asadham
-
ఆషాఢమాసం ఆరంభం.. శుభముహూర్తాలకు బ్రేక్.. అప్పటి వరకు ఆగాల్సిందే!
సాక్షి, కరీంనగర్: మూఢాలు వచ్చేశాయి.. శుభ మహూర్తాలకు బ్రేక్ పడింది. మంగళవారం నుంచి ఆషాఢమాసం ప్రవేశించడంతో ముహూర్తాలు లేవు. మూడు నెలలుగా జిల్లాలో కొనుగోలు దారులతో కళకళలాడిన పెళ్లి సామగ్రి దుకాణాలు బోసిపోనున్నాయి. పెళ్లి మండపాలు, ప్రింటింగ్ప్రెస్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వంటవారు, భజాభజంత్రీలు, నాదస్వరం, పురోహితులు నెల రోజుల పాటు ఆగస్టు 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. వ్యాపార వర్గాల్లో గుబులు ఆషాఢ మాసంతో శుభముహూర్తాలు లేక తమ వ్యాపారాలు ఎలా సాగుతాయోనని వ్యాపారవర్గాల్లో గుబులు పట్టుకుంది. వానాకాలం రైతుల సీజన్ కూడా కావడంతో రైతులు పొలం పనుల్లో ఉండి తమ అవసరాలను వాయిదా వేసుకుంటారని, అత్యవసరమైతే అది కూడా నిత్యావసరలకే తప్పా అనవసరంగా ఏమి కొనుగోలు చేయరని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి. నెల రోజులు ఉపాధి బంద్ పెళ్లిళ్లు, ఇతర శుభకార్యక్రమాలపై ఆధారపడిన వారు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్లో సంపాదించుకున్న వాటిలో నుంచే నిత్యావసరాలకు ఖర్చు చేయాల్సిందేనని వాపోతున్నారు. చదవండి: Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్ ఆగస్టు 3 నుంచి ముహూర్తాలు ఆషాఢ మాసంతో జూలైలో ముహూర్తాలు లేవు. తిరిగి ఆగస్టు 3 నుంచి శుభముహూర్తాలున్నాయి. అవి కూడా కేవలం 10 రోజులే. తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో శుక్రమూఢం ఉంటుంది. ఈ మూడు నెలలు శుభముహూర్తాలు ఉండవు. మళ్లీ డిసెంబర్లో 10 మంచి రోజులు తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది. – పవనకృష్ణశర్మ, ప్రధానార్చకులు, దుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్ ఉపాధి ఉండదు శుభకార్యక్రమాలపై ఆధారపడ్డ వారికి ఆషాఢంలో ఉపాధి ఉండదు. మొన్నటి వరకు జరిగిన శుభకార్యక్రమాల్లో అంతో ఇంతో సంపాదించుకుంటే వాటి నుంచి అత్యవసరాలకు ఖర్చు చేసుకుని ముహూర్తాల కోసం వేచి ఉండాలి. – గోగుల ప్రసాద్, ఈవెంట్ ఆర్గనైజర్, కరీంనగర్ -
ముంచుకొస్తోంది.. ముహూర్తాల వేళ..
వీరఘట్టం: శుభముహూర్తాల సందడి ప్రారంభానికి వేళైంది. ఈ నెల 15తో అధిక జ్యేష్ఠమాసం ముగియడంతో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో 20 రోజుల పాటు భాజా భజంత్రీలు మారుమోగనున్నాయి. ఈ నెల 18తో పాటు 22, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో దివ్యమైన శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. అలాగే జూలై 1, 2, 3, 5, 6,7 తేదీల్లో కూడా ముహూర్తాలు ఉండడంతో ఆయా రోజుల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు, గృహ æప్రవేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు చాలామంది సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి జూలై ఏడో తేదీ వరకు అన్నీ మంచి రోజులేనని వేద పండితులంటున్నారు. జూలై 15 నుంచి నెల రోజుల పాటు ఆషాఢం రానుండడంతో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు. పురోహితులకు డిమాండ్ ఈ నెల 18వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో పురోహితులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా రెండు వేల వరకూ వివాహాలకు ముహూర్తాలు ఖరారైనట్టు పురోహితులు చెబుతున్నారు. అలాగే కొద్దిరోజులుగా ఖాళీగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు, పురోహితులకు డిమాండ్ పెరిగింది. ముందుగానే తేదీలను ఖరారు చేసుకోవడంతో చాలామంది ప్రశాంతంగా ఉండగా... మరికొందరు కల్యాణ మండపాలు ఖాళీలేక, బ్యాండు పార్టీలు... పురోహితులు దొరక్క ఆందోళన చెందుతున్నారు. వివాహాలతోపాటు రానున్న 20 రోజుల్లో 14 ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశాలు, నూతన భవానల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసేందుకు సైతం చాలామంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జోరందుకున్న వ్యాపారాలు వివాహాలు, గృహప్రవేశాలు ముంచుకొస్తోంది.. ముహూర్తాల వేళ..చేయాలనుకునేవారు తమకు కావల్సిన సామగ్రి కొనుగోలులో బిజీగా ఉన్నారు. వస్త్రాలు, బంగారు అభరణాలు, డెకరేషన్ ఇతర సామగ్రి కొనుగోలుకు జిల్లా కేంద్రానికి ప్రజలు పోటెత్తుతుడడంతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి. కల్యాణ మండపం అద్దె ధరలు పైపైకి... ప్రస్తుత రోజుల్లో చాలా మంది వివాహాల కోసం కల్యాణ మండపాలను ఆశ్రయిస్తున్నారు. అన్ని సౌకర్యాలు అక్కడే లభిస్తుండడంతో ఎక్కువ మంది అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఎవరి ఆర్థిక స్థితిగతులను బట్టి ఆయా వేదికలను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం అద్దె రూ.5 వేలు నుంచి రూ.10 వేల మధ్య ఉంటే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. ఏసీ సౌకర్యం ఉన్న కల్యాణ మండపాల ధరలైతే లక్షల రూపాయలకు పైనే పలుకుతున్నాయి. 18 నుంచి పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 18 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు 20 రోజుల పాటు మంచి ముహూర్తాలున్నాయి. ఎక్కువగా ఈనెల 22, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. జూలై 15 నుంచి ఆషాఢం ప్రారంభం అవుతుంది. – ఎస్.వి.ఎల్.ఎన్.శర్మయాజీ, వేద పండితుడు, వీరఘట్టం -
భలెహెంగా!
చినుకుదారాలు నేలను చేరితేనే ప్రకృతి పచ్చకోకను కట్టుకుంటుంది. ఆషాఢం నడుము బిగిస్తేనే... శ్రావణం కొత్తగా ముస్తాబవుతుంది.వేడుకలు వెయ్యింతలై వెలగాలంటే నట్టింట లెహెంగాల అందం భలేగా రూపుకట్టాల్సిందే! ► లేత గులాబీ రంగుకి పసుపుదనం తోడైతే.. ఆ కాంబినేషన్ చూడటానికి రెండు కళ్లు సరిపోవేమో అనిపిస్తుంది. సంప్రదాయ వేడుకకు నిండుతాన్ని మోసుకొస్తుంది. ► బంగారు రంగుకు ఎంబ్రాయిడరీ సొగసును చేర్చితే ఆ‘కట్టు’కునే లెహంగా రూపు ‘వహ్వా’ అనిపిస్తుంది. లాంగ్ అనార్కలీ.. లెహెంగాను తలపిస్తుంది. రెండు రంగుల ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది. ► హై వెయిస్ట్ లెహెంగా శరీర సౌష్టవాన్ని మరింత అందంగా చూపుతుంది. అందుకే లెహంగా కట్కు తప్పనిసరి ప్రాధాన్యం ఇవ్వాలి. ► లెహంగాకు కుచ్చుల హంగులు జత చేర్చితే.. కొత్తరూపుతో చూసేవారి మతులను పోగొడుతుంది. ఫైన్ టస్సర్తో డిజైన్ చేసిన లెహెంగాలు వేదికలైనా, వేడుకలైనా హైలైట్‌గా వెలిగిపోవాల్సిందే! ► కురుల చివరల నుంచి నేల వరకు గులాబీ అందం అలలుగా జాలువారుతుంటే చూపుల మెరుపులు అతుక్కుపోయి అల్లికలుగా రూపుకడుతుంది. భళేగా ఉంది కదూ! అనకుండా ఉండదు ప్రతి మనసు. లెహెంగా ఎంపికకు పది సూచనలు... 1. లెహెంగాకు రంగుల కాంబినేషన్ ముఖ్యం. ఆ తర్వాత మెటీరియల్ ఎంపిక. ఆసక్తులను బట్టి ఫ్యాబ్రిక్ ఎంచుకున్నప్పటికీ లెహెంగాకు టస్సర్ సిల్క్, రాసిల్క్ గ్రాండ్ లుక్‌నిస్తాయి. 2. సంగీత్, రిసెప్షన్, పూజలు.. ఇలా సందర్భాన్ని బట్టి రంగుల ఎంపిక ఉండాలి. రాత్రి వేడుకలైతే కాంతివంతమైనవి, పూర్తిగా ఒకే రంగు లెహంగాను ఎంచుకోవాలి. 3. పొడవు, పొట్టి, లావు, సన్నం.. ఇలా శరీర కొలతలను బట్టి లెహెంగా కట్ ఉండాలి. హై వెయిస్ట్ కట్ లెహంగాలు బాగా నప్పుతాయి. 4. బ్లౌజ్‌కి సెలబ్రిటీలైతే బ్రాడ్ నెక్ డిజైన్స్ ఎంచుకుంటారు. ఎవరికి వారు వారి స్కిన్ కలర్, ఎత్తును బట్టి బ్లౌ్లజ్ డిజైన్ చేయించుకోవడం మంచిది. 5. సంప్రదాయ పండగల విషయానికి వస్తే... పసుపు, పచ్చ, మెరూన్ కలర్స్ బాగా నప్పుతాయి. 6. సిల్క్ మెటీరియల్ మాత్రమే కాకుండా మన ప్రాంతీయ ఖాదీ, కాటన్ మెటీరియల్‌తో కూడా లెహంగాలను డిజైన్ చేసుకోవచ్చు. 7. ముందు... రంగుల కాంబినేషన్లను స్కెచ్ వేసుకొని చూసుకోవచ్చు. 8. ఎంబ్రాయిడరీ కూడా మరీ గాఢీగా కాకుండా సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. 9. హైట్ తక్కువగా ఉన్నవారు అంచులు చిన్నగా ఉన్నవి ఎంచుకోవాలి. 10. హై వెయిస్ట్ లెహెంగాలు ధరిస్తే పొడవుగా కనిపిస్తారు. - దివ్యారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అందం... చందం... ఆషాఢం
మాసం ఆషాఢం అనగానే శూన్యమాసమనీ, శుభకార్యాలకు పనికిరాదనీ పెదవి విరుస్తుంటారు చాలామంది. ఆషాఢమనేది కొత్తగా పెళ్లయిన భార్యాభర్తల పాలిట విలన్ లాంటిదని పళ్లు కొరుక్కుంటారు ఇంకొంతమంది. నిజానికి ఆషాఢమాసం తెలంగాణ ప్రాంతంలో గ్రామదేవతలకు బోనాలు సమర్పించే మాసం. విజయవాడ కనకదుర్గమ్మను భక్తులు శాకంబరిదేవిగా అలంకరించి మురిసిపోతారు. జగానికే నాథుడైన పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర జరిగేది ఈ నెలలోనే. అని తల్లీతండ్రీ తర్వాత స్థానంలో ఉన్న గురువులను పూజించి, గౌరవించే గురుపౌర్ణమి వేడుకలు జరిగేది ఆషాఢంలోనే కదా! ఆడపడచులందరూ గోరింటాకుతో ఎర్రగా మిరప్పళ్లలా పండిన చేతులతో కనిపించేది, ఈ కాలంలో విరివిగా వచ్చే వాక్కాయలతో పప్పు, మునగకాడలతో ఘుమఘుమలాడే చారో పులుసో కాచుకునేది, పొట్లకాయ కూర, పెరుగుపచ్చడి చేసుకునేది ఆషాఢంలోనే! కొత్తగా పెళ్లయ్యి, పుట్టింటి మీద బెంగను అత్తమామలకి చెప్పుకోలేక తనలో తనే సతమతమవుతూన్న కొత్తకోడలి పాలిట ఆపద్భాంధవి ఆషాఢం కాదా! అత్తగారు, మామగారు, ఆడపడచులు, మరుదులను అర్థం చేసుకుంటూ, వాళ్లకి కావలసినవి వేళకు ఎలా అమర్చగలమా అని ఆందోళన పడే వేళ నేనున్నానంటూ వచ్చి, కళ్లు తుడిచేది ఆషాఢమే కదా! మొన్న మొన్ననే పెళ్లయ్యింది.. భార్యతో ఇంకా అచ్చటాముచ్చటా తీరనేలేదు... ఇంతలోనే నా పాలిటి విలన్లా దాపురించింది ఆషాఢం అని తిట్టుకునే రోజులా ఇవి! ఎప్పుడో పోయాయి. ఆషాఢంలో అత్తాకోడలూ, అత్తా అల్లుడూ నే కదా, ఒక గడప దాటకూడనిది, మొగుడూ పెళ్లాల విషయంలో ఆ రూలేమీ లేదు కదా అని ఎట్లాగో అట్లా నానా తంటాలు పడుతూ వెళ్లి, భార్యను ఆమె బాబాయి ఇంటికో, పిన్నిగారింటికో రప్పించుకుంటే సరి, అక్కడ కూడా మర్యాదలన్నీ అందుకోవచ్చుకదా! అని ఆలోచించని వాళ్లు, దానిని వెంటనే అమలు చెయ్యని వాళ్లు చాలా అరుదు. అసలు ఆషాఢంలో కలుసుకోకూడనిదే భార్యాభర్తలు. ఎందుకంటే ఆషాఢంలో భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల గర్భోత్పత్తి జరిగి, ఎండాకాలంలో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అప్పుడే భూమిమీదికొచ్చిన చిన్నారులు ఆ ఎండలను తట్టుకోలేక నానా ఇబ్బందులూ పడతారు. వాళ్ల బాధలు చూడలేక మళ్లీ మనం బాధపడాలి. అదొక్కటేనా? వ్యవసాయ పనులు ఆరంభమయ్యేది తొలకరి జల్లులు కురిసే ఆషాఢంలోనే. అంతకాలం ఎండవేడిమికి భూమిలోపలి పొరల్లో దాగి ఉన్న క్రిమికీటకాలు వర్షాలకు బయటికొచ్చి, వీరవిహారం చేస్తాయి. ఈగలూ దోమలూ ముసిరి, రకరకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు. కొత్తగా పెళ్లయినవాళ్లేమో, భార్య ఇంటిదగ్గర ఉండి, ఆమె మీదకు ధ్యాస మళ్లుతూ ఉంటుంది. దానిమూలంగా వ్యవసాయ పనులు దెబ్బతింటాయి. రైతులకు ఇంత అన్నం పెట్టేది, ఆధారభూతమయ్యేదీ వ్యవసాయపనులే కదా, అందువల్లే పెద్దవాళ్లు నవ వధూవరుల మధ్యలో ఆషాఢాన్ని అడ్డం పెట్టారు. ఇన్ని విషయాలున్నాయన్నమాట ఆషాఢంలో అత్తాకోడలూ ఒక ఇంటి గడప దాటకూడదనడం వెనక! ఇక ఆషాఢం వచ్చింది మొదలు- గోరింటాకు పెట్టుకోకూడదటే ఆ చేతులకూ అని బామ్మలు, అమ్మమ్మలు సణుగుడు మొదలెడతారు. వాళ్ల సణుగుడు తట్టుకోలేక కన్నెపిల్లలు ఎవరి దొడ్లోనో ఉన్న గోరింట చెట్టునుంచి ఇంత ఆకు దూసుకొచ్చి, అందులో ఇంత చింతపండు ముద్ద వేసి, మధ్యమధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ నూరడం మొదలెడతారు. మెదిగిందా లేదా అని రోట్లోకి ఆకును తోసేటప్పుడే చిలకముక్కుల్లా ఎర్రగా పండిన అమ్మ చేతులని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. కొత్తగా పెళ్లయి, పుట్టింటికి వచ్చిన నవ వధువులు కూడా ఆషాఢంలో చేతులనిండా గోరింటాకు పెట్టుకుని, తిరిగి అత్తారింటికి వెళ్లాక అమ్మ లేదా చెల్లి పెట్టిన గోరింటాకు చేతులను చూసుకుంటూ వారి జ్ఞాపకాల్లో మునిగిపోతారు. ఎర్రగా పండిన చేతులను భర్తకు చూపించి మురిసిపోతారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనక శాస్త్రీయ కారణాలేమిటంటే, గోరింట వల్ల గోళ్లకు అందం రావడమేకాక, గోరుచుట్టు వంటివి రాకుండా ఉంటాయి. గోరింటాకు మందారంలా పండితే మంచిమొగుడొస్తాడని, సింధూరంలా పూస్తే కలవాడొస్తాడని పెద్దలు చెబుతారు. అదే వివాహితలకు అయితే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు చెబుతారు. ఇవన్నీ ఒకప్పటి తీపి జ్ఞాపకాలు. ఇప్పుడయితే ఆషాఢం వచ్చిందంటే బంపర్ సేల్సు, డిస్కౌంట్ సేల్సు, ఆఫర్ల మీద ఆఫర్లు, కేజీల్లెక్కన చీరలమ్ముతారు... క్రెడిట్ కార్డుకు చిల్లులు పొడుస్తారు. సెల్ఫోన్లు కూడా ఒకటి కొంటే మూడు ఉచితం అని ఊరించడం, కొన్న తర్వాత ఫ్రీ పీసులకు మా పూచీ లేదని ముందే చెప్పాం కదండీ అని గిల్లుతూనే కావాలంటే, మరో పీసొచ్చింది చూడండి, ఎక్స్ఛేంజ్ చేసుకుని చూడండి అని ఊరడింపులు... ఇవి చూస్తుంటే ఆషాఢమంటేనే ఒకలాంటి బెంగ. డిస్కౌంట్ అంటేనే దిగులు..! - బాచి -
గోరింటా పూసిందీ...
మతాలకు అతీతమైనది. వయసు తేడా లేనిది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మగువ మనసుకు ముచ్చట కలిగించేది... గోరింట. ఈ మాసం ఆషాఢం. ఓ వైపు రంజాన్, మరో వైపు తెలుగు పండగలు వరసగా వస్తున్నాయి. అతివ చేతుల్లో గోరింట మందారంలా పూసి, మెరిసి, మురిసిపోయే రోజులే ఇక ముందన్నీ... అందుకే ఎర్రన్ని గోరింట ముస్తాబు... ఈ వారం... గోరింట చెట్టు వర్షాకాలంలో కొత్త చిగుళ్లు తొడుక్కుంటుంది. ఈ చెట్టు లేత ఆకులను ముద్దగా నూరి, కావలసిన ఆకారంలో చేతులకు పెట్టి, రెండు నుంచి ఆరు గంటల సేపు ఉంచితే చేతులు ఎరుపు రంగులోకి మారతాయి. ఔషధ గుణాలు మెండుగా ఉండే గోరింటాకును చేతులు, పాదాలకు అలంకరించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలు దరిచేరవని చెబుతుంటారు పెద్దలు. ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధనాలలో గోరింటాకు ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. చర్మసంరక్షణలో మరొకటి సాటిలేదనిపించే ఈ ఆకు నుంచి అందమైన డిజెన్లైన్నో సృష్టించారు సృజనకారులు. వీటిని మగువలతో పాటు మగవారూ తమ భుజాలు, వీపు, ఛాతీ భాగాలలో టాటూగా వేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. తెలుగింటి పల్లెపడుచు చేతుల్లో నిండుగా... క్రిస్టియన్ పెళ్లి వేడుకలలో కాంతిమంతంగా... ముస్లిమ్ మగువ ముంజేతులలో ఆకర్షణీయంగా.. గోరింట రూపురేఖలు మార్చుకొని మెహెందీ డిజైన్లుగా ఆకట్టుకుంటోంది. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్,.. ఏ మతమైనా మెహెందీ విషయంలో భేద భావం లేదు. మనసుకు నచ్చిన డిజైన్ అయితే చాలు. ప్రపంచం మొత్తమ్మీద గోరింటతో శారీరక అలంకరణలో రకరకాల ప్రయోగాలు చేసేది ఇండియా, అరబ్ దేశాలు మాత్రమే. అదృష్టానికి, ఆరోగ్యానికి ప్రతీకగా అరబ్దేశాలలో ఐదు వేల ఏళ్ల క్రితమే గోరింటను వాడినట్టు, హెన్నా పదం అక్కడి నుంచే వచ్చినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్టు ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని, మంచి ఆలోచనలు వస్తాయని నమ్మేవారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను ఎండబెట్టి, పొడి చేసి చేతులు, పాదాలపై రేఖాగణిత నమూనాలలో డిజైన్లు వేసుకునేవారు. వీటివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు మెరుగవుతుందని భావించేవారు. ఇప్పటికీ మన దేశ గ్రామీణ ప్రాంతాలలో ఈ నమ్మకం ఉంది. ఈజిప్ట్ ‘మమ్మీ’ల జుట్టు, గోళ్లు ముదురు గోధుమ రంగులోకి రావడానికి గోరింటాకును వాడేవారని ఒక వివాదాస్పద వార్త కూడా ఉంది. క్రీ.పూ 700 కాలంలో గోరింట మొక్క ఈజిప్ట్ నుంచి భారతదేశంలో అడుగుపెట్టిందని, అప్పటి నుంచి అతివల చేతులు, పాదాలపై గోరింట ఎర్రగా పూయడం మొదలుపెట్టిందని వృక్షశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. చారిత్రకపరంగా చూస్తే మనుషులకు గోరింటాకు ఔషధంగా... వస్త్రం, లెదర్, కేశాలు రంగు మారడానికి ‘డై’గా వాడేవారని తెలుస్తోంది. ఉత్తరాదిన కడ్వాచౌత్, దీపావళి, దక్షిణాదిన అట్లతద్ది వంటి పండగలలో గోరింట ప్రధాన భూమిక పోషిస్తోంది. ఉత్తరభారత వివాహ సంప్రదాయం ఇటీవల దక్షిణాదినీ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే వివాహానికి ముందు మెహిందీ కోసం ప్రత్యేకంగా వేడుకలు జరుపుతున్నారు. బాలీవుడ్ సినిమాలలో ‘మెహెందీ వేడుక’ ఒక ప్రధానాంశం. ఈ సినిమాల వల్ల నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులలో వివాహవేడుకల సమయాలలో అలంకరణలో భాగంగా మెహెందీ ప్రథమస్థానంలో నిలిచింది. ఆ విధంగా 1990 నుంచి మెహెందీ అలంకరణలలో నూతన పోకడలు వచ్చి చేరాయి. నాటి నుంచి ఈ డిజైన్లను ‘హెన్నా టాటూస్’గా పిలవడం ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు హెన్నా డిజైన్స్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఈ డిజైన్లని ముస్లిమ్ మహిళలు అలవోకగా వేయడం అక్కడి నుంచే మొదలైంది. వేదాలలో గోరింటరంగును సూర్యునికి ప్రతీకగా చె ప్పారు. అందుకే అరచేతుల్లో సూర్యుని ఆకారాన్ని పోలి ఉండే గుండ్రటి డిజైన్ వేసేవారు. మనిషి లోపల ఉన్న జ్ఞాన కాంతిని గోరింట ద్వారా మేలుకొలపడంగా భావించేవారు. డిజైన్లలో వైవిధ్యం ఇటీవల కాలంలో బ్రైడల్, ఇండియన్, అరబిక్... మెహెందీ డిజైన్లు పోటీ పడుతున్నాయి. వీటిలోనే షేడెడ్, ఫ్లోరల్, మోటిఫ్స్... ఇలా తీర్చిన డిజైన్లలో రంగురంగుల రాళ్లు, పూసలు, గ్లిట్టర్ (మెరుపుతో ఉండే పచ్చని రంగు)ను కూడా ఉపయోగిస్తున్నారు. మరికొందరు నేరుగా అచ్చులతో రంగు డిజైన్లను నిమిషాలలో ఒంటి మీద ముద్రించుకుంటున్నారు. ఇంకొందరు ప్లాస్టిక్ డిజైన్ల్లో వచ్చిన స్టిక్కర్స్నీ అతికించుకుంటున్నారు. జీవనశైలి వేగవంతంగా మారుతుండటంతో ఈ డిజైన్లలోనూ ఆధునిక పోకడలు వేగం పుంజుకుంటున్నాయి. మెహెందీ.. ఇలా మేలు.. మెహెందీ కోన్లు మార్కెట్లో విస్తృతంగా లభిస్తున్నాయి. వీటితో డిజైన్ వేసుకోవడానికి ముందు ఆ మెహెందీ మన చర్మానికి సరి పడుతుందా లేదా అనేది పరీక్షించుకోవడం తప్పనిసరి. చెవి వెనుక భాగంలో (చెవి వెనుక భాగం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని ఏ రియాక్షన్ అయినా త్వరగా తెలిసిపోతుంది) లేదా మోచేతి దగ్గర మెహెందీ రాసుకొని, 3-4 రోజుల తర్వాత కూడా ఎలాంటి రియాక్షన్ లేదంటే అప్పుడు డిజైన్ వేయించుకోవడం ఉత్తమం. మరీ ముఖ్యంగా బ్లాక్ మెహెందీలో ఎక్కువ అలెర్జీ కారకాలు ఉంటున్నాయి. డిజైన్ నల్లగా రావడానికి వీటిలో హానికారక రసాయనాలు కలుపుతున్నారు. మెరుపులు వచ్చే గ్లిట్టర్ తరహా మెహెందీలు సైతం చర్మానికి పడక చాలా మంది ప్రమాదకరమైన స్థితిలో ఆసుపత్రికి వస్తుంటారు. ముఖంతో పాటు గాలి పీల్చుకునే శ్వాసవాహిక కూడా ఉబ్బి పోతుంది. చేతులు, పాదాలపై మెహెందీ డిజైన్ ఉన్న చోట చర్మం ఎర్రగా కందిపోయి, పొక్కులు, చీము కనిపిస్తుంటుంది. కాబట్టి ప్రకృతి సిద్ధంగా లభించే గోరింటాకును ఉపయోగించడాన్నే ప్రోత్సహించాలి. - శైలజ సూరపనేని, కాస్మటిక్ డెర్మటాలజిస్ట్ - నిర్మలారెడ్డి -
ఈ...ఈ...ఈ...
సరదాగా... అనగనగా ఒక ఈగ. ఆ ఈగ ఇల్లు అలుక్కుంటూ తన పేరు మర్చిపోయింది. ఒక సర్వర్ కుర్రాడు దాని దగ్గరకు వచ్చి పుండు మీద కారంలాగ, ‘నీ పేరేంటి’ అని ఎగతాళిగా అడిగాడు. ‘‘నా పేరు... నా పేరు... నా... పేరా... ఔను! నా పేరేంటి?’’ అని ఆ కొంటె కుర్రాడిని ఎదురు అడిగింది. ‘‘నీ పేరు నన్నడుగుతావేంటి?’’ అన్నాడు కోపంగా. ‘‘నువ్వు చెప్పేది నిజమే! నా పేరు గతంలో నీకు చెప్పి ఉంటాను కదా! మరి నువ్వెందుకు గుర్తు పెట్టుకోలేదు?’’ అని గడుసుగా అడిగింది ఆ జీవి. ఆ కుర్రాడు కాస్త సందిగ్ధంలో పడ్డాడు. కట్ చేస్తే... అసలు ఈగ తన పేరెందుకు మర్చిపోయిందో ఆ కుర్రాడినే అడిగింది. ‘‘నేను అడిగే దానికి కొంటెగా కాకుండా సరిగా సమాధానం చెప్పు. మేం ఏ మాసంలో కనిపిస్తాం?’’ అంది ఆ జీవి. ‘‘ఆషాఢంలో...’’ ‘‘ఆషాఢం వచ్చి...?’’ ‘‘పన్నెండు రోజులవుతోంది’’ ‘‘కదా! ఒకనాడు నిద్ర లేచి చూస్తే ఎండలు కనిపించాయి. అయితే మా సీజన్ రాలేదేమోననుకుని రెండో నిద్ర ప్రారంభించాను. పది రోజుల తర్వాత, ఏదో తడిగా తగిలితే, ఉలిక్కిపడి లేచాను. అమ్మో మా సీజన్ వచ్చిసిందనుకుంటూ, సంబరంగా రెక్కలు విదిల్చాను. ఈ హడావుడిలో పేరు మర్చిపోయాను. ఆ విషయం పక్కన ఉంచితే, నిన్నో ప్రశ్న అడుగుతాను, నీ నెల జీతం పదిహేను రోజులు ఆలస్యంగా వస్తే ఎలా ఉంటుంది?’’ ‘‘అమ్మో! ఆ మాట అనకు. మా బాస్ విన్నాడంటే ఇంప్లిమెంట్ చేసేస్తాడు’’ - ఖంగారుగా అన్నాడు కుర్రాడు. ‘‘అడిగినందుకే అంత భయపడ్డావే. మరి మా జీతం పది రోజులు ఆలస్యమైంది! కడుపులో చీమలు, దోమలు (ఎలుకలు ఈగల కంటె పెద్దవి కదా) పరుగెత్తుతున్నాయి. మా జీతం ఇంకా రాలేదు!’’అంది ఆ బక్క జీవి. ‘‘నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదు!’’ ‘‘నీకెలా అర్థం అవుతుంది. చెప్తాను విను. ఆషాఢం వచ్చిందంటే మేము ముసురుతామని తెలుసు కదా! మరి ఆషాఢం వచ్చి ఇన్ని రోజులైనా మాలో ఒక్కరైనా కనిపించారా మీకు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో!’’ ‘‘ఆ! ఇప్పుడు గుర్తు వచ్చింది నీ పేరు. నువ్వు ఈగవు కదూ!’’ అన్నాడు మెరిసే కళ్లతో ఆ కుర్రాడు. ‘‘అమ్మయ్య! ఇంత కథ చెప్పాక నా పేరు నాకు గుర్తు చేసినందుకు చాలా సంతోషం...’’ అనుకుంటూ ఈగ ఈల వేసుకుంటూ వానగాలిలోకి ప్రవేశించింది... - డా.వైజయంతి -
ఆషాఢ లక్ష్ములు...
ముస్తాబు ఆషాఢంలో గోరింట పూసిన చేతులతో ఆదిలక్ష్ములు... శ్రావణంలో సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్ములు... మాసమేదైనా... వేడుకేదైనా... అమ్మాయిల ఛాయిస్ లంగా, ఓణీ అయితే ఐశ్వర్యం ఆ ఇంట కొలువుదీరుతుంది. అమ్మానాన్నలకు కనులపండుగవుతుంది. నేటి తరం అమ్మాయిలు ముస్తాబుకు ఇష్టపడి ఎంచుకునే ముచ్చటైన లంగా, ఓణీల కాంబినేషన్ మీ కోసం... 1- నీలాకాశం రంగు నెట్ లెహంగాకు ఎరుపురంగు బెనారస్ చున్నీని జత చేరిస్తే ఏ పండగైనా నట్టింటికి నడిచొచ్చేస్తుంది. మిర్రర్ వర్క్ ఉన్న లెహంగా బార్డర్, బెనారస్ బ్లౌజ్ అదనపు ప్రత్యేకతలు. 2- హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సియాన్ గ్రీన్ రా సిల్క్ లెహంగాను మరింత ఆకర్షణీయంగా మార్చివేసింది బెనారస్ చున్నీ. కుందన్ వర్క్ చేసిన ఆఫ్‌వైట్ రా సిల్క్ బ్లౌజ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. 3- కనకాంబరం రంగు లెహెంగాకు రాయల్ బ్లూ చున్నీ జతకడితే పండిన గోరింటాకు ఎర్రదనం చెక్కిళ్లలో పూస్తుంది. సీక్వెన్స్ చమ్కీ వర్క్ బార్డర్ జత చేసిన లెహంగా స్టోన్ వర్క్‌తో మెరిసిపోతుంటే, కుందన్వర్క్ బ్లౌజ్ ప్రత్యేక శోభను తీసుకువస్తుంది. 4- మిర్రర్ వర్క్ చేసిన షిమా జార్జెట్ మెటీరియల్‌ను లెహంగాగా మార్చి, అద్దాలతో కట్ వర్క్ చున్నీని మెరిపిస్తే పట్టపగలే తారలు దిగివచ్చినట్టుగా అనిపించకమానదు. 5- పీచ్ కలర్ నెట్ లెహంగా, మింట్ గ్రీన్ చున్నీ, ఫుల్ స్లీవ్స్ నెట్ బ్లౌజ్.. పైనంతా స్వీక్వెన్స్ వర్క్‌తో రూపుకడితే రాత్రి దీపకాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోవచ్చు. డిజైనర్ టిప్స్: కుందన్స్, స్టోన్స్, చమ్కీ, మిర్రర్లతో చేసిన వర్క్‌లు పాడైపోకుండా ఉండాలంటే లెహంగాలను దగ్గరికి మడతపెట్టకూడదు. ఎంబ్రాయిడరీ గల లెహంగాలేవైనా హ్యాంగర్‌కి వేలాడదీయాలి. ఏ లెహంగా అయినా శుభ్రపరచాలంటే మైల్డ్ షాంపూతో లేదంటే డ్రై వాష్ చేయించడం ఉత్తమం. మిర్రర్ వర్క్, స్వీక్వెన్స్ వర్క్ గల లెహెంగాలు రాత్రి వేడుకలకు బ్రైట్‌గా కనిపిస్తాయి. సంప్రదాయ వేడుకలకు కేశాలంకరణగా జడ, కాంబినేషన్ ఆభరణాలు బాగా నప్పుతాయి. బర్త్‌డే, రిసెప్షన్ వంటి ఈవెనింగ్ వేడుకలకు కట్ వర్క్ చున్నీలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, వదులుగా ఉండే కేశాలంకరణ బాగా నప్పుతాయి. కర్టెసీ: శశి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్ www.mugdha410@gmail.com