Kanda
-
కంద సాగుతో డబ్బులే డబ్బులు.. ఎకరానికి లక్ష లాభం..
పెరవలి(పశ్చిమగోదావరి): గత ఐదేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన కంద రైతులు ఇప్పుడు లాభాల బాట పడుతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభిస్తోంది. దానికి తోడు ఈ ఏడాది దిగుబడి కూడా మెరుగ్గా ఉండడంతో కంద రైతుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టు కంద ధర రూ.4000 పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎకరానికి 70 నుంచి 80 పుట్టుల వరకూ కంద ఊరుతోంది. 232 కిలోలను పుట్టుగా వ్యవహరిస్తారు. ఎకరం కంద చేను తవ్వితే 70 నుంచి 80 పుట్టులు దిగుబడి వస్తోంది. దీంతో రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకూ మిగులుతోంది. జిల్లాలో కందసాగు విస్తీర్ణం జిల్లాలో కంద పంటను పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, పోలవరం, కడియం, మండలాల్లో సుమారు 1,250 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది పట్టు రూ.3,400 నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.4,000 వద్ద స్థిరంగా ఉంది. గతంలో ఇదే ధర ఉన్నప్పటికీ ఆశించనం తగా ఊరికలు లేక రైతులు నష్టాల చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతులు లాభాల బాట పడుతున్నారు. ఊరుతున్న లాభాలు కంద సాగు చేసినపుడు రైతులు పుట్టు విత్తనాన్ని రూ.3000 నుంచి రూ. 3400 రేటుకు కొనుగోలు చేశారు. ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.4000 ఉండడానికి తోడు ఊరికలు బాగా రావడం రైతులకు కలసి వస్తోంది. ప్రస్తుత మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 80 పుట్టులకు రూ.3.20 లక్షలు, 70 పుట్టుల ఊరిక ఉంటే రూ.2.80 లక్షల ఆదాయం వస్తోంది. ఎకరానికి ఖర్చు రూ.2.10 లక్షలు అయ్యిందని రైతులు చెబుతున్నారు పెట్టుబడి రూ. లక్షల్లో.. కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఎకరం విస్తీర్ణంలో కంద వేయాలంటే విత్తనానికి రూ.1.02 లక్షలు, దుక్కి దున్నడానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వడానికి, చచ్చు ఎక్క వేయడానికి కూలీలకు రూ.50 వేలు అవుతుంది. అలాగే పెంట వేయడానికి రూ.18 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ, 25 వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.15 వేలు ఖర్చవుతుంది. మొత్తం ఖర్చు రూ.2.10 లక్షలు అవుతుండగా నేడు ఊరికల ఆధారంగా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష మిగులు కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు. రేటు స్థిరంగా ఉంది ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం సంతోషదాయకం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.70 వేల మిగులు వచ్చింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు వలన రేటు స్థిరంగా ఉంది. –కోటిపల్లి పెద్దకాపు, కంద రైతు, అన్నవరప్పాడు అన్నీ అనుకూలించాయి ఐదేళ్ల తరువాత కంద రైతులు లాభాలు బాట పట్టారు. గతంలో ధర ఉంటే ఊరికలు లేవు, ఊరికలు ఉంటే ధర ఉండేది కాదు. కానీ నేడు ధరలు బాగున్నాయి. దిగుబడి బాగుంది. –బొలిశెట్టి వెంకటేశ్వరావు, కంద రైతు, అన్నవరప్పాడు నగరాల్లో డిమాండ్ ఉభయ గోదావరి జిలాల్లో పండించిన కందకు మద్రాస్, ముంబై వంటి మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.అందుకే రేటు బాగుంది. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద ఊరికలు గతంలో కంటే బాగా ఎక్కువగా వస్తున్నాయి. – గడుగొయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి -
ఊదలు వంటలు
ఊదల కట్లెట్ కావలసినవి: ఊదల పిండి – ఒక కప్పు కంద ముక్కలు – పావు కప్పు బఠాణీ – పావు కప్పు జీలకర్ర పొడి – ఒక టీ స్పూను ధనియాల పొడి – ఒక టీ స్పూను వాము – ఒక టీ స్పూను మిరియాల పొడి – అర టీ స్పూను మిరప కారం – అర టీ స్పూనుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు అల్లం + వెల్లుల్లి ముద్ద – రెండు టీ స్పూన్లు జీడి పప్పు పలుకులు – 10 ఉప్పు – తగినంత నెయ్యి – కాల్చటానికి తగినంత నువ్వుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు నిమ్మ రసం – ఒక టీ స్పూను తయారీ: కంద ముక్కలు, బఠాణీలను విడివిడిగా ఉడికించి, చేతితో మెత్తగా చిదిమి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఊదల పిండి వేసి దోరగా వేయించి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో ఊదల పిండి, మెత్తగా మెదిపిన కంద, బఠాణీ ముద్ద వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి ముద్ద, మిరప కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మ రసం ఒకదాని తరవాత ఒకటి వేసి కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, కట్లెట్లాగ ఒత్తి, నువ్వుల పొడిలో ముంచి పక్కన ఉంచాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక తయారుచేసి ఉంచుకున్న కట్లెట్లను పెనం మీద వేసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. జీడి పప్పులతో అలంకరించి వేడివేడిగా అందించాలి. 100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత? ఊదలు(Banyard Millet) నియాసిన్ (Niacin)mg (B3) 1.5 రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.08 థయామిన్ (Thiamine) mg (B1) 0.31 కెరోటిన్ (Carotene)ug 0 ఐరన్ (Iron)mg 2.9 కాల్షియం (Calcium)g 0.02 ఫాస్పరస్ (Phosphorous)g 0.28 ప్రొటీన్ (Protein)g 6.2 ఖనిజాలు (Minerals) g 4.4 పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5 పీచు పదార్థం (Fiber) g 10.0 పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.55 ఊదల పిజ్జా కావలసినవి: ఊదలు – అర కప్పు, – గోధుమ పిండి – అర కప్పుబేకింగ్ పౌడర్ – అర టీ స్పూను, ఉప్పు – తగినంతనెయ్యి / నూనె – 2 టీ స్పూన్లుటాపింగ్ కోసం ఉల్లి తరుగు + క్యాప్సికమ్ తరుగు + టొమాటో తరుగు+ మష్రూమ్ తరుగు – అర కప్పు, స్వీట్ కార్న్ గింజలు – ఒక టేబుల్ స్పూను టొమాటో సాస్ – పావు కప్పు, మొజెల్లా చీజ్ – తగినంత తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేయాలి. ఊదలను గ్రైండర్లో వేసి మెత్తటి పిండిలా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్ జత చేసి బాగా కలిపి సుమారు ఆరు గంటలపాటు పులియబెట్టాలి. స్టౌ మీద పాన్‌ను వేడి చేయాలి. కొద్దిగా నూనె వేసి కాగాక, పులియబెట్టిన పిండిని ఒక గరిటెడు తీసుకుని పెనం మీద వేసి రెండు వైపులా కాలిస్తే, పిజ్జా బేస్ సిద్ధమైనట్లే. 180 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర అవెన్‌ను ఐదు నిమిషాల పాటు వేడి చేయాలి. బేకింగ్ ట్రేలో అల్యూమినియం ఫాయిల్ పేపర్ వేసి తయారుచేసి ఉంచుకున్న పిజ్జా బేస్‌ను ట్రేలో ఉంచాలి. టొమాటో సాస్, మొజెల్లా చీజ్, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్ తరుగు, మష్రూమ్ తరుగు, స్వీట్ కార్న్ గింజలు ఒకదాని మీద ఒకటి వేయాలి. సుమారు పది నిమిషాలు దీనిని బేక్ చేసి బయటకు తీయాలి. వేడివేడిగా అందించాలి. ఊదల పుదీనా అన్నం కావలసినవి: ఊదలు – ఒక కప్పు, నీళ్లు – 2 కప్పులు, ఉప్పు – తగినంత బిర్యానీ ఆకు – 1, నెయ్యి / నూనె – 2 టీ స్పూన్లు, ఉల్లి తరుగు – పావు కప్పు, క్యారట్ తరుగు – ఒక కప్పు టొమాటో తరుగు – అర కప్పు, కరివేపాకు – 2 రెమ్మలు పుదీనా – ఒక కప్పు, కొత్తిమీర – పావు కప్పు, తరిగిన పచ్చి మిర్చి – 2 లవంగాలు – 2, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను చొప్పున తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి. స్టౌ మీద కుకర్‌లో ఊదలు, నీళ్లు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి కుకర్ మూత పెట్టాలి. మంటను కొద్దిగా తగ్గించి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. పుదీనా ఆకును శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక లవంగాలు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. పుదీనా ముద్ద వేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడికించాలి. చివరగా ఉప్పు వేసి కలియబెట్టి దింపేయాలి. ఒక పెద్ద పాత్రలో ఉడికించిన ఊదలు, వేయించి ఉంచుకున్న పుదీనా మిశ్రమం వేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి. ఊదల ఇండియానా కావలసినవి: ఊదలు – ఒక కప్పుకూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీ అన్నీ కలిపి)ఉప్పు – తగినంతతరిగిన పచ్చి మిర్చి – 5నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి – 2 టీ స్పూన్లుకొత్తిమీర – తగినంతఇంగువ – పావు టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూనునీళ్లు – అర కప్పు తయారీ: ఊదలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి. స్టౌ మీద కుకర్‌లో నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి మరోమారు కలియబెట్టాలి. కరివేపాకు పొడి వేసి బాగా కలపాలి. ఊదలలో నీటిని ఒంపేయాలి. మరుగుతున్న నీళ్లలో ఊదలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి. రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి. మూత తీశాక కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేసి వేడివేడిగా వడ్డించాలి. -
దురదే!
తింటే దురదే! కందతో వండిన ఏ పదార్థమైనా ఒక్కసారి తింటే... మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాలుకకు కంద దురద ... అలా పట్టుకుంటుంది. కమాన్ ఎంజాయ్ సాటర్ డే! కంద తినడానికి వంద దురదలు అందులో కొన్ని ఇవి. నోట్: కందను కట్ చేసేటప్పుడు చేతులకు దురద వస్తుంది. అందుకని రెండుమూడు సార్లు నూనె రాసుకుంటూ, కట్ చేయాలి. మిగతా కూరగాయలకన్నా కందను కొద్దిగా ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది. కంద గారెలు కావల్సినవి: కంద ముక్కలు – 3 కప్పులు (కందపై తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు కోసి, ఉడికించి, వడకట్టి పక్కనుంచాలి), పసుపు – పావు టీ స్పూన్ చింతపండు – నిమ్మకాయ పరిమాణం అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 1/2 టీ స్పూన్ కారం – టీ స్పూన్ గరం మసాలా – అర టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్‌స్పూన్లు కొబ్బరి తురుము – టేబుల్‌స్పూన్ బ్రెడ్ స్లైసులు – 4, పుట్నాల పప్పు – 1 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙పసుపు, ఉప్పు, చింతపండు, కందముక్కలు వేసి ఉడికించాలి. చల్లారాక కంద ముక్కలను పప్పుగుత్తితో మెదపాలి. నూనె మినహా మిగతాపదార్థాలన్నీ ఇందులో వేసి కలపాలి. మిశ్రమం గట్టిగా అవుతుంది. మిశ్రమం లూజ్‌గా ఉంటే బ్రెడ్ స్లైసులు వేసి బాగా కలపాలి. కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని, ఉండలు చేయాలి. గారెల షేప్ వచ్చేలా వత్తి, ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. పొయ్యిమీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. మంట తగ్గించి, సిద్ధం చేసుకున్న గారెలను వేసి, అన్ని వైపులా గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. అదనపు నూనె పీల్చుకోవడానికి గారెలను పేపర్ టవల్మీద వేయాలి. వేడి వేడిగా టొమాటో కెచప్ లేదా చట్నీతో వడ్డించాలి. కంద దోసె కావల్సినవి: బియ్యం – ముప్పావు కప్పు పెసలు – ముప్పావు కప్పు కంద (సన్నని ముక్కలు) – అర కప్పు పచ్చిమిర్చి – 1–2, అల్లం – చిన్న ముక్క జీలకర్ర – పావు టీ స్పూన్, పసుపు – చిటికెడు ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని; నూనె – తగినంత. తయారీ: ∙బియ్యం, పెసలు కడిగి, కనీసం 3 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వడకట్టాలి. కంద పై తొక్క తీసి, శుభ్రం చేయాలి. మిక్సర్జార్లో వడకట్టిన బియ్యం, పెసలు, కందముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి రుబ్బాలి. దీనికి తగినన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని, మూత పెట్టి, ఓ గంటసేపు ఉంచాలి. పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్‌తో తుడిచేయాలి. సిద్ధం చేసుకున్న పిండిని గరిటెతో పెనం మీద వేసి, అదే గరిటెతో వలయాకారంగా పిండిని పలచని అట్టులా చేయాలి. స్పూన్‌తో నూనె తీసుకొని, దోసె చుట్టూ వేయాలి. కొద్దిగా మంటను పెంచి, బంగారు రంగు వచ్చేవరకు ఉంచి, రెండోవైపు తిప్పాలి. మరో నిమిషం సేపు ఉంచి, ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోసెను పల్లీ పొడి, లేదా ఏదైనా చట్నీతో వడ్డించాలి. నోట్: దోసె కరకరలాడుతూ రావాలంటే పెసరపప్పుకు బదులు మినప్పప్పును వాడుకోవచ్చు. కంద పోహ కావల్సినవి: అటుకులు – 2 కప్పులు, కంద తరుగు – 3 టేబుల్ స్పూన్లు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీ స్పూన్, పల్లీలు – టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు ఉల్లిపాయలు – 3 (సన్నగా కట్ చేయాలి) ఉప్పు – తగినంత, పంచదార – చిటికెడు పసుపు – అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం – 2 టీ స్పూన్లు తయారీ: ∙అటుకులను ఒక గిన్నెలో వేసి, అవి మునిగేలా నీళ్లు పోసి అటూ ఇటుగా కలపాలి. నీళ్ల నుంచి అటుకులను తీసి జల్లిలో వేసి, ఐదు నుంచి పది నిమిషాలు నీళ్లన్నీ పోయేదాకా ఉంచాలి. నీళ్లన్నీ పోవాలని తడి అటుకులను గట్టిగా పిండకూడదు. ∙పొయ్యి మీద కడాయి పెట్టి, నూనె వేసి కాగనివ్వాలి. దీంట్లో ఆవాలు, పల్లీలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కంద వేసి కలపాలి. ఇవి బాగా వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పంచదార, పసుపు, వేసి కలిపి దీంట్లో ఆరిన అటుకులను వేసి కలపాలి. పైన కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి నిమిషం సేపు ఉంచి, మంట తీసేయాలి. కంద మటన్ కావల్సినవి: మటన్ – 300 గ్రాములు కంద ముక్కలు – 250 గ్రాములు (ఇంచు పరిమాణం), ఉల్లిపాయ – 1 (కట్ చేసి, మెత్తగా రుబ్బాలి), టొమాటో – 1 (పేస్ట్ చేయాలి), జీడిపప్పు – పావు కప్పు, పచ్చిమిర్చి – 4, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కొత్తిమీర – అర టీ స్పూన్, మిరియాల పొడి – టీ స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు, మసాలా – టీ స్పూన్ (సోంపు – అర టీ స్పూన్, ఇలాచీ – 1, దాల్చిన చెక్క – చిన్నముక్క కలిపి పొడి చేయాలి), చిక్కటి కొబ్బరిపాలు – కప్పు, పల్చటి కొబ్బరి పాలు – 2 కప్పులు, బిర్యానీ ఆకు – 1 , కొత్తిమీర+ పుదీనా – గుప్పెడు, నూనె – టేబుల్ స్పూన్ తయారీ: ∙పొయ్యి మీద ప్రెషర్కుకర్ పెట్టి, నూనె వేసి, వేడయ్యాక ముక్కలు చేసిన బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం– వెల్లుల్లి, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీంట్లో మటన్ ముక్కలు, కారం, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, మసాలా, పుదీనా, కొత్తిమీర, టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఒకసారి కలపాలి. దీంట్లో పచ్చిమిర్చి, కందముక్కలు, జీడిపప్పులు, ధనియాలపొడి, రెండు రకాల కొబ్బరిపాలు పోసి, మూత పెట్టాలి. 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, మంట తీసేయాలి. పదినిమిషాల తర్వాత కుకర్ మూత తీసి పావు టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నీళ్లు కలిపి మరో 5 నిమిషాలు పొయ్యిమీద పెట్టి ఉడికించి, దించాలి. ఈ కంద మటన్ కూరను జీరారైస్, పులావ్, వెజిటబుల్ బిర్యానీలోకి వడ్డించాలి. కంద పులుసు కావల్సినవి: కంద ముక్కలు – 1 1/2 కప్పులు, ఉల్లిపాయలు – 3 పచ్చిమిర్చి – 1 ఉల్లికాడ – 1, కారం – టీస్పూన్ పసుపు – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, బెల్లం – తగినంత చింతపండు – నిమ్మకాయ పరిమాణం ధనియాల పొడి – 3/4 టీ స్పూన్ జీలకర్ర పొడి – పావు టీ స్పూన్ ఆవాలు – అర టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ మెంతిపొడి – పావు టీ స్పూన్ నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙చింతపండులో కొద్దిగా వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. కందముక్కలను ఉడికించి, నీళ్లు వడకట్టి పక్కనుంచాలి. కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగనివ్వాలి. దీంట్లో కందముక్కలు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, బెల్లం, ఉప్పు వేసి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో చింతపండు రసం కలిపి 2–3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి, సన్నని మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి, మూత పెట్టాలి. చపాతీ, అన్నంలోకి ఈ పులుసు రుచిగా ఉంటుంది. -
నిలువెత్తు పెరిగిన కంద మొక్క
అమలాపురం టౌన్ : సాధారణంగా రెండున్నర నుంచి మూడున్నర అడుగుల ఎత్తు వరకూ పెరిగే కంద మొక్క ఏకంగా ఆరున్నర అడుగుల ఎత్తు పెరిగి అబ్బుర పరుస్తోంది. అమలాపురం గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి ప్రాంగణంలో ఏడాది కిందట పాతిన కంద మొక్క ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నిలువెత్తు దాటి పెరిగిపోయింది. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు, కనకదుర్గ దంపతులు ఈ మొక్కను మామూలుగానే నాటినప్పటికీ అది అసాధారణ ఎత్తుతో ఎదిగి అందరినీ ఆకర్షిస్తోంది. గోశాలకు వచ్చే గోప్రేమికులు ఈ మొక్కను ఆసక్తిగా తిలకిస్తున్నారు. మొక్కకు నీళ్లు తప్ప ఎలాంటి ఎరువులూ కూడా వాడలేదని గోశాల సేవకురాలు కనకదుర్గ తెలిపారు. -
మాటలకందని రుచులు
అలా ప్లేటు లాగేయకండి. కందే కదా అని చిందేయకండి. చాలా ఉంది కందలో!కంద గారెలు తిన్నారా ఎప్పుడైనా? కంద దోసెలు? కంద కట్లెట్, కంద కుర్మా, కంద ఉప్మా...? అబ్బబ్బబ్బబ్బబ్బా... ఒక్కసారి తింటే, వండిపెట్టేవారి దుంప తెగినట్టే! ‘ఇవాళ కంద లేదా’ అంటారు, తొందరపడి. ‘రేపు కందే కదా’ అంటారు, ముందే జాగ్రత్తపడి. అక్కడితో ఆగుతారా! కందకోసం రైతుబజారులో కవాతు చేస్తారు. వంద వెరైటీలున్నా... కందెక్కడని చూస్తారు. ఇన్ని మాటలెందుకు, తిని చూడండి. ‘చాలిక’ అంటే ఒట్టు. ఇది ‘ఫ్యామిలీ’ బెట్! కంద గారెలు కావలసినవి: కంద - పావు కేజీ మినప్పప్పు - 50 గ్రా. పెసర పప్పు - 50 గ్రా. ఉప్పు - తగినంత ఉల్లి తరుగు - అర కప్పు అల్లం - చిన్న ముక్క పచ్చి మిర్చి - 8 కొత్తిమీర - చిన్న కట్ట నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా తరగాలి మినప్పప్పు, పెసరపప్పులను సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి మిక్సీలో కంద ముక్కలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, అల్లం ముక్క, ఉప్పు, కొత్తిమీర వేసి మెత్తగా పట్టి పక్కన ఉంచాలి మినప్పప్పు + పెసరపప్పులో ఉన్న నీళ్లు ఒంపేసి మిక్సీలో వేసి గారెల పిండి మాదిరిగా పట్టాలి ఒక పెద్ద గిన్నెలో కంద మిశ్రమం, మినప్పప్పు మిశ్రమం వేసి బాగా కలపాలి బాణలిలో నూనె వేసి కాగాక, గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీయాలి. కంద అటుకుల ఉప్మా కావలసినవి: అటుకులు - పావు కేజీ ఉప్పు - తగినంత ఉల్లి తరుగు - కప్పు పంచదార - అర టీ స్పూను నూనె - 5 టేబుల్ స్పూన్లు ఆవాలు - టీ స్పూను ఇంగువ - చిటికెడు కరివేపాకు - 2 రెమ్మలు పచ్చి మిర్చి - 7 పసుపు - అర టీ స్పూను కంద - 100 గ్రా. (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి) నిమ్మ రసం - టేబుల్ స్పూను; పచ్చి బఠాణీ - 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు తయారీ:ముందుగా అటుకులను తగినన్ని నీళ్లలో వేసి శుభ్రంగా కడిగి నీరు తీసేసి, ఉప్పు, పంచదార వేసి కలపాలి (ముద్దయిపోకుండా చూసుకోవాలి) బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పచ్చి బఠాణీ, ఉల్లి తరుగు వేసి వేయించి, పచ్చి మిర్చి, పసుపు వేసి కలియబెట్టాక, కంద ముక్కలు, అటుకులు వేసి రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి నిమ్మరసం వేసి మరోమారు కలిపి, కొత్తిమీర తరుగుతో అలంకరించి వేడివేడిగా అందించాలి. కంద పచ్చడి కావలసినవి: కంద తురుము - అర కప్పు; మినప్పప్పు - టీ స్పూను చింతపండు పులుసు - టీ స్పూను (చిక్కగా ఉండాలి); బెల్లం తురుము - టీ స్పూను; ఎండు మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను నూనె - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, జీలకర్ర, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేయించాలి కంద తురుము జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి దించి, చల్లారాక మిక్సీలో వేసి, ఉప్పు, చింతపండు పులుసు, బెల్లం తురుము జత చేసి మెత్తగా చేయాలి విడిగా పోపు వేయించి కలిపితే బాగుంటుంది. కంద - బచ్చలి కూర కావలసినవి: కంద - పావు కేజీ; బచ్చలి - రెండు కట్టలు; అల్లం తురుము - అర టీ స్పూను; పచ్చి మిర్చి - 8 (నిలువుగా మధ్యకు చీల్చాలి); ఎండు మిర్చి - 6; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; నిమ్మరసం - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; బెల్లం తురుము - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర - చిన్న కట్ట; ఉప్పు - తగినంత తయారీ: కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి బచ్చలి ఆకును కడిగి, శుభ్రం చేసి తరగాలి ఒక గిన్నెలో కంద, బచ్చలి, తగినన్ని నీళ్లు పోసి, కుకర్‌లో మెత్తగా ఉడికించాలి బాణలిలో నూనె వేసి కాగాక, సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి ఉడికించిన కంద బచ్చలి వేసి బాగా కలియబెట్టాలి అల్లం తురుము, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి మరోమారు కలిపి, నిమ్మరసం, బియ్యప్పిండి, బెల్లం తురుము, కొత్తిమీర వేసి కలిపి దించేయాలి. కంద కూర కావలసినవి: కంద ముక్కలు - 2 కప్పులు; ఉల్లి తరుగు - అర కప్పు; సాంబారు పొడి - ఒకటిన్నర స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; సెనగ పప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; కారం - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను తయారీ: కంద చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి పెద్ద గిన్నెలో కంద ముక్కలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి (మరీ మెత్తగా ఉడికించకూడదు) బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక, కరివేపాకు వేసి వేయించాలి ఉల్లి తరుగు జత చేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాక, ఉడికించిన కంద ముక్కలు, కారం, సాంబారు పొడి వేసి బాగా కలపాలి కొద్దిగా నీళ్లు చిలకరించి, మూత పెట్టకుండా సుమారు 10 నిమిషాలు ఉడికించాలి. కంద దోసె కావలసినవి: కంద - పావు కేజీ; బియ్యప్పిండి - 100 గ్రా.; పెసరపప్పు - 50 గ్రా.; అల్లం - చిన్న ముక్క; పచ్చి మిర్చి - 8; కొత్తిమీర - చిన్న కట్ట; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; ఇంగువ - పావు టీ స్పూను; జీలకర్ర - టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి కొబ్బరి తురుము - కప్పు; నూనె - తగినంత తయారీ: కందను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి పెసర పప్పును సుమారు గంట సేపు నానబెట్టి నీరు ఒంపేయాలి మిక్సీలో... కంద ముక్కలు, నానిన పెసర పప్పు, అల్లం, పచ్చి మిర్చి, కొత్తిమీర, పసుపు, ఇంగువ, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి ఒక పాత్రలో కంద మిశ్రమం, బియ్యప్పిండి, తగినన్ని నీళ్లు వేసి దోసెల పిండి మాదిరిగా చేసుకోవాలి స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక, కలిపి ఉంచుకున్న పిండిని గరిటెతో దోసె మాదిరిగా వేసి, పైన జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము జల్లి, చుట్టూ నూనె వేసి, కాలాక రెండో వైపు తిప్పి, కొద్దిగా నూనె వేసి బాగా కాల్చి తీసేయాలి. కంద కట్లెట్ కావలసినవి: కంద - అర కేజీ; ఎండు మిర్చి - 6; ఉప్పు -తగినంత; నూనె - కప్పు; ఉల్లి తరుగు - కప్పు; కరివేపాకు - 2 రెమ్మలు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 4; కారం - టీ స్పూను తయారీ: కంద చెక్కు తీసి, శుభ్రంగా కడిగి, ముక్కలు తరగాలి మిక్సీలో కంద ముక్కలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కారం, ఉప్పు, పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా పట్టి తీసేయాలి బియ్యప్పిండి, కరివేపాకు, జీలకర్ర జత చేసి బాగా కలిపి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేయాలి స్టౌ మీద పెనం వేడయ్యాక నూనె వేసి ఒక్కో ఉండను పెనం మీద ఉంచి చేతితో జాగ్రత్తగా ఒత్తి చుట్టూ కొద్దిగా నూనె వేసి మంట తగ్గించాలి బాగా కాలిన తర్వాత రెండవ వైపు కూడా బంగారు రంగులోకి వచ్చాక తీసేయాలి. కంద మన దేశంలో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. తెలుగు నాట వివాహాలలో కంద బచ్చలి కూర తప్పనిసరి. బీహార్‌లో మామిడి, అల్లం, కంద... సమాన భాగాలుగా తీసుకుని ఊరగాయ చేస్తారు. దీన్ని బరాబర్ చట్నీ అంటారు. సేకరణ: డా. వైజయంతి -
దీని ‘దుంప’తెగ..! ఎంత ఎదిగిందబ్బా..!
మౌనంగానే ఎదగడం.. ఎదిగినకొద్దీ ఒదిగుండటం మొక్కల నైజం. ఈ విషయూన్ని బాగా వంటబట్టించుకుందో లేదంటే మొక్క అనిపించుకోవడం ఇష్టంలేదో గానీ ఈ కంద మొక్క ఏకంగా 10 అడుగులకు పైగా ఎత్తు పెరిగింది. సాధారణంగా కంద మొక్క (దీన్ని కంద గొడుగు అని కూడా అంటారు) రెండునుంచి మూడు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అరుుతంపూడి మాజీ సర్పంచ్ గెద్దాడ కుటుంబరావు ఇంటి పెరట్లో మొలకెత్తిన కంద పిలక ఏకంగా 10 అడుగుల ఎత్తు దాటిపోరుుంది. మండు వేసవిలోనూ రెండు నెలల వ్యవధిలోనే ఇలా పెరిగింది. ఈ విషయమై వ్యవసాయ అధికారి ఎం.హుమయూన్‌ను సంప్రదించగా.. భూమిలో సారం అధికంగా ఉండటం లేదా జన్యుపరమైన లోపాల వల్ల మొక్కలు ఇలా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. - ఇరగవరం