నియమాల తోరణం
అలౌకికం
మాసాలన్నింటిలోకి కార్తికం అత్యంత పవిత్రమైనది, ఆహ్లాదకరమైనదీ, హరిహరులకు, వారి తనయుడైన అయ్యప్పకు ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, దీక్షలు అనంతమైన ఫలాన్నిస్తాయి. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకునేవారు సాధారణంగా కార్తికమాసంలోనే మాల ధారణ చేస్తుంటారు. ఈ మాసంలో మరో పన్నెండురోజులు మిగిలాయి. ఈ మిగిలున్న రోజుల్లోనైనా నియమనిష్ఠలతో గడుపుతూ, మనస్సునూ, శరీరాన్నీ పవిత్రంగా ఉంచుకోవడం ఆవశ్యకం.
ఇష్టదైవాలను బట్టి, జీవనశైలిని బట్టి ఈ మాసంలో మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా అయ్యప్పమాల, భవానీమాల, శ్రీవెంకటేశ్వరమాల, సాయిమాల, గణపతి మాల, గోవిందమాల, శివమాల, హనుమద్దీక్ష... బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ అన్ని రకాల మాలధారణలు సక్రమమైన దినచర్య, నియమనిష్ఠలనే ప్రధానంగా సూచిస్తున్నాయి. దైవకృపకు పాత్రులవాలంటే పవిత్రత తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. రోజువారీ జీవితంలో పాటించడానికి అనువుగా ఉండని జీవనశైలిని ఈ దీక్షా కాలంలో అనుసరించ వలసి వుంటుంది. మానసిక బలహీనతలను దూరంచేసుకోవడానికి, మనసుపై నియంత్రణ సాధించడానికి ఈ దీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయన్నది సత్యం. అదేవిధంగా ఇంచుమించు అన్ని రకాల దీక్షలూ కూడా మండల దీక్షలే కావడం గమనార్హం.
ఎందుకంటే ఏదైనా కొత్త పనిని కనీసం 40 రోజుల పాటు దినచర్యలో భాగం చేసినప్పుడే అది అలవాటుగా మారుతుంది. అందుకే మండల దీక్షల పేరిట సంప్రదాయాన్ని విధించారు పెద్దలు. అదే ఈ నియ‘మాల’ రహస్యం. దీక్షల ద్వారా భక్తి, ఆధ్యాతిక భావనలతోబాటు ఆరోగ్యకర జీవనశైలి అలవడుతుండటం ప్రత్యక్ష ప్రయోజనాలు. అందుకోవడం, ఆచరించడం ఆధ్యాత్మికానందాలలో ఓలలాడటం ఆవశ్యకం. - కృష్ణ కార్తీక