speed driving
-
వాహనదారులూ బీ అలర్ట్: కొంపముంచుతోంది అదే!
ప్రతీ రోజు దేశం నలుమూలల్లో చోటుచేసుకునే అనేక వాహన ప్రమాదాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. స్వయం కృతాపరాధంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్న సంఘటనలు కలిచి వేస్తాయి. డ్రైవింగ్‌పై క్రేజ్ తో స్పీడ్‌గా వెళ్లడం థ్రిల్ కావచ్చు, కానీ అది ప్రమాదకరం. మన ప్రాణాలకే కాదు ఇతరులకు కూడా. గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూసే ఓపిక లేకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్లు ఉపయోగించడం ఈ రోజుల్లో సాధారణమై పోయింది. ‘‘స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్’’ అనే మాటల్ని తాజా ప్రభుత్వ ఒక సంచలన నివేదిక మరోసారి గుర్తు చేసింది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన “భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు 2022” నివేదిక ప్రకారం, భారతదేశంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. రోడ్డు ప్రమాదాలకు అత్యంత ప్రమాదకరమైన సంవత్సరంగా 2022 నిలిచింది. ప్రతీ పది లక్షల జనాభాకు 122 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. 1970 నుంచి ఇదే అత్యధిక రేటు దేశవ్యాప్తంగా ప్రమాదాలు , మరణాల వెనుక అతివేగం ప్రధాన కారణాలలో ఒకటిగా తేలింది. 2022లో 11.9శాతం పెరిగి 4,లక్షల 61వేల 312 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2021లో వీటి సంఖ్య 4 లక్షల 12వేల 432గా ఉంది. 1 లక్షా 68వేల 491 మంది ప్రాణాలు కోల్పోయారు. 4 లక్షల 43వేల 366 మంది గాయపడ్డారు. గత ఏడాదితో పోలిస్తే మరణాలు 9.4 శాతం ఎగిసి క్షతగాత్రుల సంఖ్య 15.3శాతం పెరిగింది. 2022లో 3.3 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలకు దారితీసిన కారణాల్లో అతివేగంతో పాటు, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2022లో, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అతివేగం కారణంగా 71.2 శాతం మంది మరణించారు, ఆ తర్వాత స్థానం రాంగ్ సైడ్ డ్రైవింగ్ది (5.4శాతం) అని నివేదిక పేర్కొంది. ఇక మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దాదాపు 10వేల ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.అంతేకాదు రెడ్‌సిగ్నల్ జంప్ వల్ల యాక్సిడెంట్లు గణనీయంగా పెరిగాయి. 2021లో ఇవి 2,203గా ఉంటే 2022లో 82.55 శాతం పెరిగి 4,021 ప్రమాదాలు నమోదైనాయి. 2022లో హెల్మెట్ ధరించని బైక్ ప్రమాదాల్లో 50వేల మంది మరణించారు. వీరిలో 71.3 శాతం మంది ( 35,692) డ్రైవర్లు, 14,337 (28.7శాతం) వెనుక కూర్చున్న వారు అని నివేదిక పేర్కొంది. -
అతివేగం.. తీసింది ప్రాణం
సాక్షి, బెంగళూరు: భద్రత మరిచి అతి వేగాన్ని నమ్ముకుని జీవితాలను అర్ధాంతరంగా చాలిస్తున్నారు. గమ్యం చేరే ఆతృతలో సమిధలవుతున్నారు. రాష్ట్రంలో గత ఇరవై నాలుగు గంటల్లో రోడ్లపై నెత్తుటేర్లు పారాయి. నాలుగు పెద్ద ప్రమాదాల్లో మొత్తం 12 మంది మృత్యువాత పడ్డారు. బెళగావి జిల్లా, చిత్రదుర్గ, తుమకూరు, మండ్య జిల్లాల్లో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బెళగావిలో ఏడుగురు కూలీలు.. ఆదివారం తెల్లవారుజామున బెళగావి తాలూకా కల్కాళ బ్రిడ్జ్ వద్ద ట్రాక్స్ క్రూయిజర్ వాహనం పల్టీ కొట్టడంతో 7 మంది మృత్యువాత పడ్డారు. రెండు వాహనాల్లో కూలీలు బయల్దేరారు. డ్రైవర్లు పోటాపోటీగా దూసుకెళ్తుండగా ఒక క్రూయిజర్ కల్యాళ బ్రిడ్జ్ వద్ద పల్టీ కొడుతూ పడిపోయింది. ఏడు మంది అక్కడికక్కడే మరణించారు. మృతులను అడియప్ప చిలబావి (32), బసవరాజ్ దళవి (32), బసవరాజ్ హనుమన్నవర్ (35), ఆకాశ్ (40), రామన్న (29), ఫక్కీరప్ప (34), మల్లప్ప (39)గా గుర్తించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం బసవరాజు బొమ్మై సంతాపం వ్యక్తం చేశారు. మండ్యలో గ్రామ ఉద్యోగులు... వేగంగా వచ్చిన లారీ ఒకటి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నాగమంగళ తాలూకా ఎం. హోసూరు గేట్ వద్ద శనివారం రాత్రి జరిగింది. నాగమంగళ తాలూకా బీరేశ్వరపురకి చెందిన దేవరాజు (42), పాండవపుర తాలూకా దేసముద్ర గ్రామానికి చెందిన మంజునాథ్ (35), కెన్నాళు గ్రామానికి చెందిన రైతు మంజునాథ్ (64) మృతి చెందారు. గ్రామ లెక్కాధికారిగా పనిచేసే దేవరాజు సొంత పని కోసం గ్రామ సహాయకుడు మంజునాథ్, స్వామిని కారులో తీసుకుని వెళ్లాడు. తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు. టెక్కీ ప్రాణాలు తీసిన బైక్ రేస్ సరదా బైక్ రైడింగ్ ఒక టెక్కీ ప్రాణం తీసింది. సూరజ్ (27) అనే బైకిస్టు మృత్యువాత పడ్డాడు. తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా గవిమఠం వద్ద ఆదివారం ఉదయం జరిగింది. బెంగళూరు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న సూరజ్ స్నేహితుడు అజయ్‌తో కలసి వీకెండ్ రైడ్‌కు డుకాటీ బైక్‌లలో వెళ్లారు. బెంగళూరు నుంచి అతివేగంగా వెళ్లిన ఇద్దరు గవిమఠం జాతీయ రహదారి–72 వద్ద పరస్పరం పోటీ పడుతూ వాయువేగంతో దూసుకెళ్తున్నారు. సూరజ్ అదుపుతప్పి ఒక టెంపో ట్రావెలర్ వెనుక భాగాన్ని ఢీ కొట్టి బైక్‌తో సహా పల్టీలు కొడుతూ వంతెన పైనుంచి కిందకి పడిపోయాడు. సూరజ్ అక్కడికక్కడే మరణించాడు. కుణిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిత్రదుర్గలో మహిళ చిత్రదుర్గ జిల్లా చళ్లకెరె పట్టణం బళ్లారి రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీ కొట్టింది. శివమొగ్గ జిల్లా భద్రావతికి చెందిన బైకిస్టు అలీ (55) తీవ్రంగా గాయపడగా, భార్య ఇర్ఫాన (47) మరణించింది. మృతదేహాన్ని, క్షతగాత్రున్ని చెళ్లకెరె ఆస్పత్రికి తరలించారు. (చదవండి: షాకింగ్ ఘటన... డబ్బాలో ఏడు పిండాలు!) -
నా భార్యను మోసం చేస్తున్నాను.. అందుకే ఇలా!
వాషింగ్టన్: అమెరికా పోలీసులకు ఓ విచిత్ర సంఘటన ఎదురైంది. అదివారం రాత్రి 52ఏళ్ల వృద్దుడు అధిక వేగంతో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు విచారించగా.. అతడు చెప్పిన సమాధానం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే...ఫ్లొరిడాకు చెందిన జాన్ ఎర్ల్ పికార్డ్(52) 88 కిలోమీటర్ల స్పీడు లిమిట్ ఉన్న రహదారిపై 144 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకుని నిలదీయగా.. తాను భార్యను మోసం చేస్తున్నానని, అందుకే తొందరగా ఇంటికి వెళ్లేందుకు స్పీడ్‌గా వెళుతున్నానంటూ సమాధానం ఇచ్చాడు. అయితే వృద్దుడు డ్రైవింగ్ చేస్తున్న ఆ రహదారిపై 88 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి కానీ.. అతను 144 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాడు. దీంతో పరిమితికి మించి రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అరెస్టు చేసే సమయంలో అతని టీ షర్ట్ జేబులో కోకైన్ గంజాయి ప్యాకెట్ కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు. కాగా దానిని పికార్డ్ 50 డాలర్లకు కొనుగోలు చేసినట్లు స్వయంగా ఒప్పుకోవడంతో ఆదనంగా అతనిపై మాదకద్రవ్యాల కేసు నమోదు చేశారు. -
రహదారులు రక్తసిక్తం..
