అయ్యప్ప దీక్షకు చన్నీటి స్నానం, భూశయనం, పాదచారులై నడవడం, ఒంటిపూట భోజనం, బ్రహ్మచర్యం, మద్యమాంసాదులు, మసాలా దినుసులు వంటి తామసకారకాలైన పదార్థాలను త్యజించడం వంటి నియమాలు పాటించాలి. ఆ స్వామి దీక్షను చేపట్టే వారు గురుస్వామి ద్వారా తులసి, రుద్రాక్షమాలలను ధరిస్తారు. నుదుట చందనం, విభూది ధరిస్తారు. ఈ నియమాలన్నిటి వెనకా ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయి. రెండుపూటలా చన్నీళ్ళస్నానం ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాక, మనసును ప్రశాంతంగా ఉంచి భగవద్ధ్యానానికి తోడ్పడుతుంది.
తులసి పూసల నుంచి వెలువడే వాయువు ఆరోగ్యాన్నిస్తుంది. రోగనిరోధక గుణం కల తులసి, రద్రాక్షలు రక్తపోటు, మధుమేహం మొదలైన ఎన్నో రోగాల అదుపుకు ఉపకరిస్తాయి. విభూతి, గంధం ధరించడం వల్ల చక్కటి వర్ఛస్సు, ధైర్యం, బలం కలగడమేగాక వాత, పిత్త, కఫ రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ఆహార నియమం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి, కోరికలను అదుపులో ఉంచుతుంది. పాదరక్షలు ధరించరాదనే నియమం వెనుక ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి కలుగుతుంది.
నలభై ఒక్క రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల క్రింద చర్మం మొద్దుబారి అడవులలో సునాయాసంగా నడిచేందుకు వీలవుతుంది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదనటానికే నలుపు దుస్తుల ధారణ. అంతేకాదు, నలుపు తమోగుణాన్ని సూచిస్తుంది. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే నలుపు పరమాత్ముని లయ కారక తత్వం నల్లరాళ్లను కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది. మనోనిశ్చలత, జ్ఞానశక్తి దేహానికి బలాన్ని ఇస్తాయి కాబట్టే ఆ అయ్యప్ప భక్తులకు కఠినమైన బ్రహ్మ చర్యం కూడా దీక్షలో భాగమైంది.
Comments
Please login to add a commentAdd a comment