మాటలకందని రుచులు | Words tastes available | Sakshi
Sakshi News home page

మాటలకందని రుచులు

Published Fri, Nov 14 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

మాటలకందని రుచులు

మాటలకందని రుచులు

అలా ప్లేటు లాగేయకండి.  కందే కదా అని చిందేయకండి.  చాలా ఉంది కందలో!కంద గారెలు తిన్నారా ఎప్పుడైనా?  కంద దోసెలు?
 కంద కట్‌లెట్, కంద కుర్మా, కంద ఉప్మా...? అబ్బబ్బబ్బబ్బబ్బా...  ఒక్కసారి తింటే, వండిపెట్టేవారి దుంప తెగినట్టే!
‘ఇవాళ కంద లేదా’ అంటారు, తొందరపడి.  ‘రేపు కందే కదా’ అంటారు, ముందే జాగ్రత్తపడి.  అక్కడితో ఆగుతారా!  కందకోసం రైతుబజారులో కవాతు చేస్తారు.  వంద వెరైటీలున్నా... కందెక్కడని చూస్తారు. ఇన్ని మాటలెందుకు, తిని చూడండి.
‘చాలిక’ అంటే ఒట్టు. ఇది ‘ఫ్యామిలీ’ బెట్!
 
కంద గారెలు
 
కావలసినవి:  కంద - పావు
కేజీ మినప్పప్పు - 50 గ్రా.
పెసర పప్పు - 50 గ్రా.
ఉప్పు - తగినంత
ఉల్లి తరుగు - అర కప్పు
అల్లం - చిన్న ముక్క
పచ్చి మిర్చి - 8
కొత్తిమీర - చిన్న కట్ట
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ: ముందుగా కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరగాలి  మినప్పప్పు, పెసరపప్పులను సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి మిక్సీలో కంద ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, అల్లం ముక్క, ఉప్పు, కొత్తిమీర వేసి మెత్తగా పట్టి పక్కన ఉంచాలి  మినప్పప్పు + పెసరపప్పులో ఉన్న నీళ్లు ఒంపేసి మిక్సీలో వేసి గారెల పిండి మాదిరిగా పట్టాలి  ఒక పెద్ద గిన్నెలో కంద మిశ్రమం, మినప్పప్పు మిశ్రమం వేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక, గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీయాలి.
 
కంద అటుకుల ఉప్మా
 
 
కావలసినవి: 

అటుకులు - పావు కేజీ
ఉప్పు - తగినంత
ఉల్లి తరుగు - కప్పు
పంచదార - అర టీ స్పూను
నూనె - 5 టేబుల్ స్పూన్లు
ఆవాలు - టీ స్పూను
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 2 రెమ్మలు
పచ్చి మిర్చి - 7
పసుపు - అర టీ స్పూను
కంద - 100 గ్రా. (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి)
నిమ్మ రసం - టేబుల్ స్పూను; పచ్చి బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
 
తయారీ:ముందుగా అటుకులను తగినన్ని నీళ్లలో వేసి శుభ్రంగా కడిగి నీరు తీసేసి, ఉప్పు, పంచదార వేసి కలపాలి (ముద్దయిపోకుండా చూసుకోవాలి)  బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చి బఠాణీ, ఉల్లి తరుగు వేసి వేయించి, పచ్చి మిర్చి, పసుపు వేసి కలియబెట్టాక, కంద ముక్కలు, అటుకులు వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి  నిమ్మరసం వేసి మరోమారు కలిపి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా అందించాలి.
 
కంద పచ్చడిhttp://img.sakshi.net/images/cms/2014-11/51415984765_Unknown.jpg

కావలసినవి:  కంద తురుము - అర కప్పు; మినప్పప్పు - టీ స్పూను
చింతపండు పులుసు - టీ స్పూను (చిక్కగా ఉండాలి); బెల్లం తురుము - టీ స్పూను; ఎండు మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను
నూనె - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను
 
తయారీ:  స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, జీలకర్ర, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాలి  కంద తురుము జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి, ఉప్పు, చింతపండు పులుసు, బెల్లం తురుము జత చేసి మెత్తగా చేయాలి  విడిగా పోపు వేయించి కలిపితే బాగుంటుంది.
 
కంద - బచ్చలి కూర

కావలసినవి:  కంద - పావు కేజీ; బచ్చలి - రెండు కట్టలు; అల్లం తురుము - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 8 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఎండు మిర్చి - 6; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; నిమ్మరసం - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; బెల్లం తురుము - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట; ఉప్పు - తగినంత
 
తయారీ:  కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి  బచ్చలి ఆకును కడిగి, శుభ్రం చేసి తరగాలి  ఒక గిన్నెలో కంద, బచ్చలి, తగినన్ని నీళ్లు పోసి, కుకర్‌లో మెత్తగా ఉడికించాలి  బాణలిలో నూనె వేసి కాగాక, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి   ఉడికించిన కంద బచ్చలి వేసి బాగా కలియబెట్టాలి  అల్లం తురుము, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి మరోమారు కలిపి,  నిమ్మరసం, బియ్యప్పిండి, బెల్లం తురుము, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
 
కంద కూర
 
కావలసినవి:  కంద ముక్కలు - 2 కప్పులు; ఉల్లి తరుగు - అర కప్పు; సాంబారు పొడి - ఒకటిన్నర స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; సెనగ పప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కారం - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను

తయారీ:  కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి  పెద్ద గిన్నెలో కంద ముక్కలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి (మరీ మెత్తగా ఉడికించకూడదు)  బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక, కరివేపాకు వేసి వేయించాలి  ఉల్లి తరుగు జత చేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాక, ఉడికించిన కంద ముక్కలు, కారం, సాంబారు పొడి వేసి బాగా కలపాలి  కొద్దిగా నీళ్లు చిలకరించి, మూత పెట్టకుండా సుమారు 10 నిమిషాలు ఉడికించాలి.
 
కంద దోసెhttp://img.sakshi.net/images/cms/2014-11/71415984847_Unknown.jpg
 
కావలసినవి కంద - పావు కేజీ; బియ్యప్పిండి - 100 గ్రా.; పెసరపప్పు - 50 గ్రా.; అల్లం - చిన్న ముక్క; పచ్చి మిర్చి - 8; కొత్తిమీర - చిన్న కట్ట; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; ఇంగువ - పావు టీ స్పూను; జీలకర్ర - టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి కొబ్బరి తురుము - కప్పు; నూనె - తగినంత

తయారీ:  కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి పెసర పప్పును సుమారు గంట సేపు నానబెట్టి నీరు ఒంపేయాలి  మిక్సీలో... కంద ముక్కలు, నానిన పెసర పప్పు, అల్లం, పచ్చి మిర్చి, కొత్తిమీర, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి ఒక పాత్రలో కంద మిశ్రమం, బియ్యప్పిండి, తగినన్ని నీళ్లు వేసి దోసెల పిండి మాదిరిగా చేసుకోవాలి  స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక, కలిపి ఉంచుకున్న పిండిని గరిటెతో దోసె మాదిరిగా వేసి, పైన జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము జల్లి, చుట్టూ నూనె వేసి, కాలాక రెండో వైపు తిప్పి, కొద్దిగా నూనె వేసి బాగా కాల్చి తీసేయాలి.
 
కంద కట్‌లెట్
 
కావలసినవి:  కంద - అర కేజీ; ఎండు మిర్చి - 6; ఉప్పు -తగినంత; నూనె - కప్పు; ఉల్లి తరుగు - కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 4; కారం - టీ స్పూను
 
తయారీ: కంద చెక్కు తీసి, శుభ్రంగా     కడిగి, ముక్కలు  తరగాలి  మిక్సీలో కంద ముక్కలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కారం, ఉప్పు, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా పట్టి తీసేయాలి బియ్యప్పిండి, కరివేపాకు, జీలకర్ర జత చేసి బాగా కలిపి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేయాలి  స్టౌ మీద పెనం వేడయ్యాక నూనె వేసి ఒక్కో ఉండను పెనం మీద ఉంచి చేతితో జాగ్రత్తగా ఒత్తి చుట్టూ కొద్దిగా నూనె వేసి మంట తగ్గించాలి  బాగా కాలిన తర్వాత రెండవ వైపు కూడా బంగారు రంగులోకి వచ్చాక తీసేయాలి.
 
 కంద మన దేశంలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. తెలుగు నాట వివాహాలలో కంద బచ్చలి కూర తప్పనిసరి. బీహార్‌లో మామిడి, అల్లం, కంద... సమాన భాగాలుగా తీసుకుని ఊరగాయ చేస్తారు. దీన్ని బరాబర్ చట్నీ అంటారు.
 
 సేకరణ: డా. వైజయంతి
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement