
రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ చింటూ హత్య కేసులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్లో నగర డీఎస్పీ పి.సింధుప్రియ, స్థానిక ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డితో కలిసి హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను వెల్లడించారు. పాత వేదాయపాళేనికి చెందిన అరవభూమి సుజన్ కృష్ణారెడ్డి అలియాస్ చింటూ (28) రౌడీషీటర్. అతడిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులున్నాయి. చింటూకు ఇందిరాగాంధీనగర్‌కు చెందిన కృష్ణసాయి అలియాస్ కిట్టు స్నేహితుడు.
వీరి మధ్య విభేదాలున్నాయి. చింటూ గతంలో కిట్టు ఇంటికి వెళ్లి గొడవపడి చంపుతానని అందరిముందు బెదిరించాడు. అవమానంగా భావించిన కిట్టు ఈ విషయాన్ని తన స్నేహితులైన కొత్తూరు రామకోటయ్యనగర్‌కు చెందిన కరిముల్లా, ఇందిరాగాంధీనగర్‌కు చెందిన షేక్ మహ్మద్‌బాబా, వెంగళరావ్‌నగర్‌కు చెందిన జి.పవన్, ఫ్రాన్సిన్ అనిక్‌రాజ్ అలియాస్ అనిక్‌రాజ్, మనుబోలు మండలం కోదండరామపురానికి చెందిన కె.సాయితేజకు జరిగిన విషయాన్ని చెప్పాడు. అందరూ కలిసి చింటూ హత్యకు పథక రచన చేశారు.
మాట్లాడాలని పిలిచి..
చింటూ ఇందిరాగాంధీనగర్‌లోని ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమెను కొందరు ఇబ్బందులు పెడుతుండగా ఆ విషయమై మాట్లాడదామని కిట్టు ఈనెల 14వ తేదీ రాత్రి చింటూను ఇందిరాగాంధీనగర్ రెండో వీధికి పిలిచాడు. అక్కడే కాపుకాసిన నిందితులు చింటూ రాగానే కత్తులతో విచక్షణారహితంగా నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించారు. మంగళవారం వెంగళరావ్‌నగర్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితులపై త్వరలో రౌడీషీట్లు తెరుస్తామని డీఎస్పీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment