వంటల వేడుక
ఎంత మూడ్రోజుల పండగ అయినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లే ఉంటుంది! భోగిని చూడండి... చలి మంటలు వేయగానే తెల్లారుతుంది. భోగి పళ్లు పోయగానే చీకటి పడిపోతుంది. సంక్రాంతిని చూడండి... ‘హరిలో రంగ హరీ’ అంటూ మొదలౌతుంది. అల్లుళ్లనీ, ఆడపడుచుల్ని రిసీవ్ చేసుకోవడంతోనే సరిపోతుంది. కనుమను చూడండి... రథమెక్కి వస్తుంది. వచ్చిన వాళ్లతో కలిసి బస్సో, రైలో ఎక్కి వెళ్లిపోతుంది. పండగలు ఇంత త్వరగా అయిపోతే ఎలా? నిరాశ చెందకండి. పండక్కి ముందు మూడురోజులు, తర్వాత మూడురోజులకు కూడా సరిపడా పిండివంటలు చేసిపెట్టుకోండి. అవి ఉన్నన్నాళ్లూ పండగలానే ఉంటుంది! ఐడియా బాగుందా?
పాకం గారెలు
కావలసినవి: మినప్పప్పు - కప్పు; ఉప్పు - కొద్దిగా (గారెలు తియ్యగా ఉండాలి కాబట్టి ఉప్పు ఎక్కువ వాడకూడదు); బెల్లం పొడి - కప్పు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత
తయారీ: మినప్పప్పును సుమారు నాలుగు గంటలు నానబెట్టి నీళ్లు వడకట్టి, గారెల పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకుని ఉప్పు కలిపి పక్కన ఉంచాలి వేరే పాత్రలో కొద్దిగా నీరు మరిగించి అందులో బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి కలిపి, తీగ పాకం వచ్చేవరకు ఉడికించి, దించేసి, పక్కన ఉంచాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మినప్పిండిని కొద్దిగా తీసుకుని, అర చేతిలో గారెల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి తీసి బెల్లం పాకంలో వేసి సుమారు ఐదునిమిషాల తరవాత తీసి వేడివేడిగా అందించాలి.
మురుకులు
కావలసినవి: బియ్యం - 4 కప్పులు; మినప్పప్పు - అర కప్పు; నువ్వులు - 25 గ్రా.; జీలకర్ర - 25 గ్రా.; ఇంగువ - 2 టేబుల్ స్పూన్లు; బటర్ - 100 గ్రా.; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత
తయారీ: బియ్యం శుభ్రంగా కడిగి నీళ్లు తీసేసి పొడి వస్త్రం మీద ఆరబోసి, తడి పూర్తిగా పోయాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చేయాలి మినప్పప్పును దోరగా వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చే యాలి ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, మినప్పిండి, నువ్వులు, జీలకర్ర, ఇంగువ, బటర్, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి జంతికల పిండిలా కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పిండి మిశ్రమాన్ని మురుకుల అచ్చులో వేసి జంతిక మాదిరిగా నూనెలో తిప్పాలి రెండు వైపులా దోరగా వేయించి తీసేయాలి
చల్లారాక గాలి చొరని డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా పాడవ్వవు.
తంబిట్టు ఉండె
కావలసినవి: బియ్యం - కప్పు; వేయించిన సెనగపప్పు (పుట్నాలపప్పు) - అర కప్పు; పల్లీలు -
అర కప్పు; బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు; ఎండు కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పులు;
నువ్వులు - టేబుల్ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను తయారీ బాణలిలో నూనె లేకుండా బియ్యం, పల్లీలు, నువ్వులను విడివిడిగా వేయించి తీసి పక్కన ఉంచాలి పల్లీల మీద పొట్టు తీసేసి మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టాలి మిక్సీలో... వేయించిన సెనగపప్పు, వేయించిన బియ్యం వేసి మెత్తగా పొడి చేయాలి మందపాటి పాత్రలో తగినన్ని నీళ్లు, బెల్లం వేసి స్టౌ మీద ఉంచి బెల్లం
కరిగేవరకు మరిగించాలి బియ్యప్పిండి, కొబ్బరి తురుము, నువ్వులు, పల్లీ పొడి వేసి బాగా కలపాలి నెయ్యి జత చేసి మరోమారు కలిపి మిశ్రమం బాగా ఉడికిందనిపించాక దించేయాలి కొద్దిగా చల్లారాక ఉండలు కట్టి, గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఇవి సుమారు 15 రోజులు నిల్వ ఉంటాయి.