కార్తీకం... భక్తికి ముక్తికి ఆవాసం. | karhika masam special | Sakshi
Sakshi News home page

కార్తీకం... భక్తికి ముక్తికి ఆవాసం.

Published Sun, Nov 15 2015 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

కార్తీకం... భక్తికి ముక్తికి ఆవాసం.

కార్తీకం... భక్తికి ముక్తికి ఆవాసం.

నిర్మలమైన నీలాకాశం... అటు ఎండా, ఇటు చలీ రెండూ అంత ఎక్కువగా బాధించని ఆహ్లాదకరమైన వాతావరణం... రకరకాల సువాసనాపుష్పాలతో నిండిన పూలమొక్కలు ... చెవికి ఇంపుగా వినపడుతుంటే కేశవనామాలు, శివపంచాక్షరీ స్తుతులు... మనసును ఆనంద డోలికలలో ముంచెత్తే పూజలు, కనువిందుగా, మనసుకు నిండుగా కనిపించే దీపాలు... నాసికాపుటాలకు సోకే సుగంధపరిమళాలు... గుండెలలో నిండిన ఆధ్యాత్మికతతో, భక్తితో అరమోడ్చిన కన్నులతో కనిపించే భక్తులు... ఈ వాతావరణం కనపడిందీ అంటే అది కచ్చితంగా కార్తికమాసమే!

పౌర్ణమినాడు కృత్తికానక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తికమాసమని పేరు. అటు హరికీ, ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకీ కూడా ప్రీతిపాత్రమైన మాసమిది. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీకమాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే తలనిండా స్నానం చేయాలి. అలా స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించాలి.

రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా ఒక్క సోమవారంనాడయినా సరే నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే పుణ్యప్రదం. కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది.
 హరిహరస్వరూపం

 కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... కాదు... ఈ మాసంలో ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే ఆ ఇరుపక్షాల వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే. కొందరు శివకేశవులకు భేదాలు కల్పించి, స్పర్థలు సృష్టిస్తారు. ఈశ్వరుని అర్ధనారీశ్వరత్వం శివకేశవులకు భేదం లేదని చెబుతుంది.
 
ఇవి చేస్తే మంచిది

 ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి  ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేనివారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్నభోజనం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్లు తీసుకోవచ్చు.
 రోగులు, అశక్తులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో వీలుపడని వారు కనీసం సాధ్యమైనవాటినయినా సంపూర్తిగా ఆచరించి విష్ణ్వాలయానికి వెళ్లి దీపాలు వెలిగించి పండితులకు లేదా పేదలకు యథాశక్తి దానాలు చేసి భక్తి పూర్వకంగా నమస్కరించి, వారి ఆశీస్సులందుకోవాలి.
 
క్షీరాబ్ధి కన్నియకు...శ్రీ మహావిష్ణువుకు...
 కార్తీక శుద్ధ ఏకాదశికే ఉత్థాన ఏకాదశి అని, దేవోత్థాన ఏకాదశి అనీ, ప్రబోధిని ఏకాదశి అనీ పేరు. మరుసటి రోజున అంటే ద్వాదశినాడు తులసీపూజ, శ్రీ మహావిష్ణువుతో తులసీ కళ్యాణం నిర్వహిస్తారు. దీనికే మరో కథ కూడా ఉంది. దేవదానవులు క్షీరసాగర మధనం చేసిన రోజు కనుక క్షీరాబ్ధి ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అనీ పేరొచ్చింది.

క్షీరసాగరంపై శయనించి ఉండే శ్రీమహావిష్ణువు ఈ రోజున తన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మితోనూ, బ్రహ్మాది దేవతలతోనూ కలసి బృందావనికి తరలి వస్తాడు కాబట్టి ద్వాదశినాడు భక్తిశ్రద్ధలతో విష్ణుపూజ చేయడం చాలా మంచిది. క్షీరాబ్ధి కన్యక అయిన శ్రీ మహాలక్ష్మిని తన అర్ధాంగిగా చేసుకున్నది ఈ రోజే కనుక ముత్తయిదువులకు పసుపు కుంకుమలిచ్చి దీవెనలు పొందిన వారి సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ప్రతీతి.

ఈ రోజున తులసి కోటలో ఉసిరి కొమ్మను నాటి, దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు చేస్తారు. చలిమిడితో చేసిన ప్రమిదల్లో ఆవునేతితో దీపాలు పెడతారు. క్షీరాబ్ది ద్వాదశినాటి సాయంకాలం వేళ తులసి కోట ముందు దీపాలు వెలిగించిన ఇంట కలకాలం ధనధాన్యాలు నిలుస్తాయని శాస్త్రవచనం. క్షీరాబ్ధి ద్వాకార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యాస్తమయం తర్వాత స్నాన, దాన పూజాదులు చేసిన వారికి అధిక ఫలం కలుగుతుంది.

 పుణ్యప్రదమైన పౌర్ణమి
 కార్తీకమాసంలో రెండవ పర్వదినం కార్తీక పూర్ణిమ. ఈ మాసమంతా ప్రతిరోజూ స్నానం, ఉపవాసం, ఆలయ సందర్శన చేయడం, ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం శ్రేష్ఠం.
 
దివ్యఫలాల దీపదానం
 కార్తీకమాసంలో చేసే అన్ని దానాలలోను దీపదానానికి విశిష్ఠత వుంది. వెండి ప్రమిదలో బంగారపు వత్తిని వేసి వేదవిదుడైన విప్రుని పిలిచి ఆవునేతితో దీపం వెలిగించి దానం చేయాలి. మట్టి ప్రమిదలో లేదా బియ్యపుపిండితో చేసిన ప్రమిదలో ఆవునెయ్యి పోసి అయినా దీపదానం చేయొచ్చు.
 
కార్తీకమాసంలో బిల్వపత్రాలతో శివుని పూజించిన వారికి ఇహంలో సుఖసంపదలు, పరంలో శివసాయుజ్యం కలుగుతాయట. మొగలి పూవులతో శ్రీమన్నారాయణుని అర్చిస్తే వేద వేదాంగాలు అభ్యసించగలిగే అర్హత కలుగుతుందట. శివునికి జిల్లేడు పూలు, మారేడు దళాలతోనూ, విష్ణువుకు తులసి, మల్లె, తామర, జాజి, దర్భలతో పూజ చేయడం వల్ల భోగభాగ్యాలతో తులతూగుతారని శాస్త్రోక్తి. తాజాఫలాలను దానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలవుతాయట. అన్నదానం, తిలదానం చేసినవారికి సకల దేవతారాధన చేసిన ఫలితం ప్రాప్తిస్తుందట. కార్తీక బహుళ అమావాస్యనాడు ఎవరెన్ని దీపాలు పెడితే అంత పుణ్యం లభిస్తుందని నమ్మకం.
 
దొన్నెల్లో దీపాలు.. స్వర్గానికి నిచ్చెనలు
 కార్తీకమాసంలో అరటి బోదెలు తెచ్చి ఒక్కొక్క పొరను వొలుస్తారు. అలా ఆకుపచ్చ పట్టలు పోయి తెల్లటి పట్టలు వచ్చే వరకూ వొలుస్తారు. వాటిని కత్తిరించి అడుగు పొడవున దొన్నెల్లా చేస్తారు. ఈ దొన్నెలకు ఇరువైపులా మైదాపిండి ముద్ద లేదా చలిమిడితో అంచులను మూసి, పడవలా తయారు చేసి, దీపారాధన చేస్తారు. ఈ అరటి దొన్నెల్లో చిన్న చిన్న ప్రమిదలనుంచి దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజించి ఏరు, కాలువ, చెరువు లేదా బావిలో వదలుతారు. అరటి దొన్నెలు లభ్యం కాకపోతే నిమ్మడిప్పల్లో కూడ దీపాలు పెట్టవచ్చు. పట్నాలలో బావులు, ఏరులలో వదలడం కుదరదు కాబట్టి ఇంటిలోనే వెడల్పాటి పాత్రలో నీరు పోసి, దానిలోనైనా వదలవచ్చు. కార్తీక అమావాస్య నాడు పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేయడం లేదా ఉప్పు పప్పుతో కూడిన సంబారాలనూ దానం చేయడం వల్ల పెద్దలు స్వర్గసుఖాలు పొందుతారని ప్రతీతి.
 - డి.వి.ఆర్.
 
 విశిష్టఫలాల వనసమారాధన
 సాధారణ దినాలలో గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొనడం పరిపాటి. ఎందుకంటే వనసమారాధనలో ఉసిరి చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్న సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, కార్తీకవనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయని కార్తీక పురాణం చెబుతోంది.
 
 ఈ మాసంలో ఇవి చేయొద్దు ఉల్లి, వెల్లుల్లి, మద్యపానం, మాంసభక్షణం ఇతరులకు ద్రోహం. పాపపు ఆలోచనలు. దైవదూషణ. పరనింద, అతి భోజనం, అతి నిద్ర, అతి జలపానం, రెండుపూటల భోజనం, క్షౌరం
 
 సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత?
 కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైనఅగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది.  
 
 స్నానం... దానం...

 ఈ మాసంలో కనీసం ఒక్క రోజైనా నదీస్నానం చేసి, ఆవునేతితో దీపారాధన చేయాలి. నదీస్నానం కుదరకపోతే ప్రాతఃకాలాన లేచి చన్నీటి స్నానం చేయాలి. దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటీ పూజించాలి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమినాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ ఈశ్వరుని పూజించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement