చెడు చీకటి నుంచి సత్యం వైపు నడిపించే జ్యోతి మార్గమే అయ్యప్ప దీక్ష అరిషడ్వర్గాలను అరికట్టే అమోఘమైన దీక్ష అయ్యప్ప దీక్ష. ఏటా కార్తీక మాసం నుంచి అయ్యప్ప దీక్షల సందడి మొదలవుతుంది. మార్గశిర, పుష్య మాసాల వరకు ఈ సందడి కొనసాగుతుంది. అయ్యప్ప వెలసిన శబరిమలలో మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో దీక్షను ముగించే వారు కొందరైతే, మండల దీక్షలు చేపట్టే భక్తులు కొందరు జ్యోతి దర్శనంతో నిమిత్తం లేకుండా, దీక్ష గడువు పూర్తవడంతోనే స్వామిని దర్శించుకుని దీక్ష విరమించుకుంటారు. కనీసం మండలకాలం... అంటే నలభైఒక్క రోజులు అత్యంత కఠినమైన నియమ నిబంధనలతో త్రికరణ శుద్ధిగా సాగించే అయ్యప్ప దీక్షలు భక్తుల మనశ్శరీరాలను ప్రక్షాళన చేస్తాయి. వారిలో ఆధ్యాత్మికతను ఇనుమడింపజేస్తాయి. భక్తులకు కొంగుబంగారంగా శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామి గురించి, ఆయన భక్తుల దీక్షల గురించిన విశేషాలు మకర సంక్రాంతి సందర్భంగా...
ఆరోగ్య దీప్తి... సామూహిక స్ఫూర్తి
అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే భక్తులు పాటించే నియమాలు సామాన్యులకు కఠినతరంగా అనిపిస్తాయి. అయితే, ఈ నియమాలు ఇంద్రియ నిగ్రహానికి, ఆత్మ సంయమనానికి, దుర్వ్యసనాల నుంచి విముక్తికి దోహదపడతాయని చెబుతారు. దీక్షలో ఉండే భక్తులు సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చన్నీటితో స్నానం చేస్తారు. ఉదయం, రాత్రివేళల్లో కేవలం అల్పాహారం తీసుకుంటారు. మధ్యాహ్నం మాత్రమే భోజనం చేస్తారు. అల్పాహారమైనా, భోజనమైనా పూర్తిగా సాత్వికాహారమే తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలకు, మాంసాహారానికి దూరంగా ఉంటారు. మద్యపానం, ధూమపానం, తాంబూలం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు.
దీక్ష పూర్తయ్యేంత వరకు క్షురకర్మ సహా అన్ని బాహ్యాలంకారాలకు దూరంగా, కేవలం దీక్షా వస్త్రాలతోనే ఉంటారు. కటిక నేల మీదనే శయనిస్తారు. అయ్యప్ప దీక్షలో కొనసాగే భక్తులకు విధి నిషేధాలు చాలానే ఉన్నాయి. అనవసర ప్రసంగాలకు, అసత్యానికి వారు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. పాదరక్షలను ధరించకూడదు. ఇతరులను మాటలతో గాని, చేతలతో గాని హింసించే పనులేవీ చేయరాదు.
గురుస్వామి ద్వారా దీక్ష మాల ధరించినది మొదలు, శబరిమల యాత్ర పూర్తి చేసుకుని, మాలను తీసివేసేంత వరకు అయ్యప్ప భక్తులు ఈ కఠోర నియమాలను తు.చ. తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. దీక్షలో ఉన్నప్పుడు ఎక్కువ కాలం భజనల్లోను ‘ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప’ అనే శరణు ఘోషలో గడపాల్సి ఉంటుంది. ఇంత నియమబద్ధంగా నలభై ఒక్క రోజులు గడిపే వారిలో శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయి.
దీక్షకు ముందు క్రమశిక్షణ లేకుండా గడిపేవారిలో సైతం దీక్ష పూర్తయ్యాక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు సంయమనం, సహనం, ఆత్మ నిగ్రహం, ఏకాగ్రత పెరుగుతాయని చెబుతారు. ఒకసారి దీక్ష తీసుకున్న వారు ఏటేటా మళ్లీ మళ్లీ దీక్ష తీసుకుని అయ్యప్పను దర్శించుకోవాలని ఉవ్విళ్లూరుతారు. ఏటేటా దీక్షలు చేపట్టే భక్తులు ఆధ్యాత్మిక చింతనతో తామసిక ప్రవృత్తికి దూరంగా ఉంటారు. అయ్యప్ప స్వాములందరూ బృందాలుగా ఉంటూనే సామూహికంగా దీక్షలు సాగిస్తారు. ఈ దీక్షలు వారిలో సామూహిక స్ఫూర్తి పెంపొందించేందుకు దోహదపడతాయి.
సన్మార్గానికి సోపానాలు
శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయానికి పద్దెనిమిది మెట్లు ఉంటాయి. నియమ నిష్ఠలతో దీక్ష సాగించి, ఇరుముడితో ఇక్కడకు చేరుకునే వారు మాత్రమే ఈ మెట్లు ఎక్కగలరని అంటారు. అయ్యప్ప ఆలయానికి గల ఈ పద్దెనిమిది మెట్లు సన్మార్గానికి సోపానాలని ప్రతీతి. వీటిలోని తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలకు (కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మం); తర్వాతి ఎనిమిది మెట్లు అష్టరాగాలకు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, తత్వ అహంకారాలు); ఆ తర్వాతి మూడు మెట్లు త్రిగుణాలకు (సత్వ రజస్తమో గుణాలు); మిగిలిన రెండు మెట్లు విద్య, అవిద్యలకు ప్రతీకలుగా భావిస్తారు. వీటన్నింటినీ అధిగమించిన తర్వాతే భక్తులు అహాన్ని వీడి భగవంతుని చేరుకోగలుగుతారని చెబుతారు. అంతేకాదు, ఈ పద్దెనిమిది మెట్లు అష్టాదశ పురాణాలకు ప్రతీక అని కూడా అంటారు. స్వామి భక్తులు దీక్ష చేపట్టినప్పుడు కట్టిన ఇరుముడిని తలపై పెట్టుకుని ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి, స్వామిని దర్శించుకుంటారు. ఇరుముడిని సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరిస్తారు.
హరిహర సుతుడి గాథలు
అయ్యప్పస్వామి హరిహర సుతుడిగా ప్రసిద్ధుడు. మోహినీ అవతారంలోని విష్ణువును శివుడు మోహించిన ఫలితంగా అయ్యప్ప జననం సంభవించిందనే కథనం బాగా ప్రచారంలో ఉంది. మోహినీ అవతారం గురించిన ప్రస్తావన ఉన్న భాగవతంలో అయ్యప్ప జననం ప్రస్తావన కనిపించదు. అయితే, హరిహర నందనుడిగా అయ్యప్ప జననానికి సంబంధించిన గాథ శ్రీ భూతనాథ పురాణంలో విపులంగా ఉంది. ఈ గాథ మేరకు భక్తులు అయ్యప్పస్వామిని హరిహర నందనుడిగానే భావిస్తారు. శివకేశవులకు పుట్టిన వాడైనందున శైవులు, వైష్ణవులు కూడా అయ్యప్పను ఆరాధిస్తారు.
అయ్యప్పస్వామి జనన కారణానికి సంబంధించి ఒక గాథ ఉంది. దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేశాక, అతడి సోదరి మహిషి దేవతలపై పగబట్టింది. దేవతలపై పగతీర్చుకోనే శక్తుల కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించింది. శివకేశవులకు పుట్టిన సంతానం తప్ప తనను ఎవరూ జయించరాదని, అది కూడా ఆ హరిహర నందనుడు భూలోకంలో ఒక రాజు వద్ద పన్నెండేళ్లు సేవాధర్మం నిర్వర్తించిన తర్వాత మాత్రమే తనను జయించగలగాలని, లేకుంటే తన చేత ఓటమి చెందాలని వరం కోరింది మహిషి. ‘తథాస్తు’ అంటూ వరాన్ని అనుగ్రహించాడు బ్రహ్మదేవుడు. ఇక అప్పటి నుంచి మహిషి దేవతలను పీడించసాగింది.
ఇదిలా ఉంటే, హరిహర నందనుడిగా మెడలో మణిమాలతో మణికంఠుడిగా జన్మించిన అయ్యప్ప తన తండ్రి శివుడి ఆదేశంపై పంపా సరోవర తీరాన ఉన్న అరణ్యంలో బాలకుడిగా అవతరించాడు. సంతానం లేని పందళ దేశాధీశుడు రాజశేఖరుడు వేట కోసం అడవికి వచ్చినప్పుడు దివ్యతేజస్సుతో ఉన్న బాలకుడు కనిపించాడు. భగవంతుడే తనకు కుమారుడిని ప్రసాదించాడనే సంతోషంతో రాజశేఖరుడు ఆ బాలకుడిని అంతఃపురానికి తీసుకుపోతాడు. ముద్దులొలికే శిశువును చూసి మహారాణి సంతోషిస్తుంది.
అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషానికి మహారాణికి కడుపు పండి, కొద్దికాలానికి మగశిశువును ప్రసవిస్తుంది. అయ్యప్పను కూడా రాజ దంపతులు కన్నకొడుకుతో సమానంగా అల్లారు ముద్దుగా పెంచసాగారు. బాలకుడిగా ఉన్నప్పుడే అయ్యప్ప జనులకు ధర్మవర్తనపై మార్గదర్శక సూత్రాలను బోధించాడు. బాల్యంలోనే ఆయన ధర్మనిష్ఠకు ముగ్ధులైన జనులు ఆయనను ‘ధర్మశస్త’ పేరుతో పిలవసాగారు. మెడలో మణిహారంతో దొరికిన కారణంగా మణికంఠుడిగా కూడా పిలవసాగారు. మణికంఠుడి సాత్విక గుణాల వల్ల కొందరు ఆయనను ‘అయ్య’ అని, ఇంకొందరు ‘అప్ప’ అని పిలవసాగారు.
మరికొందరు రెండింటినీ కలిపి ‘అయ్యప్ప’ అని పిలవసాగారు. రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తిస్తాడు. విద్యాభ్యాసానికి తగిన వయసు రాగానే రాజశేఖరుడు అయ్యప్పను, తన కొడుకును గురుకులానికి పంపుతాడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకు వచ్చిన తర్వాత అయ్యప్పకు రాజ్యభారాన్ని అప్పగించాలని భావిస్తాడు రాజశేఖరుడు. మహారాణికి అది నచ్చక తలనొప్పి అంటూ నాటకమాడుతుంది. తన వ్యాధి తగ్గడానికి పులిపాలు కావాలంటుంది. పులిపాలు తెస్తానంటూ అయ్యప్ప అడవికి బయలు దేరుతాడు.
మహిషి వధ
అయ్యప్ప అడవికి బయలుదేరే సమయంలో నారదుడు కూడా అడవికి వెళ్లాడు. అడవిలో సంచరిస్తూ మునులను, దేవతలను పీడించే మహిషిని కలుసుకున్నాడు. కలహప్రియుడైన నారదుడు ‘నిన్ను చంపేందుకు రాజకుమారుడు ఈ అడవికి వస్తున్నాడు’ అంటూ మహిషిని రెచ్చగొట్టాడు. పులిపాల కోసం అడవికి వచ్చిన అయ్యప్పను చంపడానికి మహిషి గేదె రూపంలో రంకెలు వేస్తూ బయలుదేరింది. ఎదురుపడిన అయ్యప్ప మీదకు లంఘించింది.
అయ్యప్ప అమాంతం అక్కడే ఉన్న కొండపైకి ఎక్కి తాండవమాడుతూ మహిషిని ఎదిరించాడు. మహిషితో అయ్యప్ప యుద్ధాన్ని తిలకించడానికి దేవతలంతా అదృశ్యరూపంలో అక్కడకు చేరుకున్నారు. భీకర యుద్ధంలో అయ్యప్ప మహిషిని ఒడిసి పట్టుకుని నేలకేసి విసిరికొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. మహిషి పీడ విరగడ కావడంతో ఇంద్రాది దేవతలు హర్షాతిరేకాలతో ముందుకు వచ్చి అయ్యప్పను వేనోళ్ల ప్రస్తుతించారు. ‘స్వామీ! నిన్నెలా సేవించుకోగలం’ అని దేవతలు ప్రశ్నించగా, ‘నేను పులి పాల కోసం ఈ అడవికి వచ్చాను. మీరంతా పులులుగా మారి నాకు తోడ్పడండి’ అని కోరాడు. దేవతలంతా పులులుగా మారిపోయారు. ఇంద్రుడు పులి రూపంలో తానే అయ్యప్పకు వాహనంగా మారాడు. పులుల దండుతో అయ్యప్ప రాజ్యానికి చేరుకుంటాడు.
