కరీంనగర్: ఈ ఏడాది జూలై 4న సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ఓ యువకుడు బైక్ అతివేగంగా నడుపుతున్నాడు. మరో యువకుడు దానిపై కూర్చున్నాడు. జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్రగాయాలై ఇద్దరూ చనిపోయారు.
ఓ వారం రోజుల తర్వాత.. జగిత్యాల బైపాస్‌రోడ్డుకు చెందిన ఓ బాలుడి తండ్రి గల్ఫ్ నుంచి వచ్చాడు. అదేరోజే మంచినీళ్ల కోసమని ఆ బాలుడు ద్విచక్ర వాహనంపై వాటర్ ప్లాంట్‌కు బయలుదేరి వెళ్లాడు. అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొని మృతిచెందాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన కొన్ని క్షణాల్లోనే కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీమున్నీరు కావడం బాధించింది.
► నేను చదువుకున్న రోజుల్లోనే చిన్నచిన్న కవితలు రాశా. పాఠశాల, కళాశాల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నా. అందుకే ప్రమాదాల నియంత్రణకు ఓ పాట రాయాలని సంకల్పించా. మంచి పాట రాశా.
► వీలైనంత వరకు అతిత్వరగా రోడ్డు ప్రమాద ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులకు సూచిస్తున్నా. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని చెబుతున్నా.. ముఖ్యంగా తక్షణమే స్పందించాలని ఘటనా స్థలాల్లో ఉండే ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా. సీపీఆర్‌పై వివరిస్తున్నా. ప్రజల్లో చైతన్యం తెస్తున్నా.
► హైదరాబాద్‌లో కొంతకాలం ట్రాఫిక్ అడిషనల్ డీసీపీగా సేవలు అందించా. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం అక్కడ షార్ట్‌ఫిల్మ్‌లు నిర్మించా. వాటిని ప్రదర్శిస్తూ ట్రాఫిక్ నిబంధనలు, జాగ్రత్తలు తీసుకునేలా యువతలో చైతన్యం తీసుకొచ్చా. జగిత్యాల జిల్లాలోనూ ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఇంజినీరింగ్, ట్రాన్స్‌పోర్ట్ శాఖల అధికారులతో కలిసి హాట్‌స్పాట్లు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
► కొందరు యువకులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. ఇలాంటి వారికి ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో షార్ట్‌ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. యువతే కాదు.. ఎవరైనా ట్రాఫిక్ నిబంనలు పాటించాలి. సురక్షితంగా గమ్యస్థానం చేరాలి. అదే మా లక్ష్యం. - ‘సాక్షి’తో ఎస్పీ భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment