భారతదేశం గురించి పది వాస్తవాలు | Ten 'big facts' about India | Sakshi
Sakshi News home page

భారతదేశం గురించి పది వాస్తవాలు

Published Thu, Mar 6 2014 10:13 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

భారతదేశం గురించి పది వాస్తవాలు - Sakshi

భారతదేశం గురించి పది వాస్తవాలు

భారతదేశంలో ఏ అంశాన్ని పరిశీలించినా సాధారణంగా ఒకేలా, సర్వసాధారణంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. వేరుగా, భిన్నంగా అనిపించడం చాలా అరుదు. ఈ దేశంలో భిన్నప్రాంతాలు, భిన్న సంస్కృతుల మేళవింపు, భిన్న భాషలు, వృత్తులు, మాండలికాలు వంటివి కనిపిస్తాయి. ఇటువంటివి సాధారణంగా ఖండాలలో కనిపిస్తాయి. కాని ఒక దేశంలో ఇంతటి భిన్నత్వం కనిపించడం చాలా అరుదు. బిబిసి ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేసిన శామ్ మిల్లర్, తన జీవితంలో సగభాగం భారతదేశంలోనే గడిపారు. ఆయన భారతదేశం గురించి పది వాస్తవాలు తన అనుభవంతో వివరించారు.
 
 * అధికజనాభా...
 ఫొటో (2060 నాటికి భారతదేశ జనాభా ఊహించనంతగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు)
 2028 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను మించుతుందని అంచనా. రానున్న 14 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో జనాభాలో మొదటి స్థానం ఆక్రమిస్తుందని ఐక్యరాజ్యసమితిచెబుతోంది. అంటే సుమారు 1.4 బిలియన్ల మంది ఉంటారని ఊహిస్తున్నారు. అధిక జనాభాగా గుర్తింపు పొందడం ఒక విజయమే అయినప్పటికీ, శత్రు దేశమైన చైనా మిగిలిన విషయాలలో అభివృద్ధి చెందుతోంది.
 జనాభాను నియంత్రించడంలో భారతదేశం ఇంకా వెనుకబడే ఉంది. 1970 ప్రాంతంలో... కుటుంబ నియంత్రణ అమలు జరిపిన సమయంలో, కొన్నికొన్ని చోట్ల అది వివాదాస్పదంగాను, ఉత్పత్తి నిరోధకంగాను భావించి నిరోధించారు. అయితే స్త్రీ విద్య వల్ల జనాభా పెరుగుదల బాగా తగ్గింది. 2060 నాటికి భారతదేశ జనాభా 1.6 బిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం నైజీరియా, చైనాను అధిగమించి, జనాభా విషయంలో ద్వితీయస్థానంలో ఉంటుందని భావిస్తున్నారు.
 
 * భారతదేశం ఒకప్పుడు ద్వీపం...
 (ప్రపంచంలోకెల్లా హిమాలయాలు వయసులో అతి చిన్నవి)
 భారతదేశం ఒకప్పుడు ఖండం. 100 మిలియన్ల సంవత్సరాల క్రితం డైనసార్లు భూమి మీద సంచరిస్తున్న కాలంలో భారతదేశం ఒక ద్వీపంలా ఉండేదట. ప్రాచీనలిపి ఆధారంగా గోండ్వానాల్యాండ్ (గోండ్వానా అనే వ్యక్తి కారణంగా ఆ పేరు వచ్చింది. ఇది మధ్య భారతదేశంలో ఉన్న అటవీప్రాంతం) నెమ్మదిగా ఉత్తరదిక్కుగా ప్రయాణించిందని తెలుస్తోంది. 50 మిలియన్ల సంవత్సరాల క్రితం, డైనసార్లు... తీరప్రాంతం నుండి ఉత్తరదిక్కుగా ప్రయాణించిన కారణంగా అక్కడ హిమాలయాలు ఏర్పడ్డాయని, అందువల్ల అవి ప్రపంచంలోనే అతి చిన్నవయసుగల పర్వతశ్రేణులని, ఎత్తులో మాత్రం పెద్దవని తెలుస్తోంది. సముద్రాలలోని శిలాజాల ఆధారంగా హిమాలయాల వయసును లెక్కకట్టారు.
 
