రహదారులు రక్తసిక్తం.. | Road accidents increasing in adilabad | Sakshi
Sakshi News home page

రహదారులు రక్తసిక్తం..

Published Fri, Feb 9 2018 3:13 PM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Road accidents increasing in adilabad - Sakshi

గుడిహత్నూర్‌లో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో లారీని ఢీకొని నుజ్జునుజ్జయిన కారు.. అందులోనే మృతి చెందిన డ్రైవర్‌ బిలాల్‌

ఆదిలాబాద్‌టౌన్‌: రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికుల పాలిట మృత్యుదారులుగా మారుతున్నాయి. మానవ తప్పిదమే మనకు భద్రత లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ వాహనం ఢీకొని ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణం ఒక కారణమైతే, నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించడం ఇతర కారణాలుగా చెప్పవచ్చు. నిత్యం జిల్లాలో మూడు నుంచి నాలుగు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతను పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్‌ మండలం జాతీయ రహదారి తెలంగాణ దాబా వద్ద ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. తప్పెవరిదైనా రోడ్డు ప్రమాదంలో మూడు నిండు ప్రాణాలు గాలి లో కలిసిపోయాయి. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాహన చోదకులు నిబంధనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా చూసుకోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

జాతీయ రహదారి ప్రమాదాలే ఎక్కువ..
జిల్లాలో జాతీయ రహదారిపైనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గతంలో రహదారి భద్రత విభాగం గుర్తించింది. ఇందులో గుడిహత్నూర్‌ జాతీయ రహదారి, నేరడిగొండ, మావల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై ఉన్న వంతెనలు ఇరుకుగా, కాలంచెల్లినవి కూడా ఉండడం తో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జాతీయ రహదారిపై సరైన సూచిక బోర్డులు లేకపోవడం, వాహనాల అతివేగమే ప్రమాదాలకు దారితీస్తోంది. దీంతోపాటు జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహించకపోవడం, రోడ్లపై వాహనాలు నిలుపుతుండడంతో రాత్రి సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వాటికి ఢీకొని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించడం, అతివేగం, సీటుబెల్టు, హెల్మెట్‌లు ధరించకపోవడం, జాతీయ రహదారిపై ప్రమాద స్థలాలు గుర్తించకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్స్‌ లేకపోవడం, వాహనాలు ఇష్టారీతిన నడపడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురేసి, ఆట్లో పరిమితికి మించి ప్రయాణికుల తరలింపుతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

నిబంధనలు పాటిస్తే మేలు..
జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించేటప్పుడు షెల్టర్లు, బర్ములు సక్ర మంగా ఉన్నాయా? లేదా? ఒకటికి రెండు సార్లు కచ్చితంగా చూడాలి. కూడలి వద్ద అవతలి నుంచి వచ్చే వారు ఎదురుగా వస్తున్న వారికి 40 నుంచి 50 డిగ్రీల కోణంలో కనిపించాలి. రోడ్డు మలుపు పూర్తిగా తిరకగముందే ఎదురుగా వచ్చే వాహనాలు దారి ఇచ్చే విధంగా ఉండాలి. రహదారులపై ప్రమాదకరమైన ప్రాంతాన్ని సూచించేందుకు హెచ్చరికల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీటిని ఆయా స్పాట్లకు 200 మీటర్ల దూరంలో ఒక బోర్డు, 100 మీటర్ల దూరంలో ఒక బోర్డు ఉంచాలి. వేగ నియంత్రణ కోసం రహదారి స్థితిని బట్టి స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అందు కోసం జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్, మూలమలుపుల వద్ద రంబ్లర్‌స్ట్రిప్స్‌ను అతికించాలి. డెత్‌స్పాట్‌ వద్ద డివైడర్ల ఎత్తు పెంచి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటిని గుర్తించేలా రిఫ్లెక్టీవ్‌ మార్కర్స్‌ లేదా సోలార్‌ మార్కర్స్‌ పెట్టాలి. ప్రమాదభరితమైన ప్రాంతాల్లో డివైడర్లు రాత్రివేళల్లో కూడా కనిపించేలా క్యాట్‌ఐస్‌ ఏర్పాటు చేయాలి.  

యువతే అధికం..
యువకుల చేతిల్లోకి వెళ్తున్న బైక్‌లు కళ్లెంలేని గుర్రాల్లా మారుతున్నాయి. అతి వేగంతో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమే కాకుండా, ఇతర ప్రయాణికులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. కొన్నిసార్లు ఆగి ఉన్న వాహనాలను ఢికొట్టి మృత్యుఒడిలోకి జారిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతు న్న వారిలో యువకులే అధికంగా ఉన్నారు. హెల్మెట్‌ పెట్టుకోకుండా మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, చిన్న వాహ నాలపై అధిక సంఖ్యలో కూర్చోవడం వంటివి భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. యువకులు దూకుడు తగ్గిస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు. పిల్లలపై ఉన్న ప్రేమతో 18 ఏళ్లు నిండకుండానే తల్లిదం డ్రులు ముందూ వెనుక చూడకుండా వాహనాలు కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించాలి.

నిబంధనలకు తిలోదకాలు..
వాహనదారులు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. హెల్మెట్‌ లేకుం డా ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం చట్టరీత్యా నేరం. అయితే జిల్లాలో హెల్మెట్‌ వాడే వారి సంఖ్య చాలా తక్కువ. జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు అరుదుగా వాడుతున్నారు. అంతర్గత రోడ్లపై హెల్మెట్‌ ధరించే వ్యక్తులు దాదాపు లేరనే చెప్పాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement