శ్రీశైలం.. ఇల కైలాసం
శ్రీశైలం: కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైలాలయం శివరాత్రి శోభను సంతరించుకుంది. దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. భక్తుల రద్దీని ముందుగానే ఊహించిన అధికారులు ఆదివారం రాత్రి మైకుల ద్వారా ప్రాతఃకాలసేవా టికెట్లను నిలుపుదల చేసినట్లు ప్రకటించారు. స్వామివార్ల గర్భాలయంలో నిర్వహించే రుద్రాభిషేకాలు, అమ్మవారి శ్రీచక్రం ఎదుట నిర్వహించే కుంకుమార్చన తదితర ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపేస్తూ ఈఓ సాగర్‌బాబు ప్రకటించారు.
శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక సోమవారం, అందులోనూ కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో పుణ్య నదీ స్నానం ఆచరించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్షేత్రం పోటెత్తింది. రద్దీ విపరీతంగా పెరగడంతో వసతి సౌకర్యాలు లభించక వందలాది భక్తులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సోమవారం వేకువజామునే పవిత్ర పాతాళగంగలో పుణ్య స్నానాలాచరించుకున్న భక్తులు నేరుగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రత్యేక, అతిశీఘ్ర, ఉచిత దర్శన క్యూలలో నిరీక్షించారు.
భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత అభిషేకాలు లేకపోవడంతో వీఐపీలు సైతం స్వామివార్లను దూరం నుంచే దర్శించుకున్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ నుంచి ప్రధాన మాడా వీధిలోని గంగాధర మండపం వరకు రోడ్డుపైనే భక్తులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3.30గంటల వరకు రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సాయంకాల పూజావేళల అనంతరం రాత్రి 6గంటల నుంచి రద్దీ మళ్లీ కొనసాగింది. ఉచిత దర్శనానికి 7గంటలకు పైగా సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి 5గంటలు, అతిశీఘ్ర దర్శనానికి 3గంటల పాటు భక్తులు క్యూలలో వేచి చూడాల్సి వచ్చింది.
అయితే ముందస్తుగా చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో టికెట్ పొందిన అభిషేక సేవాకర్తలకు వృద్ధ మల్లికార్జునస్వామివార్ల వద్ద అభిషేకాలను నిర్వహించుకునే సౌలభ్యం కల్పించారు. పవిత్ర పాతాళగంగ పుణ్యనదీ స్నానాలు, స్వామివార్ల దర్శనం, కార్తీకదీపారాధనలు, వ్రతనోములతో చివరి కార్తీక సోమవారాన భక్తులు ఉపవాసదీక్షలను విరమించారు. దర్శనానంతరం మల్లన్న భక్తులకు లడ్డూ ప్రసాదాల కొరత రాకుండా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా క్యూలలో వృద్ధులు, చిన్నారులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాలవితరణ చేశారు.