![New Delhi: Mosquito Coil Trigger Fire In House 6 Of Died In Family - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/31/Untitled-2.jpg.webp?itok=lw6D8qWm)
న్యూఢిల్లీ: ఏ నిమిషానికి ఏం జరుగుతుందని ఎవరు కూడా ఊహించలేరు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలని మస్కిటో కాయిల్ పెట్టుకున్న ఓ కుటుంబం.. చివరికి ప్రమాదవశాత్తు శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఆ కుటుంబంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం మరింత విచారకరం. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఓ కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కుటుంబంలోని ఒకరు ఎప్పటిమాదిరిగానే గురువారం రాత్రి కూడా దోమలను నివారణకు మస్కిటో కాయిల్ అంటించి పడుకున్నారు. రాత్రి సమయం, పైగా దోమల బెడద కారణంగా ఆ ఇంటి కిటీకీలు, తలుపులు అన్నీ మూసివేసి నిద్రపోయారు.
అర్థరాత్రి సమయంలో అంటించిన మస్కిటో కాయిల్ ప్రమాదవశాత్తు పరుపుపై పడి మెల్లగా అంటుకుంది. ఈ క్రమంలో కుటుంబం నిద్రపోతున్న గది మొత్తం పొగ అలుముకుంది. ఈ పరిస్థితిని కుటుంబ సభ్యులు గమనించారు. అయితే అప్పటికే విషపూరిత వాయువులు గది మొత్తంగా వ్యాపించి ఉండడంతో బయటపడేందుకు ప్రయత్నిస్తుండగానే వారు స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో కొందరు ఊపిరాడక చనిపోయారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ఇంట్లోని తొమ్మిది మందిని జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఓ మహిళ, ఏడాదిన్నర చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. కాగా, 15 ఏళ్ల బాలికతో సహా మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరో 22 ఏళ్ల వ్యక్తి ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment