నిలువెత్తు పెరిగిన కంద మొక్క
అమలాపురం టౌన్ :
సాధారణంగా రెండున్నర నుంచి మూడున్నర అడుగుల ఎత్తు వరకూ పెరిగే కంద మొక్క ఏకంగా ఆరున్నర అడుగుల ఎత్తు పెరిగి అబ్బుర పరుస్తోంది. అమలాపురం గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి ప్రాంగణంలో ఏడాది కిందట పాతిన కంద మొక్క ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నిలువెత్తు దాటి పెరిగిపోయింది. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు, కనకదుర్గ దంపతులు ఈ మొక్కను మామూలుగానే నాటినప్పటికీ అది అసాధారణ ఎత్తుతో ఎదిగి అందరినీ ఆకర్షిస్తోంది. గోశాలకు వచ్చే గోప్రేమికులు ఈ మొక్కను ఆసక్తిగా తిలకిస్తున్నారు. మొక్కకు నీళ్లు తప్ప ఎలాంటి ఎరువులూ కూడా వాడలేదని గోశాల సేవకురాలు కనకదుర్గ తెలిపారు.