ఆదిలాబాద్‌టౌన్: రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికుల పాలిట మృత్యుదారులుగా మారుతున్నాయి. మానవ తప్పిదమే మనకు భద్రత లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ వాహనం ఢీకొని ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణం ఒక కారణమైతే, నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించడం ఇతర కారణాలుగా చెప్పవచ్చు. నిత్యం జిల్లాలో మూడు నుంచి నాలుగు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతను పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుడిహత్నూర్ మండలం జాతీయ రహదారి తెలంగాణ దాబా వద్ద ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. తప్పెవరిదైనా రోడ్డు ప్రమాదంలో మూడు నిండు ప్రాణాలు గాలి లో కలిసిపోయాయి. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాహన చోదకులు నిబంధనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా చూసుకోవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జాతీయ రహదారి ప్రమాదాలే ఎక్కువ.. జిల్లాలో జాతీయ రహదారిపైనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ప్రమాదకర ప్రాంతాలను గతంలో రహదారి భద్రత విభాగం గుర్తించింది. ఇందులో గుడిహత్నూర్ జాతీయ రహదారి, నేరడిగొండ, మావల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా పలు గ్రామాలకు వెళ్లే రహదారులపై ఉన్న వంతెనలు ఇరుకుగా, కాలంచెల్లినవి కూడా ఉండడం తో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జాతీయ రహదారిపై సరైన సూచిక బోర్డులు లేకపోవడం, వాహనాల అతివేగమే ప్రమాదాలకు దారితీస్తోంది. దీంతోపాటు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించకపోవడం, రోడ్లపై వాహనాలు నిలుపుతుండడంతో రాత్రి సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వాటికి ఢీకొని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించడం, అతివేగం, సీటుబెల్టు, హెల్మెట్లు ధరించకపోవడం, జాతీయ రహదారిపై ప్రమాద స్థలాలు గుర్తించకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్స్ లేకపోవడం, వాహనాలు ఇష్టారీతిన నడపడం, ద్విచక్ర వాహనాలపై ముగ్గురేసి, ఆట్లో పరిమితికి మించి ప్రయాణికుల తరలింపుతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలు పాటిస్తే మేలు.. జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించేటప్పుడు షెల్టర్లు, బర్ములు సక్ర మంగా ఉన్నాయా? లేదా? ఒకటికి రెండు సార్లు కచ్చితంగా చూడాలి. కూడలి వద్ద అవతలి నుంచి వచ్చే వారు ఎదురుగా వస్తున్న వారికి 40 నుంచి 50 డిగ్రీల కోణంలో కనిపించాలి. రోడ్డు మలుపు పూర్తిగా తిరకగముందే ఎదురుగా వచ్చే వాహనాలు దారి ఇచ్చే విధంగా ఉండాలి. రహదారులపై ప్రమాదకరమైన ప్రాంతాన్ని సూచించేందుకు హెచ్చరికల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వీటిని ఆయా స్పాట్లకు 200 మీటర్ల దూరంలో ఒక బోర్డు, 100 మీటర్ల దూరంలో ఒక బోర్డు ఉంచాలి. వేగ నియంత్రణ కోసం రహదారి స్థితిని బట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అందు కోసం జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్, మూలమలుపుల వద్ద రంబ్లర్స్ట్రిప్స్ను అతికించాలి. డెత్‌స్పాట్ వద్ద డివైడర్ల ఎత్తు పెంచి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి. చీకట్లోనూ వీటిని గుర్తించేలా రిఫ్లెక్టీవ్ మార్కర్స్ లేదా సోలార్ మార్కర్స్ పెట్టాలి. ప్రమాదభరితమైన ప్రాంతాల్లో డివైడర్లు రాత్రివేళల్లో కూడా కనిపించేలా క్యాట్‌ఐస్ ఏర్పాటు చేయాలి. యువతే అధికం.. యువకుల చేతిల్లోకి వెళ్తున్న బైక్‌లు కళ్లెంలేని గుర్రాల్లా మారుతున్నాయి. అతి వేగంతో ప్రయాణిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమే కాకుండా, ఇతర ప్రయాణికులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. కొన్నిసార్లు ఆగి ఉన్న వాహనాలను ఢికొట్టి మృత్యుఒడిలోకి జారిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతు న్న వారిలో యువకులే అధికంగా ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, చిన్న వాహ నాలపై అధిక సంఖ్యలో కూర్చోవడం వంటివి భారీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. యువకులు