దురదే!
తింటే దురదే!
కందతో వండిన ఏ పదార్థమైనా
ఒక్కసారి తింటే...
మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
నాలుకకు కంద దురద
... అలా పట్టుకుంటుంది.
కమాన్ ఎంజాయ్ సాటర్ డే!
కంద తినడానికి వంద దురదలు
అందులో కొన్ని ఇవి.
నోట్: కందను కట్ చేసేటప్పుడు చేతులకు దురద వస్తుంది. అందుకని రెండుమూడు సార్లు నూనె రాసుకుంటూ, కట్ చేయాలి. మిగతా కూరగాయలకన్నా కందను కొద్దిగా ఎక్కువసేపు ఉడికించాల్సి
ఉంటుంది.
కంద గారెలు
కావల్సినవి: కంద ముక్కలు – 3 కప్పులు (కందపై తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు కోసి, ఉడికించి, వడకట్టి పక్కనుంచాలి), పసుపు – పావు టీ స్పూన్
చింతపండు – నిమ్మకాయ పరిమాణం
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 1/2 టీ స్పూన్
కారం – టీ స్పూన్
గరం మసాలా – అర టీ స్పూన్
కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్‌స్పూన్లు
కొబ్బరి తురుము – టేబుల్‌స్పూన్
బ్రెడ్ స్లైసులు – 4, పుట్నాల పప్పు – 1 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత
తయారీ: ∙పసుపు, ఉప్పు, చింతపండు, కందముక్కలు వేసి ఉడికించాలి. చల్లారాక కంద ముక్కలను పప్పుగుత్తితో మెదపాలి. నూనె మినహా మిగతాపదార్థాలన్నీ ఇందులో వేసి కలపాలి. మిశ్రమం గట్టిగా అవుతుంది. మిశ్రమం లూజ్‌గా ఉంటే బ్రెడ్ స్లైసులు వేసి బాగా కలపాలి. కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని, ఉండలు చేయాలి. గారెల షేప్ వచ్చేలా వత్తి, ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. పొయ్యిమీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. మంట తగ్గించి, సిద్ధం చేసుకున్న గారెలను వేసి, అన్ని వైపులా గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. అదనపు నూనె పీల్చుకోవడానికి గారెలను పేపర్ టవల్‌మీద వేయాలి. వేడి వేడిగా టొమాటో కెచప్ లేదా చట్నీతో వడ్డించాలి.
కంద దోసె
కావల్సినవి: బియ్యం – ముప్పావు కప్పు
పెసలు – ముప్పావు కప్పు
కంద (సన్నని ముక్కలు) – అర కప్పు
పచ్చిమిర్చి – 1–2, అల్లం – చిన్న ముక్క
జీలకర్ర – పావు టీ స్పూన్, పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని; నూనె – తగినంత.
తయారీ: ∙బియ్యం, పెసలు కడిగి, కనీసం 3 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వడకట్టాలి. కంద పై తొక్క తీసి, శుభ్రం చేయాలి. మిక్సర్‌జార్‌లో వడకట్టిన బియ్యం, పెసలు, కందముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి రుబ్బాలి. దీనికి తగినన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని, మూత పెట్టి, ఓ గంటసేపు ఉంచాలి. పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్‌తో తుడిచేయాలి. సిద్ధం చేసుకున్న పిండిని గరిటెతో పెనం మీద వేసి, అదే గరిటెతో వలయాకారంగా పిండిని పలచని అట్టులా చేయాలి. స్పూన్‌తో నూనె తీసుకొని, దోసె చుట్టూ వేయాలి. కొద్దిగా మంటను పెంచి, బంగారు రంగు వచ్చేవరకు ఉంచి, రెండోవైపు తిప్పాలి. మరో నిమిషం సేపు ఉంచి, ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ దోసెను పల్లీ పొడి, లేదా ఏదైనా చట్నీతో వడ్డించాలి.
నోట్: దోసె కరకరలాడుతూ రావాలంటే పెసరపప్పుకు బదులు మినప్పప్పును వాడుకోవచ్చు.
కంద పోహ
కావల్సినవి: అటుకులు – 2 కప్పులు, కంద తరుగు – 3 టేబుల్ స్పూన్లు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీ స్పూన్, పల్లీలు – టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు
ఉల్లిపాయలు – 3 (సన్నగా కట్ చేయాలి)
ఉప్పు – తగినంత, పంచదార – చిటికెడు
పసుపు – అర టీ స్పూన్
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం – 2 టీ స్పూన్లు
తయారీ: ∙అటుకులను ఒక గిన్నెలో వేసి, అవి మునిగేలా నీళ్లు పోసి అటూ ఇటుగా కలపాలి. నీళ్ల నుంచి అటుకులను తీసి జల్లిలో వేసి, ఐదు నుంచి పది నిమిషాలు నీళ్లన్నీ పోయేదాకా ఉంచాలి. నీళ్లన్నీ పోవాలని తడి అటుకులను గట్టిగా పిండకూడదు.
∙పొయ్యి మీద కడాయి పెట్టి, నూనె వేసి కాగనివ్వాలి. దీంట్లో ఆవాలు, పల్లీలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కంద వేసి కలపాలి. ఇవి బాగా వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పంచదార, పసుపు, వేసి కలిపి దీంట్లో ఆరిన అటుకులను వేసి కలపాలి. పైన కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి నిమిషం సేపు ఉంచి, మంట తీసేయాలి.
కంద మటన్
కావల్సినవి: మటన్ – 300 గ్రాములు
కంద ముక్కలు – 250 గ్రాములు (ఇంచు పరిమాణం), ఉల్లిపాయ – 1 (కట్ చేసి, మెత్తగా రుబ్బాలి), టొమాటో – 1 (పేస్ట్ చేయాలి), జీడిపప్పు – పావు కప్పు, పచ్చిమిర్చి – 4, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కొత్తిమీర – అర టీ స్పూన్, మిరియాల పొడి – టీ స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు, మసాలా – టీ స్పూన్ (సోంపు – అర టీ స్పూన్, ఇలాచీ – 1, దాల్చిన చెక్క – చిన్నముక్క కలిపి పొడి చేయాలి), చిక్కటి కొబ్బరిపాలు – కప్పు, పల్చటి కొబ్బరి పాలు – 2 కప్పులు, బిర్యానీ ఆకు – 1 , కొత్తిమీర+ పుదీనా – గుప్పెడు, నూనె – టేబుల్ స్పూన్
తయారీ: ∙పొయ్యి మీద ప్రెషర్‌కుకర్ పెట్టి, నూనె వేసి, వేడయ్యాక ముక్కలు చేసిన బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం– వెల్లుల్లి, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీంట్లో మటన్ ముక్కలు, కారం, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, మసాలా, పుదీనా, కొత్తిమీర, టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఒకసారి కలపాలి. దీంట్లో పచ్చిమిర్చి, కందముక్కలు, జీడిపప్పులు, ధనియాలపొడి, రెండు రకాల కొబ్బరిపాలు పోసి, మూత పెట్టాలి. 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, మంట తీసేయాలి. పదినిమిషాల తర్వాత కుకర్ మూత తీసి పావు టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నీళ్లు కలిపి మరో 5 నిమిషాలు పొయ్యిమీద పెట్టి ఉడికించి, దించాలి. ఈ కంద మటన్ కూరను జీరారైస్, పులావ్, వెజిటబుల్ బిర్యానీలోకి వడ్డించాలి.
కంద పులుసు
కావల్సినవి: కంద ముక్కలు – 1 1/2 కప్పులు, ఉల్లిపాయలు – 3
పచ్చిమిర్చి – 1
ఉల్లికాడ – 1, కారం – టీస్పూన్
పసుపు – పావు టీ స్పూన్
ఉప్పు – తగినంత, బెల్లం – తగినంత
చింతపండు – నిమ్మకాయ పరిమాణం
ధనియాల పొడి – 3/4 టీ స్పూన్
జీలకర్ర పొడి – పావు టీ స్పూన్
ఆవాలు – అర టీ స్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
మెంతిపొడి – పావు టీ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్లు
తయారీ: ∙చింతపండులో కొద్దిగా వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. కందముక్కలను ఉడికించి, నీళ్లు వడకట్టి పక్కనుంచాలి. కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగనివ్వాలి. దీంట్లో కందముక్కలు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, బెల్లం, ఉప్పు వేసి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో చింతపండు రసం కలిపి 2–3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి, సన్నని మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి, మూత పెట్టాలి. చపాతీ, అన్నంలోకి ఈ పులుసు రుచిగా ఉంటుంది.