అచ్యుతాపురం పోలీసు స్టేషన్‌లో రాత్రివరకూ నిరసన వ్యక్తం చేసిన మహిళ రాజాన దేవి
అచ్యుతాపురం(యలమంచిలి): తప్పుడు కేసు నమోదు చేయడమే కాకుండా పరిమితికి మించి అపరాధ రుసుము వసూలు చేయడం అన్యాయమంటూ ఓ వాహనచోదకురాలు పోలీసులకు ఎదురుతిరగడం చర్చనీయాంశమైంది. పైగా ఆమె పోలీసు స్టేషన్‌లో ఐదుగంటలపాటు నిరసన వ్యక్తం చేసి కలకలం రేపింది. వివరాలివీ.. మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన రాజాన దేవి అనే మహిళ ఆదివారం బైక్‌పై అచ్యుతాపురం మండలంలోని ఎస్‌ఈజెడ్ పరిశ్రమల వైపు వెళ్తోంది. వాహన తనిఖీల్లో భాగంగా అచ్యుతాపురం ఎస్‌ఐ దీనబంధు ఆమె బైక్‌ను ఆపి రికార్డులు చూపమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, లైసెన్స్ చూపకపోవడంతో రూ.635 పెనాల్టీ విధించారు. అయితే ఆమె పెనాల్టీ చెల్లించడానికి నిరాకరించింది. తనవద్ద అన్నిరికార్డులు ఉన్నాయని ఆమె ఎస్‌ఐకు తెలిపింది. హెల్మెట్ విషయానికి వస్తే రూ.100కు మించి ఫైన్ వేయడానికి లేదని వాదించింది.
వాహనాన్ని నిలిపే హక్కు పోలీసులకు లేదని వాదించింది. అంతేకాకుండా వాహనాన్ని స్టేషనుకు తరలించగా, స్టేషన్‌లోనే ఆమె ఐదు గంటలపాటు నిరసన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ వచ్చి సంజాయిషీ ఇస్తేనే ఇంటికి వెళ్తానని భీష్మించుకు కూర్చుంది. దీంతో పోలీసులు కంగుతిన్నారు. దీనిపై ఎస్‌ఐ దీనబంధు మాట్లాడుతూ వాహనం తనిఖీ సమయంలో రికార్డులు చూపకపోవడంతో నిబంధనల ప్రకారం అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. ఆ తరువాత ఆమె రికార్డులను తీసుకువచ్చి చూపడంతో రుసుము తగ్గించడానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. కాగా పోలీసులంటే భయపడేలా తనిఖీలు నిర్వహిస్తున్నారని, రికార్డులున్నప్పటికీ వేలల్లో అపరాధ రుసుము వసూలు చేస్తున్నారని నిత్యం పోలీసులు వాహచోదకులను దోచుకుంటున్నారని దేవి స్టేషన్లోనే పోలీసుల తీరును ఎండగట్టింది. ఎట్టకేలకు ఆమెకు పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించేశారు.
Comments
Please login to add a commentAdd a comment