మల్లయ్య..మమ్మాదుకోవయ్యా!
మల్లయ్య..మమ్మాదుకోవయ్యా!
Published Wed, Mar 29 2017 9:23 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
- వైభవంగా మల్లన్న రథోత్సవం
- వేడుకల్లో 3లక్షలకు పైగా భక్తులు
- రథోత్సవానికి ముందు కూష్మాండబలి
- కీలక ఘట్టం ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
- ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
- రథోత్సవంలో భారీ బందోబస్తు
శ్రీశైలం: శివభక్తులకు భూకైలాసంగా భూమండల నాభిస్థానంగా పిలువబడుతున్న జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది పర్వదినాన అశేష జనవాహిని మధ్య శ్రీశైలేశుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నెల 26 నుంచి ఉగాది మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బు«ధవారం స్వస్తిశ్రీ హేవిలంబినామ సంవత్సర ఉగాది పర్వదినాన సాయంత్రం 4గంటల నుంచి రథాంగపూజ, రథాంగ హోమం, రథాంగబలి నిర్వహించారు. 4.45గంటలకు భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల రథోత్సవ వేడుక జరిగింది. సుమారు 3లక్షలకుపైగా భక్తులు రథోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఆలయాల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి, పూజలనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తూ మేళతాళాల మధ్య ఆలయ ప్రాంగణం నుంచి రథశాల వద్దకు తీసుకువచ్చారు. పల్లకీలో వచ్చిన స్వామిఅమ్మవార్లను రథంలో ఆవహింపజేశారు.
ర«థాంగబలిలో భాగంగా ఈఈ రామిరెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, పీఆర్వో డాక్టర్ కడప అనిల్‌కుమార్, డీఈ నరసింహరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్, ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్, అర్చకులు, పండితులు రథోత్సవ ప్రారంభ సూచనగా కూష్మాండబలిని సమర్పించారు. కన్నడ భక్తులు సిరిగిరి మల్లయ్యా, మహాత్మ మల్లయ్యా..మమ్మాదుకోవయ్యా.. నినాదాల మధ్య రథశాల నుంచి రథోత్సవం బయలుదేరింది. భక్తిపూర్వకంగా రథం మీదికి అరటి పండ్లు, ఎండు ఖర్జూరం, కలకండలను భక్తులు విసిరి తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత నంది మండపం నుంచి తిరిగి రథోత్సవం బయలుదేరి రథశాలకు చేరింది. జిల్లా ఎస్పీ రవికృష్ణ నేతృత్వంలో పోలీసులు రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఉగాది పర్వదినాల్లో కీలక ఘట్టమైన రథోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు దేవస్థానం ఈఓ నారాయణభరత్‌గుప్త సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌లో పరిస్థితులను వీక్షిస్తూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై వైర్‌లెస్ సెట్ ద్వారా సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు.
రథోత్సవంలో ఆకట్టుకున్న జానపద కళారూపాలు
శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26 నుంచి ప్రారంభమైన ఉగాది మహోత్సవాల్లో కన్నడిగులను అలరించడానికి దేవస్థానం వారు సంప్రదాయ నృత్యప్రదర్శనలు, భక్తి సంగీత విభావరి తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గ్రామోత్సవంలో గొరవల నృత్యం, కోలాటం, చెక్కభజన, కన్నడడోలు విన్యాసాలు, కేరళ కథక్ కేళి నృత్యాలు, బుట్ట బొమ్మలు, పగటి వేషధారులు, జాంజ్, నందికోలు ఉత్సవం మొదలైన జానపద కళారూపాలు భక్తులను సమ్మోహితులను చేశాయి.
Advertisement