యూ అధికారులను పోలీసులు డామినేట్ చేసిన విషయాన్ని వీడియో ఫుటేజీల ఆధారంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు.
ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ స్టాల్‌లో కూర్చొన్న ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియను బయటకు పంపేందుకు పోలీసులు అధికారం ఎవరిచ్చారో చెప్పాలన్నారు. పోలీసులు తనను కూడా వెయిటింగ్ స్టాల్‌లో కూర్చోనివ్వలేదన్నారు. అదే విషయం వారికి చెప్పగా.. ఆర్డీఓ వచ్చి ఓటు వేయాలని కోరడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం గౌరవించానన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ప్రకటించిన రెండు గంటల తర్వాత తనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించడం వెనుక ఎవరి డెరైక్షన్ ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. పోలీసు శాఖలో ఉన్నంత మిత్రులు మరెక్కడా లేరనే విషయం ఎస్పీ తెలుసుకోవాలన్నారు.
ద్వేషించే వారు ఒకరిద్దరు ఉంటే.. అభిమానించే వారి సంఖ్య 95 మందికి పైమాటేనన్నారు. ఎస్పీ బాధపడేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదని, అయితే ఆయన ఎందుకు అంతలా కక్ష పెంచుకున్నారో వేయి డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. తనను అరెస్టు చేయడానికి ఇల్లు, ప్రభుత్వాసుపత్రి వద్ద వందల సంఖ్యలో పోలీసులను నియమించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బాధాకరమన్నారు. ఆ సందర్భంగా ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయవద్దని క్యాడర్‌కు స్వచ్ఛందంగా పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఇమెజ్ అంతలా పెరుగుతుందన్నారు. పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానని.. ఎస్పీ మరోసారి రాజకీయ నాయకుడిలా ప్రకటనలు చేస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు.
దౌర్జన్యం చేస్తే గెలుపు వరించదు
Published Sat, Jul 11 2015 3:53 AM | Last Updated on Tue, Oct 30 2018 4:15 PM
Advertisement
Advertisement