Vanabhojanalu
-
చెట్టు కింద వంట సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (అట్లాంటా) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు చెట్టు కింద వంట కార్యక్రమాన్ని ఉల్లాసంగా నిర్వహించారు. 2022 మే 14న బూఫోర్డ్ డ్యామ్రోడ్డులో ఉన్న సరస్సు ఒడ్డున చిక్కనైన వనంలో పచ్చని చెట్ల కింద వంటావార్పు - ఆటాపాటలతో సందడి చేశారు. ఆరేళ్ల కిందట టీడీఎఫ్ ఈ వంటావార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వంటావార్పు కార్యక్రమంలో 800ల మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా హాయిగా గడిపారు. పురుషులు నలభీములై పాకాలను ఘుమఘుమలాడించగ, స్త్రీమూర్తులు అన్నపూర్ణలై కమ్మదనాన్ని రంగరించారు. సుమారు 20 రకాల నోరూరే శాకాహార మాంసాహార వంటకాలు సిద్ధం చేశారు. లావణ్య గూడూరు తన ఆటపాటలతో ఆకట్టుకుంది. చెట్టు కింద వంట కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళిక బద్దంగా కార్యాచరణ రూపొందించుకుని టీడీఎఫ్ అందులో విజయం సాధించింది. బాపురెడ్డి కేతిరెడ్డి, స్వాతి సుదిని సారథ్యంలో స్వప్న కస్వా నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు, కోర్‌టీం మెంబర్స్ అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహణకు తమ వంతు సహకారాన్ని అందించిన సువిద, డెక్కన్ స్పైస్, డీజే దుర్గం, లావణ్య గూడురు ఇతర స్వచ్చంధ సంస్థలకు టీడీఎఫ్ ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ఇదే తీరుగా సహాకారం ఇవ్వాలని కోరింది. తమ ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రవాస తెలుగువారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపింది. చదవండి : టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వనితా డే -
సామాజిక వనంలో కార్తీక జన భోజనాలు
కార్తీకమాసం మరికొద్దిరోజులు మాత్రమే ఉంది. ఇంతకాలం వివిధ కారణాల వల్ల వనభోజనాలకు వెళ్ల(లే)నివారు ఇప్పుడైనా సరే.. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో బంధుమిత్రులతో కనీసం కుటుంబ సభ్యులతో కలసి ఒక పిక్నిక్లా వనభోజనాలకు వెళ్లి, స్నేహంగా... ప్రేమగా.. సమైక్యతా భావంతో జరుపుకుంటే.. ఆత్మీయానుబంధాలు పెనవేసుకుంటాయి. మానవ సంబంధాలు బలపడతాయి. కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అంతేకాదు.. ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు కార్తీక వనభోజనాలు మంచి ఆటవిడుపు. పూర్వం సూతమహర్షి ఆధ్వర్యంలో నైమిశారణ్యంలో మునులందరూ వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు కార్తీకపురాణం చెబుతోంది. అలా పూర్వం ఆ మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాల ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ మనందరం ఏర్పాటు చేసుకుంటున్నాం. నలుగురితో కలిసి మెలిసి సంతోషంగా వేడుకలు జరుపుకొంటూ ఆనందిస్తున్నాం. ప్రత్యేకించి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో కార్తీక వన భోజనాలు సమీప ఉద్యానవనాలలో, తోటల్లో, నదీ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో జరుపుకుంటారు. వనభోజనాలు మనలోని కళా ప్రావీణ్య ప్రదర్శనకూ వేదికగా నిలుస్తాయి. భోజనాలకే పరిమితం కాకుండా, అందరూ కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా, ఆనందంగా గడిపేందుకు ఇది ఒక చక్కటి వేదిక అవుతుంది. ప్రకృతి ఆరాధన మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు. ఫలం, పుష్పం, పత్రం లేకుండా మన పూజలు సంపూర్ణం కావు. సంస్కృతి ముందుకు సాగినా భారతీయులు ఆనాటి మూలాలను మర్చిపోలేదు. మనిషి ఎంతగా ఎదిగినా ప్రకృతికి లోబడక తప్పదని వారికి తెలుసు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు. అలాంటి వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మాసంలో ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావించి పూజించాలన్నది పెద్దల మాట. అలాంటి ఆరుబయల్లో అందరూ కలిసి వంటలు వండుకోవడానికైనా, ఔషధభరితమైన ఉసిరి వంటి చెట్ల గాలిని పీల్చుకోవడానికైనా వనభోజనాలు సరైన సందర్భాలు. ఎక్కడపడితే అక్కడ వనభోజనాలు అంత ఆరోగ్యకరం కాదు కాబట్టి ఉసిరి చెట్టు ఉన్న వనం ముఖ్యం అన్నారు పెద్దలు. వినోదం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సామాజికం... ఇలా ఏ కోణంలోంచి చూసినా వనభోజనాలకు సాటి మరో సందర్భం కానరాదు! ‘వనం’ అనే పదానికి ‘అరణ్యాన్ని ప్రేమించడమ’ని అమరకోశం చెబుతుంది. జపానులో కూడా హనామి (హన – పువ్వు, మిమస్ – చూడటం) పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుకను జరుపుకుంటారు. సామాజిక కోణం వనభోజనాలు సంప్రదాయమే కాదు అందులో సామాజిక కోణమూ వుంది. స్నేహాన్ని, సమైక్యతను పెంచేదే ఈ కోణం. అంతస్తుల తారతమ్యాలు లేని సమైక్యతా భావం ఈ సహపంక్తి భోజనాల్లో వెల్లివిరుస్తుంది. ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించే క్రమంలో వన భోజనాలు జన భోజనాలుగా వర్థిల్లుతాయి. – పూర్ణిమాస్వాతి గోపరాజు కార్తీక మాసంలోనే ఎందుకంటే..? కార్తీక మాసపు రోజుల్లో బయట గడిపేందుకు వాతావరణం అనువుగా ఉంటుంది. వర్షాలు అప్పటికి తగ్గుముఖం పడతాయి కాబట్టి కీటకాల బెడద కూడా అంతగా ఉండదు. చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. అలాంటి ఆరుబయలు ప్రదేశంలో అందరూ కలిసి అక్కడే వంటలు వండుకుని తినడం మరీ మంచిది. కుదరని పక్షంలో అందరి ఇళ్లనుంచి తెచ్చిన వంటకాలను ఒకరితో ఒకరు పంచుకుని తినడం కూడా స్నేహపరిమళాలు ఆస్వాదించడానికి అనువుగా ఉంటుంది. అందరూ కుటుంబాలతో వెళ్లడం, చెట్లకింద రకరకాలవంటలు వండుకుని తినడం ఒక అనుభవం. అయితే... ఉసిరి చెట్టు ఉన్న వనంలో వనభోజ నాలు చేయడం ఆరోగ్యకరం అంటారు పెద్దలు. -
హైదరాబాద్: కార్తీక మాసం..వనభోజనాల సందడి
-
టీడీఎఫ్ ఆధ్వర్యంలో వనభోజనాలు
అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్( టీడీఎఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో వనభోజనాలను అట్టహాసంగా నిర్వహించింది. చాప్టర్ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీని.. ప్రొఫెసర్ జయశంకర్‌కి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వనభోజనాలకు పోర్ట్‌ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలివచ్చారు. అదేవిధంగా టీడీఎఫ్ ఫుడ్ బృంద సభ్యులు పార్క్‌లోనే రుచికరమైన తెలంగాణ వంటలు వండి అందరికి వడ్డించారు. అదేవిధంగా కార్యక్రమం ముందు టీడీఎఫ్ రెండవ వాలీబాల్, చెస్, క్యారమ్స్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. టీడీఎఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీటీతో పాటు ఫన్ గేమ్స్, బింగో, మ్యూజికల్ చైర్, బాల్రేస్ ఆటలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో మహిళలు, పిల్లలు, యువకులు, యువ దంపతులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు. ఈ వనభోజన వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికీ టీడీఎఫ్ అధ్యక్షుడు శ్రీని కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలు అందించారు. అదేవిధంగా ఫన్ గేమ్స్, ఇతర ఆటల పోటీలు, రాఫెల్ డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో కృషిచేసిన వాలంటీర్లకు, టీడీఎఫ్ చాప్టర్ సభ్యులు కాంత్ కోడిదేటి, నరంజన్ కూర, నరేందర్ చీటి, ప్రవీణ్ అన్నవజ్జల, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, కొండాల్‌రెడ్డి పుర్మ, శ్రీపాద్, శివ ఆకుతోట, రఘు శ్యామ, వెంకట్ ఇంజం, హరి సూదిరెడ్డి, నవీన్, సురేశ్ దొంతుల, రాజ్ అందోల్, వీరేశ్ బుక్క, జయాకర్ రెడ్డి, అజయ్ అన్నమనేని కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
సీఏఏ ఆధ్వర్యంలో వనభోజనాలు
చికాగో : చికాగో ఆంధ్రా అసోసియేషన్(సీఏఏ) ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. రుచికరమైన ఆంధ్ర వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి మేలిసి ఈ వనభోజన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బారింగ్టన్ రోడ్ పాండ్ పిక్నిక్ గ్రోవ్‌లో నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమానికి దాదాపు 800 మంది హాజరయ్యారు. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వనభోజన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతామని ప్రెసిడెంట్ పద్మారావు పేర్కొన్నారు. ఉదయం నుంచి, సాయంత్రం వరకు జరిగిన ఈ వనభోజనాల్లో తెలుగు వారందరు ఆత్మీయంగా కలుసుకొని విందు భోజనాలని ఆరగించారు. చికాగోలో తమ పిల్లలతో గడపాలని ఆంధ్ర నుంచి వచ్చిన తల్లిదండ్రులు సీఏఏ వారి ఆత్మీయతకి అబ్బురపడ్డారు. ఆంధ్రాలోనే బఫెట్ పద్ధతికి అలవాటు పడుతున్న రోజుల్లో అగ్ర రాజ్యంలో సీఏఏ వారి కృషి అభినందనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. సాయిరవి సూరిభోట్ల, విజయ్ కొరపాటి, సురేష్ పొనిపిరెడ్డి, విష్ణువర్ధన్ పద్దమారు, సత్య తోట పర్యవేక్షణలో విష్ణు విలాస్ వారు అందించిన విందుభోజనానికి తోడుగా సుజాత అప్పలనేని, రాజీ మక్కెన, శైలజ కపిల తయారుచేసిన గోంగూర పచ్చడి, నాటుకోడి కూర, ఆవకాయ పచ్చడి, మైసూర్‌పాక్, నెయ్యితో కలిపి కోనసీమ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అరటి ఆకులలో వడ్డించారు. సాయంత్రం మల్లేశ్వరి పెదమల్లు ఆధ్వర్యంలో మహిళలు ముంత మసాలా తయారుచేసి వడ్డించారు. ప్రెసిడెంట్ పద్మారావు అప్పలనేని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ భార్గవి నెట్టెం (ప్రెసిడెంట్ ఎలెక్ట్ 2020) సీఏఏ ఫౌండర్స్ దినకర్ - పవిత్ర కారుమూరి, మల్లేశ్వరి - శ్రీనివాస్ పెదమల్లు, సుందర్- వాణి దిట్టకవి, రాఘవ జాట్ల, ప్రసాద్ - భార్గవి నెట్టెం, సుజాత అప్పలనేని, ఉమా కటికి, సీఏఏ బోర్డ్ డైరెక్టర్లు శ్యామ్ సుందర్ పప్పు, సాయిరవి సూరిభోట్ల, శైలేష్ మద్ధి, శ్రీకృష్ణ మతుకుమల్లి, రాజ్ పోట్లూరి, రామకృష్ణ తాడేపల్లి, గౌరిశంకర్ అద్దంకి, శిరీష కోల, అనురాధ గంపాల, సాహితీ కొత్త, కిరణ్ వంకాయలపాటి, సునిత రాచపల్లి, నీలిమా బొడ్డు, మైత్రి అద్దంకి, నిఖిల్ దిట్టకవి తదితరులు పాల్గొన్నారు. జ్యోతి వంగర సారథ్యంలో సంఘ వ్యవస్థాపకులు, బోర్డ్ డైరెక్టర్లు చేసిన ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ విశేష ఆకర్షణగా నిలిచి అందరినీ అలరించింది. ఈ సందర్భంగా పిల్లలకి పెద్దలకి ఆటపాటల పోటీలను నిర్వహించి.. నీలిమ బొడ్డు, జయశ్రీ సోమిశెట్టి, శ్రీచైత్య పొనిపిరెడ్డి, శ్వేతా కొత్తపల్లి, సరిత వీరబ్రహ్మ, నాగేశ్వరి తోట, కిరణ్ మట్టే, స్మిత నండూరి బహుమతులందించారు. ఈ వనభోజనాలు జయప్రదం కావడానికి సహకరించిన దాతలు పటేల్ బ్రదర్స్, అశోక్ లక్ష్మణన్, కృష్ణ రంగరాజు తదితరులకు ప్రెసిడెంట్ పద్మారావు అప్పలనేని మరియు సీఏఏ బోర్డు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్వదేశ్ మీడియావారి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సహకారాన్ని పలువురు అభినందించారు. -
పెద్ద సార్ల ఆటవిడుపు
-
పెద్ద సార్ల ఆటవిడుపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా తీరిక లేకుండా గడిపిన అఖిల భారత సర్వీసుల సీనియర్ అధికారులు ఈ ఆదివారం తమ కుటుంబాలతో కండ్లకోయలో హాయిగా సేద తీరారు. గడిచిన శుక్రవారం పోలింగ్ ముగిసేదాకా సెలవులు లేకుండా విధులు నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఈ ఆదివారం మాత్రం ఆటవిడుపుగా మారింది. అటవీ శాఖకు చెందిన కండ్లకోయ వనక్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడిపారు. నగర శివార్లలోని ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో వీరు ఆత్మీయంగా కలుసుకుని వన భోజనాలు చేశారు. ఆటపాటలతో సరదాగా గడుపుతున్న సీపీ అంజనీకుమార్ తదితరులు ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, పీసీసీఎఫ్ పీకే ఝా, సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితర అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ కార్యక్రమానికి హాజరై ఉల్లాసంగా గడిపారు. గత మూడు నెలలుగా ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా గడిపిన డీజీపీ, సీపీతో పాటు పలువురు ఇతర అధికారులు కొద్దిసేపు రాజకీయ చర్చలు, పాలనా వ్యవహారాల ముచ్చట్లను పక్కనబెట్టి గ్రామీణ క్రీడలు, ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. -
వర భోజనం
టైమ్‌కి తినడం ఆరోగ్యం.టైమ్లీగా తినడం ఆహ్లాదం. ఆరోగ్యం, ఆహ్లాదం కలిసిందే ఆయుర్ భోజనం. ప్రకృతి ప్రసాదించిన రేకలు, శాకలతో తయారవుతుంది కనుక ఇది వర భోజనం కూడా! పూల రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు కలిపి రంగరించి బొమ్మ చేస్తే అందమైన అమ్మాయి రూపం వస్తుందో రాదో కానీ, పూలరెక్కలను పోపులో వేసి మరిగించి తేనె చుక్కలు కలిపితే రుచికరమైన చారు తయారవుతుంది. ఆశ్చర్యంగా అనిపించినా, విచిత్రంగా ముఖం పెట్టినా సరే.. ఇది నిజం. వెల్లుల్లి కర్రీ కూడా దాదాపుగా అంతే. కూరల్లో వెల్లుల్లి రేకలు వేయడమే మనకు తెలిసిందే. వెల్లుల్లి పేస్ట్‌తో మాంసాహారం వండుకోవడమూ తెలుసు. అయితే వెల్లుల్లి రేకలతోనే కూర చేయడం ఓ ప్రయోగం. మాంసాహారాన్ని మరిపించిన ఆరోగ్యవర్ధిని వెల్లుల్లి కర్రీ. కోడిగుడ్డు సొన కనిపించని ఆమ్లెట్ కూడా అంతే విచిత్రం. శనగపిండి– పెసర పిండిని బజ్జీల పిండిలా కలిపి నెయ్యి రాసిన పెనం మీద పోసి పైన కూరగాయ ముక్కలు, జీలకర్ర పొడి, మిరియాల పొడి చల్లితే ఎగ్‌లెస్ వెజ్ ఆమ్లెట్ రెడీ. ఇవన్నీ జానపద చిత్రంలో... విచిత్రలోకంలో వడ్డించిన విస్తరిలో కనిపించిన ఆచరణ సాధ్యం కాని అద్భుతాలు కాదు. అడవుల్లో సంచరిస్తూన్నప్పుడు కడుపు నింపుకునే ఆపద్ధర్మ భోజనమూ కాదు. అచ్చమైన ఆయుర్వేద భోజనం. ఆరోగ్యకరమైన భోజనం. అభివృద్ధి పరుగులో ప్రకృతికి దూరంగా వచ్చేసిన మనిషిని తిరిగి ప్రకృతికి దగ్గర చేసే ప్రయత్నమే ఈ భోజనం. రేపటి నుంచి కార్తీకం కార్తీకం.. వనభోజనాల సందడి మొదలయ్యే మాసం. ఈ ఆయుర్ మెనూని పాటిస్తే ఆరోగ్యంతో పాటు, సందర్భోచితంగా కూడా ఉంటుంది. ఆయుర్ భోజనం అంటే కందమూలాలు తినాలా అని ముఖం చిట్లించాల్సిన కష్టమూ అక్కర్లేదు. వెల్కమ్ డ్రింక్స్‌గా ఆమ్‌పన్నా, కొబ్బరి పాలు; పండ్లు– కూరగాయల సలాడ్లు; మొక్కజొన్న– క్యారట్ సూప్‌లోకి మెంతి ఆకు–మునగాకు పకోడీ స్టార్టర్స్; అలసంద – సగ్గుబియ్యం గారె; మెయిన్ కోర్సులో పాలకూర రోటీలోకి జీడిపప్పు– అల్లం తరుగు కూర, వెల్లుల్లి ఇగురు, నేతితో వెజ్ ఆమ్లెట్, పెసర (ముద్ద) పప్పు–నెయ్యి, గుమ్మడికాయ పప్పు, మందార పూల చారు, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి.ఇక మజ్జిగలో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, కరివేపాకు కలుపుకోవాలి. చివరగా శనగపప్పు– బెల్లం పాయసం, ఉసిరి – పటిక బెల్లం హల్వా... వీటితో సంపూర్ణ భోజనం. దీపావళికి రెండు రోజుల ముందు ధన్వంతరి దినోత్సవం. ఆ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు పరిచయం చేసిన సంప్రదాయ, ఆరోగ్య సంపన్న భోజనమిది. గుర్తుంచుకోండి ∙అల్లం దేహంలోని మలినాలను తొలగిస్తుంది, మిరియాలు రోగాలను నయం చేస్తాయి, పండ్లు, కూరగాయలు దేహాన్ని శుభ్రపరుస్తాయి. ∙దక్షిణాదిలో చింతపండు వాడకం ఎక్కువ, అది ఎముకల పటుత్వాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థరైటిస్ సమస్యలకు కారణమవుతుంది. ∙కొబ్బరి దేహాన్ని చల్లబరిచి జీవక్రియను వేగవంతం చేస్తుంది. సమతుల ఆహారం ఒబేసిటీని దగ్గరకు రానివ్వదు, బరువు తగ్గడానికీ దోహదం చేస్తుంది. ∙మన దేహం ఆకలి అనే హెచ్చరికను మెదడుకు చేర్చేది కడుపు నింపమని చెప్పడానికి కాదు. పోషకాలతోకూడిన సమతుల ఆహారాన్ని ఇవ్వమని మాత్రమే. బిస్కట్, సమోసాలతో తాత్కాలికంగా ఆకలిని మరిపిస్తుంటాం. అందులో దేహానికి అవసరమైన పోషకాలు లేకపోవడంతో అరగంట లోపే మళ్లీ ఆకలి వేస్తుంటుంది. పప్పులో మునగ పువ్వు మునగలో వాపును నివారించే గుణం ఉంది. దేహానికి గాయమైతే మునగచెట్టు బెరడును ఒలిచి దంచి గాయం మీద పెట్టి కట్టుకడితే మూడో రోజుకి గాయం ఆనవాలు లేకుండా పోతుంది. మునగ కాయలనే కాదు, మునగ పువ్వును పప్పులో వేసుకోవచ్చు, ఆకుతో కూర, పకోడీలు చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్న లైఫ్‌స్టయిల్ డిసీజ్‌లు తగ్గాలంటే, బ్రౌన్‌రైస్ అన్నం తినడంతోపాటు ఆహారంలో మునగ, వెల్లుల్లి వీలయింత తరచుగా వాడాలి. – డాక్టర్ యాన్సీ డి సౌజా పండ్లు.. భోజనానికి ముందే మన మనసుకి అసలైన భాగస్వామి మన శరీరమే. అందుకే దేహాన్ని కాపాడుకోవడం మీద మనసు పెట్టాలి. మంచి ఆహారంతో రోగాలను నివారించవచ్చు. అలాగే మనకు భోజనం తర్వాత పండ్లు తినాలనే పెద్ద అపోహ ఉంది. నిజానికి పండ్లను భోజనానికి ముందు తినాలి. ఆహారం– విహారం సక్రమంగా ఉంటే డాక్టర్ అవసరం లేని జీవితాన్ని గడపవచ్చు. – డాక్టర్ సాజీ డి సౌజా – వాకా మంజులారెడ్డి -
టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు
పోర్ట్‌ల్యాండ్ : అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో అట్టహాసంగా వజభోజనాల కార్యక్రమం జరిగింది. రుచికరమైన తెలుగు వంటకాలతో ఆట పాటలతో చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్రొఫెసర్ జయశంకర్‌కి చాప్టర్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వనభోజన కార్యక్రమానికి పోర్ట్‌ల్యాండ్ మెట్రో సిటీ నుంచి పెద్ద ఎత్తున ఎన్నారైలు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతితో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అవార్డ్స్‌ను చాప్టర్ చైర్మన్ అందించారు. అనంతరం పుడ్ కమిటీ తయారు చేసిన రుచికరమైన తెలుగు వంటకాలతో చిన్నా పెద్ద అంతా కలిసి భోజనం చేశారు. మహిళలు, పిల్లలు, యువకులు, యువదంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్ అందరికీ శ్రీని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఢీఎప్ చాప్టర్ టీం సభ్యులు నిరంజన్ కూర, నరెందర్ చీటి, రాజ్ అందోల్, కాంత్ కోడిదేటి, కొండల్‌రెడ్డి పుర్మ, మధుకర్‌రెడ్డి పురుమాండ్ల, జయాకర్ రెడ్డి ఆడ్ల, హరి సూదిరెడ్డి, సత్య సింహరాజు, ఈవెంట్ టీం సభ్యులు శ్రీనివాసరెడ్డి పగిడి, వీరేష్ బుక్క, ప్రవీణ్ యలకంటి, స్పోర్ట్స్ టోర్నమెంట్ వాలంటీర్స్ శ్రీని బొంతల, అజయ్ అన్నమనేని, వెంకట్ ఇంజమ్ తదితరులు పాల్గొన్నారు. -
టిపాడ్ ఆధ్యర్యంలో ఘనంగా వనభోజనాలు
అమెరికాలోని తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టిపాడ్) వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫ్రిస్కోలోని హిడెన్ కోవ్ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటగా శ్రీకృష్ణ, లక్ష్మీదేవి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. పిల్లలతో కలిసి అంత్యాక్షరి, గేమ్స్, మ్యూజిక్ మస్తీలతో వనభోజనాల కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని నేటి తరానికి తెలియజేయడానికే ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ వంటకాలు, ఆట పాటలతో వనభోజనాల కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. టిపాడ్ ప్రెసిడెంట్ శ్రీని గంగాధర, బీఓటీ చైర్మన్ శారద సింగిరెడ్డి, శ్రీని వేముల, జయ తెలకలపల్లి, ఇందూ పంచర్పుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. టిపాడ్ సభ్యులు రఘువీర్ బండారు, జయకిరణ్ మండది, ఉపేందర్ తెలుగు, అజయ్ రెడ్డి, రావు కల్వల, రాజ్వర్ధన్ గొంది, మహెందర్ కామిరెడ్డి, పవన్ కుమార్ గంగాధర, మనోహర్ కాసగాని, అశోక్ కొండల, రామ్ ఆన్నాడి, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులు రమణ లష్కర్, కరణ్ పోరెడ్డి, చంద్ర పోలీస్, సత్య పెర్కారి, రవికాంత్ మామిడి, రూప కన్నయ్యగారి, లింగారెడ్డి అల్వా, సురెందర్ చింతల, ఆడెపు రోజా, శరత్ ఎర్రమ్, మధుమతి, మాధవి లోకిరెడ్డి, దీప్తి సూర్యదేవర, శంకర్ పరిమల్, వేణు ఉప్పాల, సతీష్ నాగిళ్ల, కళ్యాణి తడిమెటి, లక్ష్మీ పోరెడ్డి, పల్లవి తోటకూర, రోహిత్ నరిమేటి, అనూష వనం, నితిన్ చంద్ర, శిరిష్ గోనె, మాధవి ఓంకార్, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివకర్ల, కవిత బ్రహ్మదేవర, అనురాధ మేకల, సునిత, నితిన్ కొర్వి, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్, సుగత్రి గూడూరు, మాధవి మెంటా, లావణ్య యారాకల, ధనలక్ష్మీ రావుల, మంజుల రెడ్డి ముప్పిడి, శాంతి నూతి, శ్రీనివాస్ కోటికంటి తదితరులు పాల్గొన్నారు. -
టీడీఫ్ ఆధ్వర్యంలో ఘనంగా వన భోజనాలు
అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్(టీడీఫ్) పోర్ట్‌ల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో వన భోజనాలు అట్టహాసంగా జరిగాయి. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్‌కి చాప్టర్ చైర్మన్ శ్రీని అనుమాండ్ల నివాళులు అర్పించి పోర్ట్‌ల్యాండ్ ఒరెగాన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వనభోజనాలకు పోర్ట్‌ల్యాండ్ మెట్రో నగరాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఫన్ గేమ్స్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, బింగో, మ్యూజికల్ చైర్, బాల్ గేమ్‌లు నిర్వహించారు. మహిళలు, పిల్లలు, యువకులు, యువదంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్ అందరికీ శ్రీని కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలు అందజేశారు. ఫన్ గేమ్స్, ఆటల పోటీలు, రాఫెల్ డ్రాల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. శ్రీని అనుమాండ్ల కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో పాటూ, ఈ వేడుక విజయవంతం చేయడంలో తమ వంతు కృషి చేసిన టీడీఫ్ చార్టర్ టీం సభ్యులు కొండల్ రెడ్డి పుర్మ, రఘు స్యామ, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, నిరంజన్ కూర, కాంత్ కోడిదేటి, నరెందర్ చీటి, శివ ఆకుతోట, రాజ్ అందోల్, వీరేష్ బుక్క, జయాకర్ రెడ్డి ఆడ్ల, సందీప్ ఆశ, ప్రవీణ్ అన్నావఝల, భాను పోగుల, సురేష్ దొంతుల, అజయ్ అన్నమనేని, వెంకట్ ఇంజం, హరి సూదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పగిడి, సత్య సింహరాజ, కృష్ణారెడ్డి, కార్తీక్ రెడ్డి ఆశ, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
డల్లాస్‌లో ఘనంగా వన భోజనాలు
-
డల్లాస్‌లో ఘనంగా వన భోజనాలు
డల్లాస్: అమెరికాలోని తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టిపాడ్) వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫ్రిస్కోలోని హిడెన్ కోవ్ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 2000 మంది హాజరయ్యారు. ఇందులో పాల్గొన్నవారు ఆట పాటలతో హుషారుగా గడిపారు. తెలంగాణ వంటకాలను నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దుర్గ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో టీపాడ్ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
డెట్రాయిట్లో వనభోజనాల సందడి
డెట్రాయిట్: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం దాదాపు 300 తెలుగు కుటుంబాలు కలిసి వనభోజనాలకు వెళ్లి సందడి చేశారు. అక్కడ ఎండాకాలం ప్రారంభం కావడంతో ఇళ్లలో నుంచి బయటికి వచ్చిఅందరూ కలిసి ఒకేచోట చేరి సేద తీరారు. ఫర్మింగ్టన్ హిల్స్‌లోని షియావసి పార్క్‌లో వివిధ రంగాలకి చెందిన తెలుగు వారు కలిసి హాయిగా గడిపారు. ప్రత్యేకమైన వంటకాలు, ఆటలు, పాటలతో ఉషారుగా గడిపారు. వివిధప్రాంతాల్లో ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకే చోట కలిశారు. అందరు తెలుగు వాళ్లు ఒకే చోట చేరి ఆనందంగా గడిపే అవకాశాన్ని కల్పించినందుకు టీడీఎఫ్‌కు వనభోజనాలకు వచ్చిన వారు కృతజ్ఞతలు తెలిపారు. -
నవభోజనాలు
మామిడికాయ పప్పు, కందబచ్చలి కూర, ముక్కల పులుసు... మాటల్లేవ్! బూరెలు, బొబ్బట్లు, సేమ్యా పాయసం, జాంగ్రీ, జిలేబీ... మాట్లాడుకోవడాల్లేవ్! మసాలా వడలు, ఆవడలు, గారెలు, వగైరాలు... లేవడాల్లేవ్! చెయ్యి కడగడాల్లేవ్! వనభోజనాల్లోని మజానే ఇది. మాయే ఇది. మంత్రమే ఇది! కబుర్లు చెప్పుకుంటూ కానిద్దాం... అనుకుంటాం. మూతలు తెరుచుకోగానే కమ్మటి మత్తులో పడిపోతాం. ఆ మత్తుకు కాస్త కొత్తను జోడించి, మీ భుక్తాయాసానికి జోల పాట పాడించేందుకు 'నవ' భోజనాలను చేసుకొచ్చింది ఫ్యామిలీ. ఆరగించండి, ఈ కార్తిక వనభోజనాలను ఆస్వాదించండి. ఖండ్వీ కావలసినవి: సెనగపిండి : కప్పు; పెరుగు : 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు : తగినంత; పసుపు : టీ స్పూను; కారం : టీ స్పూను; ఇంగువ : చిటికెడు; నూనె : కొద్దిగా పోపు కోసం: నూనె : 2 టీ స్పూన్లు; ఆవాలు : టీ స్పూను; నువ్వు పప్పు : 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు : టీ స్పూను; కొత్తిమీర : చిన్న కట్ట; కారం : కొద్దిగా (పైన చల్లడానికి) తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు, ఉప్పు, పసుపు, ఇంగువ, కారం వేసి బాగా కలిపి, మూడు కప్పుల నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ పిండి కలిపి, స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతూ, పిండి చిక్కబడ్డాక దించేయాలి ఒక ప్లేట్‌కి వెనుక వైపు కొద్దిగా నూనె పూసి, పిండి మిశ్రమాన్ని కొద్దిగా మందంగా ఉండేలా పరిచి పది నిమిషాలు చల్లారనిచ్చాక, చపాతీ చుట్టినట్టుగా చుట్టి, చాకుతో ముక్కలుగా కట్ చేస్తే, ఖండ్వీ సిద్ధమైనట్లే చిన్న బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, నువ్వు పప్పు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని తయారుచేసి ఉంచుకున్న ఖండ్వీల మీద వేసి, కారం, కొత్తిమీరలతో అలంకరించి వేడివేడిగా అందించాలి. క్యాప్సికమ్ బజ్జీ కావలసినవి: క్యాప్సికమ్ : 15 (చిన్నవి); సెనగ పిండి : కప్పు; ఉప్పు : తగినంత; నీళ్లు : తగినన్ని; నూనె : డీప్ ఫ్రైకి సరిపడా ఫిల్లింగ్ కోసం: బంగాళ దుంపలు :పావు కిలో (ఉడికించి తొక్క తీసి, మెత్తగా చేయాలి); ఉప్పు : తగినంత; కారం : టీ స్పూను; ఆమ్చూర్ పొడి : 2 టీ స్పూన్లు; ధనియాల పొడి : 2 టీ స్పూన్లు; ఇంగువ : పావు టీ స్పూను; సోంపు : 2 టీస్పూన్లు; పచ్చి మిర్చి : 4 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) ఫిల్లింగ్ కోసం: ఒక పాత్రలో బంగాళదుంపల ముద్ద, ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, ఇంగువ, సోంపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలపాలి. బజ్జీ కోసం: ఒక పాత్రలో సెనగ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి బజ్జీల పిండిలా కలిపి పక్కన ఉంచాలి కాప్సికమ్‌ను ఒకవైపు కొద్దిగా కట్‌చేసి గింజలు తీసేసి, బంగాళదుంపల మిశ్రమం క్యాప్సికమ్‌లో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఒక్కో క్యాప్సికమ్‌ను సెనగ పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి, వేడివేడిగా అందించాలి. దాల్ కా పరాఠా కావలసినవి : గోధుమపిండి : కప్పు; ఉప్పు : కొద్దిగా; నూనె : 2 టీ స్పూన్లు; ఫిల్లింగ్ కోసం...: పెసలు : అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి); నూనె : 2 టీ స్పూన్లు; జీలకర్ర : అర టీ స్పూను; ఇంగువ : చిటికెడు; ఉప్పు : తగినంత; పసుపు : కొద్దిగా; కారం : అర టీ స్పూను; నెయ్యి :తగినంత తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, కొద్దిగా నూనె జత చేసి బాగా కలిపి, పక్కన ఉంచాలి పెసలు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి, కప్పుడు నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేగాక, ఉడికించిన పెసలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి, నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచి దించి, చల్లారాక, చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి చపాతీపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ ఒత్తి, మధ్యలో పెసరపిండి మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, పరాఠాలా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి కాగాక కొద్దిగా నెయ్యి వేసి, కరిగాక ఒత్తి ఉంచుకున్న పరాఠా వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు రెండువైపులా కాల్చి తీసేయాలి. మొహంతాల్ కావలసినవి: సెనగ పిండి : పావు కేజీ; నెయ్యి : టేబుల్ స్పూను; పాలు : 3 టేబుల్ స్పూన్లు; ఈ మూడు పదార్థాలను ఒక గిన్నెలో వేసి గట్టిగా అయ్యేలా కలపాలి); పచ్చి కోవా : 50 గ్రా.; పంచదార : 200 గ్రా.; నీళ్లు : అర కప్పు; ఏలకుల పొడి : అర టీ స్పూను; నెయ్యి : 150 గ్రా.; బాదం పప్పులు, పిస్తా పప్పులు : అలంకరించడానికి తగినన్ని. తయారీ: ఒక పాత్రలో పంచదార, అర కప్పు నీళ్లు వేసి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి పంచదార బాగా కరిగి, ఉండ పాకం వచ్చాక, పచ్చి కోవా, నెయ్యి వేసి బాగా కలపాలి వేరొక బాణలిలో టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సెనగ పిండి మిశ్రమం వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాక, ఏలకుల పొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పంచదార పాకం మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ కలిపి, కొద్దిసేపు ఉంచి దించేయాలి ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి, ఉడికించిన మిశ్రమం వేసి పల్చగా పరిచి, బాదంపప్పులు, పిస్తా పప్పులతో అలంకరించాలి. గట్టిపడుతుండగా ముక్కలుగా కట్ చేయాలి. డ్రైఫ్రూట్స్ రైస్ కావలసినవి బాస్మతి బియ్యం : ఒకటిన్నర కప్పులు; బటర్ : 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు : అర కప్పు; జీలకర్ర : అరటీ స్పూను; పసుపు : అర టీ స్పూను; దాల్చినచెక్క పొడి : పావు టీస్పూను; వెల్లుల్లి రేకలు : 2; నీళ్లు : రెండుంపావు కప్పులు; ఉప్పు : తగినంత; మిరియాల పొడి : పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ : కప్పు (బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, పిస్తా పప్పులు, ఆప్రికాట్... వంటివి) తయారీ బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు నానబెట్టి, నీళ్లు వంపేసి, తడి పోయేవరకు సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి బియ్యం జత చేసి, కలియబెట్టాలి నీళ్లలో ఉప్పు వేసి మరిగించి ఇందులో పోసి, మంట తగ్గించి, మూత ఉంచి, సుమారు పది నిమిషాలు ఉడికించాలి మరొక బాణలిలో బటర్ వేసి కరిగించి, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, దాల్చిన చెక్క పొడి, పసుపు, మిరియాల పొడి వేసి వేయించి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించి, అన్నంలో వేసి కలిపి వేడివేడిగా వడ్డించాలి. దమ్ ఆలూ లఖ్నవీ కావలసినవి: బంగాళ దుంపలు : పావు కేజీ (ఉడికించి తొక్క తీసి మెత్తగా చేయాలి); పనీర్ తురుము : 100 గ్రా; కారం : టీ స్పూను; ఉప్పు : తగినంత; గరం మసాలా : టీ స్పూను; కసూరీ మేథీ : ఒకటిన్నర టీ స్పూను; నెయ్యి : 3 టేబుల్ స్పూన్లు; బటర్ : టేబుల్ స్పూను; క్రీమ్ : టేబుల్ స్పూను ఉల్లిపాయ గ్రేవీ కోసం: ఉల్లిపాయలు :200 గ్రా. (మిక్సీలో వేసి ముద్ద చేయాలి) గరం మసాలా :అర టీ స్పూను; ఉప్పు : తగినంత; నెయ్యి : టీ స్పూను టొమాటో గ్రేవీ కోసం: టొమాటో ప్యూరీ : 200 గ్రా; నెయ్యి : టీ స్పూను; ఉప్పు :తగినంత ఉల్లిపాయ గ్రేవీ తయారీ: బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక, ఉల్లిపాయ ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. టొమాటో గ్రేవీ తయారీ: మరొక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక టొమాటో ప్యూరీ వేసి చిక్కబడే వరకు వేయించాక, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. దమ్ ఆలూ తయారీ: బంగాళదుంపల తొక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, బంగాళదుంప ముక్కలను వేసి కరక రలాడేలా వేయించి, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దించి చల్లార్చాలి ఒక పాత్రలో ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళ దుంప ముద్ద, పనీర్ తురుము వేసి కలిపి పక్కన ఉంచాలి. చివరగా... ఒక బాణలిలో నూనె వేసి కాగాక, టొమాటో గ్రేవీ, ఉల్లిపాయ గ్రేవీ మిశ్రమాలు వేసి నూనె బాగా పైకి తేలే వరకు వేయించాలి గరం మసాలా, కారం, కసూరీ మేథీ వేసి కలిపి, రెండు నిమిషాలు ఉడికించాలి బటర్, క్రీమ్ వేసి బాగా కలపాలి చివరగా బంగాళదుంప ముక్కలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. వనభోజనాలకు వెళ్లేటప్పుడు వెంట ఉంచుకోవలసినవి... అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆ ప్రదేశంలో పెద్దవాళ్లు, పిల్లలు విడివిడిగా ఆడుకోవడానికి అనువైన ఆట వస్తువులు... కూర్చోవడానికి అనువుగా దుప్పట్లు / చాపలు... మ్యూజిక్ సిస్టమ్, కెమెరా ఇవే కాకుండా మీకు ఇంకా ఏవైనా ఉంటే బాగుంటుందనుకుంటే ముందుగానే ఒక కాగితం మీద రాసి ఉంచుకోండి. బయలుదేరే ముందు ఒకసారి ఆ కాగితం చూస్తే చాలు మీరు అనుకున్నవన్నీ మీ వెంట తీసుకువెళ్లగలుగుతారు. సేకరణ: డా. వైజయంతి