వీరఘట్టం: శుభముహూర్తాల సందడి ప్రారంభానికి వేళైంది. ఈ నెల 15తో అధిక జ్యేష్ఠమాసం ముగియడంతో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మరో 20 రోజుల పాటు భాజా భజంత్రీలు మారుమోగనున్నాయి. ఈ నెల 18తో పాటు 22, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో దివ్యమైన శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. అలాగే జూలై 1, 2, 3, 5, 6,7 తేదీల్లో కూడా ముహూర్తాలు ఉండడంతో ఆయా రోజుల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు, గృహ æప్రవేశాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించేందుకు చాలామంది సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి జూలై ఏడో తేదీ వరకు అన్నీ మంచి రోజులేనని వేద పండితులంటున్నారు. జూలై 15 నుంచి నెల రోజుల పాటు ఆషాఢం రానుండడంతో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవని స్పష్టం చేస్తున్నారు.
పురోహితులకు డిమాండ్
ఈ నెల 18వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండడంతో పురోహితులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా రెండు వేల వరకూ వివాహాలకు ముహూర్తాలు ఖరారైనట్టు పురోహితులు చెబుతున్నారు. అలాగే కొద్దిరోజులుగా ఖాళీగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు, పురోహితులకు డిమాండ్ పెరిగింది. ముందుగానే తేదీలను ఖరారు చేసుకోవడంతో చాలామంది ప్రశాంతంగా ఉండగా... మరికొందరు కల్యాణ మండపాలు ఖాళీలేక, బ్యాండు పార్టీలు... పురోహితులు దొరక్క ఆందోళన చెందుతున్నారు. వివాహాలతోపాటు రానున్న 20 రోజుల్లో 14 ముహూర్తాలు ఉండడంతో గృహప్రవేశాలు, నూతన భవానల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసేందుకు సైతం చాలామంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జోరందుకున్న వ్యాపారాలు
వివాహాలు, గృహప్రవేశాలు ముంచుకొస్తోంది.. ముహూర్తాల వేళ..చేయాలనుకునేవారు తమకు కావల్సిన సామగ్రి కొనుగోలులో బిజీగా ఉన్నారు. వస్త్రాలు, బంగారు అభరణాలు, డెకరేషన్ ఇతర సామగ్రి కొనుగోలుకు జిల్లా కేంద్రానికి ప్రజలు పోటెత్తుతుడడంతో దుకాణాలన్నీ కళకళలాడుతున్నాయి.
కల్యాణ మండపం అద్దె ధరలు పైపైకి...
ప్రస్తుత రోజుల్లో చాలా మంది వివాహాల కోసం కల్యాణ మండపాలను ఆశ్రయిస్తున్నారు. అన్ని సౌకర్యాలు అక్కడే లభిస్తుండడంతో ఎక్కువ మంది అటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఎవరి ఆర్థిక స్థితిగతులను బట్టి ఆయా వేదికలను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం అద్దె రూ.5 వేలు నుంచి రూ.10 వేల మధ్య ఉంటే ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేలు పలుకుతోంది. ఏసీ సౌకర్యం ఉన్న కల్యాణ మండపాల ధరలైతే లక్షల రూపాయలకు పైనే పలుకుతున్నాయి.
18 నుంచి పెళ్లిళ్ల సీజన్
ఈ నెల 18 నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు 20 రోజుల పాటు మంచి ముహూర్తాలున్నాయి. ఎక్కువగా ఈనెల 22, 23, 24, 27, 28, 29, 30 తేదీల్లో పెళ్లిళ్లు ఉన్నాయి. జూలై 15 నుంచి ఆషాఢం ప్రారంభం అవుతుంది.
– ఎస్.వి.ఎల్.ఎన్.శర్మయాజీ, వేద పండితుడు, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment