Gare
-
'వంట'చేలు
పాలకంకిలా ఉన్నప్పుడు తినాలి... పెదవుల నుంచి పాయసం జారుతుంది! కాస్త కండ పడుతున్నప్పుడు నమలాలి... పంటికి పాకంలా అంటుకు వస్తుంది! ముదిరి, ముత్యమైనప్పుడు చూడాలి... నోరు ఆల్చిప్పలా తెరుచుకుంటుంది! ఎలా తిన్నా సజ్జలకో రుచి ఉంటుంది. స్నాక్స్ చేసుకుని తింటే మాత్రం... ఏకంగా పంటపొలంలోకే పరుగులు తీయాలనిపిస్తుంది! గారెలు కావలసినవి: సజ్జ పిండి- ఒక కప్పు; ఉల్లి తరుగు - పావు కప్పు జీలకర్ర- ఒక చెంచా; కారం- ఒక చెంచా పచ్చిమిర్చి తరుగు- ఒక చెంచా; అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక చెంచా కరివేపాకు- ఒక రెమ్మ; ధనియాల పొడి- అర చెంచా నూనె- గారెలు వేయిచడానికి సరిపడినంత; ఉప్పు- తగినంత తయారీ: నూనె మినహా పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి కలిపి తగినంత నీటిని పోస్తూ ముద్దగా చేయాలి. చపాతీల పిండి కంటే కొంచెం వదులుగా గారెల పిండిలా ఉండాలి. * పిండిని పెద్ద నిమ్మకాయంత ఉండలుగా చేసుకుని అరిటాకు మీద వేసి గారెల్లా వత్తి, మధ్యలో చిల్లు పెట్టి మరుగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలి. * ఒక వైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాలిన తర్వాత చిల్లుల గరిటెతో తీయాలి. గమనిక: * అరిటాకు లేకపోతే తడివస్త్రం మీద చేసుకోవచ్చు. బాగా చెయ్యి తిరిగిన వాళ్లయితే పిండిని అరచేతిలో వేసుకుని వత్తి నూనెలో వదులుతారు. * పిండిలో మునగాకు, మెంతికూర, తోటకూర వంటివి కలుపుకోవచ్చు. అలాగే నువ్వుల పొడి, వేరుశనగ పప్పు పొడి కూడా కలుపుకోవచ్చు. * నూనెలో మునిగి కాలిన గారెలు తినడానికి సంశయిస్తుంటే ఇదే గారెలను దోశె పెనం మీద వేసి రెండు స్పూన్ల నూనెతో సన్న మంట మీద కాల్చుకోవచ్చు. సజ్జ అప్పాలు కావలసినవి: సజ్జపిండి- ఒక కప్పు; బెల్లం- ఒక కప్పు కొబ్బరి ముక్కలు- పావు కప్పు; ఏలకుల పొడి- అర చెంచా పండిన అరటిపండు గుజ్జు- ఒక చెంచా; నూనె లేదా నెయ్యి- పావు కప్పు తయారీ: * బాణలిలో ఒక చెంచా నూనె వేసి కొబ్బరి ముక్కలను వేయించాలి. * అరకప్పు నీటిలో బెల్లం తురుము వేసి వేడి చేసి వడకట్టాలి. ఆ నీటిలో సజ్జపిండి, ఏలకుల పొడి, కొబ్బరిముక్కలు, అరటిపండు గుజ్జు వేసి బాగా కలపాలి. అవసరమైతే మరికొంత నీటిని వేసుకోవచ్చు. ఈ మిశ్రమం ఇడ్లీపిండిలాగ గరిటె జారుడుగా ఉండాలి. దీనిని నాలుగు గంటల సేపు నాననివ్వాలి. * గుంట పొంగణాల పెనం తీసుకుని ఒక్కొక్క గుంటలో పావు చెంచా నూనె వేయాలి. పెనం వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క చెంచా పిండి వేయాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేయాలి. ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకోవాలి. గమనిక: అప్పాలు కాలేటప్పుడు పొంగుతాయి. కాబట్టి పిండిని గుంట నిండా వేయకూడదు, సగం వరకే వేయాలి. గుంట పొంగణాల పెనం లేకపోతే బాణలిలో నూనె పోసుకుని గారెల్లా చేసుకోవచ్చు. బాణలిలో చేసుకునే వాళ్లు పిండిని మరీ వదులుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సజ్జ బూరెలు కావలసినవి: సజ్జపిండి - రెండు కప్పులు; బెల్లం- ఒక కప్పు కొబ్బరి కోరు- అర కప్పు; ఏలకుల పొడి- అరచెంచా శొంఠి పొడి- అర చెంచా; నూనె - బూరెలు కాల్చడానికి తగినంత తయారీ: అర కప్పు నీటిలో బెల్లం పొడి వేసి వేడి చేయాలి. రెండు నిమిషాల తర్వాత బెల్లం నీటిని వడపోసి ఆ నీటిలో కొబ్బరి కోరు, సజ్జపిండి, ఏలకుల పొడి, శొంఠిపొడి వేసి రొట్టెల పిండిలాగ కలపాలి. పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి. * బాణలిలో నూనె వేడి చేసి, పిండి గోళీని బూరెలా వత్తి నూనెలో వేయాలి. రెండువైపులా కాలిన తర్వాత తీసేయాలి. ఇవి రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. గమనిక: కొబ్బరిని తురమకుండా చిన్న పలుకులుగా కూడా వేసుకోవచ్చు. పిండిలో కొబ్బరికోరుతోపాటు నువ్వులు లేదా నువ్వుల పిండి కూడా కలుపుకోవచ్చు. సజ్జ పరాఠా కావలసినవి: సజ్జపిండి- ఒక కప్పు గోధుమపిండి- అర కప్పు; అల్లం తరుగు- ఒక చెంచా ఉడికించి చిదిమిన బంగాళదుంప- అర కప్పు పెరుగు- రెండు చెంచాలు; ఉల్లి తరుగు- అర కప్పు కారం- అర చెంచా; పచ్చిమిర్చి తరుగు- ఒక చెంచా ఉప్పు- తగినంత; నూనె లేదా నెయ్యి- పావు కప్పు తయారీ: ఒక పాత్రలో సజ్జపిండి, గోధుమ పిండి, బంగాళాదుంప, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, అల్లం, కారం, ఉప్పు, పెరుగు వేసి తగినంత నీటిని చేరుస్తూ రొట్టెల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని పదినిమిషాల సేపు పక్కన ఉంచాలి. * ఈ పిండిని పెద్ద నిమ్మకాయంత ఉండలుగా చేసుకుని చపాతీల పీట మీద వత్తి వేడెక్కిన పెనం మీద వేసి, ఒక స్పూను నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. గమనిక: మరింత రుచి కోసం పిండి కలిపేటప్పుడు ఒక చెంచా నూనె వేసుకోవచ్చు. సజ్జ హల్వా కావలసినవి: సజ్జ పిండి- ఒక కప్పు; జీడిపప్పు - 10 బెల్లం లేదా చక్కెర పొడి- ఒక కప్పు; కిస్మిస్- 10 నెయ్యి- రెండు చెంచాలు; ఏలకుల పొడి- అర చెంచా తయారీ: * బాణలిలో ఒక చెంచా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత సజ్జపిండి వేసి కలుపుతూ దోరగా వేయించాలి. * మూడు కప్పుల నీటిలో ఒక కప్పు బెల్లం లేదా చక్కెర పొడి కలిపి వేడి చేయాలి. ఆ మిశ్రమాన్ని సజ్జపిండిలో పోయాలి. పిండి ఉండలు కట్టకుండా ఉండడానికి పిండిని కలుపుతూ బెల్లం నీటిని పోయాలి. తర్వాత కూడా సన్న మంట మీద పది నిమిషాల సేపు కలుపుతూ అడుగు పట్టకుండా ఉడికించిన తరవాత ఏలకుల పొడి, ఒక చెంచా నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి దించాలి. గమనిక: హల్వాలో కొబ్బరికోరు, ఖర్జూరం పలుకులు కూడా వేసుకోవచ్చు. సజ్జ పెసరట్టు కావలసినవి: సజ్జలు- ఒక కప్పు పొట్టు పెసరపప్పు- ఒక కప్పు బియ్యం- పిడికెడు జీలకర్ర- అర చెంచా ఇంగువ - అర చెంచా పచ్చిమిర్చి- రెండు అల్లం- చిన్న ముక్క ఉప్పు- తగినంత నూనె లేదా నెయ్యి- పావు కప్పు తయారీ: * సజ్జలు, పెసరపప్పు, బియ్యం ఒక పాత్రలో వేసి కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టాలి. * నానిన తర్వాత అల్లం, ఇంగువ, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. పిండిలో నీటిని కలుపుతూ గరిటె జారుడుగా చేసుకోవాలి. * దోశె పెనం వేడి చేసి అట్టు పోసుకుని ఒక స్పూను నూనె లేదా నెయ్యి వేయాలి. కాలిన తర్వాత తిరగేసి, రెండు వైపులా సమంగా కాలిన తర్వాత తీసేయాలి. ఈ వేడి వేడి అట్టును టొమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. గమనిక: పప్పుతోపాటు ఒక చెంచా మెంతులు వేసుకుంటే అట్లు మెత్తగా వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు ఈ రకంగా కూడా మెంతులను తీసుకోవచ్చు. -
వంటల వేడుక
ఎంత మూడ్రోజుల పండగ అయినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లే ఉంటుంది! భోగిని చూడండి... చలి మంటలు వేయగానే తెల్లారుతుంది. భోగి పళ్లు పోయగానే చీకటి పడిపోతుంది. సంక్రాంతిని చూడండి... ‘హరిలో రంగ హరీ’ అంటూ మొదలౌతుంది. అల్లుళ్లనీ, ఆడపడుచుల్ని రిసీవ్ చేసుకోవడంతోనే సరిపోతుంది. కనుమను చూడండి... రథమెక్కి వస్తుంది. వచ్చిన వాళ్లతో కలిసి బస్సో, రైలో ఎక్కి వెళ్లిపోతుంది. పండగలు ఇంత త్వరగా అయిపోతే ఎలా? నిరాశ చెందకండి. పండక్కి ముందు మూడురోజులు, తర్వాత మూడురోజులకు కూడా సరిపడా పిండివంటలు చేసిపెట్టుకోండి. అవి ఉన్నన్నాళ్లూ పండగలానే ఉంటుంది! ఐడియా బాగుందా? పాకం గారెలు కావలసినవి: మినప్పప్పు - కప్పు; ఉప్పు - కొద్దిగా (గారెలు తియ్యగా ఉండాలి కాబట్టి ఉప్పు ఎక్కువ వాడకూడదు); బెల్లం పొడి - కప్పు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత తయారీ: మినప్పప్పును సుమారు నాలుగు గంటలు నానబెట్టి నీళ్లు వడకట్టి, గారెల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకుని ఉప్పు కలిపి పక్కన ఉంచాలి వేరే పాత్రలో కొద్దిగా నీరు మరిగించి అందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి కలిపి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించి, దించేసి, పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మినప్పిండిని కొద్దిగా తీసుకుని, అర చేతిలో గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి బెల్లం పాకంలో వేసి సుమారు ఐదునిమిషాల తరవాత తీసి వేడివేడిగా అందించాలి. మురుకులు కావలసినవి: బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - అర కప్పు; నువ్వులు - 25 గ్రా.; జీలకర్ర - 25 గ్రా.; ఇంగువ - 2 టేబుల్ స్పూన్లు; బటర్ - 100 గ్రా.; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత తయారీ: బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు తీసేసి పొడి వస్త్రం మీద ఆరబోసి, తడి పూర్తిగా పోయాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చేయాలి మినప్పప్పును దోరగా వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చే యాలి ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, మినప్పిండి, నువ్వులు, జీలకర్ర, ఇంగువ, బటర్, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి జంతికల పిండిలా కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పిండి మిశ్రమాన్ని మురుకుల అచ్చులో వేసి జంతిక మాదిరిగా నూనెలో తిప్పాలి రెండు వైపులా దోరగా వేయించి తీసేయాలి చల్లారాక గాలి చొరని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా పాడవ్వవు. తంబిట్టు ఉండె కావలసినవి: బియ్యం - కప్పు; వేయించిన సెనగపప్పు (పుట్నాలపప్పు) - అర కప్పు; పల్లీలు - అర కప్పు; బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు; ఎండు కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పులు; నువ్వులు - టేబుల్ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను తయారీ బాణలిలో నూనె లేకుండా బియ్యం, పల్లీలు, నువ్వులను విడివిడిగా వేయించి తీసి పక్కన ఉంచాలి పల్లీల మీద పొట్టు తీసేసి మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి మిక్సీలో... వేయించిన సెనగపప్పు, వేయించిన బియ్యం వేసి మెత్తగా పొడి చేయాలి మందపాటి పాత్రలో తగినన్ని నీళ్లు, బెల్లం వేసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగేవరకు మరిగించాలి బియ్యప్పిండి, కొబ్బరి తురుము, నువ్వులు, పల్లీ పొడి వేసి బాగా కలపాలి నెయ్యి జత చేసి మరోమారు కలిపి మిశ్రమం బాగా ఉడికిందనిపించాక దించేయాలి కొద్దిగా చల్లారాక ఉండలు కట్టి, గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇవి సుమారు 15 రోజులు నిల్వ ఉంటాయి. -
మాటలకందని రుచులు
అలా ప్లేటు లాగేయకండి. కందే కదా అని చిందేయకండి. చాలా ఉంది కందలో!కంద గారెలు తిన్నారా ఎప్పుడైనా? కంద దోసెలు? కంద కట్లెట్, కంద కుర్మా, కంద ఉప్మా...? అబ్బబ్బబ్బబ్బబ్బా... ఒక్కసారి తింటే, వండిపెట్టేవారి దుంప తెగినట్టే! ‘ఇవాళ కంద లేదా’ అంటారు, తొందరపడి. ‘రేపు కందే కదా’ అంటారు, ముందే జాగ్రత్తపడి. అక్కడితో ఆగుతారా! కందకోసం రైతుబజారులో కవాతు చేస్తారు. వంద వెరైటీలున్నా... కందెక్కడని చూస్తారు. ఇన్ని మాటలెందుకు, తిని చూడండి. ‘చాలిక’ అంటే ఒట్టు. ఇది ‘ఫ్యామిలీ’ బెట్! కంద గారెలు కావలసినవి: కంద - పావు కేజీ మినప్పప్పు - 50 గ్రా. పెసర పప్పు - 50 గ్రా. ఉప్పు - తగినంత ఉల్లి తరుగు - అర కప్పు అల్లం - చిన్న ముక్క పచ్చి మిర్చి - 8 కొత్తిమీర - చిన్న కట్ట నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరగాలి మినప్పప్పు, పెసరపప్పులను సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి మిక్సీలో కంద ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, అల్లం ముక్క, ఉప్పు, కొత్తిమీర వేసి మెత్తగా పట్టి పక్కన ఉంచాలి మినప్పప్పు + పెసరపప్పులో ఉన్న నీళ్లు ఒంపేసి మిక్సీలో వేసి గారెల పిండి మాదిరిగా పట్టాలి ఒక పెద్ద గిన్నెలో కంద మిశ్రమం, మినప్పప్పు మిశ్రమం వేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక, గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీయాలి. కంద అటుకుల ఉప్మా కావలసినవి: అటుకులు - పావు కేజీ ఉప్పు - తగినంత ఉల్లి తరుగు - కప్పు పంచదార - అర టీ స్పూను నూనె - 5 టేబుల్ స్పూన్లు ఆవాలు - టీ స్పూను ఇంగువ - చిటికెడు కరివేపాకు - 2 రెమ్మలు పచ్చి మిర్చి - 7 పసుపు - అర టీ స్పూను కంద - 100 గ్రా. (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి) నిమ్మ రసం - టేబుల్ స్పూను; పచ్చి బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ:ముందుగా అటుకులను తగినన్ని నీళ్లలో వేసి శుభ్రంగా కడిగి నీరు తీసేసి, ఉప్పు, పంచదార వేసి కలపాలి (ముద్దయిపోకుండా చూసుకోవాలి) బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చి బఠాణీ, ఉల్లి తరుగు వేసి వేయించి, పచ్చి మిర్చి, పసుపు వేసి కలియబెట్టాక, కంద ముక్కలు, అటుకులు వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి నిమ్మరసం వేసి మరోమారు కలిపి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా అందించాలి. కంద పచ్చడి కావలసినవి: కంద తురుము - అర కప్పు; మినప్పప్పు - టీ స్పూను చింతపండు పులుసు - టీ స్పూను (చిక్కగా ఉండాలి); బెల్లం తురుము - టీ స్పూను; ఎండు మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను నూనె - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, జీలకర్ర, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాలి కంద తురుము జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి, ఉప్పు, చింతపండు పులుసు, బెల్లం తురుము జత చేసి మెత్తగా చేయాలి విడిగా పోపు వేయించి కలిపితే బాగుంటుంది. కంద - బచ్చలి కూర కావలసినవి: కంద - పావు కేజీ; బచ్చలి - రెండు కట్టలు; అల్లం తురుము - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 8 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఎండు మిర్చి - 6; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; నిమ్మరసం - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; బెల్లం తురుము - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట; ఉప్పు - తగినంత తయారీ: కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి బచ్చలి ఆకును కడిగి, శుభ్రం చేసి తరగాలి ఒక గిన్నెలో కంద, బచ్చలి, తగినన్ని నీళ్లు పోసి, కుకర్‌లో మెత్తగా ఉడికించాలి బాణలిలో నూనె వేసి కాగాక, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి ఉడికించిన కంద బచ్చలి వేసి బాగా కలియబెట్టాలి అల్లం తురుము, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి మరోమారు కలిపి, నిమ్మరసం, బియ్యప్పిండి, బెల్లం తురుము, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. కంద కూర కావలసినవి: కంద ముక్కలు - 2 కప్పులు; ఉల్లి తరుగు - అర కప్పు; సాంబారు పొడి - ఒకటిన్నర స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; సెనగ పప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కారం - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను తయారీ: కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి పెద్ద గిన్నెలో కంద ముక్కలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి (మరీ మెత్తగా ఉడికించకూడదు) బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక, కరివేపాకు వేసి వేయించాలి ఉల్లి తరుగు జత చేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాక, ఉడికించిన కంద ముక్కలు, కారం, సాంబారు పొడి వేసి బాగా కలపాలి కొద్దిగా నీళ్లు చిలకరించి, మూత పెట్టకుండా సుమారు 10 నిమిషాలు ఉడికించాలి. కంద దోసె కావలసినవి: కంద - పావు కేజీ; బియ్యప్పిండి - 100 గ్రా.; పెసరపప్పు - 50 గ్రా.; అల్లం - చిన్న ముక్క; పచ్చి మిర్చి - 8; కొత్తిమీర - చిన్న కట్ట; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; ఇంగువ - పావు టీ స్పూను; జీలకర్ర - టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి కొబ్బరి తురుము - కప్పు; నూనె - తగినంత తయారీ: కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి పెసర పప్పును సుమారు గంట సేపు నానబెట్టి నీరు ఒంపేయాలి మిక్సీలో... కంద ముక్కలు, నానిన పెసర పప్పు, అల్లం, పచ్చి మిర్చి, కొత్తిమీర, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి ఒక పాత్రలో కంద మిశ్రమం, బియ్యప్పిండి, తగినన్ని నీళ్లు వేసి దోసెల పిండి మాదిరిగా చేసుకోవాలి స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక, కలిపి ఉంచుకున్న పిండిని గరిటెతో దోసె మాదిరిగా వేసి, పైన జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము జల్లి, చుట్టూ నూనె వేసి, కాలాక రెండో వైపు తిప్పి, కొద్దిగా నూనె వేసి బాగా కాల్చి తీసేయాలి. కంద కట్లెట్ కావలసినవి: కంద - అర కేజీ; ఎండు మిర్చి - 6; ఉప్పు -తగినంత; నూనె - కప్పు; ఉల్లి తరుగు - కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 4; కారం - టీ స్పూను తయారీ: కంద చెక్కు తీసి, శుభ్రంగా కడిగి, ముక్కలు తరగాలి మిక్సీలో కంద ముక్కలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కారం, ఉప్పు, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా పట్టి తీసేయాలి బియ్యప్పిండి, కరివేపాకు, జీలకర్ర జత చేసి బాగా కలిపి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేయాలి స్టౌ మీద పెనం వేడయ్యాక నూనె వేసి ఒక్కో ఉండను పెనం మీద ఉంచి చేతితో జాగ్రత్తగా ఒత్తి చుట్టూ కొద్దిగా నూనె వేసి మంట తగ్గించాలి బాగా కాలిన తర్వాత రెండవ వైపు కూడా బంగారు రంగులోకి వచ్చాక తీసేయాలి. కంద మన దేశంలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. తెలుగు నాట వివాహాలలో కంద బచ్చలి కూర తప్పనిసరి. బీహార్‌లో మామిడి, అల్లం, కంద... సమాన భాగాలుగా తీసుకుని ఊరగాయ చేస్తారు. దీన్ని బరాబర్ చట్నీ అంటారు. సేకరణ: డా. వైజయంతి -
నవభోజనాలు
మామిడికాయ పప్పు, కందబచ్చలి కూర, ముక్కల పులుసు... మాటల్లేవ్! బూరెలు, బొబ్బట్లు, సేమ్యా పాయసం, జాంగ్రీ, జిలేబీ... మాట్లాడుకోవడాల్లేవ్! మసాలా వడలు, ఆవడలు, గారెలు, వగైరాలు... లేవడాల్లేవ్! చెయ్యి కడగడాల్లేవ్! వనభోజనాల్లోని మజానే ఇది. మాయే ఇది. మంత్రమే ఇది! కబుర్లు చెప్పుకుంటూ కానిద్దాం... అనుకుంటాం. మూతలు తెరుచుకోగానే కమ్మటి మత్తులో పడిపోతాం. ఆ మత్తుకు కాస్త కొత్తను జోడించి, మీ భుక్తాయాసానికి జోల పాట పాడించేందుకు 'నవ' భోజనాలను చేసుకొచ్చింది ఫ్యామిలీ. ఆరగించండి, ఈ కార్తిక వనభోజనాలను ఆస్వాదించండి. ఖండ్వీ కావలసినవి: సెనగపిండి : కప్పు; పెరుగు : 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు : తగినంత; పసుపు : టీ స్పూను; కారం : టీ స్పూను; ఇంగువ : చిటికెడు; నూనె : కొద్దిగా పోపు కోసం: నూనె : 2 టీ స్పూన్లు; ఆవాలు : టీ స్పూను; నువ్వు పప్పు : 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు : టీ స్పూను; కొత్తిమీర : చిన్న కట్ట; కారం : కొద్దిగా (పైన చల్లడానికి) తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు, ఉప్పు, పసుపు, ఇంగువ, కారం వేసి బాగా కలిపి, మూడు కప్పుల నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ పిండి కలిపి, స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతూ, పిండి చిక్కబడ్డాక దించేయాలి ఒక ప్లేట్‌కి వెనుక వైపు కొద్దిగా నూనె పూసి, పిండి మిశ్రమాన్ని కొద్దిగా మందంగా ఉండేలా పరిచి పది నిమిషాలు చల్లారనిచ్చాక, చపాతీ చుట్టినట్టుగా చుట్టి, చాకుతో ముక్కలుగా కట్ చేస్తే, ఖండ్వీ సిద్ధమైనట్లే చిన్న బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, నువ్వు పప్పు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని తయారుచేసి ఉంచుకున్న ఖండ్వీల మీద వేసి, కారం, కొత్తిమీరలతో అలంకరించి వేడివేడిగా అందించాలి. క్యాప్సికమ్ బజ్జీ కావలసినవి: క్యాప్సికమ్ : 15 (చిన్నవి); సెనగ పిండి : కప్పు; ఉప్పు : తగినంత; నీళ్లు : తగినన్ని; నూనె : డీప్ ఫ్రైకి సరిపడా ఫిల్లింగ్ కోసం: బంగాళ దుంపలు :పావు కిలో (ఉడికించి తొక్క తీసి, మెత్తగా చేయాలి); ఉప్పు : తగినంత; కారం : టీ స్పూను; ఆమ్చూర్ పొడి : 2 టీ స్పూన్లు; ధనియాల పొడి : 2 టీ స్పూన్లు; ఇంగువ : పావు టీ స్పూను; సోంపు : 2 టీస్పూన్లు; పచ్చి మిర్చి : 4 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) ఫిల్లింగ్ కోసం: ఒక పాత్రలో బంగాళదుంపల ముద్ద, ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, ఇంగువ, సోంపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలపాలి. బజ్జీ కోసం: ఒక పాత్రలో సెనగ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి బజ్జీల పిండిలా కలిపి పక్కన ఉంచాలి కాప్సికమ్‌ను ఒకవైపు కొద్దిగా కట్‌చేసి గింజలు తీసేసి, బంగాళదుంపల మిశ్రమం క్యాప్సికమ్‌లో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఒక్కో క్యాప్సికమ్‌ను సెనగ పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి, వేడివేడిగా అందించాలి. దాల్ కా పరాఠా కావలసినవి : గోధుమపిండి : కప్పు; ఉప్పు : కొద్దిగా; నూనె : 2 టీ స్పూన్లు; ఫిల్లింగ్ కోసం...: పెసలు : అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి); నూనె : 2 టీ స్పూన్లు; జీలకర్ర : అర టీ స్పూను; ఇంగువ : చిటికెడు; ఉప్పు : తగినంత; పసుపు : కొద్దిగా; కారం : అర టీ స్పూను; నెయ్యి :తగినంత తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, కొద్దిగా నూనె జత చేసి బాగా కలిపి, పక్కన ఉంచాలి పెసలు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి, కప్పుడు నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేగాక, ఉడికించిన పెసలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి, నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచి దించి, చల్లారాక, చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి చపాతీపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ ఒత్తి, మధ్యలో పెసరపిండి మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, పరాఠాలా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి కాగాక కొద్దిగా నెయ్యి వేసి, కరిగాక ఒత్తి ఉంచుకున్న పరాఠా వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు రెండువైపులా కాల్చి తీసేయాలి. మొహంతాల్ కావలసినవి: సెనగ పిండి : పావు కేజీ; నెయ్యి : టేబుల్ స్పూను; పాలు : 3 టేబుల్ స్పూన్లు; ఈ మూడు పదార్థాలను ఒక గిన్నెలో వేసి గట్టిగా అయ్యేలా కలపాలి); పచ్చి కోవా : 50 గ్రా.; పంచదార : 200 గ్రా.; నీళ్లు : అర కప్పు; ఏలకుల పొడి : అర టీ స్పూను; నెయ్యి : 150 గ్రా.; బాదం పప్పులు, పిస్తా పప్పులు : అలంకరించడానికి తగినన్ని. తయారీ: ఒక పాత్రలో పంచదార, అర కప్పు నీళ్లు వేసి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి పంచదార బాగా కరిగి, ఉండ పాకం వచ్చాక, పచ్చి కోవా, నెయ్యి వేసి బాగా కలపాలి వేరొక బాణలిలో టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సెనగ పిండి మిశ్రమం వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాక, ఏలకుల పొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పంచదార పాకం మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ కలిపి, కొద్దిసేపు ఉంచి దించేయాలి ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి, ఉడికించిన మిశ్రమం వేసి పల్చగా పరిచి, బాదంపప్పులు, పిస్తా పప్పులతో అలంకరించాలి. గట్టిపడుతుండగా ముక్కలుగా కట్ చేయాలి. డ్రైఫ్రూట్స్ రైస్ కావలసినవి బాస్మతి బియ్యం : ఒకటిన్నర కప్పులు; బటర్ : 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు : అర కప్పు; జీలకర్ర : అరటీ స్పూను; పసుపు : అర టీ స్పూను; దాల్చినచెక్క పొడి : పావు టీస్పూను; వెల్లుల్లి రేకలు : 2; నీళ్లు : రెండుంపావు కప్పులు; ఉప్పు : తగినంత; మిరియాల పొడి : పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ : కప్పు (బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, పిస్తా పప్పులు, ఆప్రికాట్... వంటివి) తయారీ బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు నానబెట్టి, నీళ్లు వంపేసి, తడి పోయేవరకు సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి బియ్యం జత చేసి, కలియబెట్టాలి నీళ్లలో ఉప్పు వేసి మరిగించి ఇందులో పోసి, మంట తగ్గించి, మూత ఉంచి, సుమారు పది నిమిషాలు ఉడికించాలి మరొక బాణలిలో బటర్ వేసి కరిగించి, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, దాల్చిన చెక్క పొడి, పసుపు, మిరియాల పొడి వేసి వేయించి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించి, అన్నంలో వేసి కలిపి వేడివేడిగా వడ్డించాలి. దమ్ ఆలూ లఖ్నవీ కావలసినవి: బంగాళ దుంపలు : పావు కేజీ (ఉడికించి తొక్క తీసి మెత్తగా చేయాలి); పనీర్ తురుము : 100 గ్రా; కారం : టీ స్పూను; ఉప్పు : తగినంత; గరం మసాలా : టీ స్పూను; కసూరీ మేథీ : ఒకటిన్నర టీ స్పూను; నెయ్యి : 3 టేబుల్ స్పూన్లు; బటర్ : టేబుల్ స్పూను; క్రీమ్ : టేబుల్ స్పూను ఉల్లిపాయ గ్రేవీ కోసం: ఉల్లిపాయలు :200 గ్రా. (మిక్సీలో వేసి ముద్ద చేయాలి) గరం మసాలా :అర టీ స్పూను; ఉప్పు : తగినంత; నెయ్యి : టీ స్పూను టొమాటో గ్రేవీ కోసం: టొమాటో ప్యూరీ : 200 గ్రా; నెయ్యి : టీ స్పూను; ఉప్పు :తగినంత ఉల్లిపాయ గ్రేవీ తయారీ: బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక, ఉల్లిపాయ ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. టొమాటో గ్రేవీ తయారీ: మరొక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక టొమాటో ప్యూరీ వేసి చిక్కబడే వరకు వేయించాక, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. దమ్ ఆలూ తయారీ: బంగాళదుంపల తొక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, బంగాళదుంప ముక్కలను వేసి కరక రలాడేలా వేయించి, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దించి చల్లార్చాలి ఒక పాత్రలో ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళ దుంప ముద్ద, పనీర్ తురుము వేసి కలిపి పక్కన ఉంచాలి. చివరగా... ఒక బాణలిలో నూనె వేసి కాగాక, టొమాటో గ్రేవీ, ఉల్లిపాయ గ్రేవీ మిశ్రమాలు వేసి నూనె బాగా పైకి తేలే వరకు వేయించాలి గరం మసాలా, కారం, కసూరీ మేథీ వేసి కలిపి, రెండు నిమిషాలు ఉడికించాలి బటర్, క్రీమ్ వేసి బాగా కలపాలి చివరగా బంగాళదుంప ముక్కలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. వనభోజనాలకు వెళ్లేటప్పుడు వెంట ఉంచుకోవలసినవి... అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆ ప్రదేశంలో పెద్దవాళ్లు, పిల్లలు విడివిడిగా ఆడుకోవడానికి అనువైన ఆట వస్తువులు... కూర్చోవడానికి అనువుగా దుప్పట్లు / చాపలు... మ్యూజిక్ సిస్టమ్, కెమెరా ఇవే కాకుండా మీకు ఇంకా ఏవైనా ఉంటే బాగుంటుందనుకుంటే ముందుగానే ఒక కాగితం మీద రాసి ఉంచుకోండి. బయలుదేరే ముందు ఒకసారి ఆ కాగితం చూస్తే చాలు మీరు అనుకున్నవన్నీ మీ వెంట తీసుకువెళ్లగలుగుతారు. సేకరణ: డా. వైజయంతి