శిలలపై శిల్పాలు చెక్కు... నారీ | Bhuvaneswari is as a statue sculptor | Sakshi
Sakshi News home page

శిలలపై శిల్పాలు చెక్కు... నారీ

Published Tue, Jul 8 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

శిలలపై శిల్పాలు చెక్కు... నారీ

శిలలపై శిల్పాలు చెక్కు... నారీ

ఆళ్లగడ్డ... కర్నూలు జిల్లాలోని ఆ ఊరి పేరు చెప్పగానే... రాజకీయ నాయకులకు ఒక రకమైన... సామాజిక పరిశీలకులకు మరో రకమైన అంశాలు గుర్తుకు రావచ్చు. అయితే...చాలామందికి తెలియనిది ఏమిటంటే... అక్కడ కొన్ని వందల కుటుంబాలు... శిలలను శిల్పాలుగా మార్చే వృత్తిలో జీవిస్తున్నాయని!  శతాబ్దాలుగా కొన్ని కుటుంబాలు ఈ వృత్తికే అంకితమయ్యాయని!!

అంతేకాదు...  ఈ ఊళ్లో ఓ అరుదైన మహిళా శిల్పి కూడా ఉన్నారు... శిల్పకళా రంగంలో మహిళలు చాలా అరుదుగా ఉంటారు... చదువుకున్న మహిళలైతే మరీ తక్కువ... కలం పడతారే కాని ఉలి పట్టరు... కానీ, అందుకు భిన్నంగా ఇరవై రెండేళ్ళ భువనేశ్వరి కలం పట్టి చదువుకున్నారు... ఇప్పుడు ఉలి పట్టి శిల్పకళను అభ్యసిస్తున్నారు... ఆళ్లగడ్డకు చెందిన భువనేశ్వరి శిల్పిగా ఎందుకు మారారు? ఎలా మారారు? దాని వెనుక చాలా కథే ఉంది.
 
అందరు ఆడపిల్లల లాగానే భువనేశ్వరి డిగ్రీ పూర్తి చేశారు. వివాహం, సంతానం... వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే ఆమె జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. 2013లో భర్త ఆమెను విడిచి వెళ్లిపోయాడు. అప్పటికి భువనేశ్వరికి ఒక బాబు. చంటిపిల్లవాడితో తండ్రి పంచన చేరారు భువనేశ్వరి.

తండ్రికి భారంగా మారకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకున్నారు. వారి వంశంలో తరతరాలుగా వస్తున్న శిల్పాల వృత్తిని ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. బిఈడి పూర్తిచేసినా టీచరుగా చేరకుండా స్వయంగా శిల్పాలు చెక్కడం నేర్చుకోవడం ప్రారంభించారు భువనేశ్వరి.
 
ఇందుకు కారణం...
ఇటీవలే ‘లా' ఎంట్రన్స్ ప్యాసైన భువనేశ్వరి, తనలాగ ఎవరైనా స్త్రీలు బాధపడుతుంటే వారికి సహాయపడాలనుకుంటున్నారు.
‘‘నేను జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకరోజు నాన్న నాతో ‘శిల్పాలు చేసే వాళ్లు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు’ అని చెప్పారు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. ఎవరో వచ్చి శిల్పాలు కొంటారని ఎదురు చూసేకన్నా, మనమే వినియోగదారులకు దగ్గరయ్యేలాగ ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని! ఆ ఆలోచనకు వెంటనే కార్యరూపం ఇచ్చేశాను! మొదటినుంచీ నాకు ఇంటర్నెట్‌లో సొంతంగా పెట్టే బ్లాగులు, ఫేస్‌బుక్, యూ ట్యూబ్ వంటివి ఉపయోగించడం అలవాటే. దాంతో ముందుగా నా సొంత బ్లాగ్ ప్రారంభించాను. దానికి స్పందన బాగానే వచ్చింది’’ అంటారు భువనేశ్వరి

ఫేస్‌బుక్‌తో మారిన ఫేట్...
ఫేస్‌బుక్‌లో రకరకాల వస్తువులను అమ్మకానికి ఉంచడం గమనించిన భువనేశ్వరి, తాను కూడా శిల్పాలను సులువుగా అమ్మడానికి ఆ మార్గం ఎంచుకుంటే బావుంటుందనుకుని, తమ వద్ద తయారైన శిల్పాల ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఉంచడం ప్రారంభించారు. మెల్లగా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ‘‘వినియోగదారుల అభిరుచి మేరకు ఫేస్‌బుక్‌లో ఆర్డర్‌లు తీసుకుని, వాటికి తగ్గట్టుగా శిల్పాలు తయారు చేయడం కూడా ప్రారంభించాను’’ అంటారు భువనేశ్వరి.
 
నా జీవితంలో మరచిపోలేను..!
ఆమె సాధించిన విజయం అంత తేలికగా సాధ్యం కాలేదు. ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడిన తర్వాతే  ఆర్డర్లు రావడం ఆరంభమైంది. ‘‘కిందటి సంవత్సరం ఒక విదేశీ వనిత ... ఆరడుగుల బుద్ధుడి విగ్రహం, డైనింగ్ టేబుల్ సెట్, రెండు నీటితొట్లు, బఫే టేబుల్  ఫేస్‌బుక్ ద్వారా ఆర్డరిచ్చారు. అదే నేను అందుకున్న మొదటి ఆర్డరు, తొలి సంపాదన కూడా! ఇటీవల ఆమె ఇండియాకు వచ్చినప్పుడు నన్ను చూడాలని సరాసరి మా ఇంటికి వచ్చారు.

అది నిజంగా నా జీవితంలో మరచిపోలేని సంఘటన’’ అని ఎంతో సంబరంగా వివరించారు భువనేశ్వరి. అలాగే హైదరాబాద్ నివాసి సిద్ధలక్ష్మి, భువనేశ్వరి దగ్గర దేవుడి విగ్రహాలు కొనుగోలు చేశారు. అవి ఆవిడకు అమితంగా నచ్చడంతో పారితోషికంతో పాటు భువనేశ్వరికి చీర సారె పంపారు. అది తన జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చిన రోజని చెబుతున్న భువనేశ్వరి జీవితం కూడా కాలం చెక్కిన ఒక శిల్పం లాంటిదే!   
 - డా. వైజయంతి
 
శిల్పాల అమ్మకం ప్రారంభిస్తానని నాన్నతో అన్నాను. ఆయన సరే అన్నారు. కానీ శిల్పాల తయారీలో తోడ్పడే వర్కర్స్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టారు. ఒక ఆడమనిషి చెబితే మనం చేయటం ఏంటి అనుకున్నారు. కొందరైతే ముఖం మీదే అన్నారు. సరైన సమయం కోసం నిరీక్షించాను. ఫేస్‌బుక్‌లో మేం తయారు చేసిన శిల్పాల వివరాలు పెట్టాక, మెల్లగా ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అందరూ వచ్చి, ‘ఏదైనా పని ఉంటే చెప్పండి’ అంటున్నారు.       - భువనేశ్వరి, విగ్రహ శిల్పి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement