బొంతాలమ్మ గుడికాడ జయరాముడు, జయచంద్రుడు, జయసింహుడితో కలసి దాయాలాట ఆడతా వుండాడు ధనంజయుడు. కార్తీకమాసం కాబట్టి గుడిలో దీపాలు వెలిగిద్దామని వచ్చినారు మునిలక్ష్మి, వెంకటలక్ష్మి, సుబ్బలక్ష్మి.‘‘ఒరేయ్, జయరామా! మొన్న మంగళవారం నాడు నా మనవడు నాగసూరి ప్రసాదానికి వస్తే పొంగలి పెట్టకుండానే పంపినావంట కదరా’’ అని ఎగిరెగిరి అడిగింది మునిలక్ష్మి.‘‘ఆరోజు పొంగలి అరచెంబుకే వండినాములే అక్కా, చాలీ చాలకుండా వచ్చిందిగానీ’’ అని గట్టిగా బదులిచ్చినాడు.‘‘వచ్చినోడే వచ్చి పదిసార్లు పొంగలికి చేయి చాపితే ఎక్కడి నుంచి తెచ్చేదిలే అక్కా’’ అని గుసగుసలాడినాడు.‘‘జయచంద్రా, నా ఏడేండ్ల చిన్న బుడ్డోడు మనోహరుడు జంబాడ బస్సెక్కితే టికెటు తీసుకోమన్నావంట కదరా. ఊరోడిగా ఉండి ఊరోళ్లనే టికెట్ అడగతావరా? అని రాగాలు తీస్తూ అడిగింది వెంకటలక్ష్మి.‘‘ఏమి చేసేది పిన్నమ్మా! అయిదేండ్లు దాటితే ఆర్టీసీబస్సులో టికెటు కొట్టమని రూల్ ఉంది కదా’’ అని వయ్యారంగా బదులిచ్చినాడు ఆర్టీసీ కండక్టర్ జయచంద్రుడు.‘‘భలే రూల్స్‌గానీ...’’ అని విసురుగా అంటూ ఇంటికి బయలుదేరింది వెంకటలక్ష్మి.‘‘జయసింహా! పప్పన్నం ఎప్పుడు పెడ్తావబ్బీ’’ అని ఊరంతా అడిగింది సుబ్బలక్ష్మి.‘‘నయనతార నంబర్ దొరకలేదత్తా. ముహూర్తాలు పెట్టుకొందామంటే’’ అని నంగిగా బదులిచ్చినాడు మూడుపదుల జయసింహుడు.‘‘మీతో మాట్లాడాలంటే మూడుపూటలు తింటే చాలదురా అబ్బా, అయిదారు సార్లన్నా తినాల్సిందే’’ అంటూ గబగబా వెళ్లిపోయింది.
కడుపులో ఎలుకలు పరుగెడ్తావుంటే బొంతాలమ్మ గుడి కాడి నుంచి గబగబా తడుకుపేట ఊర్లోకి బయలుదేరినాడు ధనంజయుడు. ఆకలికి పంచె ఎగ్గట్టుకొని పరుగులు తీస్తూ వీరరాఘవన్న ఇంటి వంటగదిలోకి దూరినాడు. అన్ని ఆల్మారాలు వెదికినాడు. అప్పచ్చులు ఏమీ దొరకలేదు. చిన్నతట్టలో నారదబ్బ ఊరగాయ ముక్క కనబడింది. నోటిలో ఊట మొదలయ్యింది. గబుక్కున దానిని నోట్లో వేసుకొని చప్పరిస్తూ పరుగెత్తుతా ఊర్లోకి పోయినాడు. పరుగులు తీస్తూ ‘నెల్లికాయ తెద్దునా, నిమ్మకాయ తెద్దునా’ అని చిటికెలేసి పాడుకుంటూ వెళ్లినాడు.కొంగు విదిలించి ధనంజయుడిని ఉరిమి ఉరిమి చూడసాగింది రాఘవన్న భార్య నరసమ్మ.
‘‘ఎవరిని ఎక్కడ పెట్టాల్నో మీకు తెలవకపాయె. వాడిని ఇంట్లోకి ఎందుకు రానిస్తారు మీరు? వీధి పొరికివాడు. నెత్తిన ఎక్కించుకొంటిరి. వాడిష్టంగా వాడు నేరుగా ఇంట్లోకి వస్తాడు, పోతాడు. అడగకుండానే దూరి దూరి తింటాడు. నచ్చింది చేస్తాడు. నట్టింట్లో తిష్ట వేస్తాడు. అడ్డదొడ్డం తిరగతాడు. ఎట్లా ఏగేదబ్బా వాడితో’’ అంటూ చేతులు తిప్పుతూ భర్తని నిష్టూ మాడింది నరసమ్మ. వినీవిననట్లు ఇంటి ముందరి మునగచెట్టుకి విరగకాచిన మునగకాయలను వరుసగా ఎంచసాగాడు రాఘవన్న.‘‘ధనంజయుడి గురించి మీకు ఎన్ని చెప్పినా ఉలకరు, పలకరు. బండరాయిలాగ గమ్మున ఉంటారు. నాకేమో వాడు మన ఇంట్లో తిరుగులాడుతుంటే ఒళ్లంతా జెర్రులు పాకినట్లు ఉంటాది, నిప్పుల్లో నడిచినట్లు ఉంటాది. మీకు మేనమామకొడుకో, నాకు మేనత్త కొడుకో అన్నట్లుగా వాడిని చూస్తారు. వాడిని ‘దేముడమ్మ దేముడు’ అన్నట్లుగా ఇల్లంతా, ఊరంతా ఊరేగిస్తారు. ఎట్ల చేసేదబ్బా? ఎవరితో చెప్పుకొనేదబ్బా’’ అంటూ పెరట్లో పాత్రలేసుకొని కడుగుతూ గట్టిగట్టిగా ముక్కుచీదసాగింది నరసమ్మ. తిన్నెపైన కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న తెల్లకొంగల్ని లెక్కలేస్తున్నాడు రాఘవన్న.
ఊర్లోని ముత్తబావ శవం పాడిపైన ఊరేగుతోంది. తిమ్మాపురం తిమ్మడి బృందం పలకలు కొడుతోంది. కర్రోడు, పొట్టేలు పరంధాముడు, నడింపల్లి నాగన్న, దొంగకోళ్ల దామోదరం, రామగిరి రామన్న శవం ముందు డ్యాన్సులు చేస్తా వుండారు. తిరుచానూరు తిరుపాలు టపాకాయలు పేలస్తా వుండాడు. బాతుల బాలిరెడ్డి బుట్టలోంచి పూలు, బొరుగులు, పైసలు చల్లతా పోతావుండాడు.మిట్ట మధ్యాహ్నం బొంతాలమ్మ గుడికాడ పొట్టి రెక్కల చొక్కా వేసుకొని నిద్ర పోతావుండాడు ధనంజయుడు. వాడి చెవులకి చావు మేళం వినిపించింది. సరసరాలేచి టకటక నడుస్తూ ‘లకలక’ అంటూ పలకల ముందరకి దూకినాడు. ఒంటికాలిపై నిలబడి భుజాలు ఎగరేస్తూ నోట్లో నాలిక మడిచి కులకతా డ్యాన్సు చేసినాడు. పరుగెత్తతా వచ్చిన గంపలాయన ఈలలు వేస్తూ వయ్యారంగా చేతివేళ్ళు తిప్పుతూ చిందులేసినాడు. రాజబాబు టపాకాయలు పేల్చినాడు.ఇంటి ముందర గుబురుగా ఉన్న తెల్ల ఉమ్మెత్త పూలు అటూ ఇటూ ఊగుతుంటే వాటిని లెక్కేస్తూ నిల బడివున్నాడు రాఘవన్న. ధనంజయుడి డ్యాన్సు చూడలేక నరసమ్మ ఇంటి తలుపులేసుకొని పెరట్లో చిక్కుడు పందిరి దగ్గరికి పోయి నిలబడింది. తిరుత్తణి కొండని చూస్తూ ‘ము రుగా! కొడుకు కుమారస్వామి అమెరికాలో రేయనక పగలనకా కష్టం చేసి పైసలు పంపిస్తా వుండాడు. నా మొగుడేమో వీధి పొరికి ధనంజయుడిని ఏనుగును మేపినట్లు మేపతా ఉండాడు. వాడు అడిగింది కాదనడు. అడిగినప్పుడల్లా డబ్బులిస్తాడు. వాడు మూడు పూటలా మా ఇంటికాడనే పడి మెక్కతాడు. పనీ లేదు పాటా లేదు వాడికి. ముందూ వెనకా ఎవరూ లేరు వాడికి. ఎక్కడి వాడో.... ఎవడువాడో నా బిడ్డ సొత్తంతా తిని పోతావుండాడే. ఊరకనే సాకతావుండాడు వాడిని మా ఇంటాయన. నా మొగుడి బుద్ధి మార్చరాదా. నీకు నెలనెలా ప్రతి కృత్తికకీ పిండి దీపం వెలిగించి దండం పెట్టుకుంటా మురగా’’ అని చేతులెత్తి వేడుకొంది.
రాఘవన్న, ధనంజయుడు నాలుగేసి సజ్జెరొట్టెల్ని ఎర్రగడ్డ కారం వేసుకొని తృప్తిగా తినినారు. పౌర్ణమి వెన్నెలకి ఇంటి ముందర నారమంచం వేసి కూర్చొన్నారు. చల్లగా చింత చెట్ల గాలి వీస్తోంది. కొండపైన తిరుత్తణి గుడిదీపాలు మిలమిలా మెరుస్తున్నాయి.ఎదురింటి వెంకటస్వామికి తెల్లారికి మార్కెట్‌లోకి తోపుడు బండి సిద్ధం చేస్తా ఉండాడు. వెంకటస్వామి భార్య వెంకటలక్ష్మి నైటీ వేసుకొని దానిపైన తువ్వాలు వేసుకొని నాలుగేసి మునక్కాయలు జతచేసి అరటినార చుట్టి బండిలో పెడతావుంది.ఈతగింజలు తింటూ ధనంజయుడు ‘‘కొండ ఎక్కినోడు కొండ దిగడా, శెనక్కాయలు తిన్నోడు సేయి కడగడా, ఏటికి పోయినోడు కాళ్లు కడగడా, పుట్టినోడు చావడా’’ అన్నాడు. ముసిముసిగా నవ్వినాడు రాఘవన్న. పడిపడీ నవ్వినారు వెంకటస్వామి, వెంకటలక్ష్మి.మాణిక్యం తాగి ఊగతా వీధిలోని వేపచెట్టు కింద ధబీమని పడినాడు.‘‘ఏం మావా, పడినావా’’ అని అడిగినాడు ధనంజయుడు.‘‘లేదురా ధనంజయా, తమాషాగా ఉంటుందని పల్టీ కొట్టినానురా’’ అని లేచి ఒళ్లు దులుపుకొని ఊర్లోకి పోయినాడు. ధనంజయుడు నవ్వుతూ ‘‘చూడు రాఘవన్నా! మాణిక్యంగాడు పడినా పల్టీ అంటూ లేచిపోతా వుండాడు’’ అనినాడు.
వీధికుక్కలు రెండు మొరుగుతూ మంచినీళ్ల గుంటవైపు పరుగులెత్తినాయి. తలతిప్పి చూసినాడు రాఘవన్న. ‘‘మన ఊరి కుక్కలు దొంగల్ని చూసి మొరిగేది మరచినాయిలే రాఘవన్నా. అట్ల తిరిగి, ఇట్ల తిరిగి మన వాళ్లని, మన ఊరి వాళ్లనే చూసి మొరుగుతున్నాయి. ఇవి దొంగల్ని పట్టిందీ లేదూ, దొంగలు దొరికిందీ లేదూ’’ అని రాగాలు తీస్తూ చెప్పినాడు ధనంజయుడు. ఫస్ట్ షో తెలుగు సినిమాకి సైకిల్‌లో పోయివస్తావున్న మొగుడూపెళ్లాలు బోడెన్న బోడెక్కలు ధనంజయుడి మాటలకి నవ్వుకుంటూ వెళ్లినారు.‘‘రాఘవన్నా! సెప్పేది మరచినా. మొన్న చచ్చిన ముత్తబావ కొడుకు మునికిష్టడు నాయిన పోయినాడని దొర్లిదొర్లి ఏడ్చినాడన్నా, పోయినోడితోనే పోతాడన్నంతగా పొర్లి పొర్లి ఏడ్చినాడు.సచ్చినోళ్లతోనే పోతామా! సింగినాదం కాకపోతే, ఏడ్చి ఏడ్చి నువ్వు చస్తే నీ బిడ్డలెట్ల బతకతార్రా’’ అని అందరూ సర్ది చెప్పినారన్నా. గుంతలో శవాన్ని వేస్తావుంటే ముత్తబావా చొక్కాజేబులో రెండు రెండువేల నోట్లు వున్నాయన్నా. ఆ నోట్లు శవంతోటే పూడ్చేద్దామంటే వినలేదన్నా మునికిష్టడు. రచ్చరచ్చ చేసినాడు. పోనీ దాన్ని గుంత తవ్వినోడికి ఇనాం ఇద్దామని ఊరిపెద్ద పెరుమాల్రాజు చెబితే గలాటా చేసి రెండు నోట్లూ పెరికి పెట్టుకున్నాడన్నా...అట్లా ఆడిస్తదన్నా జిత్తుల మారి బుద్ధి’’ అని చెప్పినాడు ధనంజయుడు. కావడి పూజ చేసుకొని, కాశెమ్మ కొడుకు కోడలు గుడికి పోయి గుండు గీయించుకొని ఇంటికెళ్తున్నారు. ధనంజయుడి మాటలు విని వాళ్లు ముసిముసిగా నవ్వుకొంటూ పోయినారు.ఇంతలో నరసమ్మ తాగేదానికి చెంబునిండా మజ్జిగ తెచ్చి ఇచ్చింది రాఘవన్నకి. ‘ధనంజయుడికి మజ్జిగ లేదా’ అన్నట్లుగా పెళ్లాం వైపు చూసినాడు. ‘‘సట్టెడు తిన్నాడు, చాల్లే. ఇంట్లో చలివేంద్రం పెట్టలేదు. దారిన పోయే వాళ్లకంతా మజ్జిగ దానం చేయడానికి’’ అన్నట్లుగా ముఖం పెట్టింది నరసమ్మ.
మజ్జిగ తాగి మీసాలు తుడుచుకొని చెంబు నరసమ్మ చేతికిస్తూ ఆమె చేతి బంగారు గాజుల్ని చూసినాడు. కొడుకు ఇంజనీరింగ్ చదువులకి గ్రామీణబ్యాంకులో రెండు మూడు సార్లు వాటిని కుదవపెట్టిన విషయం గుర్తొచ్చింది.‘‘ఎంత కష్టపడి చదివించినాం బిడ్డని’ అనుకున్నాడు మనసులో.‘‘వాడు అమెరికా వెళ్లి డాలర్ల వర్షం కురిపించినాక అప్పులన్నీ తీర్చేసుకున్నాములే’’ అని తనలో తాను అనుకున్నాడు.‘అర్ధరాత్రిళ్ల దాకా చదివి ఆకాశంలో ఎగిరి అమెరికా వెళ్లినాడు. మంచికీ చెడ్డకీ ఎట్ల రాబోతాడబ్బా మన ఊరికి’ అంటూ ఆలోచనలో పడ్డాడు. కంట్లో తడి ఎవరికంటా పడకుండా పై గుడ్డతో తుడుచుకున్నాడు.రాఘవన్న, ధనంజయుడు ఊర్లో కథలన్నీ మాట్లాడి మాట్లాడి అలిసిపోయినారు. ఆకాశంలో నక్షత్రాలను లెక్కిస్తూ ఇద్దరూ మంచంపైన గురకలు పెడ్తూ నిద్రపోయినారు.ఆడినెల–ఆదివారం నాడు సన్నసన్నగా చినుకులు రాలుతూ ఉన్నాయి. కోమటోళ్ల బావికాడ వరికయ్యిలో కలుపు తీస్తా వుంది నరసమ్మ. నరసమ్మకి తోడుగా కయ్యిలో అయిదారు కొంగలు వంగి పురుగూపుట్రా తింటున్నాయి. నాటుకోళ్లు నాలుగు నరసమ్మ చుట్టూ తిరిగి తిరిగి కానగచెట్టు కింద చేరినాయి.పరుగులు తీస్తా పేరూరు పద్మ అరస్తా వచ్చి చెప్పింది–‘‘నరసక్కా! నరసక్కా! మన రాఘవన్న బ్రహ్మంగారి మఠంకాడ నిలబడినోడు నిలబడినట్లే గుండె పట్టుకొని పక్కకి వాలిపోయినాడంట. మన ఊరి ఆయుర్వేదం డాక్టరు ఆర్ముగం నాడిపట్టి చూసి పెదాలు విరిచేసినాడంట. ఊరు ఊరంతా మఠం కాడ వుండారక్కా’’విషయం విన్న నరసక్క సెకను నిలబడలా. కత్తి, కొడవలి, పార వరికయ్యిలోనే పారేసి గట్టిగా గుండెలు బాదుకొంటూ గెనాలమ్మిట మఠంకాడికి పరుగులు తీసింది. బావికాడి పచ్చగడ్డి తింటున్న రెండు ఆవులు తలలెత్తి నరసమ్మ వైపు చూసినాయి. నరసమ్మ ఊర్లోకి పోయేంతవరకు ఆ దిక్కే చూసినాయి. బావి కట్టపైన ఉన్న బొప్పాయి చెట్టుకున్న కాయలు యజమాని లేడని తెలిసి బాధపడ్తున్నట్లుగా పాలు కార్చినాయి.
శవం చుట్టూ జనాలు గుంపులు గుంపులుగా చేరినారు. ఐ.ఐ.టి, ఖరగ్‌పూర్‌లో చదువుతున్న మేకల గంగయ్య వీడియో కాన్ఫరెన్స్ పెట్టినాడు. నాయన శవాన్ని చూసి భోరుభోరున ఏడుస్తున్నాడు కాలిఫోర్నియాలోని కొడుకు కుమారస్వామి. గ్రామపెద్దలు జడామణి, రోడ్డు మేస్త్రీ, తపాలాయన, బ్యాంకు బాలరాజు, మాడా మునస్వామి విషయాన్ని కుమారస్వామికి వివరించినారు. అమ్మ నరసమ్మకి ధైర్యం మాటలు చెప్పినాడు కుమారస్వామి. తను రావడానికి కుదరడం లేదని భోరుభోరునా ఏడుస్తూ చెప్పినాడు.మరి ‘తలకొరివి ఎవరు పెడ్తారు?’ అని అడిగినాడు సర్పంచ్ సుబ్బరామన్న. తల కొట్టుకుంటూ కూర్చొంది నరసమ్మ. పక్కనున్న ఆడాళ్లంతా ఒకర్నొకరు పట్టుకొని ఏడస్తావుండారు. భారతంమిట్ట, పేటమిట్ట, మేదరమిట్ట, గులకరాళ్లమిట్ట, కొత్తపల్లిమిట్ట బంధువులంతా ‘ఒక్కగానొక్క కొడుకుని అమెరికాకు పంపినారు కదబ్బా’ అని గుసగుసలాడినారు. వెంకటాపురం, వేదాంతపురం, ఈశ్వరాపురం, రామాపురం, వేమాపురం దాయాదులంతా ‘దూరాబారాలెల్లిపోయి, పిలకాయలు చివరి చూపులకి కూడా రాలేకపోతావుండారు కదబ్బా’’ అని చెవులు కొరుక్కున్నారు.ఇంతలో ఎక్కడి నుంచో ‘లక్ లక్’మంటూ ఎగురుతూ చేతుల్తోనే తిక్కమేళం వేసుకొంటూ వచ్చినాడు ధనంజయుడు. మెడ మీది తువ్వాలు ఆకాశంలోకి విసురుతా ‘రాఘవన్నకి తలకొరివి నేను పెడ్తాను’ అని అరిచి చెప్పినాడు. అందరూ వాడివైపు తల తిప్పి చూసినారు.‘‘రాఘవన్న బతికి వున్నప్పుడే నాకు చెప్పినాడు. కొడుకు కుమారస్వామి అమెరికా నుంచి రాలేకపోతే నాకు కొరివి నువ్వే పెట్టాలిరా ధనంజయా...అని ఒక్కసారి కాదు...వందసార్లు చెప్పినాడు పెద్దాయన’’ఊరి కుర్రకారు గంతులేస్తూ ధనంజయుడి వైపు చేతులు విసిరినారు. జయరాముడు, జయచంద్రుడు, జయసింహుడు కులాసాగా చేతి గుడ్డలు ఊపినారు. రాములోరి గుడి అయ్యోరు ధనంజయుడిని గుండెలకి హత్తుకున్నాడు. పోస్ట్‌మాస్టర్ చీటీల చెంగల్రాజు ధనంజయుడి మెడలో ముద్దబంతుల మాల వేసినాడు. చేయి చేయి కలిపినాడు. అక్కడ ఉన్న ఆడోళ్లంతా ధనంజయుడు చేస్తున్న మంచిపనికి ముక్కు మీద వేలేసుకొని సంతోషపడినారు.
తూకివాకం తిరుపాలు బృందం పలకలు కొడతా వచ్చింది. బీడీల బీకిరాజు, గూని గురవరాజు, సంగటికూడు శివయ్య, ఆవిరికుడుము ఆనందుడు, లొడిగనోరు లోకనాధంలు డాన్సులు చేస్తా వచ్చినారు. కాటమరెడ్డి నడిపి కొడుకు టపాకాయలు పేలస్తా వుండాడు. బాణపొట్ట బాలరాజు బుట్టలోంచి పూలు, బొరుగులు, పైసలు చల్లతా వుండాడు. పరుగెత్తతా వచ్చిన కొర్రలోడు రెండు చేతులూ నడుముపైన పెట్టుకొని నోటితోనే ఈలలు వేస్తా వుండాడు.ఉడకబెట్టిన అన్నం మట్టికుండలో పెట్టుకొని, తెల్లతడి పంచె కట్టుకొని శవం ముందర నడుస్తున్నాడు ధనంజయుడు. వాడిని కన్నులార్పకుండా చూస్తోంది నరసమ్మ. మొగుడి ముందస్తు ఒప్పందం తెలియక ‘వీధి పొరికి’ అనుకున్న ధనంజయుడిలో తన కొడుకు కుమారస్వామి కనిపించాడు. ఆమెకు తెలియకనే ఆమె కళ్లు మరిన్ని కన్నీళ్లు కార్చాయి. ధనంజయుడికి చేతులెత్తి నమస్కరించింది. ఊరిలోని ఉమ్మెత్తపూలు ధనంజయుడిని చూసి పలకరింపుగా అటూ ఇటూ ఊగుతూ పలకరించినాయి. తిరుత్తణిలో కొండపైని గుడి గుంటలు గణగణ మోగినాయి.
ఆర్.సి.కృష్ణస్వామిరాజు
వీధి పొరికి
Published Sun, Sep 30 2018 12:58 AM | Last Updated on Sun, Sep 30 2018 12:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment