భక్తులతో పోటెత్తిన శ్రీశైలం
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం కార్తీకమాసం రెండో సోమవారం భక్తులతో పోటెత్తింది. సోమవారం ఉదయానికి లక్షకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ భరత్ గుప్త ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. రెండో కార్తీక సోమవారం.. సప్తమి, శ్రవణా నక్షత్రం కలిసి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుందని వేదపండితులు తెలిపారు. ఇలాంటి పర్వదినాన్ని కోటి సోమవారం అని అంటారని పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో అభిషేకాలు
కార్తీకమాసం సోమవారాన మల్లన్న రికార్డు స్థాయిలో 2,250 అభిషేకాలను నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేకువజాము నుంచే భక్తులు పవ్రితపాతాళగంగలో కార్తీక స్నానాలచరించుకుని నేరుగా స్వామిఅమ్మవార్ల దర్శనార్థమైన క్యూలలోకి చేరుకున్నారు. దీంతో అన్నిక్యూలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. కార్తీకమాసంలో రెండవ సోమవారం సప్తమి,శ్రవణా నక్షత్రం కలిసి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలవైపు మొగ్గు చూపారు.దీంతో 1328కిపైగా సామూహిక అభిషేకాలు, 785 సింగిల్ అభిషేకాలు, గర్భాలయంలో జరిగే రూ. 5వేల అభిషేకం టికెట్లు 137, మొత్తం 2,250 అభిషేకాల టికెట్లను విక్రయించగా, 351 కుంకుమార్చన టికెట్లను విక్రయించినట్లు అధికారులు తెలిపారు.