వేములవాడరూరల్: బైక్ చెట్టుకు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడరూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన విక్కుర్తి దిలీప్ (22), సూర అనిల్ (21) స్నేహితులు. ఆదివారం రాత్రి దుర్గామాత ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం బైక్‌పై బొల్లారం గ్రామం వైపు వెళ్తుండగా శివారులో చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు ఆసుపత్రికి తరలించగా చనిపోయాడు.
బైక్ కొన్న ఐదు రోజులకే..
హన్మాజిపేటకు చెందిన విక్కుర్తి రాజేశం బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. ఇతడికి భార్య జూలీ, కొడుకు దిలీప్, కూతురు ఉన్నారు. ఇటీవల గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. దిలీప్ సైతం హైదరాబాద్‌లో చదువుతుండగా, తన తండ్రి రాకతో రెండు నెలల క్రితం ఇంటికి వచ్చాడు. దసరా పండుగ నేపథ్యంలో బైక్ కొనివ్వాలని తండ్రిని దిలీప్ కోరగా, ఒక్కగానొక్క కొడుకు మాట కాదనలేక గత బుధవారం రాజేశం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనిచ్చి మళ్లీ గల్ఫ్ వెళ్లాడు.
కొడుక్కు ప్రేమతో బైక్ కొనిచ్చి మంచిగా ఉండాలని ఆశీర్వదించి వెళ్లిన ఐదు రోజులకే దిలీప్ మృతిచెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. అలాగే సూర అనిల్ గ్రామంలో వ్యవసాయం చేస్తుంటాడు. తల్లిదండ్రులు అంజయ్య, లక్ష్మి, ఇద్దరు సోదరులు ఉన్నారు. తండ్రి రెండేళ్లుగా మస్కట్‌లో ఉంటున్నాడు. ఇద్దరు యువకుల తండ్రులు గల్ఫ్‌లో ఉండడంతో మృతదేహాలను ఫ్రీజర్‌లలో భద్రపరిచారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారుతి తెలిపారు. కాగా అతివేగమే యువకుల ప్రాణాలు బలిగొందని గ్రామస్తులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment