శ్రీశైలం..భక్తజనసంద్రం
శ్రీశైలం: ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలం కార్తీకమాసం ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. సుమారు 80వేలకు పైగా భక్తులు శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని గంగాధర మండపం వద్ద కార్తీక దీపారాధనలను వెలిగించారు. అనంతరం మల్లన్న దర్శనం కోసం క్యూ కట్టారు. ఉచిత, ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలన్ని నిండిపోవడంతో భక్తులు ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులకు దేవస్థానం వారు మంచినీరు, పులిహోర ప్రసాదాలను క్యూలలోనే అందజేశారు. అలాగే శివదీక్షా శిబిరాల వద్ద ఉదయం 8గంటల నుంచి అల్పాహారం 9గంటల నుంచి కార్తీకవనభోజనాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి ప్రత్యేక కళావేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రవల్లిక బృందం నృత్యప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కార్తీక రెండో సోమవారం 4.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఈఓ భరత్ గుప్త ఏర్పాట్లు చేశారు.