'వంట'చేలు | differenr types of recipes | Sakshi
Sakshi News home page

'వంట'చేలు

Published Fri, Sep 16 2016 11:40 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

'వంట'చేలు - Sakshi

'వంట'చేలు

పాలకంకిలా ఉన్నప్పుడు తినాలి...
పెదవుల నుంచి పాయసం జారుతుంది!

కాస్త కండ పడుతున్నప్పుడు నమలాలి...
పంటికి పాకంలా అంటుకు వస్తుంది!

ముదిరి, ముత్యమైనప్పుడు చూడాలి...
నోరు ఆల్చిప్పలా తెరుచుకుంటుంది!

ఎలా తిన్నా సజ్జలకో రుచి ఉంటుంది.
స్నాక్స్ చేసుకుని తింటే  మాత్రం...
ఏకంగా పంటపొలంలోకే పరుగులు తీయాలనిపిస్తుంది!

 
గారెలు
కావలసినవి: సజ్జ పిండి- ఒక కప్పు; ఉల్లి తరుగు - పావు కప్పు
జీలకర్ర- ఒక చెంచా; కారం- ఒక చెంచా
 పచ్చిమిర్చి తరుగు- ఒక చెంచా; అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక చెంచా
 కరివేపాకు- ఒక రెమ్మ; ధనియాల పొడి- అర చెంచా
 నూనె- గారెలు వేయిచడానికి సరిపడినంత; ఉప్పు- తగినంత

తయారీ: నూనె మినహా పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక పాత్రలో వేసి కలిపి తగినంత నీటిని పోస్తూ ముద్దగా చేయాలి. చపాతీల పిండి కంటే కొంచెం వదులుగా గారెల పిండిలా ఉండాలి.
* పిండిని పెద్ద నిమ్మకాయంత ఉండలుగా చేసుకుని అరిటాకు మీద వేసి గారెల్లా వత్తి, మధ్యలో చిల్లు పెట్టి మరుగుతున్న నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలి.
* ఒక వైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాలిన తర్వాత చిల్లుల గరిటెతో తీయాలి.
 
గమనిక:
* అరిటాకు లేకపోతే తడివస్త్రం మీద చేసుకోవచ్చు. బాగా చెయ్యి తిరిగిన వాళ్లయితే పిండిని అరచేతిలో వేసుకుని వత్తి నూనెలో వదులుతారు.
* పిండిలో మునగాకు, మెంతికూర, తోటకూర వంటివి కలుపుకోవచ్చు. అలాగే నువ్వుల పొడి, వేరుశనగ పప్పు పొడి కూడా కలుపుకోవచ్చు.
* నూనెలో మునిగి కాలిన గారెలు తినడానికి సంశయిస్తుంటే ఇదే గారెలను దోశె పెనం మీద వేసి రెండు స్పూన్ల నూనెతో సన్న మంట మీద కాల్చుకోవచ్చు.
 
సజ్జ అప్పాలు
కావలసినవి: సజ్జపిండి- ఒక కప్పు; బెల్లం- ఒక కప్పు
 కొబ్బరి ముక్కలు- పావు కప్పు; ఏలకుల పొడి- అర చెంచా
పండిన అరటిపండు గుజ్జు- ఒక చెంచా;
 నూనె లేదా నెయ్యి- పావు కప్పు

తయారీ:
* బాణలిలో ఒక చెంచా నూనె వేసి కొబ్బరి ముక్కలను వేయించాలి.
* అరకప్పు నీటిలో బెల్లం తురుము వేసి వేడి చేసి వడకట్టాలి. ఆ నీటిలో సజ్జపిండి, ఏలకుల పొడి, కొబ్బరిముక్కలు, అరటిపండు గుజ్జు వేసి బాగా కలపాలి. అవసరమైతే మరికొంత నీటిని వేసుకోవచ్చు.  ఈ మిశ్రమం ఇడ్లీపిండిలాగ గరిటె జారుడుగా ఉండాలి. దీనిని నాలుగు గంటల సేపు నాననివ్వాలి.
* గుంట పొంగణాల పెనం తీసుకుని ఒక్కొక్క గుంటలో పావు చెంచా నూనె వేయాలి. పెనం వేడెక్కిన తర్వాత ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క చెంచా పిండి వేయాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేయాలి. ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకోవాలి.
 గమనిక: అప్పాలు కాలేటప్పుడు పొంగుతాయి. కాబట్టి పిండిని గుంట నిండా వేయకూడదు, సగం వరకే వేయాలి.  గుంట పొంగణాల పెనం లేకపోతే బాణలిలో నూనె పోసుకుని గారెల్లా చేసుకోవచ్చు. బాణలిలో చేసుకునే వాళ్లు పిండిని మరీ వదులుగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
 
సజ్జ బూరెలు
కావలసినవి: సజ్జపిండి - రెండు కప్పులు; బెల్లం- ఒక కప్పు
 కొబ్బరి కోరు- అర కప్పు; ఏలకుల పొడి- అరచెంచా
 శొంఠి పొడి- అర చెంచా; నూనె - బూరెలు కాల్చడానికి తగినంత
 
తయారీ:  అర కప్పు నీటిలో బెల్లం పొడి వేసి వేడి చేయాలి. రెండు నిమిషాల తర్వాత బెల్లం నీటిని వడపోసి ఆ నీటిలో కొబ్బరి కోరు, సజ్జపిండి, ఏలకుల పొడి, శొంఠిపొడి వేసి రొట్టెల పిండిలాగ కలపాలి. పిండిని పెద్ద నిమ్మకాయంత గోళీలుగా చేసుకోవాలి.
* బాణలిలో నూనె వేడి చేసి, పిండి గోళీని బూరెలా వత్తి నూనెలో వేయాలి. రెండువైపులా కాలిన తర్వాత తీసేయాలి. ఇవి రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి.
 గమనిక:  కొబ్బరిని తురమకుండా చిన్న పలుకులుగా కూడా వేసుకోవచ్చు.  పిండిలో కొబ్బరికోరుతోపాటు నువ్వులు లేదా నువ్వుల పిండి కూడా కలుపుకోవచ్చు.
 
సజ్జ పరాఠా
కావలసినవి: సజ్జపిండి- ఒక కప్పు
గోధుమపిండి- అర కప్పు; అల్లం తరుగు- ఒక చెంచా
 ఉడికించి చిదిమిన బంగాళదుంప- అర కప్పు
 పెరుగు- రెండు చెంచాలు; ఉల్లి తరుగు- అర కప్పు
 కారం- అర చెంచా; పచ్చిమిర్చి తరుగు- ఒక చెంచా
 ఉప్పు- తగినంత; నూనె లేదా నెయ్యి- పావు కప్పు
 
తయారీ:
ఒక పాత్రలో సజ్జపిండి, గోధుమ పిండి, బంగాళాదుంప, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, అల్లం, కారం, ఉప్పు, పెరుగు వేసి తగినంత నీటిని చేరుస్తూ రొట్టెల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని పదినిమిషాల సేపు పక్కన ఉంచాలి.
* ఈ పిండిని పెద్ద నిమ్మకాయంత ఉండలుగా చేసుకుని చపాతీల పీట మీద వత్తి వేడెక్కిన పెనం మీద వేసి, ఒక స్పూను నెయ్యి లేదా నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.
 గమనిక: మరింత రుచి కోసం పిండి కలిపేటప్పుడు ఒక చెంచా నూనె వేసుకోవచ్చు.
 
సజ్జ హల్వా
కావలసినవి: సజ్జ పిండి- ఒక కప్పు; జీడిపప్పు - 10
 బెల్లం లేదా చక్కెర పొడి- ఒక కప్పు; కిస్‌మిస్- 10
 నెయ్యి- రెండు చెంచాలు; ఏలకుల పొడి- అర చెంచా
 
తయారీ:
* బాణలిలో ఒక చెంచా నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత సజ్జపిండి వేసి కలుపుతూ దోరగా వేయించాలి.
* మూడు కప్పుల నీటిలో ఒక కప్పు బెల్లం లేదా చక్కెర పొడి కలిపి వేడి చేయాలి. ఆ మిశ్రమాన్ని సజ్జపిండిలో పోయాలి. పిండి ఉండలు కట్టకుండా ఉండడానికి పిండిని కలుపుతూ బెల్లం నీటిని పోయాలి. తర్వాత కూడా సన్న మంట మీద పది నిమిషాల సేపు కలుపుతూ అడుగు పట్టకుండా ఉడికించిన తరవాత ఏలకుల పొడి, ఒక చెంచా నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి కలిపి దించాలి.
 గమనిక: హల్వాలో కొబ్బరికోరు, ఖర్జూరం పలుకులు కూడా వేసుకోవచ్చు.
 
సజ్జ పెసరట్టు
కావలసినవి:
సజ్జలు- ఒక కప్పు
 పొట్టు పెసరపప్పు- ఒక కప్పు
 బియ్యం- పిడికెడు
 జీలకర్ర- అర చెంచా
 ఇంగువ - అర చెంచా
 పచ్చిమిర్చి- రెండు
 అల్లం- చిన్న ముక్క
 ఉప్పు- తగినంత
 నూనె లేదా నెయ్యి- పావు కప్పు
 
తయారీ:
* సజ్జలు, పెసరపప్పు, బియ్యం ఒక పాత్రలో వేసి కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టాలి.
* నానిన తర్వాత అల్లం, ఇంగువ, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బాలి. పిండిలో నీటిని కలుపుతూ గరిటె జారుడుగా చేసుకోవాలి.
* దోశె పెనం వేడి చేసి అట్టు పోసుకుని ఒక స్పూను నూనె లేదా నెయ్యి వేయాలి. కాలిన తర్వాత తిరగేసి, రెండు వైపులా సమంగా కాలిన తర్వాత తీసేయాలి. ఈ వేడి వేడి అట్టును టొమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటుంది.
 గమనిక: పప్పుతోపాటు ఒక చెంచా మెంతులు వేసుకుంటే అట్లు మెత్తగా వస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు ఈ రకంగా కూడా మెంతులను తీసుకోవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement