భలెహెంగా!
చినుకుదారాలు నేలను చేరితేనే ప్రకృతి పచ్చకోకను కట్టుకుంటుంది. ఆషాఢం నడుము బిగిస్తేనే... శ్రావణం కొత్తగా ముస్తాబవుతుంది.వేడుకలు వెయ్యింతలై వెలగాలంటే నట్టింట లెహెంగాల అందం భలేగా రూపుకట్టాల్సిందే!
► లేత గులాబీ రంగుకి పసుపుదనం తోడైతే.. ఆ కాంబినేషన్ చూడటానికి రెండు కళ్లు సరిపోవేమో అనిపిస్తుంది. సంప్రదాయ వేడుకకు నిండుతాన్ని మోసుకొస్తుంది.
► బంగారు రంగుకు ఎంబ్రాయిడరీ సొగసును చేర్చితే ఆ‘కట్టు’కునే లెహంగా రూపు ‘వహ్వా’ అనిపిస్తుంది. లాంగ్ అనార్కలీ.. లెహెంగాను తలపిస్తుంది. రెండు రంగుల ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది.
► హై వెయిస్ట్ లెహెంగా శరీర సౌష్టవాన్ని మరింత అందంగా చూపుతుంది. అందుకే లెహంగా కట్‌కు తప్పనిసరి ప్రాధాన్యం ఇవ్వాలి.
► లెహంగాకు కుచ్చుల హంగులు జత చేర్చితే.. కొత్తరూపుతో చూసేవారి మతులను పోగొడుతుంది. ఫైన్ టస్సర్‌తో డిజైన్ చేసిన లెహెంగాలు వేదికలైనా, వేడుకలైనా హైలైట్‌గా వెలిగిపోవాల్సిందే!
► కురుల చివరల నుంచి నేల వరకు గులాబీ అందం అలలుగా జాలువారుతుంటే చూపుల మెరుపులు అతుక్కుపోయి అల్లికలుగా రూపుకడుతుంది. భళేగా ఉంది కదూ! అనకుండా ఉండదు ప్రతి మనసు.
లెహెంగా ఎంపికకు పది సూచనలు...
1. లెహెంగాకు రంగుల కాంబినేషన్ ముఖ్యం. ఆ తర్వాత మెటీరియల్ ఎంపిక. ఆసక్తులను బట్టి ఫ్యాబ్రిక్ ఎంచుకున్నప్పటికీ లెహెంగాకు టస్సర్ సిల్క్, రాసిల్క్ గ్రాండ్ లుక్‌నిస్తాయి.
2. సంగీత్, రిసెప్షన్, పూజలు.. ఇలా సందర్భాన్ని బట్టి రంగుల ఎంపిక ఉండాలి. రాత్రి వేడుకలైతే కాంతివంతమైనవి, పూర్తిగా ఒకే రంగు లెహంగాను ఎంచుకోవాలి.
3. పొడవు, పొట్టి, లావు, సన్నం.. ఇలా శరీర కొలతలను బట్టి లెహెంగా కట్ ఉండాలి. హై వెయిస్ట్ కట్ లెహంగాలు బాగా నప్పుతాయి.
4. బ్లౌజ్‌కి సెలబ్రిటీలైతే బ్రాడ్ నెక్ డిజైన్స్ ఎంచుకుంటారు. ఎవరికి వారు వారి స్కిన్ కలర్, ఎత్తును బట్టి బ్లౌ్లజ్ డిజైన్ చేయించుకోవడం మంచిది.
5. సంప్రదాయ పండగల విషయానికి వస్తే... పసుపు, పచ్చ, మెరూన్ కలర్స్ బాగా నప్పుతాయి.
6. సిల్క్ మెటీరియల్ మాత్రమే కాకుండా మన ప్రాంతీయ ఖాదీ, కాటన్ మెటీరియల్‌తో కూడా లెహంగాలను డిజైన్ చేసుకోవచ్చు.
7. ముందు... రంగుల కాంబినేషన్‌లను స్కెచ్ వేసుకొని చూసుకోవచ్చు.
8. ఎంబ్రాయిడరీ కూడా మరీ గాఢీగా కాకుండా సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి.
9. హైట్ తక్కువగా ఉన్నవారు అంచులు చిన్నగా ఉన్నవి ఎంచుకోవాలి.
10. హై వెయిస్ట్ లెహెంగాలు ధరిస్తే పొడవుగా కనిపిస్తారు.
- దివ్యారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్