అరసవల్లి: రథసప్తమి ఉత్సవం సందర్భంగా అరసవల్లి పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో కూడా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని, ఈ నిబంధనలను అందరూ పాటించి సహకరించాలని ట్రాఫిక్ డీ ఎస్పీ సీహెచ్ పెంటారావు కోరారు. శనివారం ఉదయం ఆయన అరసవల్లి ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు ఈనెల 23 రాత్రి నుంచి 24 వ తేది రాత్రి వరకు (రథసప్తమి ఉత్సవం ముగిసినంత వరకు) ట్రాఫిక్ సంబంధించి పలు నిబంధనలను విధించామన్నారు. ముఖ్యంగా అరసవల్లికి వచ్చే వాహనా లన్నీ దాదాపుగా 80 ఫీట్ రోడ్డులోనే నిలిపివేస్తామని, కేవలం వీవీఐపీలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వాహనాలు మాత్రమే అరసవల్లి జంక్షన్‌ను దాటి అనుమతిస్తామని, మళ్లీ ఇందులో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలు మాత్రమే ఆలయ ప్రధాన ముఖ ద్వారం (ఆర్చిగేటు) వరకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే మొత్తం పార్కింగ్ కోసమే 12 స్థలాలను ఏర్పాటు చేశామని వివరించారు.
► శ్రీకాకుళం నగరం నుంచి అరసవల్లి వైపుగా వచ్చిన వారి వాహనాలకు 80 ఫీట్ రోడ్డులోనే బైకులు, కార్లు, బస్సులకు వేర్వేరుగా 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
► అలాగే గార నుంచి వచ్చే వాహనాల కోసం వాడాడ కూడలి లోనూ, అరసవల్లి అసిరితల్లి ఆలయం వద్ద వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు.
► గార నుంచి నగరానికి వచ్చే బస్సులు, ఇతర వాహనాలన్నీ వాడాడ మీదుగా కలెక్టరేట్, ఓబీఎస్ మీదుగా వెళ్లాలని సూచించారు.
► నగరం నుంచి గార, శ్రీకూర్మం వైపు వెళ్లే వాహనాలు కూడా జాతీయ రహదారి మీదుగా వెళ్లి, అంపోలు (జిల్లా జైలు రోడ్డు) మీదుగా ఓ మార్గంలో వెళ్లాలని, అలాగే సింగుపురం (బూరవల్లి రోడ్డు) మీదుగా కొన్ని వాహనాలు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
► శ్రీకాకుళం నగరంలో కూడా రథసప్తమి రోజున పూర్తిగా వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నామని, అరసవల్లి రావాల్సిన అన్ని వాహనాను కాంప్లెక్స్, రామలక్ష్మణ కూడలి, సూర్యామహల్ మీదుగా అరసవల్లి జంక్షన్ (80 ఫీట్ రోడ్డు)కు చేరుకుంటాయని, తిరిగి వెళ్లే వాహనాలన్నీ మిల్లు జంక్షన్ నుంచి ఓబీఎస్ మీదుగా నగరంలోకి వెళ్లాలని, అలాగే జీటీ రోడ్డును కూడా వెళ్లే మార్గంగానే గుర్తించామని స్పష్టం చేశారు.
ఈ నిబంధనలు కచ్చితంగా పౌరులంతా పాటించాలని లేదంటే చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట సిఐ బి.ప్రసాదరావు, వన్‌టౌన్ ఎస్సై చిన్నంనాయుడు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment