
'నువ్వు అరిస్తే ఏమీ కాదు.. '
హైదరాబాద్: ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పట్ల డీఎస్పీ అగౌరవంగా మాట్లాడారని డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు.
శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో ఉన్న భూమా నాగిరెడ్డిని 'నువ్వు అరిస్తే ఏమీ కాదు' అంటూ డీఎస్పీ ఏకవచనంతో మాట్లాడారని, ఎమ్మెల్యేలతో మాట్లాడేతీరు ఇదేనా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డితో అగౌరవంగా మాట్లాడిన విషయం వీడియో రికార్డులో స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. భూమా కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో పోలీసులు దురుసుగా వ్యవహరించారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మహిళా ఎమ్మెల్యేతో ఇలా ప్రవర్తించడం సరికాదని రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. ఈ విషయంపై పోలీసులను గట్టిగా ప్రశ్నించినందుకే భూమా నాగిరెడ్డిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని రాజేంద్రనాథ్ రెడ్డిఆవేదన వ్యక్తం చేశారు.