వెలిగిన ఆకాశదీపం
శ్రీశైలం: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం సోమవారం నుంచి ప్రారంభం కావడంతో శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో సాయం సంధ్యవేళ ఆకాశదీపాన్ని శాస్త్రోక్తరీతిలో ఈఓ భరత్ గుప్త దంపతులు, అర్చకులు వెలిగించారు. ఆవునేతిలో ముంచిన ఒత్తిని ప్రమిదలో వెలిగించి ఇత్తడితో చేసిన భరణిలో ఉంచి సుమారు 30 అడుగుల ఎత్తున ఈ ఆకాశదీపాన్ని ఏర్పాటు చేశారు. కార్తీకమాసం ముగిసేంతవరకు ప్రతిరోజూ సాయంకాలం సంధ్యాసమయంలో ఈ ఆకాశదీపాన్ని వెలిగించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. అలాగే ఆకాశదీపాన్ని దర్శించడం వల్ల సర్వపాపాలు హరించబడి సద్గతి లభిస్తుందని, ఆయురారోగ్యాలు చేకూరుతాయని, అకాల మరణం సైతం ఆకాశదీప దర్శనంతో దరిచేరదని వారు పేర్కొన్నారు. అనివార్యకారణాలతో ఆలయ ప్రవేశం చేయలేని వారు దూరం నుంచే ఈ ఆకాశదీపాన్ని దర్శించుకోవచ్చుననే సామాజిక అంశం కూడా ఇందులో ఇమిడి ఉందన్నారు.