 * బహుభాషలు...
 భారతదేశం విభిన్న భాషల సమాహారం. సుమారు 1000 భాషలు ఇక్కడ మాట్లాడతారు. అయితే ఒక భాషను మొదటిదని, మరో భాష చివరిదని మాత్రం చెప్పలేం. 1961 లెక్కల ప్రకారం, భారతదేశంలో 1652 భాషలు (ఇందులో చాలావరకు మాండలికాలు ఉన్నప్పటికీ) ఉన్నాయి. కాలక్రమేణా కొన్ని భాషలు పూర్తిగా కాలగర్భంలో కలసిపోయాయి. అతి ఎక్కువగా మాట్లాడే భాషలైన హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ వంటి ఆరు భాషలలో ప్రతి భాషను 50 మిలియన్ల మంది మాట్లాడుతున్నారు.
 122 భాషలను 10,000 మంది కంటె ఎక్కువమంది మాట్లాడుతున్నారు.
 
 భారతదేశానికి జాతీయ భాష లేదు. హిందీ, ఇంగ్లీషు... రెండు భాషలూ అధికార భాషలే. హిందీ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా తమిళులు హిందీ భాష విషయంలో తమ వ్యతిరేకతను తెలియచేస్తున్నారు. అందువల్ల ఇంగ్లీషు అధికారభాషగా నిలబడిపోయింది. భారతీయ భాషలు ప్రపంచంలోని నాలుగు భాషా కుటుంబాలకు చెంది ఉన్నాయి. ఇండో యూరోపియన్, ద్రవిడియన్, ఆస్ట్రో ఆసియాటిక్, టిబెటో బర్మన్.
 
 20 శతాబ్దపు మధ్యభాగం వరకు ఆఫ్రికాలో పుట్టిన బంటు భాషా కుటుంబం, తూర్పు ఆఫ్రికా నుంచి వలస వచ్చినవారు, పశ్చిమభారతదేశంలో నివసించేవారు ఉపయోగించే సిది భాష మాట్లాడేవారికి ప్రాతినిథ్యం వహించింది. కాలక్రమేణా ఆ భాష ప్రస్తుతం కాలగర్భంలో కలిసిపోయింది. సిది జాతివారు బంటూ పదాలను కొద్దికొద్దిగా ఉపయోగిస్తున్నారు.
 
 * మెగా సిటీస్
 (నగరాలలోని స్లమ్స్‌లో నీరు దొరకటం దుర్భరం)
 ప్రపంచంలోని పది మహానగరాలలో మూడు భారతదేశంలోనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న అతి పెద్దనగరాలలో ఢిల్లీ రెండవది, ముంబై ఏడవది, కలకత్తాది పదవస్థానం. ఢిల్లీ జనాభా 22.65 మిలియన్లు. అంటే టోక్యోను అధిగమించినట్లు. 17 వ శతాబ్దంలో ఢిల్లీ ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా కలిగిన నగరం. కాని 1960 నాటికి, ఢిల్లీ కనీసం 30 వ స్థానంలో కూడా లేదు. నాటి నుంచి ఈ నగర పెరుగుదల ఏడాదికి కేవలం 4 శాతం మాత్రమే.
 
 ఆ పెరుగుదల రానురాను తగ్గుతున్నప్పటికీ ఇప్పటికి ఆ పెరుగుదల 3 శాతానికి పడిపోయింది. అంటే యేటా జనాభా రేటు పెరుగుతున్నప్పటికీ, శిశుజననాలు, వలసలు 700000కి పెరిగి, భారత రాజధాని మీద వనరుల కోసం ఒత్తిడి పెరిగింది. నీరు ప్రధాన సమస్యగా పరిణమించింది. నగరంలో నాలుగోవంతు భాగంలో ప్రతిరోజూ నీటి సరఫరా ఉండదు. భారతదేశంలోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణె, సూరత్... ఈ నగరాలు అత్యధిక జనాభా ఉన్న 100 నగరాలలో నిలబడ్డాయి.
 
 * ఓటర్లు (417,037,606)                                                                              
 (ఓటర్ల చేతి వేలి మీద ఇంకు మార్కు వేసి, ఒక వ్యక్తి ఒకే ఓటు అని సూచిస్తున్నారు)
 ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. (చైనీయులు వారి పాలకులను నేరుగా ఎన్నుకోరు). 417,037,606 మంది ఓటర్లు అంటే సుమారు 60 శాతం మంది, 2009 ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 830,866 పోలింగ్ స్టేషన్లు పెట్టారు. గుజరాత్ పశ్చిమభాగంలో ఒక ప్రాంతంలో కేవలం ఒకే ఒక్క ఓటరు ఉన్నాడు. ఆయన కూడా అక్కడి స్థానిక గుడికి సంరక్షకుడిగా ఉన్నారు.


 ఏ ఒక్క ఓటరూ ఓటు వేయడం కోసం రెండు కిలోమీటర్ల కంటె ప్రయాణించకూడదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అవసరమనుకుంటే కుష్ఠురోగులకు, నడవలేనివారి కోసం ప్రత్యేకంగా ఒక పోలింగ్ స్టేషన్‌ను ఉంచాలని ప్రకటించింది. 1996 ఎన్నికలలో తమిళనాడులోని మోదుకుర్చి అసెంబ్లీ నియోజకవర్గానికి రికార్డుస్థాయిలో 1032 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. అందులో ఇద్దరు అభ్యర్థులకు మాత్రమే ధరావత్తు వచ్చింది. 88 మంది అభ్యర్థులు కనీసం ఒక్క ఓటు కూడా పొందలేదు.
 
 * భారతదేశం ముస్లిం సామ్రాజ్యం...
 (ఇండియన్ బోహ్రా ముస్లింలు ముంబైలో సమావేశమయ్యారు)
 ప్రపంచంలో ముస్లిములు అధికంగా ఉన్న దేశాలలో భారతదేశం రెండవస్థానంలో ఉంది. 15 శాతం భారతీయులు ముస్లిములు అయినప్పటికీ, ఇండోనేషియా, పాకిస్థాన్ దేశాలను మినహాయిస్తే, భారతదేశం రెండవస్థానంలో ఉంది. భారతదేశంలో ముస్లిముల సంఖ్య పాకిస్థాన్‌లో ముస్లిముల సంఖ్యతో సమానం. మొట్టమొదటగా ముస్లిములు ముహమ్మద్ ప్రవక్త జీవించిన కాలంలో కేరళకు వచ్చారు. స్వాతంత్య్రం సమయంలో తూర్పు, పశ్చిమ పాకిస్థాన్ నుంచి మిలియన్ల కొలదీ ముస్లిములుభారతదేశానికి వలస వచ్చారు. అలా వచ్చినవారిలో చాలామంది ఇక్కడే ఉండిపోయారు. ఈరోజు భారతదేశంలోని కాశ్మీర్, లక్షద్వీపాలలో ముస్లిముల సంఖ్య అధికంగా ఉంది. వీరు నెమ్మదిగా దేశమంతా వ్యాపిస్తున్నారు.
 
 * భయంకరమైన రోడ్లు
 (ప్రపంచంలోనే అతి భయంకరమైన రోడ్లు భారతదేశంలో ఉన్నాయి)

 ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నది భారతదేశంలోనే. భారతదేశంలోని రోడ్లను సందర్శించినవారెవ్వరూ ఈ విషయంలో ఆశ్చర్యపోరు. ఈ మధ్యే బ్రిటిష్ మెడికల్ స్టడీ ఇచ్చిన లెక్కల ప్రకారం 115, 000 మంది భారతీయులు రోడ్డు ప్రమాదంలో మరణించారని, అయితే వాస్తవానికి ఈ సంఖ్య 200,000 ఉంటుందని పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం చనిపోయినవారిలో 37 శాతం మంది పాదచారులు, 28 శాతం మంది సైకిల్, మోటారుసైకిళ్లపై వెళ్లేవారు, వారిలో 55 శాతం మంది ప్రమాదం జరిగిన ఐదు నిముషాలలోనే మరణించారని తెలిపింది. ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు వేయడం, హెల్మెట్‌ల వాడకం తప్పనిసరి చేయడం, ట్రాఫిక్ నియమాలను డ్రైవర్లు ఉల్లంఘించకుండా చేయడం... వంటివి పాటిస్తే ఈ ప్రమాదాలను నిర్మూలించవచ్చని పేర్కొంది.
 
 * భారతదేశ చలనచిత్రాలన్నీ బాలీవుడ్‌కి చెందినవి కావు...
 ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చలనచిత్ర పరిశ్రమ భారతదేశంలోనే ఉంది. 1100 చలనచిత్రాలు యేటా విడుదలవుతున్నాయి. ఇది నైజీరియా కంటె కొద్దిగా ఎక్కువ, అమెరికా కంటె రెట్టింపు, బ్రిటన్ కంటె పదిరెట్లు ఎక్కువ. యేటా 200 చలనచిత్రాలను తీసే ముంబైకి ఉన్న బాలీవుడ్ అనే ముద్దుపేరు భారతదేశం మొత్తానికి వర్తించదు. అన్ని సినిమాలు ఆ పేరు మీద విడుదల కావు. తమిళం, తెలుగు భాషలలో అత్యధిక చిత్రాలు విడుదలవుతున్నాయి. అయినప్పటికీ ప్రపంచంలో భారతదేశం బాక్సాఫీస్ విషయంలో ఆరవస్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
 
 * మామిడికాయల గుట్టలు
 (ప్రపంచంలోనే అత్యధికంగా 40 శాతం మామిడిపంట భారతదేశంలో పండుతుంది)
 ప్రపంచంలోకెల్లా మామిడిపండ్ల అత్యధిక ఉత్పత్తి, అత్యధిక వినియోగం భారతదేశంలోనే. వేసవికాలంలో మామిడిపండ్లను తినడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఇది భారతదేశ జాతీయఫలం. భారతదేశంలో ఎన్నోరకాల మామిడిపండ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 30 రకాలు వాణిజ్యపంటగా ఉన్నాయి. ఇది ప్రతిఒక్కరికీ అత్యంత ప్రీతిపాత్రమైన పండు. చాలామంది ఏ రకం మామిడి మంచిగా, రుచిగా ఉంటుందనే విషయంపై చర్చించుకుంటుంటారు. ముంబైలో స్థానికంగా దొరికే అల్ఫాన్సా పండు రుచి గురించి, ‘అంత గొప్పది ఉండదు’ అంటే వారికి చాలా కోపం వస్తుంది. చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌ల కంటె అత్యధికంగా 40 శాతం మామిడి పంట భారతదేశంలో పండుతుంది.
 
 * రికార్డు బ్రేకర్...
 (భారతీయ విద్యార్థులు అధికసంఖ్యలో మహాత్మాగాంధీ వేషం ధరించారు)

 భారతదేశంలో మరే ఇతర దేశాలలోనూ లేని విధంగా రికార్డులు బ్రేక్ చేయడం ఎక్కువ. ఇది ముమ్మాటికీ సత్యం. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రకారం, యేటా రికార్డులు సాధించేవారిలో అమెరికా, బ్రిటన్ తరువాతి స్థానం భారతదేశానిదే. అత్యధిక సంఖ్యలో 891 మంది విద్యార్థులు మహాత్మాగాంధీ వేషం ధరించి ఈ మధ్యనే ఒక రికార్డు నెలకొల్పారు.రికార్డు నెలకొల్పారు.
 ఈ రికార్డులలో పశువుల పేడతో తయారుచేసిన అతి పెద్ద దండ, గుర్రం వీపు మీద 10 గంటలపాటు కూర్చుని యోగా చేయడం, ఒకరి ముక్కులో నుంచి మరొకరి నోటి దాకా కరెంట్ వైర్ ఉంచి, దీపాలు వెలిగించడం (36 వాట్ల బల్బు) వంటివి.
 2007లో తమిళనాడులోని ఒక ఆసుపత్రిలో 15 ఏళ్ల వయసున్న బాలుడు, డాక్టర్ పర్యవేక్షణలో సిజేరియన్ చేశాడు. ప్రపంచంలోనే ఇటువంటి సర్జరీ చేసిన అతి పిన్నవయస్కుడు ఈ బాలుడు. చిత్రమేమిటంటే అక్కడి పోలీసులు, మెడికల్ అధికారులు దీనిని ప్రపంచ రికార్డుగా పంపడానికి ముందుకు రాలేదు.

 - డా.వైజయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement