ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం
– రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక
కర్నూలు: దందాలు, దౌర్జన్యాలకు దూరంగా ఉండాలని.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఆకె రవికృష్ణ రౌడీషీటర్లను హెచ్చరించారు. బుధవారం రాత్రి కర్నూలు నగరం 3వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్, గణేష్‌నగర్ కాలనీల్లో ఆయన కలియతిరిగారు. శాంతి భద్రతల విషయమై కాలనీవాసులతో చర్చించారు. శ్రీరామ్‌నగర్‌కు చెందిన ఇమ్మానియేల్(ఇమ్మి)పై డిసెంబర్ 17న కొందరు వ్యక్తులు ముఖాలకు మాస్క్‌లు వేసుకొని దాడిచేశారు. గణేష్‌నగర్‌లోని స్నేహితుని ఇంట్లో తలదాచుకొని ఉండగా.. అడ్రస్ తెలుసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారు. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేత బంధువులు దాడి చేసినట్లు విచారణలో వెల్లడయింది. ఈ విషయాన్ని బాధితుడు నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో 3వ పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదయింది. సమస్యకు కారణం ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఘటనపై ఆరా తీయాలని మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావును ఎస్పీ ఆదేశించారు. దాడికి కారణమైన వారిపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచాలన్నారు. రౌడీషీటర్ వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయితే నేరుగా లేదా ఫోన్ ద్వారా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. డీఎస్పీలు రమణమూర్తి, బాబు ప్రసాద్, సీఐ మధుసూదన్‌రావు తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.