ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
Published Sat, Jun 17 2017 10:39 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
ఎస్పీ ఆకే రవికృష్ణ
కర్నూలు: కర్నూలును ప్రమాద, ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం ఉదయం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాద దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించి వాటిని తెరపై ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర ఆధ్వర్యంలో ఓ డాక్యుమెంటరీ తయారు చేశారు. అతి వేగంగా వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, సీటుబెల్టు, హెల్మెట్ ధరించాలని యువకులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడం కోసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.
జిల్లాలో సుమారు 600 మంది ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, 2,500 మందికి పైగా క్షతగాత్రులవుతున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నటు వెల్లడించారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ర్యాగింగ్ జరిగితే కళాశాల యాజమాన్యాలదే బాధ్యత అన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యల కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపల్ శౌరిల్‌రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, సీఐలు మహేశ్వరరెడ్డి, కృష్ణయ్య, శేఖర్‌రావు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement