Dr. Vyjayanthi
-
మేలుకొలుపు
రొటీన్ కథలకు భిన్నంగా సామాజిక అంశాలనే చిత్రాలుగా మలిచాడు ఎ.బద్రి. తీసింది షార్ట్ ఫిల్ములే అయినా... చెప్పదలుచుకుంది సూటిగా, సుత్తి లేకుండా చెప్పి ఆలోచింపజేశాడు. ఆ చిత్రాలను మనమూ ‘షార్ట్’గా చూసేద్దాం రండి... ముందడుగు వేసి చూద్దాం ఓటు వేయరు గానీ... ప్రభుత్వ బాధ్యత గురించి గంటలు గంటలు చెప్పేస్తుంటారు చాలామంది. తమ కనీస బాధ్యతను విస్మరించి... పక్కవాడికి దాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. అలాంటిదే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా. ఓటు వేయడం దండగంటూ రూమ్ మేట్‌కు నూరిపోస్తుంటాడు ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి. ప్రధాన బాధ్యతైన ఓటు వేయకుండా దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తుంటాడు. ఇది సరైన పద్ధతి కాదనే విషయం చివరకు ఇద్దరు చిన్న పిల్లల సంభాషణల ద్వారా అతనికి అర్థమవుతుంది. ఆలోచనా ధోరణి మారుతుంది. ఈ కథనాన్ని ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. అనుకున్న మెసేజ్‌ను జనాల్లోకి పాస్ చేయడంలో సఫలమయ్యాడనే చెప్పాలి. సిగ్గు లేదా..! గతుకుల రోడ్లు... కాయకష్టం చేస్తున్న బడి వయసు చిన్నారులు... ఫుట్‌పాత్‌పై దీనమైన బతుకులు... ఇంటి నుంచి కాలు పెడితే చాలు నిత్యం కనిపించే దృశ్యాలే ఇవి. సామాన్యుడిని అన్నీ కలచివేసేవే. ఇలా చూసి బాధపడితే ప్రయోజనం ఏముంటుంది! మనవల్ల కాదనుకుని వదిలేస్తే ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుంది! ఈ ప్రశ్నలన్నింటికీ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ పరిష్కారం చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. భద్రి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా... షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్న తన అభిరుచి కొనసాగిస్తున్నాడు. మూస కథలు, చిత్రాలకు భిన్నంగా సమాజానికి అంతో ఇంతో సందేశాన్నిస్తున్నాడు. - ఓ మధు ది లేట్ కమర్స్ పంక్చ్యువాలిటీ పాటించడాన్ని గిల్టీగా ఫీల్ అవుతారు నేటి స్టూడెంట్స్. పైగా కాలేజీకి లేట్‌గా వెళ్లడమంటే అదో పెద్ద క్రెడిట్ వాళ్లకి. చేతిలో బుక్స్ లేకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ, లేట్‌గా వచ్చి క్లాస్‌లోకి పర్మిషన్ అడిగి, లెక్చరర్ని ఏదో ఒకటి అనడం బాగా అలవాటయిపోయిన విద్యార్థులపై సెటైరికల్‌గా ఈ లఘుచిత్రాన్ని రూపొందించాడు శ్రవణ్ కొత్త. ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అడుగు పెట్టిన లెక్చరర్‌కి ఎదురైన చేదు అనుభవాన్ని కథగా మలుచుకుని తీశాడు ఈ షార్ట్ ఫిల్మ్. ఆలస్యంగా వచ్చిన ప్రతి విద్యార్థీ ఏదో ఒక సాకు చెప్పి లోపలకు వచ్చి కూర్చుంటాడు. చివరికి అందరూ క్లాస్‌కి వచ్చేసరికి పీరియడ్ అయిపోతుంది. కథనం... డైలాగ్స్ బాగున్నాయి. ‘బీయింగ్ లేట్ టు క్లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ నాలెడ్జ్’ అనే మెసేజ్‌తో చిత్రం ముగుస్తుంది. బిగ్స్క్రీన్పై మక్కువ ఉన్నా అవకాశాలు దొరక్క పోవడంతో తనలోని క్రియేటర్‌ను ఇలా షార్ట్ ఫిల్మ్స్‌తో సంతృప్తి పరుస్తున్నాడు శ్రవణ్. ప్రస్తుతం నగరంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. - డా. వైజయంతి ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యూత్‌లో యమ క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com -
నవభోజనాలు
మామిడికాయ పప్పు, కందబచ్చలి కూర, ముక్కల పులుసు... మాటల్లేవ్! బూరెలు, బొబ్బట్లు, సేమ్యా పాయసం, జాంగ్రీ, జిలేబీ... మాట్లాడుకోవడాల్లేవ్! మసాలా వడలు, ఆవడలు, గారెలు, వగైరాలు... లేవడాల్లేవ్! చెయ్యి కడగడాల్లేవ్! వనభోజనాల్లోని మజానే ఇది. మాయే ఇది. మంత్రమే ఇది! కబుర్లు చెప్పుకుంటూ కానిద్దాం... అనుకుంటాం. మూతలు తెరుచుకోగానే కమ్మటి మత్తులో పడిపోతాం. ఆ మత్తుకు కాస్త కొత్తను జోడించి, మీ భుక్తాయాసానికి జోల పాట పాడించేందుకు 'నవ' భోజనాలను చేసుకొచ్చింది ఫ్యామిలీ. ఆరగించండి, ఈ కార్తిక వనభోజనాలను ఆస్వాదించండి. ఖండ్వీ కావలసినవి: సెనగపిండి : కప్పు; పెరుగు : 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు : తగినంత; పసుపు : టీ స్పూను; కారం : టీ స్పూను; ఇంగువ : చిటికెడు; నూనె : కొద్దిగా పోపు కోసం: నూనె : 2 టీ స్పూన్లు; ఆవాలు : టీ స్పూను; నువ్వు పప్పు : 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు : టీ స్పూను; కొత్తిమీర : చిన్న కట్ట; కారం : కొద్దిగా (పైన చల్లడానికి) తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, పెరుగు, ఉప్పు, పసుపు, ఇంగువ, కారం వేసి బాగా కలిపి, మూడు కప్పుల నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ పిండి కలిపి, స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతూ, పిండి చిక్కబడ్డాక దించేయాలి ఒక ప్లేట్‌కి వెనుక వైపు కొద్దిగా నూనె పూసి, పిండి మిశ్రమాన్ని కొద్దిగా మందంగా ఉండేలా పరిచి పది నిమిషాలు చల్లారనిచ్చాక, చపాతీ చుట్టినట్టుగా చుట్టి, చాకుతో ముక్కలుగా కట్ చేస్తే, ఖండ్వీ సిద్ధమైనట్లే చిన్న బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, నువ్వు పప్పు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని తయారుచేసి ఉంచుకున్న ఖండ్వీల మీద వేసి, కారం, కొత్తిమీరలతో అలంకరించి వేడివేడిగా అందించాలి. క్యాప్సికమ్ బజ్జీ కావలసినవి: క్యాప్సికమ్ : 15 (చిన్నవి); సెనగ పిండి : కప్పు; ఉప్పు : తగినంత; నీళ్లు : తగినన్ని; నూనె : డీప్ ఫ్రైకి సరిపడా ఫిల్లింగ్ కోసం: బంగాళ దుంపలు :పావు కిలో (ఉడికించి తొక్క తీసి, మెత్తగా చేయాలి); ఉప్పు : తగినంత; కారం : టీ స్పూను; ఆమ్చూర్ పొడి : 2 టీ స్పూన్లు; ధనియాల పొడి : 2 టీ స్పూన్లు; ఇంగువ : పావు టీ స్పూను; సోంపు : 2 టీస్పూన్లు; పచ్చి మిర్చి : 4 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) ఫిల్లింగ్ కోసం: ఒక పాత్రలో బంగాళదుంపల ముద్ద, ఉప్పు, కారం, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, ఇంగువ, సోంపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలపాలి. బజ్జీ కోసం: ఒక పాత్రలో సెనగ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి బజ్జీల పిండిలా కలిపి పక్కన ఉంచాలి కాప్సికమ్‌ను ఒకవైపు కొద్దిగా కట్‌చేసి గింజలు తీసేసి, బంగాళదుంపల మిశ్రమం క్యాప్సికమ్‌లో స్టఫ్ చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక, ఒక్కో క్యాప్సికమ్‌ను సెనగ పిండిలో ముంచి బజ్జీల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి, వేడివేడిగా అందించాలి. దాల్ కా పరాఠా కావలసినవి : గోధుమపిండి : కప్పు; ఉప్పు : కొద్దిగా; నూనె : 2 టీ స్పూన్లు; ఫిల్లింగ్ కోసం...: పెసలు : అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి); నూనె : 2 టీ స్పూన్లు; జీలకర్ర : అర టీ స్పూను; ఇంగువ : చిటికెడు; ఉప్పు : తగినంత; పసుపు : కొద్దిగా; కారం : అర టీ స్పూను; నెయ్యి :తగినంత తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి చపాతీపిండిలా కలిపి, కొద్దిగా నూనె జత చేసి బాగా కలిపి, పక్కన ఉంచాలి పెసలు శుభ్రంగా కడిగి ఆ నీళ్లు తీసేసి, కప్పుడు నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేగాక, ఉడికించిన పెసలు, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి, నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచి దించి, చల్లారాక, చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి చపాతీపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ ఒత్తి, మధ్యలో పెసరపిండి మిశ్రమం ఉంచి అన్నివైపులా మూసేసి, పరాఠాలా ఒత్తాలి స్టౌ మీద పెనం ఉంచి కాగాక కొద్దిగా నెయ్యి వేసి, కరిగాక ఒత్తి ఉంచుకున్న పరాఠా వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు రెండువైపులా కాల్చి తీసేయాలి. మొహంతాల్ కావలసినవి: సెనగ పిండి : పావు కేజీ; నెయ్యి : టేబుల్ స్పూను; పాలు : 3 టేబుల్ స్పూన్లు; ఈ మూడు పదార్థాలను ఒక గిన్నెలో వేసి గట్టిగా అయ్యేలా కలపాలి); పచ్చి కోవా : 50 గ్రా.; పంచదార : 200 గ్రా.; నీళ్లు : అర కప్పు; ఏలకుల పొడి : అర టీ స్పూను; నెయ్యి : 150 గ్రా.; బాదం పప్పులు, పిస్తా పప్పులు : అలంకరించడానికి తగినన్ని. తయారీ: ఒక పాత్రలో పంచదార, అర కప్పు నీళ్లు వేసి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి పంచదార బాగా కరిగి, ఉండ పాకం వచ్చాక, పచ్చి కోవా, నెయ్యి వేసి బాగా కలపాలి వేరొక బాణలిలో టీ స్పూను నెయ్యి వేసి కరిగాక సెనగ పిండి మిశ్రమం వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాక, ఏలకుల పొడి జత చేసి, ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పంచదార పాకం మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ కలిపి, కొద్దిసేపు ఉంచి దించేయాలి ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి, ఉడికించిన మిశ్రమం వేసి పల్చగా పరిచి, బాదంపప్పులు, పిస్తా పప్పులతో అలంకరించాలి. గట్టిపడుతుండగా ముక్కలుగా కట్ చేయాలి. డ్రైఫ్రూట్స్ రైస్ కావలసినవి బాస్మతి బియ్యం : ఒకటిన్నర కప్పులు; బటర్ : 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు : అర కప్పు; జీలకర్ర : అరటీ స్పూను; పసుపు : అర టీ స్పూను; దాల్చినచెక్క పొడి : పావు టీస్పూను; వెల్లుల్లి రేకలు : 2; నీళ్లు : రెండుంపావు కప్పులు; ఉప్పు : తగినంత; మిరియాల పొడి : పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ : కప్పు (బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, పిస్తా పప్పులు, ఆప్రికాట్... వంటివి) తయారీ బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు నానబెట్టి, నీళ్లు వంపేసి, తడి పోయేవరకు సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి బాణలిలో బటర్ వేసి కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి బియ్యం జత చేసి, కలియబెట్టాలి నీళ్లలో ఉప్పు వేసి మరిగించి ఇందులో పోసి, మంట తగ్గించి, మూత ఉంచి, సుమారు పది నిమిషాలు ఉడికించాలి మరొక బాణలిలో బటర్ వేసి కరిగించి, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, దాల్చిన చెక్క పొడి, పసుపు, మిరియాల పొడి వేసి వేయించి, ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించి, అన్నంలో వేసి కలిపి వేడివేడిగా వడ్డించాలి. దమ్ ఆలూ లఖ్నవీ కావలసినవి: బంగాళ దుంపలు : పావు కేజీ (ఉడికించి తొక్క తీసి మెత్తగా చేయాలి); పనీర్ తురుము : 100 గ్రా; కారం : టీ స్పూను; ఉప్పు : తగినంత; గరం మసాలా : టీ స్పూను; కసూరీ మేథీ : ఒకటిన్నర టీ స్పూను; నెయ్యి : 3 టేబుల్ స్పూన్లు; బటర్ : టేబుల్ స్పూను; క్రీమ్ : టేబుల్ స్పూను ఉల్లిపాయ గ్రేవీ కోసం: ఉల్లిపాయలు :200 గ్రా. (మిక్సీలో వేసి ముద్ద చేయాలి) గరం మసాలా :అర టీ స్పూను; ఉప్పు : తగినంత; నెయ్యి : టీ స్పూను టొమాటో గ్రేవీ కోసం: టొమాటో ప్యూరీ : 200 గ్రా; నెయ్యి : టీ స్పూను; ఉప్పు :తగినంత ఉల్లిపాయ గ్రేవీ తయారీ: బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక, ఉల్లిపాయ ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. టొమాటో గ్రేవీ తయారీ: మరొక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక టొమాటో ప్యూరీ వేసి చిక్కబడే వరకు వేయించాక, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి. దమ్ ఆలూ తయారీ: బంగాళదుంపల తొక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక, బంగాళదుంప ముక్కలను వేసి కరక రలాడేలా వేయించి, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దించి చల్లార్చాలి ఒక పాత్రలో ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళ దుంప ముద్ద, పనీర్ తురుము వేసి కలిపి పక్కన ఉంచాలి. చివరగా... ఒక బాణలిలో నూనె వేసి కాగాక, టొమాటో గ్రేవీ, ఉల్లిపాయ గ్రేవీ మిశ్రమాలు వేసి నూనె బాగా పైకి తేలే వరకు వేయించాలి గరం మసాలా, కారం, కసూరీ మేథీ వేసి కలిపి, రెండు నిమిషాలు ఉడికించాలి బటర్, క్రీమ్ వేసి బాగా కలపాలి చివరగా బంగాళదుంప ముక్కలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. వనభోజనాలకు వెళ్లేటప్పుడు వెంట ఉంచుకోవలసినవి... అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆ ప్రదేశంలో పెద్దవాళ్లు, పిల్లలు విడివిడిగా ఆడుకోవడానికి అనువైన ఆట వస్తువులు... కూర్చోవడానికి అనువుగా దుప్పట్లు / చాపలు... మ్యూజిక్ సిస్టమ్, కెమెరా ఇవే కాకుండా మీకు ఇంకా ఏవైనా ఉంటే బాగుంటుందనుకుంటే ముందుగానే ఒక కాగితం మీద రాసి ఉంచుకోండి. బయలుదేరే ముందు ఒకసారి ఆ కాగితం చూస్తే చాలు మీరు అనుకున్నవన్నీ మీ వెంట తీసుకువెళ్లగలుగుతారు. సేకరణ: డా. వైజయంతి -
పర్యాటక ఆహారం
ప్రపంచంలో... రకరకాల మనుషులు... రకరకాల మనస్తత్వాలు... రకరకాల ప్రదేశాలు... రకరకాల వాతావరణాలు... అవే కూరలకు ఒక్కో చోట ఒక్కో పేరు... ఒక్కో చోట ఒక్కో రకమైన వంట... ఊరు పేరు మారినా... రంగు, రుచి మారినా... అందరి లక్ష్యం... వండి తినడమే... ఆహారాన్ని ఆస్వాదించడమే! నేడు ప్రపంచ పర్యాటక దినం... ఈ సందర్భంగా ప్రపంచ దేశాలలో దొరికే పలురకాల వంటలు... మీరూ ప్రయత్నించండి.... కాదేదేశమూ రుచికి అనర్హం అనుకోండి... చైనా - కుంగ్ పావో చికెన్ కావలసినవి: స్కిన్లెస్, బోన్‌లెస్ చికెన్ - కప్పు (ముక్కలు చేయాలి); సాయ్ సాస్ - 2 టేబుల్ స్పూన్లు; నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు (2 టేబుల్ స్పూన్ల నీళ్లలో కలపాలి); ఎండు మిర్చి ముద్ద - టేబుల్ స్పూను; వైట్ వెనిగర్ - టీ స్పూను; బ్రౌన్ సుగర్ - 2 టీ స్పూన్లు; ఉల్లికాడల తరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూను; వాటర్ చెస్ట్‌నట్స్- 2 టేబుల్ స్పూన్లు; పల్లీ తురుము- టేబుల్ స్పూను. తయారీ: ఊరబెట్టడానికి: ఒక పాత్రలో టేబుల్ స్పూను సాయ్ సాస్, టేబుల్ స్పూను నూనె, టేబుల్ స్పూను నీళ్లలో కలిపిన కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి, అందులో చికెన్ ముక్కలు వేసి సుమారు గంటసేపు ఊరనిచ్చాక, కింద నుంచి పైకి బాగా కలిపి, మూత పెట్టి ఫ్రిజ్‌లో అర గంటసేపు ఉంచాలి సాస్ తయారీ: చిన్న పాత్రలో టేబుల్ స్పూన్ సాయ్ సాస్, టేబుల్ స్పూను నూనె, టేబుల్ స్పూను కార్న్‌ఫ్లోర్ కలిపిన నీళ్లు, ఎండు మిర్చి ముద్ద, వెనిగర్, పంచదార వేసి బాగా కలిపి ఉల్లికాడల తరుగు, వెల్లుల్లి తరుగు, నీళ్లు, చెస్ట్‌నట్స్ తురుము, పల్లీల తురుము వేసి బాగా కలిపి, బాణలిలో వేసి స్టౌ మీద ఉంచి చిక్కగా అయ్యేవరకు కలుపుతుండాలి ఫ్రిజ్‌లో నుంచి చికెన్ మిశ్రమం తీసి, వేరే పాన్‌లో వేసి స్టౌ మీద ఉంచి, చికెన్ తెల్లగా మారేవరకు బాగా కలిపి, సాస్ తయారవుతున్న పాత్రలో వేసి కలపాలి అన్ని పదార్థాలు ఉడికి, కూర బాగా దగ్గర పడ్డాక దించేయాలి. ఎగ్‌లెస్ మార్బుల్ కేక్ కావలసినవి: బటర్ - 150 గ్రా; మెత్తగా చేసిన పంచదార పొడి - 150 గ్రా; పాలు - ముప్పావు కప్పు; వెనిగర్ - 3 టీ స్పూన్లు; మైదా పిండి - 150 గ్రా; వెనిలా ఎసెన్స్ - టీ స్పూను; కోకో పొడి - టేబుల్ స్పూను; బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీ స్పూను; ఐసింగ్ కోసం... బటర్ - 50 గ్రా; ఐసింగ్ సుగర్ - 100 గ్రా; కరిగించిన చాకొలేట్ - 50 గ్రా.; కోకో - 2 టీ స్పూన్లు; అలంకరించడానికి స్వీట్లు - తగినన్ని. తయారీ: ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి గిలక్కొట్టాలి పాలు, వెనిగర్ జత చేసి మరోమారు గిలక్కొట్టి, మిశ్రమాన్ని రెండు భాగాలు చేయాలి (టేబుల్ స్పూను మిశ్రమాన్ని పక్కన ఉంచాలి) ఒక సగంలో టేబుల్ స్పూను మైదా పిండి, ఒక సగంలో కోకో వేయాలి కేక్ ప్లేట్లో ఈ మిశ్రమాలను ఒక దాని మీద ఒకటి ఉంచాలి 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఈ ట్రే ఉంచి, సుమారు 25 నిమిషాలు బేక్ చేసి, బయటకు తీసి చల్లారనివ్వాలి ఐసింగ్ కోసం ఇచ్చిన పదార్థాలను బాగా గిలక్కొట్టి, కేక్ మీద వేయాలి పండ్ల ముక్కలతో అలంకరించాలి. మొఘలాయీ బిర్యానీ బాద్షాహీ కావలసినవి: మటన్ - అర కేజీ; బాస్మతి బియ్యం - పావు కేజీ; నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు - 10; బటర్ - కప్పు; కొత్తిమీర - కొద్దిగా; జీలకర్ర - అర టేబుల్ స్పూను; ఉల్లి తరుగు - అర కప్పు; ఏలకులు - 2; నూనె - టేబుల్ స్పూను; వెల్లుల్లి రేకలు - 2; అల్లం ముక్క - చిన్నది; కుంకుమ పువ్వు - అర టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు - అర టేబుల్ స్పూను; కారం - అర టేబుల్ స్పూను; దాల్చిన చెక్క - చిన్న ముక్క; పెరుగు - అర కేజీ; పాలు - 125 మి.లీ; నీళ్లు - 3 కప్పులు తయారీ: బియ్యం కడిగి నానబెట్టాలి బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి ముద్ద చేయాలి బాణలిలో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి నీళ్లు పోసి బాగా ఉడికించాలి. (సుమారు ఒక కప్పు గ్రేవీ ఉండేవరకు ఉడికించాలి) ఒక పెద్ద పాత్రలో నీళ్లలో ఉప్పు, బియ్యం వేసి ఉడికించాలి పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి ఉన్న నీరంతా పోయేలా పిండేయాలి లవంగాలు, ఏలకులు, జీలకర్ర, పుదీనా, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర పెరుగులో వేసి కలపాలి కుంకుమ పువ్వు నీరు, నిమ్మరసం రెండింటినీ మటన్‌లో వేసి కలపాలి సగం అన్నాన్ని మటన్ మీద వేసి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసి మళ్లీ పైన అన్నం వేయాలి పాలు, కొద్దిగా పెరుగు వేసి మూత ఉంచాలి సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి వేడివేడిగా వడ్డించాలి. సేకరణ: డా. వైజయంతి -
శిలలపై శిల్పాలు చెక్కు... నారీ
ఆళ్లగడ్డ... కర్నూలు జిల్లాలోని ఆ ఊరి పేరు చెప్పగానే... రాజకీయ నాయకులకు ఒక రకమైన... సామాజిక పరిశీలకులకు మరో రకమైన అంశాలు గుర్తుకు రావచ్చు. అయితే...చాలామందికి తెలియనిది ఏమిటంటే... అక్కడ కొన్ని వందల కుటుంబాలు... శిలలను శిల్పాలుగా మార్చే వృత్తిలో జీవిస్తున్నాయని! శతాబ్దాలుగా కొన్ని కుటుంబాలు ఈ వృత్తికే అంకితమయ్యాయని!! అంతేకాదు... ఈ ఊళ్లో ఓ అరుదైన మహిళా శిల్పి కూడా ఉన్నారు... శిల్పకళా రంగంలో మహిళలు చాలా అరుదుగా ఉంటారు... చదువుకున్న మహిళలైతే మరీ తక్కువ... కలం పడతారే కాని ఉలి పట్టరు... కానీ, అందుకు భిన్నంగా ఇరవై రెండేళ్ళ భువనేశ్వరి కలం పట్టి చదువుకున్నారు... ఇప్పుడు ఉలి పట్టి శిల్పకళను అభ్యసిస్తున్నారు... ఆళ్లగడ్డకు చెందిన భువనేశ్వరి శిల్పిగా ఎందుకు మారారు? ఎలా మారారు? దాని వెనుక చాలా కథే ఉంది. అందరు ఆడపిల్లల లాగానే భువనేశ్వరి డిగ్రీ పూర్తి చేశారు. వివాహం, సంతానం... వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే ఆమె జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. 2013లో భర్త ఆమెను విడిచి వెళ్లిపోయాడు. అప్పటికి భువనేశ్వరికి ఒక బాబు. చంటిపిల్లవాడితో తండ్రి పంచన చేరారు భువనేశ్వరి. తండ్రికి భారంగా మారకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకున్నారు. వారి వంశంలో తరతరాలుగా వస్తున్న శిల్పాల వృత్తిని ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. బిఈడి పూర్తిచేసినా టీచరుగా చేరకుండా స్వయంగా శిల్పాలు చెక్కడం నేర్చుకోవడం ప్రారంభించారు భువనేశ్వరి. ఇందుకు కారణం... ఇటీవలే ‘లా' ఎంట్రన్స్ ప్యాసైన భువనేశ్వరి, తనలాగ ఎవరైనా స్త్రీలు బాధపడుతుంటే వారికి సహాయపడాలనుకుంటున్నారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకరోజు నాన్న నాతో ‘శిల్పాలు చేసే వాళ్లు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు’ అని చెప్పారు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. ఎవరో వచ్చి శిల్పాలు కొంటారని ఎదురు చూసేకన్నా, మనమే వినియోగదారులకు దగ్గరయ్యేలాగ ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని! ఆ ఆలోచనకు వెంటనే కార్యరూపం ఇచ్చేశాను! మొదటినుంచీ నాకు ఇంటర్నెట్లో సొంతంగా పెట్టే బ్లాగులు, ఫేస్బుక్, యూ ట్యూబ్ వంటివి ఉపయోగించడం అలవాటే. దాంతో ముందుగా నా సొంత బ్లాగ్ ప్రారంభించాను. దానికి స్పందన బాగానే వచ్చింది’’ అంటారు భువనేశ్వరి ఫేస్‌బుక్‌తో మారిన ఫేట్... ఫేస్బుక్లో రకరకాల వస్తువులను అమ్మకానికి ఉంచడం గమనించిన భువనేశ్వరి, తాను కూడా శిల్పాలను సులువుగా అమ్మడానికి ఆ మార్గం ఎంచుకుంటే బావుంటుందనుకుని, తమ వద్ద తయారైన శిల్పాల ఫొటోలను ఫేస్బుక్లో ఉంచడం ప్రారంభించారు. మెల్లగా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ‘‘వినియోగదారుల అభిరుచి మేరకు ఫేస్బుక్లో ఆర్డర్లు తీసుకుని, వాటికి తగ్గట్టుగా శిల్పాలు తయారు చేయడం కూడా ప్రారంభించాను’’ అంటారు భువనేశ్వరి. నా జీవితంలో మరచిపోలేను..! ఆమె సాధించిన విజయం అంత తేలికగా సాధ్యం కాలేదు. ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడిన తర్వాతే ఆర్డర్లు రావడం ఆరంభమైంది. ‘‘కిందటి సంవత్సరం ఒక విదేశీ వనిత ... ఆరడుగుల బుద్ధుడి విగ్రహం, డైనింగ్ టేబుల్ సెట్, రెండు నీటితొట్లు, బఫే టేబుల్ ఫేస్బుక్ ద్వారా ఆర్డరిచ్చారు. అదే నేను అందుకున్న మొదటి ఆర్డరు, తొలి సంపాదన కూడా! ఇటీవల ఆమె ఇండియాకు వచ్చినప్పుడు నన్ను చూడాలని సరాసరి మా ఇంటికి వచ్చారు. అది నిజంగా నా జీవితంలో మరచిపోలేని సంఘటన’’ అని ఎంతో సంబరంగా వివరించారు భువనేశ్వరి. అలాగే హైదరాబాద్ నివాసి సిద్ధలక్ష్మి, భువనేశ్వరి దగ్గర దేవుడి విగ్రహాలు కొనుగోలు చేశారు. అవి ఆవిడకు అమితంగా నచ్చడంతో పారితోషికంతో పాటు భువనేశ్వరికి చీర సారె పంపారు. అది తన జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చిన రోజని చెబుతున్న భువనేశ్వరి జీవితం కూడా కాలం చెక్కిన ఒక శిల్పం లాంటిదే! - డా. వైజయంతి శిల్పాల అమ్మకం ప్రారంభిస్తానని నాన్నతో అన్నాను. ఆయన సరే అన్నారు. కానీ శిల్పాల తయారీలో తోడ్పడే వర్కర్స్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టారు. ఒక ఆడమనిషి చెబితే మనం చేయటం ఏంటి అనుకున్నారు. కొందరైతే ముఖం మీదే అన్నారు. సరైన సమయం కోసం నిరీక్షించాను. ఫేస్బుక్లో మేం తయారు చేసిన శిల్పాల వివరాలు పెట్టాక, మెల్లగా ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అందరూ వచ్చి, ‘ఏదైనా పని ఉంటే చెప్పండి’ అంటున్నారు. - భువనేశ్వరి, విగ్రహ శిల్పి -
ఈ...ఈ...ఈ...
సరదాగా... అనగనగా ఒక ఈగ. ఆ ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయింది. ఒక సర్వర్ కుర్రాడు దాని దగ్గరకు వచ్చి పుండు మీద కారంలాగ, ‘నీ పేరేంటి’ అని ఎగతాళిగా అడిగాడు. ‘‘నా పేరు... నా పేరు... నా... పేరా... ఔను! నా పేరేంటి?’’ అని ఆ కొంటె కుర్రాడిని ఎదురు అడిగింది. ‘‘నీ పేరు నన్నడుగుతావేంటి?’’ అన్నాడు కోపంగా. ‘‘నువ్వు చెప్పేది నిజమే! నా పేరు గతంలో నీకు చెప్పి ఉంటాను కదా! మరి నువ్వెందుకు గుర్తు పెట్టుకోలేదు?’’ అని గడుసుగా అడిగింది ఆ జీవి. ఆ కుర్రాడు కాస్త సందిగ్ధంలో పడ్డాడు. కట్ చేస్తే... అసలు ఈగ తన పేరెందుకు మర్చిపోయిందో ఆ కుర్రాడినే అడిగింది. ‘‘నేను అడిగే దానికి కొంటెగా కాకుండా సరిగా సమాధానం చెప్పు. మేం ఏ మాసంలో కనిపిస్తాం?’’ అంది ఆ జీవి. ‘‘ఆషాఢంలో...’’ ‘‘ఆషాఢం వచ్చి...?’’ ‘‘పన్నెండు రోజులవుతోంది’’ ‘‘కదా! ఒకనాడు నిద్ర లేచి చూస్తే ఎండలు కనిపించాయి. అయితే మా సీజన్ రాలేదేమోననుకుని రెండో నిద్ర ప్రారంభించాను. పది రోజుల తర్వాత, ఏదో తడిగా తగిలితే, ఉలిక్కిపడి లేచాను. అమ్మో మా సీజన్ వచ్చిసిందనుకుంటూ, సంబరంగా రెక్కలు విదిల్చాను. ఈ హడావుడిలో పేరు మర్చిపోయాను. ఆ విషయం పక్కన ఉంచితే, నిన్నో ప్రశ్న అడుగుతాను, నీ నెల జీతం పదిహేను రోజులు ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుంది?’’ ‘‘అమ్మో! ఆ మాట అనకు. మా బాస్ విన్నాడంటే ఇంప్లిమెంట్ చేసేస్తాడు’’ - ఖంగారుగా అన్నాడు కుర్రాడు. ‘‘అడిగినందుకే అంత భయపడ్డావే. మరి మా జీతం పది రోజులు ఆలస్యమైంది! కడుపులో చీమలు, దోమలు (ఎలుకలు ఈగల కంటె పెద్దవి కదా) పరుగెత్తుతున్నాయి. మా జీతం ఇంకా రాలేదు!’’అంది ఆ బక్క జీవి. ‘‘నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు!’’ ‘‘నీకెలా అర్థం అవుతుంది. చెప్తాను విను. ఆషాఢం వచ్చిందంటే మేము ముసురుతామని తెలుసు కదా! మరి ఆషాఢం వచ్చి ఇన్ని రోజులైనా మాలో ఒక్కరైనా కనిపించారా మీకు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో!’’ ‘‘ఆ! ఇప్పుడు గుర్తు వచ్చింది నీ పేరు. నువ్వు ఈగవు కదూ!’’ అన్నాడు మెరిసే కళ్లతో ఆ కుర్రాడు. ‘‘అమ్మయ్య! ఇంత కథ చెప్పాక నా పేరు నాకు గుర్తు చేసినందుకు చాలా సంతోషం...’’ అనుకుంటూ ఈగ ఈల వేసుకుంటూ వానగాలిలోకి ప్రవేశించింది... - డా.వైజయంతి -
భారతదేశం గురించి పది వాస్తవాలు
భారతదేశంలో ఏ అంశాన్ని పరిశీలించినా సాధారణంగా ఒకేలా, సర్వసాధారణంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. వేరుగా, భిన్నంగా అనిపించడం చాలా అరుదు. ఈ దేశంలో భిన్నప్రాంతాలు, భిన్న సంస్కృతుల మేళవింపు, భిన్న భాషలు, వృత్తులు, మాండలికాలు వంటివి కనిపిస్తాయి. ఇటువంటివి సాధారణంగా ఖండాలలో కనిపిస్తాయి. కాని ఒక దేశంలో ఇంతటి భిన్నత్వం కనిపించడం చాలా అరుదు. బిబిసి ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేసిన శామ్ మిల్లర్, తన జీవితంలో సగభాగం భారతదేశంలోనే గడిపారు. ఆయన భారతదేశం గురించి పది వాస్తవాలు తన అనుభవంతో వివరించారు. * అధికజనాభా... ఫొటో (2060 నాటికి భారతదేశ జనాభా ఊహించనంతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు) 2028 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను మించుతుందని అంచనా. రానున్న 14 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానం ఆక్రమిస్తుందని ఐక్యరాజ్యసమితిచెబుతోంది. అంటే సుమారు 1.4 బిలియన్ల మంది ఉంటారని ఊహిస్తున్నారు. అధిక జనాభాగా గుర్తింపు పొందడం ఒక విజయమే అయినప్పటికీ, శత్రు దేశమైన చైనా మిగిలిన విషయాలలో అభివృద్ధి చెందుతోంది. జనాభాను నియంత్రించడంలో భారతదేశం ఇంకా వెనుకబడే ఉంది. 1970 ప్రాంతంలో... కుటుంబ నియంత్రణ అమలు జరిపిన సమయంలో, కొన్నికొన్ని చోట్ల అది వివాదాస్పదంగాను, ఉత్పత్తి నిరోధకంగాను భావించి నిరోధించారు. అయితే స్త్రీ విద్య వల్ల జనాభా పెరుగుదల బాగా తగ్గింది. 2060 నాటికి భారతదేశ జనాభా 1.6 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం నైజీరియా, చైనాను అధిగమించి, జనాభా విషయంలో ద్వితీయస్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. * భారతదేశం ఒకప్పుడు ద్వీపం... (ప్రపంచంలోకెల్లా హిమాలయాలు వయసులో అతి చిన్నవి) భారతదేశం ఒకప్పుడు ఖండం. 100 మిలియన్ల సంవత్సరాల క్రితం డైనసార్లు భూమి మీద సంచరిస్తున్న కాలంలో భారతదేశం ఒక ద్వీపంలా ఉండేదట. ప్రాచీనలిపి ఆధారంగా గోండ్వానాల్యాండ్ (గోండ్వానా అనే వ్యక్తి కారణంగా ఆ పేరు వచ్చింది. ఇది మధ్య భారతదేశంలో ఉన్న అటవీప్రాంతం) నెమ్మదిగా ఉత్తరదిక్కుగా ప్రయాణించిందని తెలుస్తోంది. 50 మిలియన్ల సంవత్సరాల క్రితం, డైనసార్లు... తీరప్రాంతం నుండి ఉత్తరదిక్కుగా ప్రయాణించిన కారణంగా అక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయని, అందువల్ల అవి ప్రపంచంలోనే అతి చిన్నవయసుగల పర్వతశ్రేణులని, ఎత్తులో మాత్రం పెద్దవని తెలుస్తోంది. సముద్రాలలోని శిలాజాల ఆధారంగా హిమాలయాల వయసును లెక్కకట్టారు. * బహుభాషలు... భారతదేశం విభిన్న భాషల సమాహారం. సుమారు 1000 భాషలు ఇక్కడ మాట్లాడతారు. అయితే ఒక భాషను మొదటిదని, మరో భాష చివరిదని మాత్రం చెప్పలేం. 1961 లెక్కల ప్రకారం, భారతదేశంలో 1652 భాషలు (ఇందులో చాలావరకు మాండలికాలు ఉన్నప్పటికీ) ఉన్నాయి. కాలక్రమేణా కొన్ని భాషలు పూర్తిగా కాలగర్భంలో కలసిపోయాయి. అతి ఎక్కువగా మాట్లాడే భాషలైన హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ వంటి ఆరు భాషలలో ప్రతి భాషను 50 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు. 122 భాషలను 10,000 మంది కంటె ఎక్కువమంది మాట్లాడుతున్నారు. భారతదేశానికి జాతీయ భాష లేదు. హిందీ, ఇంగ్లీషు... రెండు భాషలూ అధికార భాషలే. హిందీ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా తమిళులు హిందీ భాష విషయంలో తమ వ్యతిరేకతను తెలియచేస్తున్నారు. అందువల్ల ఇంగ్లీషు అధికారభాషగా నిలబడిపోయింది. భారతీయ భాషలు ప్రపంచంలోని నాలుగు భాషా కుటుంబాలకు చెంది ఉన్నాయి. ఇండో యూరోపియన్, ద్రవిడియన్, ఆస్ట్రో ఆసియాటిక్, టిబెటో బర్మన్. 20 శతాబ్దపు మధ్యభాగం వరకు ఆఫ్రికాలో పుట్టిన బంటు భాషా కుటుంబం, తూర్పు ఆఫ్రికా నుంచి వలస వచ్చినవారు, పశ్చిమభారతదేశంలో నివసించేవారు ఉపయోగించే సిది భాష మాట్లాడేవారికి ప్రాతినిథ్యం వహించింది. కాలక్రమేణా ఆ భాష ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయింది. సిది జాతివారు బంటూ పదాలను కొద్దికొద్దిగా ఉపయోగిస్తున్నారు. * మెగా సిటీస్ (నగరాలలోని స్లమ్స్‌లో నీరు దొరకటం దుర్భరం) ప్రపంచంలోని పది మహానగరాలలో మూడు భారతదేశంలోనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న అతి పెద్దనగరాలలో ఢిల్లీ రెండవది, ముంబై ఏడవది, కలకత్తాది పదవస్థానం. ఢిల్లీ జనాభా 22.65 మిలియన్లు. అంటే టోక్యోను అధిగమించినట్లు. 17 వ శతాబ్దంలో ఢిల్లీ ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా కలిగిన నగరం. కాని 1960 నాటికి, ఢిల్లీ కనీసం 30 వ స్థానంలో కూడా లేదు. నాటి నుంచి ఈ నగర పెరుగుదల ఏడాదికి కేవలం 4 శాతం మాత్రమే. ఆ పెరుగుదల రానురాను తగ్గుతున్నప్పటికీ ఇప్పటికి ఆ పెరుగుదల 3 శాతానికి పడిపోయింది. అంటే యేటా జనాభా రేటు పెరుగుతున్నప్పటికీ, శిశుజననాలు, వలసలు 700000కి పెరిగి, భారత రాజధాని మీద వనరుల కోసం ఒత్తిడి పెరిగింది. నీరు ప్రధాన సమస్యగా పరిణమించింది. నగరంలో నాలుగోవంతు భాగంలో ప్రతిరోజూ నీటి సరఫరా ఉండదు. భారతదేశంలోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణె, సూరత్... ఈ నగరాలు అత్యధిక జనాభా ఉన్న 100 నగరాలలో నిలబడ్డాయి. * ఓటర్లు (417,037,606) (ఓటర్ల చేతి వేలి మీద ఇంకు మార్కు వేసి, ఒక వ్యక్తి ఒకే ఓటు అని సూచిస్తున్నారు) ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. (చైనీయులు వారి పాలకులను నేరుగా ఎన్నుకోరు). 417,037,606 మంది ఓటర్లు అంటే సుమారు 60 శాతం మంది, 2009 ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 830,866 పోలింగ్ స్టేషన్లు పెట్టారు. గుజరాత్ పశ్చిమభాగంలో ఒక ప్రాంతంలో కేవలం ఒకే ఒక్క ఓటరు ఉన్నాడు. ఆయన కూడా అక్కడి స్థానిక గుడికి సంరక్షకుడిగా ఉన్నారు. ఏ ఒక్క ఓటరూ ఓటు వేయడం కోసం రెండు కిలోమీటర్ల కంటె ప్రయాణించకూడదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అవసరమనుకుంటే కుష్ఠురోగులకు, నడవలేనివారి కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ స్టేషన్‌ను ఉంచాలని ప్రకటించింది. 1996 ఎన్నికలలో తమిళనాడులోని మోదుకుర్చి అసెంబ్లీ నియోజకవర్గానికి రికార్డుస్థాయిలో 1032 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. అందులో ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ధరావత్తు వచ్చింది. 88 మంది అభ్యర్థులు కనీసం ఒక్క ఓటు కూడా పొందలేదు. * భారతదేశం ముస్లిం సామ్రాజ్యం... (ఇండియన్ బోహ్రా ముస్లింలు ముంబైలో సమావేశమయ్యారు) ప్రపంచంలో ముస్లిములు అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం రెండవస్థానంలో ఉంది. 15 శాతం భారతీయులు ముస్లిములు అయినప్పటికీ, ఇండోనేషియా, పాకిస్థాన్ దేశాలను మినహాయిస్తే, భారతదేశం రెండవస్థానంలో ఉంది. భారతదేశంలో ముస్లిముల సంఖ్య పాకిస్థాన్‌లో ముస్లిముల సంఖ్యతో సమానం. మొట్టమొదటగా ముస్లిములు ముహమ్మద్ ప్రవక్త జీవించిన కాలంలో కేరళకు వచ్చారు. స్వాతంత్య్రం సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ నుంచి మిలియన్ల కొలదీ ముస్లిములుభారతదేశానికి వలస వచ్చారు. అలా వచ్చినవారిలో చాలామంది ఇక్కడే ఉండిపోయారు. ఈరోజు భారతదేశంలోని కాశ్మీర్, లక్షద్వీపాలలో ముస్లిముల సంఖ్య అధికంగా ఉంది. వీరు నెమ్మదిగా దేశమంతా వ్యాపిస్తున్నారు. * భయంకరమైన రోడ్లు (ప్రపంచంలోనే అతి భయంకరమైన రోడ్లు భారతదేశంలో ఉన్నాయి) ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నది భారతదేశంలోనే. భారతదేశంలోని రోడ్లను సందర్శించినవారెవ్వరూ ఈ విషయంలో ఆశ్చర్యపోరు. ఈ మధ్యే బ్రిటిష్ మెడికల్ స్టడీ ఇచ్చిన లెక్కల ప్రకారం 115, 000 మంది భారతీయులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, అయితే వాస్తవానికి ఈ సంఖ్య 200,000 ఉంటుందని పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం చనిపోయినవారిలో 37 శాతం మంది పాదచారులు, 28 శాతం మంది సైకిల్, మోటారుసైకిళ్లపై వెళ్లేవారు, వారిలో 55 శాతం మంది ప్రమాదం జరిగిన ఐదు నిముషాలలోనే మరణించారని తెలిపింది. ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు వేయడం, హెల్మెట్ల వాడకం తప్పనిసరి చేయడం, ట్రాఫిక్ నియమాలను డ్రైవర్లు ఉల్లంఘించకుండా చేయడం... వంటివి పాటిస్తే ఈ ప్రమాదాలను నిర్మూలించవచ్చని పేర్కొంది. * భారతదేశ చలనచిత్రాలన్నీ బాలీవుడ్‌కి చెందినవి కావు... ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చలనచిత్ర పరిశ్రమ భారతదేశంలోనే ఉంది. 1100 చలనచిత్రాలు యేటా విడుదలవుతున్నాయి. ఇది నైజీరియా కంటె కొద్దిగా ఎక్కువ, అమెరికా కంటె రెట్టింపు, బ్రిటన్ కంటె పదిరెట్లు ఎక్కువ. యేటా 200 చలనచిత్రాలను తీసే ముంబైకి ఉన్న బాలీవుడ్ అనే ముద్దుపేరు భారతదేశం మొత్తానికి వర్తించదు. అన్ని సినిమాలు ఆ పేరు మీద విడుదల కావు. తమిళం, తెలుగు భాషలలో అత్యధిక చిత్రాలు విడుదలవుతున్నాయి. అయినప్పటికీ ప్రపంచంలో భారతదేశం బాక్సాఫీస్ విషయంలో ఆరవస్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. * మామిడికాయల గుట్టలు (ప్రపంచంలోనే అత్యధికంగా 40 శాతం మామిడిపంట భారతదేశంలో పండుతుంది) ప్రపంచంలోకెల్లా మామిడిపండ్ల అత్యధిక ఉత్పత్తి, అత్యధిక వినియోగం భారతదేశంలోనే. వేసవికాలంలో మామిడిపండ్లను తినడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఇది భారతదేశ జాతీయఫలం. భారతదేశంలో ఎన్నోరకాల మామిడిపండ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 30 రకాలు వాణిజ్యపంటగా ఉన్నాయి. ఇది ప్రతిఒక్కరికీ అత్యంత ప్రీతిపాత్రమైన పండు. చాలామంది ఏ రకం మామిడి మంచిగా, రుచిగా ఉంటుందనే విషయంపై చర్చించుకుంటుంటారు. ముంబైలో స్థానికంగా దొరికే అల్ఫాన్సా పండు రుచి గురించి, ‘అంత గొప్పది ఉండదు’ అంటే వారికి చాలా కోపం వస్తుంది. చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌ల కంటె అత్యధికంగా 40 శాతం మామిడి పంట భారతదేశంలో పండుతుంది. * రికార్డు బ్రేకర్... (భారతీయ విద్యార్థులు అధికసంఖ్యలో మహాత్మాగాంధీ వేషం ధరించారు) భారతదేశంలో మరే ఇతర దేశాలలోనూ లేని విధంగా రికార్డులు బ్రేక్ చేయడం ఎక్కువ. ఇది ముమ్మాటికీ సత్యం. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకారం, యేటా రికార్డులు సాధించేవారిలో అమెరికా, బ్రిటన్ తరువాతి స్థానం భారతదేశానిదే. అత్యధిక సంఖ్యలో 891 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషం ధరించి ఈ మధ్యనే ఒక రికార్డు నెలకొల్పారు.రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డులలో పశువుల పేడతో తయారుచేసిన అతి పెద్ద దండ, గుర్రం వీపు మీద 10 గంటలపాటు కూర్చుని యోగా చేయడం, ఒకరి ముక్కులో నుంచి మరొకరి నోటి దాకా కరెంట్ వైర్ ఉంచి, దీపాలు వెలిగించడం (36 వాట్ల బల్బు) వంటివి. 2007లో తమిళనాడులోని ఒక ఆసుపత్రిలో 15 ఏళ్ల వయసున్న బాలుడు, డాక్టర్ పర్యవేక్షణలో సిజేరియన్ చేశాడు. ప్రపంచంలోనే ఇటువంటి సర్జరీ చేసిన అతి పిన్నవయస్కుడు ఈ బాలుడు. చిత్రమేమిటంటే అక్కడి పోలీసులు, మెడికల్ అధికారులు దీనిని ప్రపంచ రికార్డుగా పంపడానికి ముందుకు రాలేదు. - డా.వైజయంతి