నవభోజనాలు | VanaBhojanalu special dish | Sakshi
Sakshi News home page

నవభోజనాలు

Published Fri, Oct 31 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

VanaBhojanalu special dish

మామిడికాయ పప్పు, కందబచ్చలి కూర, ముక్కల పులుసు...
 మాటల్లేవ్!
 బూరెలు, బొబ్బట్లు, సేమ్యా పాయసం, జాంగ్రీ, జిలేబీ...
 మాట్లాడుకోవడాల్లేవ్!
 మసాలా వడలు, ఆవడలు, గారెలు, వగైరాలు...
 లేవడాల్లేవ్! చెయ్యి కడగడాల్లేవ్!
 వనభోజనాల్లోని మజానే ఇది. మాయే ఇది. మంత్రమే ఇది!
 కబుర్లు చెప్పుకుంటూ కానిద్దాం... అనుకుంటాం.
 మూతలు తెరుచుకోగానే కమ్మటి మత్తులో పడిపోతాం.
 ఆ మత్తుకు కాస్త కొత్తను జోడించి, మీ భుక్తాయాసానికి జోల పాట పాడించేందుకు
 'నవ' భోజనాలను చేసుకొచ్చింది ఫ్యామిలీ.
 ఆరగించండి, ఈ కార్తిక వనభోజనాలను ఆస్వాదించండి.

 
ఖండ్వీ
 
కావలసినవి:
సెనగపిండి : కప్పు; పెరుగు : 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు : తగినంత; పసుపు : టీ స్పూను; కారం : టీ స్పూను; ఇంగువ : చిటికెడు; నూనె : కొద్దిగా
 
పోపు కోసం:
నూనె : 2 టీ స్పూన్లు; ఆవాలు : టీ స్పూను; నువ్వు పప్పు : 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు : టీ స్పూను; కొత్తిమీర : చిన్న కట్ట; కారం : కొద్దిగా (పైన చల్లడానికి)
 
తయారీ:  
ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు, ఉప్పు, పసుపు, ఇంగువ, కారం వేసి బాగా కలిపి, మూడు కప్పుల నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ పిండి కలిపి, స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతూ, పిండి చిక్కబడ్డాక దించేయాలి  
 
ఒక ప్లేట్‌కి వెనుక వైపు కొద్దిగా నూనె పూసి, పిండి మిశ్రమాన్ని కొద్దిగా మందంగా ఉండేలా పరిచి పది నిమిషాలు చల్లారనిచ్చాక, చపాతీ చుట్టినట్టుగా చుట్టి, చాకుతో ముక్కలుగా కట్ చేస్తే, ఖండ్వీ సిద్ధమైనట్లే  
 
చిన్న బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, నువ్వు పప్పు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని తయారుచేసి ఉంచుకున్న ఖండ్వీల మీద వేసి, కారం, కొత్తిమీరలతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
 
క్యాప్సికమ్ బజ్జీ
 
కావలసినవి:
క్యాప్సికమ్ : 15 (చిన్నవి); సెనగ పిండి : కప్పు; ఉప్పు : తగినంత; నీళ్లు : తగినన్ని; నూనె : డీప్ ఫ్రైకి సరిపడా
 
ఫిల్లింగ్ కోసం:
బంగాళ దుంపలు :పావు కిలో (ఉడికించి తొక్క తీసి, మెత్తగా చేయాలి); ఉప్పు : తగినంత; కారం : టీ స్పూను; ఆమ్‌చూర్ పొడి : 2 టీ స్పూన్లు; ధనియాల పొడి : 2 టీ స్పూన్లు; ఇంగువ : పావు టీ స్పూను; సోంపు : 2 టీస్పూన్లు; పచ్చి మిర్చి : 4 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
 
ఫిల్లింగ్ కోసం:  
ఒక పాత్రలో బంగాళదుంపల ముద్ద, ఉప్పు, కారం, ఆమ్‌చూర్ పొడి, ధనియాల పొడి, ఇంగువ, సోంపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలపాలి.
 
బజ్జీ కోసం:  
ఒక పాత్రలో సెనగ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి బజ్జీల పిండిలా కలిపి పక్కన ఉంచాలి  
 
కాప్సికమ్‌ను ఒకవైపు కొద్దిగా కట్‌చేసి గింజలు తీసేసి, బంగాళదుంపల మిశ్రమం క్యాప్సికమ్‌లో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి  
 
బాణలిలో నూనె వేసి కాగాక, ఒక్కో క్యాప్సికమ్‌ను సెనగ పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి, వేడివేడిగా అందించాలి.
 
దాల్ కా పరాఠా

కావలసినవి :
గోధుమపిండి : కప్పు; ఉప్పు : కొద్దిగా; నూనె : 2 టీ స్పూన్లు;
 
ఫిల్లింగ్ కోసం...:

పెసలు : అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి); నూనె : 2 టీ స్పూన్లు; జీలకర్ర : అర టీ స్పూను; ఇంగువ : చిటికెడు; ఉప్పు : తగినంత; పసుపు : కొద్దిగా; కారం : అర టీ స్పూను; నెయ్యి :తగినంత
 
 తయారీ:  
 ఒక పాత్రలో గోధుమపిండి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, కొద్దిగా నూనె జత చేసి బాగా కలిపి, పక్కన ఉంచాలి
 
 పెసలు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి, కప్పుడు నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి  
 
 బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేగాక, ఉడికించిన పెసలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి, నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచి దించి, చల్లారాక, చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి
 
 చపాతీపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ ఒత్తి, మధ్యలో పెసరపిండి మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, పరాఠాలా ఒత్తాలి  
 
స్టౌ మీద పెనం ఉంచి కాగాక కొద్దిగా నెయ్యి వేసి, కరిగాక ఒత్తి ఉంచుకున్న పరాఠా వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు రెండువైపులా కాల్చి తీసేయాలి.
 
మొహంతాల్

 
కావలసినవి:
సెనగ పిండి : పావు కేజీ; నెయ్యి : టేబుల్ స్పూను; పాలు : 3 టేబుల్ స్పూన్లు; ఈ మూడు పదార్థాలను ఒక గిన్నెలో వేసి గట్టిగా అయ్యేలా కలపాలి); పచ్చి కోవా : 50 గ్రా.; పంచదార : 200 గ్రా.; నీళ్లు : అర కప్పు; ఏలకుల పొడి : అర టీ స్పూను; నెయ్యి : 150 గ్రా.; బాదం పప్పులు, పిస్తా పప్పులు : అలంకరించడానికి తగినన్ని.
 
 తయారీ:  
ఒక పాత్రలో పంచదార, అర కప్పు నీళ్లు వేసి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి  
 
పంచదార బాగా కరిగి, ఉండ పాకం వచ్చాక, పచ్చి కోవా, నెయ్యి వేసి బాగా కలపాలి
 
వేరొక బాణలిలో టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సెనగ పిండి మిశ్రమం వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాక, ఏలకుల పొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పంచదార పాకం మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ కలిపి, కొద్దిసేపు ఉంచి దించేయాలి  
 
 ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి, ఉడికించిన మిశ్రమం వేసి పల్చగా పరిచి, బాదంపప్పులు, పిస్తా పప్పులతో అలంకరించాలి. గట్టిపడుతుండగా ముక్కలుగా కట్ చేయాలి.
 
డ్రైఫ్రూట్స్ రైస్
 
కావలసినవి
బాస్మతి బియ్యం : ఒకటిన్నర కప్పులు; బటర్ : 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు : అర కప్పు; జీలకర్ర : అరటీ స్పూను; పసుపు : అర టీ స్పూను; దాల్చినచెక్క పొడి : పావు టీస్పూను; వెల్లుల్లి రేకలు : 2; నీళ్లు : రెండుంపావు కప్పులు; ఉప్పు : తగినంత; మిరియాల పొడి : పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ : కప్పు (బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్‌మిస్, పిస్తా పప్పులు, ఆప్రికాట్... వంటివి)
 
 తయారీ

బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు నానబెట్టి, నీళ్లు వంపేసి, తడి పోయేవరకు సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి  
 
 బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి
 
 బియ్యం జత చేసి, కలియబెట్టాలి
 
 నీళ్లలో ఉప్పు వేసి మరిగించి ఇందులో పోసి, మంట తగ్గించి, మూత ఉంచి, సుమారు పది నిమిషాలు ఉడికించాలి
 
మరొక బాణలిలో బటర్ వేసి కరిగించి, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, దాల్చిన చెక్క పొడి, పసుపు, మిరియాల పొడి వేసి వేయించి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి  
 
 బాణలిలో నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించి, అన్నంలో వేసి కలిపి వేడివేడిగా వడ్డించాలి.
 
దమ్ ఆలూ లఖ్నవీ
 
కావలసినవి:
బంగాళ దుంపలు : పావు కేజీ (ఉడికించి తొక్క తీసి మెత్తగా చేయాలి); పనీర్ తురుము : 100 గ్రా; కారం : టీ స్పూను; ఉప్పు : తగినంత; గరం మసాలా : టీ స్పూను; కసూరీ మేథీ : ఒకటిన్నర టీ స్పూను; నెయ్యి : 3 టేబుల్ స్పూన్లు; బటర్ : టేబుల్ స్పూను; క్రీమ్ : టేబుల్ స్పూను
 
 ఉల్లిపాయ గ్రేవీ కోసం:
 ఉల్లిపాయలు :200 గ్రా. (మిక్సీలో వేసి ముద్ద చేయాలి)
 గరం మసాలా :అర టీ స్పూను; ఉప్పు : తగినంత; నెయ్యి : టీ స్పూను
 టొమాటో గ్రేవీ కోసం: టొమాటో ప్యూరీ : 200 గ్రా; నెయ్యి : టీ స్పూను; ఉప్పు :తగినంత
 
ఉల్లిపాయ గ్రేవీ తయారీ:  
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక, ఉల్లిపాయ ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి  గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి.
 
 టొమాటో గ్రేవీ తయారీ:  
మరొక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక టొమాటో ప్యూరీ వేసి చిక్కబడే వరకు వేయించాక, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి.
 
దమ్ ఆలూ తయారీ:  
బంగాళదుంపల తొక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి  
 
బాణలిలో నూనె వేసి కాగాక, బంగాళదుంప ముక్కలను వేసి కరక రలాడేలా వేయించి, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దించి చల్లార్చాలి  
 
ఒక పాత్రలో ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళ దుంప ముద్ద, పనీర్ తురుము వేసి కలిపి పక్కన ఉంచాలి.
 
 చివరగా...
 ఒక బాణలిలో నూనె వేసి కాగాక, టొమాటో గ్రేవీ, ఉల్లిపాయ గ్రేవీ మిశ్రమాలు వేసి నూనె బాగా పైకి తేలే వరకు వేయించాలి  
 
 గరం మసాలా, కారం, కసూరీ మేథీ వేసి కలిపి, రెండు నిమిషాలు ఉడికించాలి  
 
 బటర్, క్రీమ్ వేసి బాగా కలపాలి  
 
 చివరగా బంగాళదుంప ముక్కలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి.
 
 వనభోజనాలకు వెళ్లేటప్పుడు వెంట ఉంచుకోవలసినవి...

 అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్
 
 ఆ ప్రదేశంలో పెద్దవాళ్లు, పిల్లలు విడివిడిగా ఆడుకోవడానికి అనువైన  ఆట వస్తువులు...
 
 కూర్చోవడానికి అనువుగా దుప్పట్లు / చాపలు...
 
 మ్యూజిక్ సిస్టమ్, కెమెరా
 
 ఇవే కాకుండా మీకు ఇంకా ఏవైనా ఉంటే బాగుంటుందనుకుంటే ముందుగానే ఒక కాగితం మీద రాసి ఉంచుకోండి. బయలుదేరే ముందు ఒకసారి ఆ కాగితం చూస్తే చాలు మీరు అనుకున్నవన్నీ మీ వెంట తీసుకువెళ్లగలుగుతారు.
 
 సేకరణ: డా. వైజయంతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement