ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్న ఓఆర్‌ఆర్
సాక్షి, సిటీబ్యూరో: అతివేగం, వాహనచోదకుల నిర్లక్ష్యం, రహదారి నిర్వహణ లోపాలతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఈ మార్గం నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వెలుతురు లేమి, సూచికలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడం, సర్వీస్ రోడ్లపై జంతువులు తిరగడం తదితర కారణాలతో రహదారులపై నెత్తురు పారుతోంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన156.90కిమీ ఓఆర్‌ఆర్ మార్గంలో 12 ప్రాంతాలు మృత్యుకేంద్రాలుగా మారాయి.
తాజాగా మేడ్చల్ మండలం సుతూరిగూడ వద్ద ఔటర్‌రింగ్ రోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఎనిమిది మృతి చెందిన సంగతి తెలిసిందే. ర్యాష్ డ్రైవింగ్ ఒక కారణం కాగా, వెలుతురు సరిగా లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓఆర్‌ఆర్ రోడ్డు నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతా అయోమయం..
ఓఆర్‌ఆర్‌పై అనేక చోట్ల టోల్‌ప్లాజాలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఈ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించే వాహనాలకు తాము ఎక్కడా ఉన్నామనేది సాధారణ పరిస్థితుల్లో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఫలితంగా ఎగ్జిట్ పాయింట్స్ గుర్తిచడంలో అయోమయానికి లోనవుతుంటారు. ఇదే కారణంతో వాహనాలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ ఎగ్జిట్ పాయింట్లతో పాటు మలుపులు, ఇతర కీలక ప్రాంతాలకు సంబంధించి సూచికలు కాకుండా స్పష్టంగా కనిపించకపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదు. మరోపక్క ఓఆర్‌ఆర్‌పై వీధి దీపాలు సైతం లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది.
రాత్రి వేళల్లో ములుపులు కనిపించక వాహనాలు రెయిలింగ్స్‌ను ఢీకొంటున్నాయి. దీనికితోడు ఓఆర్‌ఆర్‌పైనా వాటర్ లాగింగ్ ఏరియాలు ఉండటం ప్రమాద హేతువుగా మారింది. 12 ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా గుర్తించినా ప్రమదాల నియంత్రణకు హెచ్‌ఎండీఏ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. రోడ్డు నిర్మాణం వరకే మా బాధ్యత...అనుమతి లేని వావాహనాలు ఆపాల్సింది మాత్రం పోలీసులే అన్నట్లుగా వ్యవరిస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
రాత్రిళ్లలోనే ఎక్కువ...
గతంలో జరిగిన ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఓఆర్‌ఆర్‌పై తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతి లేని వాహనాలను అడ్డుకోవడం, అతివేగంతో వెళ్లే వాహనాలను గుర్తించేందుకు తదితర చర్యలు తీసుకుంటున్నారు. అయితే భద్రతతో పాటు ఇతర అంశాల నేపథ్యంలో ఇవన్నీ పగటిపూట మాత్రమే పరిమితం ఆకవడంతో రాత్రి వేళల్లో దూసుకుపోతున్న వాహనాలు ప్రమాదాలకు గురికావడం, ప్రమాద హేతువులుగా మారడం పరిపాటిగా మారింది.
\గచ్చిబౌలి, పెద్ద అంబర్‌పేట్ మధ్యలో నాలుగు ఔట్ పోస్టు భవనాల నిర్మాణం సహా మరికొన్ని కీలక ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. ఓఆర్‌ఆర్‌పై జరుగుతున్న ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గించడానికి మొబైల్ ఐసీయూ సేవలను అవసరమని పోలీసులు చెబుతున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులోనైనా హెచ్‌ఎండీఏ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాల నివారణకు సమష్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.