చట్టాలు సమర్ధం అమలు అవ్వలి
అప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది: చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా
సాక్షి, హైదరాబాద్: చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా చెప్పారు. లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ కల్పించేందుకు తెచ్చిన కొత్త చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులు, న్యాయమూర్తులు, మీడియా, పౌరసమాజంపైనే ఉందన్నారు. ఆదివారం రాష్ట్ర న్యాయ సేవా సంస్థ, ఏపీ పోలీస్ అకాడమీ (అప్పా)లు సంయుక్తంగా.. ‘లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం-2012’పై న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహించారుు. అప్పాలో జరిగిన ఈ సదస్సుకు జస్టిస్ సేన్ గుప్తా ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం సమర్ధవంతమైన చట్టాలకు రూపకల్పన చేయాలంటూ ఐక్యరాజ్యసమితి 1992 డిసెంబర్ 18న చేసిన తీర్మానాన్ని అంగీకరిస్తూ మన దేశం కూడా సంతకం చేసినా...ఈ చట్టాన్ని రూపొందించేందుకు రెండు దశాబ్దాలకు పైగా సమయం పట్టడం శోచనీయమన్నారు. చట్టానికి రూపకల్పన జరిగి ఏడాది దాటినా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని చెప్పారు.
ఐపీసీ అభియోగాల్లో నిందితులు నేరం చేసినట్లు పోలీసులు నిరూపించాల్సి ఉంటుందని...అయితే ఈ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే తాను నేరం చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. లైంగిక హింసకు గురవుతున్న బాలల వివరాలను, వార్తలను ప్రచురించడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత మీడియా, ప్రజలపై ఉందని సూచించారు. పోలీసులు ఫిర్యాదు అందిన వెంటనే నేర నిరూపణకు తగిన ఆధారాలను సేకరించాలని తెలిపారు. దేశంలో 50 శాతానికి పైగా చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు తేలిందని హైకోర్టు న్యాయమూర్తి జి.రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో బాధిత చిన్నారుల వాంగ్మూలం నమోదు, తుది విచారణ (ట్రయల్) చిన్నారులను వేధించే విధంగా ఉండకూడదని సూచించారు. వేధింపులకు గురైన చిన్నారుల వ్యక్తిగత వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాచీన భారతీయ సాంప్రదాయాలకు తిలోదకాలివ్వడమే అన్ని అనర్ధాలకు మూలమని హైకోర్టు జడ్జి ఎల్.నరసింహారెడ్డి అన్నారు. నేటి ఆధునిక సమాజంలో చిన్నారులపై హింస పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలో ఓ బోరు బావిలో పడిన చిన్నారిని నాలుగవ తరగతి వరకు చదివి మేస్త్రీగా పనిచేస్తున్న మరో చిన్నారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాళ్లకు తాడుకట్టుకొని తలకిందులుగా బోరుబావిలోకి దిగి రక్షించాడని...ఆ చిన్నారి ధైర్యసాహసాలను ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. విషయం తెలిసి తాను ఆ చిన్నారిని ఘనంగా సన్మానించానన్నారు. చిన్నారులకు లైంగిక విద్య అవసరమనే ఉద్దేశంతో 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాల్లో.. 8, 14, 18 సంవత్సరాల్లో బాలబాలికల అవయవాల ఎదుగుదలను వివరించేందుకు రంగుల్లో ముద్రించిన నగ్న చిత్రాలు జుగుప్సాకరంగా ఉండడంతో తాను బహిరంగంగానే వ్యతిరేకించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవడంతో ప్రభుత్వం ఉపసంహరించుకుందని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై చిన్న కుటుంబాలు వచ్చాయని, పిల్లల సంరక్షణను ఆయాలు, వార్డర్లు చూస్తుండడంతో వారు తల్లిదండ్రుల సంరక్షణకు దూరమవుతున్నారని డీజీపీ ప్రసాదరావు అన్నారు.
లైంగిక దాడికి గురైన చిన్నారులు తీవ్రమైన మానసిక ఆందోళన మధ్య ఉంటారని, వారిని బెదిరింపులకు గురిచేయకుండా పోలీసులు మానవీయకోణంలో దర్యాప్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు కేసీ భాను, ఆర్.సుభాష్‌రెడ్డి, చంద్రయ్య, చంద్రకుమార్, మాజీ జడ్జి శేషశయనారెడ్డి, అప్పా డెరైక్టర్ మాలకొండయ్య, డీఐజీ వెంకటేశ్వరరావు, లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ కమిటీ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంటేశ్వరరావు, కింగ్‌షుక్‌నాగ్, ఆర్‌వీ రామారావు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు అశోక్‌బాబు, దాసప్ప, గౌస్‌బాష, తారకరామ్, ఎల్.రవిబాబు, షమీమ్ అక్తర్, బాలయోగి, రజని, నాగమారుతిశర్మ, సీహెచ్ కనకదుర్గారావు, భానుమతి, లీలావతి, జయసూర్య, ఎన్.బసవయ్య, జి.చక్రధరరావు, కేఏపీ స్వామి, టి.గంగిరెడ్డి, జి.గోపాలక్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.