శబరిమల నివాసం
అడవి నుంచి రాజ్యానికి చేరుకున్న అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలని భావిస్తాడు రాజశేఖరుడు. అయ్యప్ప తనకు రాజ్యం వద్దని, తనకు ఒక ఆలయాన్ని నిర్మించి ఇస్తే చాలని కోరుతాడు. తాను ఇక్కడి నుంచి సంధించి విడిచి పెట్టిన బాణం ఎక్కడ పడుతుందో అక్కడ తనకు ఆలయం నిర్మించాలని సూచిస్తాడు. అయ్యప్ప విడిచిన బాణం శబరిమల కొండ మీద పడుతుంది. అక్కడ కట్టించిన ఆలయంలోనే అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకుని జనుల మంచిచెడ్డలు చూసుకునేవాడు. ఈ ఆలయంలో కొలువైన అయ్యప్ప ఇప్పటికీ తమ కోర్కెలు తీరుస్తుంటాడని భక్తుల నమ్మకం. అయ్యప్ప వెలసిన ఈ శబరిమల లోగడ రామభక్తురాలైన శబరికి ఆవాసంగా ఉండేది. శబరి శ్రీరాముడికి తాను రుచి చూసిన పండ్లు తినిపించినది ఇక్కడేనని ప్రతీతి.
శబరిమల యాత్ర
దీక్ష స్వీకరించి, నియమబద్ధంగా మండలం రోజులు గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. స్వామి సన్నిధానాన్ని సందర్శించుకుని, ఇరుముడిని స్వామికి సమర్పించి, ప్రసాదాన్ని స్వీకరించడంతో యాత్ర ముగుస్తుంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పడమటి కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది శబరిమల. దట్టమైన అడవులు ఉన్న ప్రాంతంలో పద్దెనిమిది కొండల నడుమ ఉన్న శబరిమల అయ్యప్ప సన్నిధానానికి యాత్రలు ఏటా నవంబరు నెలలో ప్రారంభమవుతాయి.
జనవరి నెలలో మకర సంక్రాంతి నాటితో ముగుస్తాయి. కార్తీకమాసంలో మండల దీక్షలు చేపట్టే వారు సాధారణంగా నవంబర్ నెలలో స్వామిని దర్శించుకుని, యాత్రను ముగిస్తారు. ‘మకర విళక్కు’ యాత్రకు వెళ్లే వారు మకర సంక్రాంతి రోజున స్వామిని దర్శించుకుంటారు. ఇదేరోజు ఆలయం నుంచి చూసే వారికి ‘మకరజ్యోతి’ కనిపిస్తుంది. మకరవిళక్కు యాత్రకు వెళ్లే భక్తులు ‘మకరజ్యోతి’ దర్శనంతో యాత్రను ముగించుకుంటారు.
ఎరుమేలితో యాత్ర మొదలు...
శబరిమల యాత్ర ఎరుమేలి నుంచి మొదలవుతుంది. ఎరుమేలిలో భక్తులు తొలుత ‘వావరు స్వామి’ని దర్శించుకుంటారు. వావరు స్వామి తొలుత గజదొంగగా ఉండేవాడు. అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి వెళ్లినప్పుడు ఆయనను అడ్డగించాడు. స్వామి మహిమను తెలుసుకున్న తర్వాత స్వామికి భక్తుడిగా మారిపోయాడు.
ఒకరకంగా వావరుస్వామి అయ్యప్పస్వామికి తొలి భక్తుడు. ‘నా దర్శనానికి వచ్చే భక్తులందరూ తొలుత నిన్ను దర్శించుకుంటారు’ అని అయ్యప్పస్వామి వావరుస్వామికి వరం ఇచ్చినట్లు ప్రతీతి. ముస్లిం అయిన వావరుస్వామి ఎరుమేలిలోని మసీదులో వెలిశారు. స్వామి భక్తులందరూ తొలుత ఇక్కడి మసీదులోని వావరు స్వామిని దర్శించుకుంటారు. దర్శనం తర్వాత రకరకాల వేషధారణలతో ‘పేటై తుళ్ల’ అనే నాట్యం చేస్తారు. ఎరుమేలిలో ఉన్న ‘ధర్మశాస్త’ ఆలయంలో అయ్యప్పస్వామి ధనుర్బాణాలతో దర్శనమిస్తాడు. ఇదే ఆలయంలో వినాయకుడు కూడా కొలువై ఉన్నాడు.
