trafic rules
-
'చేజారిన కొడుకు'..! రోడ్డు ప్రమాదాలపై స్పెషల్ సాంగ్ రిలీజ్..!
కరీంనగర్: ఈ ఏడాది జూలై 4న సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ఓ యువకుడు బైక్ అతివేగంగా నడుపుతున్నాడు. మరో యువకుడు దానిపై కూర్చున్నాడు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలై ఇద్దరూ చనిపోయారు. ఓ వారం రోజుల తర్వాత.. జగిత్యాల బైపాస్‌రోడ్డుకు చెందిన ఓ బాలుడి తండ్రి గల్ఫ్ నుంచి వచ్చాడు. అదేరోజే మంచినీళ్ల కోసమని ఆ బాలుడు ద్విచక్ర వాహనంపై వాటర్ ప్లాంట్‌కు బయలుదేరి వెళ్లాడు. అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని మృతిచెందాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన కొన్ని క్షణాల్లోనే కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరు కావడం బాధించింది. ► నేను చదువుకున్న రోజుల్లోనే చిన్నచిన్న కవితలు రాశా. పాఠశాల, కళాశాల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా. అందుకే ప్రమాదాల నియంత్రణకు ఓ పాట రాయాలని సంకల్పించా. మంచి పాట రాశా. ► వీలైనంత వరకు అతిత్వరగా రోడ్డు ప్రమాద ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులకు సూచిస్తున్నా. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని చెబుతున్నా.. ముఖ్యంగా తక్షణమే స్పందించాలని ఘటనా స్థలాల్లో ఉండే ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా. సీపీఆర్‌పై వివరిస్తున్నా. ప్రజల్లో చైతన్యం తెస్తున్నా. ► హైదరాబాద్‌లో కొంతకాలం ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా సేవలు అందించా. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం అక్కడ షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించా. వాటిని ప్రదర్శిస్తూ ట్రాఫిక్ నిబంధనలు, జాగ్రత్తలు తీసుకునేలా యువతలో చైతన్యం తీసుకొచ్చా. జగిత్యాల జిల్లాలోనూ ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇంజినీరింగ్, ట్రాన్స్పోర్ట్ శాఖల అధికారులతో కలిసి హాట్స్పాట్లు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. ► కొందరు యువకులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఇలాంటి వారికి ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో షార్ట్‌ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. యువతే కాదు.. ఎవరైనా ట్రాఫిక్ నిబంనలు పాటించాలి. సురక్షితంగా గమ్యస్థానం చేరాలి. అదే మా లక్ష్యం. - ‘సాక్షి’తో ఎస్పీ భాస్కర్ -
సండే.. ట్యాంక్‌బండ్ మీదే!
సాక్షి, సిటీబ్యూరో: ఆదివారాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్‌బండ్ వాహనాలకు నో ఎంట్రీ జోన్‌గా మారనుంది. ఆ సమయాల్లో కేవలం సందర్శకుల్ని మాత్రమే అనుమతించేలా ట్రాఫిక్ పోలీసులు కసరత్తులు చేస్తున్నారు. అశోక్ చంద్రశేఖర్ అనే నెటిజన్ ఈ ప్రతిపాదనలను కేటీఆర్‌కు మంగళవారం ట్వీట్ చేశారు. ‘మంచి సలహా’ అంటూ సానుకూలంగా స్పందించిన ఆయన..నగర పోలీసు కమిషనర్‌కు రీ–ట్వీట్ చేశారు. ఆయన నుంచి ఆదేశాలు అందుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తూ, ఈ సూచనల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఈ అంశంపై బుధవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించి, నిర్ణయం తీసుకోనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ తెలిపారు. విహార కేంద్రాల్లో కీలక ప్రాంతం.. నగరంలోని విహార ప్రాంతాల్లో ట్యాంక్‌బండ్ కీలకమైంది. ఇక్కడకు అనునిత్యం నగరానికి చెందిన వాళ్ల కుటుంబాలే కాకుండా పర్యాటకులూ పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. లిబర్టీ వైపు ఉన్న అంబేడ్కర్ విగ్రహం జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు ఉన్న వైశ్రాయ్ చౌరస్తా వరకు 2.6 కిలోమీటర్ల పొడవుతో ట్యాంక్‌బండ్ విస్తరించి ఉంటుంది. ఆద్యంతం పూర్తిస్థాయిలో సరాసరిన, ఎలాంటి టర్నింగ్స్ లేకుండా ఉండే రహదారి ఇది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రభుత్వం ఇటీవల కొత్త హంగుల్ని ఏర్పాటు చేసింది. దీంతో వారాంతాల్లో వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ట్రాఫిక్‌తో తీవ్ర ఇబ్బందులు... జంట నగరాలను కలిపే కీలక రహదారుల్లో ట్యాంక్‌బంక్ కూడా ఒకటి కావడంతో ఈ మార్గం అనునిత్యం రద్దీగా ఉంటుంది. ఒకప్పుడు దీంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పని దినాలతో పోలిస్తే ఆదివారం 25 శాతం ట్రాఫిక్ మాత్రమే ఉండేది. అయితే ఇటీవల కాలంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆ రోజునా ట్రాఫిక్ రద్దీ గరిష్టంగా 75 శాతానికి చేరుతోంది. ఫలితంగా కుటుంబాలతో ట్యాంక్‌బండ్ మీదికి విహారానికి వచ్చే వారికి అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని అశోక్ చంద్రశేఖర్ తన ట్వీట్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ రెండే ప్రధాన సమస్యలు... వాస్తవానికి చార్మినార్ మాదిరిగా ట్యాంక్‌బండ్‌ను కూడా పాదచారుల జోన్‌గా మార్చాలని ట్రాఫిక్ విభాగం అధికారులు కొన్నాళ్లుగా యోచిస్తున్నారు. అయితే అక్కడ మాదిరిగా అన్ని రోజులూ కాకుండా కేవలం ఆది వారాల్లోనే దీన్ని అమలు చేయాలని భావించారు. తాజాగా ఇదే విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేయడంతో చర్యలు వేగవంతమయ్యాయి. ట్యాంక్‌బండ్‌ను ఆదివారం సాయంత్రం వాహనాలకు నో ఎంట్రీ జోన్‌గా మార్చడానికి రెండు ప్రధాన సవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సందర్శకుల వాహనాలను ఎక్కడ వరకు అనుమతించాలి? వీరికి పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చే యాలి? అనే సవాళ్ల పైనే దృష్టి పెట్టిన ట్రాఫిక్ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించారు. ఏళ్లుగా నిమజ్జనం రోజు అమలు... ప్రతి ఏడాదీ వినాయక నిమజ్జనంతో పాటు అవసరాన్ని బట్టి ఆ మరుసటి రోజు హుస్సేన్‌సాగర్ చట్టుపక్కల ప్రాంతాల్లోకి సాధారణ వాహనాలు అనుమతించరు. అప్పట్లో ట్రాఫిక్ మళ్లింపులు చేసే ప్రాంతాలపై అధికారులు దృష్టి పెట్టారు. రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి, రాణిగంజ్ వైపు వెళ్లే మార్గాలను పీవీ మార్గ్ మీదుగా పంపాలని యోచిస్తున్నారు. ఆయా మార్గాల్లో అధ్యయనం చేస్తున్న ట్రాఫిక్ విభాగం బృందాలు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, చక్కదిద్దాల్సిన అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఖరారైన తర్వాత దీని అమలుపై నోటిఫికేషన్ జారీ చేస్తామని, విస్తృత ప్రచారం కల్పిస్తామని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Dalit Bandhu: హుజురాబాద్‌కు మరో రూ.500 కోట్ల నిధులు -
ట్రక్కు 6.53 లక్షల జరిమానా
భువనేశ్వర్: ఒడిశాలోని సంభల్‌పూర్‌లో శనివారం నాగాలాండ్‌కు చెందిన ఓ లారీపై రూ.6.53 లక్షల జరిమానా విధించి పోలీసులు కొత్త రికార్డు సృష్టించారు. ట్రాఫిక్ నిబంధనలు ఏడింటిని ఉల్లంఘించారన్న కారణంగా ఇంతటి భారీ జరిమానా వేశారు. ఐదేళ్లుగా రోడ్ ట్యాక్స్ కట్టని కారణంగా ఎన్ఎల్ 08డీ 7079 నెంబరు ఉన్న ట్రక్‌పై రూ.6.40 లక్షల జరిమానా విధిస్తూ సంభల్పూర్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి చలాన్ రాశారు. వాహనాన్ని దిలీప్ కర్తా అనే డ్రైవర్ నడుపారు. యజమాని పేరు శైలేశ్ గుప్తా. దీంతోపాటు రూ.వంద సాధారణ జరిమానాగా, ఆదేశాలను ఉల్లంఘించినందుకు రూ.500, వాయు, శబ్ద కాలుష్య ఉల్లంఘనలకు రూ.1000, సరుకులు రవాణా చేయాల్సిన వాహనంలో ప్రయాణీకులను తీసుకెళుతున్నందుకు రూ.5000, పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.5000, పర్మిట్ నిబంధనలను పాటించనందుకు రూ.1000 జరిమానా విధించినట్లు రసీదులో ఉంది. -
ఒకే కారుపై 64 చలాన్లు
గోల్కొండః ఒక కారు పై 64 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు పెండింగ్‌లో ఉన్న సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బుధవారం గోల్కొండ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు కారుకు సంబందించిన పత్రాలను తనిఖీ చేయగా సదరు వాహనంపై వివిధ రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన 64 ఛలాన్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ. 64 వేలు బకాయి ఉన్నట్లు తెలిపారు. -
‘పెద్దోళ్ల’కో రూల్.. మాకో రూలా..?
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడు కనబడితే నిబంధనలు గుర్తు చేసి, చలాన్లతో వాయించే ట్రాఫిక్ సిబ్బంది కారులో షికారు చేసే బడా వ్యాపారులకు సలాం చేస్తున్నారని శుక్రవారం జరిగిన ఓ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. వివరాలు.. శుక్రవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వ్యాపారి కారును సీజ్ చేయకుండా పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనల్లో సామాన్య జనం దొరికితే వారి వాహనాలను ఈడ్చుకెళ్లి సీజ్ చేస్తారనీ, వ్యాపారి వాహనాన్ని క్రేన్ సాయంతో కాకుండా రాచమర్యాదలతో స్టేషన్‌కు తరలించారని ఘటనకు సాక్ష్యంగా నిలిచిన జనం మండిపడుతున్నారు. వ్యాపారితో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. -
రహదారులు రక్తసిక్తం..
ఆదిలాబాద్‌టౌన్: రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికుల పాలిట మృత్యుదారులుగా మారుతున్నాయి. మానవ తప్పిదమే మనకు భద్రత లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ వాహనం ఢీకొని ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణం ఒక కారణమైతే, నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించడం ఇతర కారణాలుగా చెప్పవచ్చు. నిత్యం జిల్లాలో మూడు నుంచి నాలుగు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతను పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్ మండలం జాతీయ రహదారి తెలంగాణ దాబా వద్ద ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. తప్పెవరిదైనా రోడ్డు ప్రమాదంలో మూడు నిండు ప్రాణాలు గాలి లో కలిసిపోయాయి. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాహన చోదకులు నిబంధనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా చూసుకోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జాతీయ రహదారి ప్రమాదాలే ఎక్కువ.. జిల్లాలో జాతీయ రహదారిపైనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గతంలో రహదారి భద్రత విభాగం గుర్తించింది. ఇందులో గుడిహత్నూర్ జాతీయ రహదారి, నేరడిగొండ, మావల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై ఉన్న వంతెనలు ఇరుకుగా, కాలంచెల్లినవి కూడా ఉండడం తో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జాతీయ రహదారిపై సరైన సూచిక బోర్డులు లేకపోవడం, వాహనాల అతివేగమే ప్రమాదాలకు దారితీస్తోంది. దీంతోపాటు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించకపోవడం, రోడ్లపై వాహనాలు నిలుపుతుండడంతో రాత్రి సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వాటికి ఢీకొని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించడం, అతివేగం, సీటుబెల్టు, హెల్మెట్లు ధరించకపోవడం, జాతీయ రహదారిపై ప్రమాద స్థలాలు గుర్తించకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్స్ లేకపోవడం, వాహనాలు ఇష్టారీతిన నడపడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురేసి, ఆట్లో పరిమితికి మించి ప్రయాణికుల తరలింపుతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటిస్తే మేలు.. జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించేటప్పుడు షెల్టర్లు, బర్ములు సక్ర మంగా ఉన్నాయా? లేదా? ఒకటికి రెండు సార్లు కచ్చితంగా చూడాలి. కూడలి వద్ద అవతలి నుంచి వచ్చే వారు ఎదురుగా వస్తున్న వారికి 40 నుంచి 50 డిగ్రీల కోణంలో కనిపించాలి. రోడ్డు మలుపు పూర్తిగా తిరకగముందే ఎదురుగా వచ్చే వాహనాలు దారి ఇచ్చే విధంగా ఉండాలి. రహదారులపై ప్రమాదకరమైన ప్రాంతాన్ని సూచించేందుకు హెచ్చరికల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీటిని ఆయా స్పాట్లకు 200 మీటర్ల దూరంలో ఒక బోర్డు, 100 మీటర్ల దూరంలో ఒక బోర్డు ఉంచాలి. వేగ నియంత్రణ కోసం రహదారి స్థితిని బట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అందు కోసం జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్, మూలమలుపుల వద్ద రంబ్లర్స్ట్రిప్స్ను అతికించాలి. డెత్‌స్పాట్ వద్ద డివైడర్ల ఎత్తు పెంచి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటిని గుర్తించేలా రిఫ్లెక్టీవ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. ప్రమాదభరితమైన ప్రాంతాల్లో డివైడర్లు రాత్రివేళల్లో కూడా కనిపించేలా క్యాట్‌ఐస్ ఏర్పాటు చేయాలి. యువతే అధికం.. యువకుల చేతిల్లోకి వెళ్తున్న బైక్‌లు కళ్లెంలేని గుర్రాల్లా మారుతున్నాయి. అతి వేగంతో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమే కాకుండా, ఇతర ప్రయాణికులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. కొన్నిసార్లు ఆగి ఉన్న వాహనాలను ఢికొట్టి మృత్యుఒడిలోకి జారిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతు న్న వారిలో యువకులే అధికంగా ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, చిన్న వాహ నాలపై అధిక సంఖ్యలో కూర్చోవడం వంటివి భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. యువకులు దూకుడు తగ్గిస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు. పిల్లలపై ఉన్న ప్రేమతో 18 ఏళ్లు నిండకుండానే తల్లిదం డ్రులు ముందూ వెనుక చూడకుండా వాహనాలు కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించాలి. నిబంధనలకు తిలోదకాలు.. వాహనదారులు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. హెల్మెట్ లేకుం డా ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం చట్టరీత్యా నేరం. అయితే జిల్లాలో హెల్మెట్ వాడే వారి సంఖ్య చాలా తక్కువ. జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు అరుదుగా వాడుతున్నారు. అంతర్గత రోడ్లపై హెల్మెట్ ధరించే వ్యక్తులు దాదాపు లేరనే చెప్పాలి. -
ట్రాఫిక్ ఆంక్షలు తప్పనిసరి
అరసవల్లి: రథసప్తమి ఉత్సవం సందర్భంగా అరసవల్లి పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో కూడా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని, ఈ నిబంధనలను అందరూ పాటించి సహకరించాలని ట్రాఫిక్ డీ ఎస్పీ సీహెచ్ పెంటారావు కోరారు. శనివారం ఉదయం ఆయన అరసవల్లి ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు ఈనెల 23 రాత్రి నుంచి 24 వ తేది రాత్రి వరకు (రథసప్తమి ఉత్సవం ముగిసినంత వరకు) ట్రాఫిక్ సంబంధించి పలు నిబంధనలను విధించామన్నారు. ముఖ్యంగా అరసవల్లికి వచ్చే వాహనా లన్నీ దాదాపుగా 80 ఫీట్ రోడ్డులోనే నిలిపివేస్తామని, కేవలం వీవీఐపీలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వాహనాలు మాత్రమే అరసవల్లి జంక్షన్‌ను దాటి అనుమతిస్తామని, మళ్లీ ఇందులో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలు మాత్రమే ఆలయ ప్రధాన ముఖ ద్వారం (ఆర్చిగేటు) వరకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే మొత్తం పార్కింగ్ కోసమే 12 స్థలాలను ఏర్పాటు చేశామని వివరించారు. ► శ్రీకాకుళం నగరం నుంచి అరసవల్లి వైపుగా వచ్చిన వారి వాహనాలకు 80 ఫీట్ రోడ్డులోనే బైకులు, కార్లు, బస్సులకు వేర్వేరుగా 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ► అలాగే గార నుంచి వచ్చే వాహనాల కోసం వాడాడ కూడలి లోనూ, అరసవల్లి అసిరితల్లి ఆలయం వద్ద వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. ► గార నుంచి నగరానికి వచ్చే బస్సులు, ఇతర వాహనాలన్నీ వాడాడ మీదుగా కలెక్టరేట్, ఓబీఎస్ మీదుగా వెళ్లాలని సూచించారు. ► నగరం నుంచి గార, శ్రీకూర్మం వైపు వెళ్లే వాహనాలు కూడా జాతీయ రహదారి మీదుగా వెళ్లి, అంపోలు (జిల్లా జైలు రోడ్డు) మీదుగా ఓ మార్గంలో వెళ్లాలని, అలాగే సింగుపురం (బూరవల్లి రోడ్డు) మీదుగా కొన్ని వాహనాలు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ► శ్రీకాకుళం నగరంలో కూడా రథసప్తమి రోజున పూర్తిగా వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నామని, అరసవల్లి రావాల్సిన అన్ని వాహనాను కాంప్లెక్స్, రామలక్ష్మణ కూడలి, సూర్యామహల్ మీదుగా అరసవల్లి జంక్షన్ (80 ఫీట్ రోడ్డు)కు చేరుకుంటాయని, తిరిగి వెళ్లే వాహనాలన్నీ మిల్లు జంక్షన్ నుంచి ఓబీఎస్ మీదుగా నగరంలోకి వెళ్లాలని, అలాగే జీటీ రోడ్డును కూడా వెళ్లే మార్గంగానే గుర్తించామని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కచ్చితంగా పౌరులంతా పాటించాలని లేదంటే చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట సిఐ బి.ప్రసాదరావు, వన్‌టౌన్ ఎస్సై చిన్నంనాయుడు తదితరులున్నారు. -
వాహన చోదకురాలి తిరుగుబాటు
అచ్యుతాపురం(యలమంచిలి): తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా పరిమితికి మించి అపరాధ రుసుము వసూలు చేయడం అన్యాయమంటూ ఓ వాహనచోదకురాలు పోలీసులకు ఎదురుతిరగడం చర్చనీయాంశమైంది. పైగా ఆమె పోలీసు స్టేషన్లో ఐదుగంటలపాటు నిరసన వ్యక్తం చేసి కలకలం రేపింది. వివరాలివీ.. మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన రాజాన దేవి అనే మహిళ ఆదివారం బైక్‌పై అచ్యుతాపురం మండలంలోని ఎస్ఈజెడ్ పరిశ్రమల వైపు వెళ్తోంది. వాహన తనిఖీల్లో భాగంగా అచ్యుతాపురం ఎస్ఐ దీనబంధు ఆమె బైక్‌ను ఆపి రికార్డులు చూపమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, లైసెన్స్ చూపకపోవడంతో రూ.635 పెనాల్టీ విధించారు. అయితే ఆమె పెనాల్టీ చెల్లించడానికి నిరాకరించింది. తనవద్ద అన్నిరికార్డులు ఉన్నాయని ఆమె ఎస్ఐకు తెలిపింది. హెల్మెట్ విషయానికి వస్తే రూ.100కు మించి ఫైన్ వేయడానికి లేదని వాదించింది. వాహనాన్ని నిలిపే హక్కు పోలీసులకు లేదని వాదించింది. అంతేకాకుండా వాహనాన్ని స్టేషనుకు తరలించగా, స్టేషన్లోనే ఆమె ఐదు గంటలపాటు నిరసన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ వచ్చి సంజాయిషీ ఇస్తేనే ఇంటికి వెళ్తానని భీష్మించుకు కూర్చుంది. దీంతో పోలీసులు కంగుతిన్నారు. దీనిపై ఎస్ఐ దీనబంధు మాట్లాడుతూ వాహనం తనిఖీ సమయంలో రికార్డులు చూపకపోవడంతో నిబంధనల ప్రకారం అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. ఆ తరువాత ఆమె రికార్డులను తీసుకువచ్చి చూపడంతో రుసుము తగ్గించడానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. కాగా పోలీసులంటే భయపడేలా తనిఖీలు నిర్వహిస్తున్నారని, రికార్డులున్నప్పటికీ వేలల్లో అపరాధ రుసుము వసూలు చేస్తున్నారని నిత్యం పోలీసులు వాహచోదకులను దోచుకుంటున్నారని దేవి స్టేషన్లోనే పోలీసుల తీరును ఎండగట్టింది. ఎట్టకేలకు ఆమెకు పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించేశారు. -
ఇక బాదుడే..!
తణుకు: మందుబాబులూ జర జాగ్రత్త... ఇకపై మద్యం తాగి వాహనం నడుపుతూ తనిఖీల్లో పోలీసులకు చిక్కారో వాళ్లు వేసే జరిమానాలకు తాగిన మందుకు ఎక్కిన మత్తు దిగిపోవడం ఖాయం. మీ ఇంట్లో పిల్లలకు మైనార్టీ తీరకుండానే వాహనం చేతికిచ్చారో మీరు బుక్కవుతారు. ఎందుకంటే మైనార్టీ తీరకుండా వాహనం నడిపితే పోలీసులు వేసే జరిమానాలు భారీగానే ఉండబోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం త్వరలో కొత్త మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే చట్టం అమల్లోకి వస్తే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాల నుంచి తప్పించుకోలేరు. జిల్లాలో ఇప్పటికే రవాణా, పోలీసు శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో సరాసరి నెలకు 45 వేల కేసులు నమోదవుతుండగా సుమారు రూ.కోటి వరకు జరిమానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వస్తే జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో వాహన ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు మాత్రం ప్రస్తుతం అందుతున్న పరిహారం రూ.25 వేల నుంచి రూ.2 లక్షలకు చేరనుంది. ఈ చట్టం ద్వారా 2020 నాటికి యాభైశాతం రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారీమొత్తంలో జరిమానాలు ఇటీవలకాలంలో పెరుగుతోన్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణల బిల్లు2017 రాజ్యసభలో ఆమోదించడానికి కృషి చేస్తోంది. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. రాజ్యసభలో కూడా ఆమోదం పొంది అమల్లోకి వస్తే ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు, శిక్షలు అమలు కానున్నాయి. తాజా చట్టం ప్రకారం ఇకముందు భారీ జరిమానాలతో వాత పెట్టనున్నారు. ప్రస్తుతం మందుతాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు, కేసుల నమోదుతో పాటు అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. అయితే తాజా చట్టం ప్రకారం ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.2 వేల జరిమానా కనీస మొత్తంగా రూ.10 వేలకు పెరగనుంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపేవారికి ప్రస్తుతం విధిస్తున్న రూ.వెయ్యి ఇకపై రూ.5 వేలు కానుంది. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే ఇప్పుడు రూ.500 జరిమానా విధిస్తున్నారు. రాబోయేరోజుల్లో రూ.5 వేలు వడ్డన తప్పదు. అతివేగంతో వాహనం నడిపితే విధించే రూ.400 జరిమానా రూ.2 వేలకు పెరగనుంది. వాహనం నడుపుతూ సెల్ మాట్లాడితే ఇకపై రూ.5 వేలు జరిమానా చెల్లించాల్సి రానుంది. సాయం అందిస్తే పారితోషికం రోడ్డు ప్రమాదం జరిగితే బాధితులకు సాయం అందించిన పాపానికి ఇన్నాళ్లు వారిని సాక్ష్యం పేరుతో పోలీసుస్టేషన్, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి ఉండేది. కొత్త చట్టంలో వారికి ఉపశమనం కల్పించారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే గుడ్ సమారిటన్లకు అభయం చేకూర్చేలా వారికి పారితోషికం అందించేలా సవరణలు చేశారు. వారితో కేసులకు సంబంధం లేకుండా చూస్తారు. ప్రమాదంలో సాయం చేసిన వారు ఎవరనేది పోలీసులకు లేదా వైద్య సిబ్బందికి వెల్లడించడం గుడ్సమరిటన్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం అందించనుంది. ఇప్పటి వరకు రూ. 25 వేలు ఇస్తుండగా ప్రమాదంలో బాధితులకు ఆసరాగా నిలిచేందుకు మోటారు వాహనాల ప్రమాద నిధిని ఏర్పాటు చేయనున్నారు. ప్రమాద బాధితులకు గరిష్టంగా ఆర్నెల్ల లోపు బీమా సొమ్ము అందించాల్సి ఉంటుంది. ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం పెరిగే అవకాశమూ ఉంటుంది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్‌కు, డ్రైవింగ్ లైసెన్సు పొందడానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయనున్నారు. మరోవైపు డ్రైవింగ్ లైసెన్సు కాలపరిమితి ముగిసిన తర్వాత నెలలోపు మాత్రమే దాన్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వచ్చేది. ఈ గడువును ఏడాది వరకు పొడిగించనున్నారు. -
ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం
ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు: కర్నూలును ప్రమాద, ర్యాగింగ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని ఎస్పీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో శనివారం ఉదయం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాద దృశ్యాలకు సంబంధించిన సీసీ ఫుటేజీలను సేకరించి వాటిని తెరపై ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర ఆధ్వర్యంలో ఓ డాక్యుమెంటరీ తయారు చేశారు. అతి వేగంగా వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, సీటుబెల్టు, హెల్మెట్ ధరించాలని యువకులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడం కోసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో సుమారు 600 మంది ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, 2,500 మందికి పైగా క్షతగాత్రులవుతున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నటు వెల్లడించారు. ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ర్యాగింగ్ జరిగితే కళాశాల యాజమాన్యాలదే బాధ్యత అన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యల కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ కళాశాల ప్రిన్సిపల్ శౌరిల్‌రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, సీఐలు మహేశ్వరరెడ్డి, కృష్ణయ్య, శేఖర్‌రావు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
వాహనచోదకులరా తస్మత్ జాగ్రత్త
-రాంగ్రూట్లో వెళ్లినా..సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా ఈ చలానా జరిమాన - త్వరలో కర్నూలులో అమలు – సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ కర్నూలు : నిబంధనలకు విరుద్ధంగా రాంగ్రూట్లో వెళ్లే వాహన చోదకులకు ఈ చలానా జరిమానతో చెక్ పెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు కార్యచరణ రూపొందించారు. త్వరలో ఈ చలాన ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నగరంలోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్స్, ట్రాఫిక్ పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆకే రవికృష్ణ సూచించారు. ఆదివారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమును ఆయన పరిశీలించారు. నగరంలోని రద్దీస్థలాలు, రోడ్లపై ఉన్న ట్రాఫిక్‌ను కంట్రోల్ రూము నుంచి పరిశీలించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, పరిమితికి మించి వాహనాల్లో వెళ్లడం వంటి వాటిని సీసీ కెమెరాల నుంచి ఫొటో క్యాప్షర్ చేసి, ఈచలానా ఫాం వాహనదారుని ఇంటికే పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. ఎంవీ యాక్ట్ ప్రకారం ఈచలానా జరిమాన రూ.300 నుంచి రూ.1000 వరకు ఉంటుందన్నారు. దూర ప్రాంతాల వారికి పోస్టల్లో ఈ చలానా వెళ్తుందన్నారు. శివారు కాలనీల్లో కూడా ప్రజాభద్రతా చట్టం ప్రకారం సీసీ కెమెరాల వినియోగానికి అవగాహన కల్పిస్తామన్నారు. ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల పుటేజీ నుంచి పర్యవేక్షించాలన్నారు. సీసీ కెమెరాల పనిలోపం ఎక్కడైనా ఉంటే మున్సిపల్ అధికారులు బృహస్పతి టెక్నాలజీ వారితో చర్చించి సరిచేయాలన్నారు. నేరాల అదుపునకు, దర్యాప్తునకు సీసీ టీవీల పుటేజీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. డీఎస్పీలు రమణమూర్తి, బాబూప్రసాద్, సీఐలు డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, కృష్ణయ్య, నాగరాజరావు, నాగరాజుయాదవ్, శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించకపోతే చర్యలు
నూనెపల్లె: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా ఽఎస్పీ రవికృష్ణ అన్నారు. నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ పట్టణంలోని ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. త్వరలో ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, సీఐలు శ్రీనివాసరెడ్డి, ప్రతాప్ రెడ్డి ఉన్నారు.