దూకుడు తగ్గిస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు. పిల్లలపై ఉన్న ప్రేమతో 18 ఏళ్లు నిండకుండానే తల్లిదం డ్రులు ముందూ వెనుక చూడకుండా వాహనాలు కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించాలి. నిబంధనలకు తిలోదకాలు.. వాహనదారులు నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. హెల్మెట్ లేకుం డా ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం చట్టరీత్యా నేరం. అయితే జిల్లాలో హెల్మెట్ వాడే వారి సంఖ్య చాలా తక్కువ. జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు అరుదుగా వాడుతున్నారు. అంతర్గత రోడ్లపై హెల్మెట్ ధరించే వ్యక్తులు దాదాపు లేరనే చెప్పాలి. -
ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్న ఓఆర్ఆర్
సాక్షి, సిటీబ్యూరో: అతివేగం, వాహనచోదకుల నిర్లక్ష్యం, రహదారి నిర్వహణ లోపాలతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ మార్గం నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వెలుతురు లేమి, సూచికలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడం, సర్వీస్ రోడ్లపై జంతువులు తిరగడం తదితర కారణాలతో రహదారులపై నెత్తురు పారుతోంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన156.90కిమీ ఓఆర్ఆర్ మార్గంలో 12 ప్రాంతాలు మృత్యుకేంద్రాలుగా మారాయి. తాజాగా మేడ్చల్ మండలం సుతూరిగూడ వద్ద ఔటర్‌రింగ్ రోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఎనిమిది మృతి చెందిన సంగతి తెలిసిందే. ర్యాష్ డ్రైవింగ్ ఒక కారణం కాగా, వెలుతురు సరిగా లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్ రోడ్డు నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా అయోమయం.. ఓఆర్ఆర్పై అనేక చోట్ల టోల్‌ప్లాజాలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఈ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించే వాహనాలకు తాము ఎక్కడా ఉన్నామనేది సాధారణ పరిస్థితుల్లో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఫలితంగా ఎగ్జిట్ పాయింట్స్ గుర్తిచడంలో అయోమయానికి లోనవుతుంటారు. ఇదే కారణంతో వాహనాలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ ఎగ్జిట్ పాయింట్లతో పాటు మలుపులు, ఇతర కీలక ప్రాంతాలకు సంబంధించి సూచికలు కాకుండా స్పష్టంగా కనిపించకపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదు. మరోపక్క ఓఆర్ఆర్పై వీధి దీపాలు సైతం లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. రాత్రి వేళల్లో ములుపులు కనిపించక వాహనాలు రెయిలింగ్స్‌ను ఢీకొంటున్నాయి. దీనికితోడు ఓఆర్‌ఆర్‌పైనా వాటర్ లాగింగ్ ఏరియాలు ఉండటం ప్రమాద హేతువుగా మారింది. 12 ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా గుర్తించినా ప్రమదాల నియంత్రణకు హెచ్ఎండీఏ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. రోడ్డు నిర్మాణం వరకే మా బాధ్యత...అనుమతి లేని వావాహనాలు ఆపాల్సింది మాత్రం పోలీసులే అన్నట్లుగా వ్యవరిస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రిళ్లలోనే ఎక్కువ... గతంలో జరిగిన ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఓఆర్ఆర్పై తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతి లేని వాహనాలను అడ్డుకోవడం, అతివేగంతో వెళ్లే వాహనాలను గుర్తించేందుకు తదితర చర్యలు తీసుకుంటున్నారు. అయితే భద్రతతో పాటు ఇతర అంశాల నేపథ్యంలో ఇవన్నీ పగటిపూట మాత్రమే పరిమితం ఆకవడంతో రాత్రి వేళల్లో దూసుకుపోతున్న వాహనాలు ప్రమాదాలకు గురికావడం, ప్రమాద హేతువులుగా మారడం పరిపాటిగా మారింది. \గచ్చిబౌలి, పెద్ద అంబర్పేట్ మధ్యలో నాలుగు ఔట్ పోస్టు భవనాల నిర్మాణం సహా మరికొన్ని కీలక ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. ఓఆర్ఆర్పై జరుగుతున్న ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గించడానికి మొబైల్ ఐసీయూ సేవలను అవసరమని పోలీసులు చెబుతున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులోనైనా హెచ్ఎండీఏ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాల నివారణకు సమష్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.