అభివృద్ధి దిశగా శ్రీశైల క్షేత్రం
శ్రీశైలం: రానున్న రోజుల్లో శ్రీశైల మహాక్షేత్రం మరెంతో అభివృద్ధి చెందుతుందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగని ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప అన్నారు. కార్తీకమాసం సందర్భంగా శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లను దర్శించుకోవడానికి గురువారం రాత్రి ఆయన కుటుంబ సమేతంగా శ్రీశైలం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రధానాలయగోపురం వద్ద ఈఓ నారాయణ భరత్ గుప్త ఆలయ మర్యాదలతో వారికి ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతి దర్శనం చేసుకున్నాక స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర విశేషపూజలను నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలను పలుకగా, ఈఓ స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, శ్రీశైలాలయ జ్ఞాపికను అందజేశారు. వారి వెంట జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఎస్పీ సుప్రజ, సీఐ విజయకృష్ణ తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రంలో సకల సౌకర్యాల రూపకల్పన జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఇప్పటికే క్షేత్ర అభివృద్ధిలో భాగంగా ఈఓ నారాయణ భరత్‌గుప్త మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతంగా చేయిస్తున్నారన్నారు. మాస్టర్‌ప్లాన్ పనులన్ని పూర్తయితే శ్రీశైల క్షేత్రం కొత్త శోభను సంతరించుకుంటుందని పేర్కొన్నారు.