అరణ్యమార్గంలో పాదయాత్ర
వావరు స్వామి దర్శనం తర్వాత ఎరుమేలి నుంచి అయ్యప్పస్వామి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. శబరిమల వెళ్లడానికి ఇక్కడి నుంచి రెండు మార్గాలు ఉన్నాయి. ‘పెద్దపాదం’ మార్గం అత్యంత దుర్గమమైన అరణ్యమార్గం. దాదాపు ఎనభై కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలో పెరుర్‌తోడు, కాలైకుట్టి అనే స్థలాలు ఉన్నాయి. మహిషితో అయ్యప్ప యుద్ధం చేస్తుండగా కాలైకుట్టి నుంచి శివకేశవులు ఆ యుద్ధాన్ని తిలకించారట. ఇక్కడకు చేరువలోనే అళుదా నది ఉంది. మహిషి కన్నీరు కార్చగా ఆ కన్నీరే ఇక్కడ అళుదా నదిగా ఏర్పడిందట.
ఈ నదిలో భక్తులు స్నానాలు ఆచరించి, నది నుంచి రెండు రాళ్లను తీసుకువెళతారు. ఆ రాళ్లను మహిషిని పూడ్చిపెట్టిన చోటు ‘కళిద ముకుంద’ వద్ద పడవేస్తారు. అక్కడి నుంచి ముందుకు సాగి కరిమల కొండకు చేరుకుంటారు. ఏటవాలుగా ఉండే ఈ కొండ మీదకెక్కడం చాలా కఠినమైన పని అని చెబుతారు. అయితే భక్తులు ఎలాంటి భయం లేకుండా శరణుఘోషతో బృందాలు బృందాలుగా ముందుకు సాగుతారు. కరిమల కొండను దాటిన తర్వాత పంపా నది వద్దకు చేరుకుంటారు. పంపానదిలో స్నానం భక్తుల అలసటను పోగొడుతుంది. పంపా స్నానం తర్వాత భక్తులు ఇక్కడి నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వామి సన్నిధానానికి చేరుకుంటారు.
కఠినమైన ‘పెద్దపాదం’ మార్గంలో వెళ్లలేని భక్తులు ‘చిన్నపాదం’ మార్గాన్ని ఎంచుకుంటారు. ‘చిన్నపాదం’ మార్గంలో బస్సులు తిరుగుతాయి. ఈ మార్గంలో భక్తులు నేరుగా పంపానది వరకు బస్సుల్లో చేరుకోవచ్చు. అయితే, అక్కడి నుంచి సన్నిధానం వరకు పాదయాత్ర సాగించాల్సి ఉంటుంది.
ఇరుముడి
అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమల వెళ్లే భక్తులు నెత్తిమీద ‘ఇరుముడి’ని మోసుకుపోతుంటారు. ‘ఇరుముడి’ అంటే రెండు అరలు ఉండే మూట. ఈ ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ ఒకటి, రెండు మామూలు కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు, నాణేలు, పసుపు, గంధపు పొడి, విభూతి, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, అరటిపండ్లు, కలకండ, అగరువత్తులు, కర్పూరం, మిరియాలు (వావరు స్వామి కోసం), తేనె, ఎండుద్రాక్ష, తువ్వాలు తదితరమైనవి పెట్టుకుంటారు. దీక్ష స్వీకరించే భక్తులు ఈ వస్తువులను ‘ఇరుముడి’గా కట్టుకొనే ఉత్సవాన్ని ‘కెట్టునిరా’ లేదా ‘పల్లికట్టు’ అంటారు.
నలుపు దుస్తులు ఎందుకంటే.?
అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు దీక్షా వస్త్రాలుగా నలుపురంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారంటే... ఒకసారి శనీశ్వరుడు అయ్యప్పస్వామితో తలపడి ఓటమి చెందాడు. శనీశ్వరుడు శరణు వేడటంతో క్షమించిన అయ్యప్పస్వామి ఆయనకు ‘నా దీక్ష చేపట్టే భక్తులు నీకు ఇష్టమైన నలుపు రంగు దుస్తులే ధరిస్తారు’ అంటూ వరమిచ్చాడు. అందుకే అయ్యప్ప భక్తులు నలుపురంగు దుస్తులను ధరిస్తారు. అలాగే, అయ్యప్ప భక్తులకు శనీశ్వరుడు ఎలాంటి ఇక్కట్లూ కలిగించడని ప్రతీతి.
పడిపూజ
అయ్యప్పస్వామి దీక్షలో కొనసాగే భక్తులు శక్తిమేరకు తోటి స్వాములను ఆహ్వానించి భిక్ష (భోజనం) పెడతారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి సన్నిధానాన్ని తలపించే రీతిలో పద్దెనిమిది మెట్లతో పీఠాన్ని ఏర్పాటు చేసి, దానిపై అయ్యప్పను నిలిపి పూజలు చేస్తారు. భజనలు, పూజలు, శరణుఘోషతో భక్తి పారవశ్యాలతో గడుపుతారు. ఈ కార్యక్రమాన్నే పడిపూజ అంటారు.
గురుస్వామి ప్రశస్తి
అయ్యప్ప దీక్షలు చేపట్టే భక్తులు గురుస్వామిని సాక్షాత్తు అయ్యప్పస్వామికి ప్రతిరూపంగా భావిస్తారు. గురుస్వాములే మిగిలిన స్వాములకు మాలధారణం చేయిస్తారు. తొలిసారి అయ్యప్ప మాల ధరించే వారిని కన్నెస్వాములంటారు. రెండోసారి మాల ధారణ చేసేవారిని కత్తి స్వాములని, మూడోసారి మాలధారణ చేసేవారిని ఘంట స్వాములని, నాలుగోసారి మాలధారణ చేసేవారిని గద స్వాములని, ఐదోసారి మాల ధారణ చేసేవారిని పెరుస్వాములని, ఆరోసారి మాలధారణ చేసేవారిని గురుస్వాములని అంటారు.
హరివరాసనం
అయ్యప్పస్వామి పూజ చివరిలో ‘హరివరాసనం’ లేదా ‘శ్రీ హరిహరాత్మజాష్టకం’ గానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. శబరిమలతో పాటు ఇతర ప్రాంతాల్లోని అయ్యప్పస్వామి ఆలయాల్లోనూ ‘హరివరాసనం’ గానంతో అయ్యప్పస్వామి పూజలను ముగిస్తారు. ఇది స్వామివారికి జోల వంటిది. ఇందులో ఎనిమిది శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతున్నప్పుడు ఆలయంలోని ఒక్కొక్క దీపాన్ని కొండెక్కిస్తారు. చివరిగా గర్భగుడిలో ఒక్క దీపాన్ని మాత్రమే ఉంచుతారు. ‘హరివరాసనం’ స్తోత్రాన్ని కుంబకుడి కులతూర్ అయ్యర్ రచించారు. స్వామి విమోచానంద ఈ స్తోత్రాన్ని 1955లో శబరిమలలో గానం చేశారు. అప్పట్లో ఈ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగా ఉండేది.
ఆ కాలంలో వీఆర్ గోపాల మీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆయన అయ్యప్ప సన్నిధానంలో నిత్యం ‘హరివరాసనం’ స్తోత్రాన్ని గానంచేస్తూ వచ్చేవాడు. కొన్నాళ్లకు గోపాల మీనన్ శబరిమల నుంచి వెళ్లిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆయన కాలం చేశాడు. ఆయన మరణవార్త తెలుసుకున్న అయ్యప్పస్వామి అర్చకుడు ఈశ్వరన్ నంబూద్రి ఆలయాన్ని మూసివేసే సమయంలో ‘హరివరాసనం’ స్తోత్రాన్ని గానం చేశాడు. అప్పటి నుంచి ఆలయం మూసివేసే సమయంలో ఈ స్తోత్రాన్ని గానం చేయడం సంప్రదాయంగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment