పెరవలి(పశ్చిమగోదావరి): గత ఐదేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన కంద రైతులు ఇప్పుడు లాభాల బాట పడుతున్నారు. మార్కెట్‌లో కందకు గిట్టుబాటు ధర లభిస్తోంది. దానికి తోడు ఈ ఏడాది దిగుబడి కూడా మెరుగ్గా ఉండడంతో కంద రైతుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం మార్కెట్‌లో పుట్టు కంద ధర రూ.4000 పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎకరానికి 70 నుంచి 80 పుట్టుల వరకూ కంద ఊరుతోంది. 232 కిలోలను పుట్టుగా వ్యవహరిస్తారు. ఎకరం కంద చేను తవ్వితే 70 నుంచి 80 పుట్టులు దిగుబడి వస్తోంది. దీంతో రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకూ మిగులుతోంది.
జిల్లాలో కందసాగు విస్తీర్ణం
జిల్లాలో కంద పంటను పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, పోలవరం, కడియం, మండలాల్లో సుమారు 1,250 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది పట్టు రూ.3,400 నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.4,000 వద్ద స్థిరంగా ఉంది. గతంలో ఇదే ధర ఉన్నప్పటికీ ఆశించనం తగా ఊరికలు లేక రైతులు నష్టాల చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతులు లాభాల బాట పడుతున్నారు.
ఊరుతున్న లాభాలు
కంద సాగు చేసినపుడు రైతులు పుట్టు విత్తనాన్ని రూ.3000 నుంచి రూ. 3400 రేటుకు కొనుగోలు చేశారు. ఇప్పుడు మార్కెట్‌లో పుట్టు ధర రూ.4000 ఉండడానికి తోడు ఊరికలు బాగా రావడం రైతులకు కలసి వస్తోంది. ప్రస్తుత మార్కెట్‌లో లభిస్తున్న ధర ప్రకారం 80 పుట్టులకు రూ.3.20 లక్షలు, 70 పుట్టుల ఊరిక ఉంటే రూ.2.80 లక్షల ఆదాయం వస్తోంది. ఎకరానికి ఖర్చు రూ.2.10 లక్షలు అయ్యిందని రైతులు చెబుతున్నారు
పెట్టుబడి రూ. లక్షల్లో..
కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఎకరం విస్తీర్ణంలో కంద వేయాలంటే విత్తనానికి రూ.1.02 లక్షలు, దుక్కి దున్నడానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వడానికి, చచ్చు ఎక్క వేయడానికి కూలీలకు రూ.50 వేలు అవుతుంది. అలాగే పెంట వేయడానికి రూ.18 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ, 25 వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.15 వేలు ఖర్చవుతుంది. మొత్తం ఖర్చు రూ.2.10 లక్షలు అవుతుండగా నేడు ఊరికల ఆధారంగా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రైతులకు ఎకరానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష మిగులు కనిపిస్తోందని రైతులు చెబుతున్నారు.
రేటు స్థిరంగా ఉంది
ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం సంతోషదాయకం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.70 వేల మిగులు వచ్చింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు వలన రేటు స్థిరంగా ఉంది.
–కోటిపల్లి పెద్దకాపు, కంద రైతు, అన్నవరప్పాడు
అన్నీ అనుకూలించాయి
ఐదేళ్ల తరువాత కంద రైతులు లాభాలు బాట పట్టారు. గతంలో ధర ఉంటే ఊరికలు లేవు, ఊరికలు ఉంటే ధర ఉండేది కాదు. కానీ నేడు ధరలు బాగున్నాయి. దిగుబడి బాగుంది.
–బొలిశెట్టి వెంకటేశ్వరావు, కంద రైతు, అన్నవరప్పాడు
నగరాల్లో డిమాండ్
ఉభయ గోదావరి జిలాల్లో పండించిన కందకు మద్రాస్, ముంబై వంటి మార్కెట్‌లలో మంచి డిమాండ్ ఉంది.అందుకే రేటు బాగుంది. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద ఊరికలు గతంలో కంటే బాగా ఎక్కువగా వస్తున్నాయి.
– గడుగొయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment