ఈ...ఈ...ఈ...
సరదాగా...
అనగనగా ఒక ఈగ. ఆ ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయింది. ఒక సర్వర్ కుర్రాడు దాని దగ్గరకు వచ్చి పుండు మీద కారంలాగ, ‘నీ పేరేంటి’ అని ఎగతాళిగా అడిగాడు. ‘‘నా పేరు... నా పేరు... నా... పేరా... ఔను! నా పేరేంటి?’’ అని ఆ కొంటె కుర్రాడిని ఎదురు అడిగింది.
‘‘నీ పేరు నన్నడుగుతావేంటి?’’ అన్నాడు కోపంగా. ‘‘నువ్వు చెప్పేది నిజమే! నా పేరు గతంలో నీకు చెప్పి ఉంటాను కదా! మరి నువ్వెందుకు గుర్తు పెట్టుకోలేదు?’’ అని గడుసుగా అడిగింది ఆ జీవి. ఆ కుర్రాడు కాస్త సందిగ్ధంలో పడ్డాడు.
కట్ చేస్తే... అసలు ఈగ తన పేరెందుకు మర్చిపోయిందో ఆ కుర్రాడినే అడిగింది.
‘‘నేను అడిగే దానికి కొంటెగా కాకుండా సరిగా సమాధానం చెప్పు. మేం ఏ మాసంలో కనిపిస్తాం?’’ అంది ఆ జీవి.
‘‘ఆషాఢంలో...’’
‘‘ఆషాఢం వచ్చి...?’’
‘‘పన్నెండు రోజులవుతోంది’’
‘‘కదా! ఒకనాడు నిద్ర లేచి చూస్తే ఎండలు కనిపించాయి. అయితే మా సీజన్ రాలేదేమోననుకుని రెండో నిద్ర ప్రారంభించాను. పది రోజుల తర్వాత, ఏదో తడిగా తగిలితే, ఉలిక్కిపడి లేచాను. అమ్మో మా సీజన్ వచ్చిసిందనుకుంటూ, సంబరంగా రెక్కలు విదిల్చాను. ఈ హడావుడిలో పేరు మర్చిపోయాను. ఆ విషయం పక్కన ఉంచితే, నిన్నో ప్రశ్న అడుగుతాను, నీ నెల జీతం పదిహేను రోజులు ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుంది?’’
‘‘అమ్మో! ఆ మాట అనకు. మా బాస్ విన్నాడంటే ఇంప్లిమెంట్ చేసేస్తాడు’’ - ఖంగారుగా అన్నాడు కుర్రాడు. ‘‘అడిగినందుకే అంత భయపడ్డావే. మరి మా జీతం పది రోజులు ఆలస్యమైంది! కడుపులో చీమలు, దోమలు (ఎలుకలు ఈగల కంటె పెద్దవి కదా) పరుగెత్తుతున్నాయి. మా జీతం ఇంకా రాలేదు!’’అంది ఆ బక్క జీవి.
‘‘నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు!’’
‘‘నీకెలా అర్థం అవుతుంది. చెప్తాను విను. ఆషాఢం వచ్చిందంటే మేము ముసురుతామని తెలుసు కదా! మరి ఆషాఢం వచ్చి ఇన్ని రోజులైనా మాలో ఒక్కరైనా కనిపించారా మీకు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో!’’
‘‘ఆ! ఇప్పుడు గుర్తు వచ్చింది నీ పేరు. నువ్వు ఈగవు కదూ!’’ అన్నాడు మెరిసే కళ్లతో ఆ కుర్రాడు.
‘‘అమ్మయ్య! ఇంత కథ చెప్పాక నా పేరు నాకు గుర్తు చేసినందుకు చాలా సంతోషం...’’ అనుకుంటూ ఈగ ఈల వేసుకుంటూ వానగాలిలోకి ప్రవేశించింది...
- డా.వైజయంతి