కార్తీకమాసం మరికొద్దిరోజులు మాత్రమే ఉంది. ఇంతకాలం వివిధ కారణాల వల్ల వనభోజనాలకు వెళ్ల(లే)నివారు ఇప్పుడైనా సరే.. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధుమిత్రులతో కనీసం కుటుంబ సభ్యులతో కలసి ఒక పిక్నిక్‌లా వనభోజనాలకు వెళ్లి, స్నేహంగా... ప్రేమగా.. సమైక్యతా భావంతో జరుపుకుంటే.. ఆత్మీయానుబంధాలు పెనవేసుకుంటాయి. మానవ సంబంధాలు బలపడతాయి.
కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అంతేకాదు.. ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు కార్తీక వనభోజనాలు మంచి ఆటవిడుపు. పూర్వం సూతమహర్షి ఆధ్వర్యంలో నైమిశారణ్యంలో మునులందరూ వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీకపురాణం చెబుతోంది. అలా పూర్వం ఆ మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాల ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ మనందరం ఏర్పాటు చేసుకుంటున్నాం.
నలుగురితో కలిసి మెలిసి సంతోషంగా వేడుకలు జరుపుకొంటూ ఆనందిస్తున్నాం. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యానవనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు. వనభోజనాలు మనలోని కళా ప్రావీణ్య ప్రదర్శనకూ వేదికగా నిలుస్తాయి. భోజనాలకే పరిమితం కాకుండా, అందరూ కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా, ఆనందంగా గడిపేందుకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుంది.
ప్రకృతి ఆరాధన
మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు. ఫలం, పుష్పం, పత్రం లేకుండా మన పూజలు సంపూర్ణం కావు. సంస్కృతి ముందుకు సాగినా భారతీయులు ఆనాటి మూలాలను మర్చిపోలేదు. మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని వారికి తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట. అలాంటి ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధభరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడానికైనా వనభోజనాలు సరైన సందర్భాలు.
ఎక్కడపడితే అక్కడ వనభోజనాలు అంత ఆరోగ్యకరం కాదు కాబట్టి ఉసిరి చెట్టు ఉన్న వనం ముఖ్యం అన్నారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సామాజికం... ఇలా ఏ కోణంలోంచి చూసినా వనభోజనాలకు సాటి మరో సందర్భం కానరాదు! ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడమ’ని అమరకోశం చెబుతుంది. జపానులో కూడా హనామి (హన – పువ్వు, మిమస్ – చూడటం) పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుకను జరుపుకుంటారు.
సామాజిక కోణం
వనభోజనాలు సంప్రదాయమే కాదు అందులో సామాజిక కోణమూ వుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ కోణం. అంతస్తుల తారతమ్యాలు లేని సమైక్యతా భావం ఈ సహపంక్తి భోజనాల్లో వెల్లివిరుస్తుంది. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించే క్రమంలో వన భోజనాలు జన భోజనాలుగా వర్థిల్లుతాయి.
– పూర్ణిమాస్వాతి గోపరాజు
కార్తీక మాసంలోనే ఎందుకంటే..?
కార్తీక మాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అలాంటి ఆరుబయలు ప్రదేశంలో అందరూ కలిసి అక్కడే వంటలు వండుకుని తినడం మరీ మంచిది. కుదరని పక్షంలో అందరి ఇళ్లనుంచి తెచ్చిన వంటకాలను ఒకరితో ఒకరు పంచుకుని తినడం కూడా స్నేహపరిమళాలు ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది. అందరూ కుటుంబాలతో వెళ్లడం, చెట్లకింద రకరకాలవంటలు వండుకుని తినడం ఒక అనుభవం. అయితే... ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజ నాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు.
Comments
Please login to add a commentAdd a comment