మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నెల రోజుల క్రితం చుక్కలనంటిన చికెన్ ధరలు ప్రస్తుతం సగానికి పడిపోయాయి. మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుండగా చికెన్ మాత్రం చీప్‌గా మారింది. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ 180 ఉండగా ప్రస్తుతం రూ 88కు పడిపోయింది. చికెన్ ప్రియులను తగ్గిన ధరలు ఆనందంలో ముంచినా బ్రాయిలర్ వ్యాపారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన దాణా ఖర్చులకు.. పడిపోతున్న చికెన్ ధరలకు కనీసం పొంతన లేకుండా పోతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిలో చికెన్ ఉత్పత్తికి దాణాతో పాటు మొత్తం రూ 70 ఖర్చవుతుండగా ప్రస్తుతం కోడిని కిలో 55రూపాయలకే విక్రయిస్తున్నారు. కార్తీకమాసపు పూజల ప్రభావం చికెన్ ధరలపై పడింది. ప్రతి యేటా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చికెన్ ధరలు తగ్గుదల సాధారణమే అయినా ఈసారి మాత్రం భారీగా తగ్గాయి.
ఆకాశన్నంటుతున్న కూరగాయలు
చికెన్ ధరలు ఓ వైపున తగ్గుతుండగా కూరగాయల ధరలు మాత్రం ఆకాశన్నంటుతున్నాయి. దొండకాయల ధర చికెన్‌కు పోటీగా ఉంది. కిలో దొండకాయలు రూ 80కు విక్రయిస్తున్నారు. అలుగడ్డ కిలో రూ 40, బెండకాయలు కిలో రూ 40, బీరకాయలు కిలో రూ 40, పచ్చిమిర్చి కిలో రూ 50, గోకరకాయ కిలో రూ 50కు విక్రయిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. దీంతో హైదరాబాద్, విజయవాడ నుంచి దిగుమతి అయ్యే కూరగాయలకు ధరలు పెరిగాయి. దానికి తోడు కార్తీకమాసంలో కూరగాయల వాడకం ఎక్కువగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా నిలిచింది.