ఆడపిల్లలు పుట్టారని వేధింపులు
– పోలీసు దర్బార్‌ను ఆశ్రయించిన మహిళ
కర్నూలు: ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని తన భర్త వేధిస్తున్నారని, అంతేకాకుండా వారిని వదిలించుకునేందుకు గొంతు నులిమి హత్య చేసే యత్నం కూడా చేస్తున్నారని దేవనకొండ మండలం నల్లచెలిమల గ్రామానికి చెందిన సుంకులమ్మ... ఎస్పీ ఆకె రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీసు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 94407 95567 సెల్ నెంబరుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు నేరుగా వచ్చి కలిసిన ప్రజల నుంచి సమస్యలపై వినతులను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నల్లచెలిమల గ్రామానికి చెందిన సుంకులమ్మ తన కష్టాన్ని ఎస్పీకి విన్నవించారు. తన భర్త ప్రతి రోజూ పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తూ అడ్డుకోబోయిన తనను కూడా దుర్భాషలాడుతూ భౌతిక దాడులు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులు భరించలేక కొద్దిరోజులుగా తాను పుట్టినింటిలో ఉంటున్నానని, ఇదే అవకాశంగా తీసుకొని రెండు నెలల క్రితం తన భర్త మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడని తెలిపారు. పిల్లలకు బతుకుతెరువు చూపించి న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు.
-
సంతకాన్ని ఫోర్జరీ చేసి రెండో కుమారుడు తన వ్యవసాయ భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆక్రమించుకున్నాడని కృష్ణగిరి మండలం కర్లకుంట గ్రామానికి చెందిన లక్ష్మమ్మ ఫిర్యాదు చేసింది. తన భూమిని తనకు వెనక్కు ఇప్పించాలని వేడుకొంది.
-
భర్త తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురం చక్కబెట్టాలని రుద్రవరం గ్రామానికి చెందిన ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
-
అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడచులు కలిసి పెళ్లైనప్పటి నుంచి వేధిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన నీలి వెంకట పుష్పలత ఫిర్యాదు చేశారు. వేధింపులు భరించలేక కొంతకాలంగా పుట్టింటిలో ఉంటున్నానని, అయితే భర్త అతని స్నేహితులతో కలిసి తనను, తల్లిదండ్రులను చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు.