పర్వదినాలకు శుభారంభం కార్తిక మాసం | Parvadinalaku started the month of Karteekamasam | Sakshi
Sakshi News home page

పర్వదినాలకు శుభారంభం కార్తిక మాసం

Published Mon, Nov 4 2013 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

పర్వదినాలకు శుభారంభం కార్తిక మాసం

పర్వదినాలకు శుభారంభం కార్తిక మాసం

పున్నమి చంద్రుడు కృత్తికానక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ మాసానికి కార్తికమాసం అని పేరు. ఈ మాసంలో చేసే ఆలయ సందర్శనం, అర్చనలు, అభిషేకాలతోపాటు, స్నానదానాదులు కూడా అత్యంత విశిష్ఠమైనవే. అలాగే నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఆచరించదగ్గ విధులు. కార్తికమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్లకాలువలలోనూ నివసిస్తాడట. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావిస్తూ...  సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేయాలి.  
 
ఈ మాసంలో ప్రతిరోజూ  పుణ్యప్రదమైనదే. అయితే ఏ రోజున ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మచ్చుకు కొన్ని తిథులు... ఈవారం ఆచరించవలసిన విధుల వివరాలు...
 
కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, ‘నేను చేయదలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించ’మని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.
 
విదియ:
ఈ రోజు సోదరి చేతి భోజనం చేసి ఆమెకు యథాశక్తి కానుకలు ఇచ్చిరావాలి. అలా చేసిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.
 
 తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుందని ప్రతీతి.
 
 కార్తీక శుద్ధ చవితి: దీనికే నాగుల చవితి అని పేరు. ఈ వేళ పగలు ఉపవాసం ఉండి, నియమనిష్ఠలతో సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోసిన వారికి కడుపు పండుతుందని కార్తికపురాణం చెబుతోంది.
 
 పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.
 
 రోజూ చేయలేకపోయినా...
 
 ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారంనాడయినా సరే నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పినట్లు కార్తిక పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమినాడు పగలు ఉపవసించి, రుద్రాభిషేకం చేయించి శివాలయంలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక కథలు, గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది.
 
 ఈమాసం... వనసమారాధనలకు ఆవాసం
 
 మామూలు రోజులలో గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. వనసమారాధనలో ఉసిరిగ చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్న సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం బోధిస్తోంది. కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతోపాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయంలో, పితృతర్పణ సమయంలో, భ్రష్టులు, ఛండాలురు, సూతకం ఉన్నవాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయని పురాణోక్తి.  
 
 ఈ రెండు వాదనలూ సరైనవే...
 
 కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే.
 
 ఈ మాసంలో ఇవి చేయరాదు
 
 తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట  తినరాదు.
 
 ఈ మాసం... ఇవి చేయడం మంచిది
 
 ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి  ఇహపర సౌఖ్యాలతోబాటుఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేనివారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్నభోజనం చేసి, రాత్రికి పాలు, పళ్లు తీసుకోవచ్చు.
 
 ఇలా చేయడం అధిక ఫలదాయకం
 
కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటీ పూజిస్తే సమస్త సౌఖ్యాలు కలగడంతోపాటు జన్మరాహిత్యం కలుగుతుందట. ఆరుద్ర నక్షత్రాన, మాసశివరాత్రినాడు, సోమవారం రోజు, పున్నమినాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతో పూజించిన వారు అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ఇవేవీ పాటించ(లే)కున్నా, సంప్రదాయాన్ని పాటించేవారిని గేలిచేయకుండా, వారికి సాయం చేస్తూ, పరనిందకు దూరంగా ఉంటూ,  కలిగినదానిలోనే దానధర్మాలు చేసేవారికి సైతం పుణ్యఫలాలు కలుగుతాయని పెద్దల వాక్కు.
 
 - డి.వి.ఆర్.
 
 కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులూ వాదిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురి వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే.
 
 సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి.
 ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు)
 పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1,
 సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034
 మెయిల్: sakshi.features@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement