‘కార్యదర్శుల’ కేసులో నేడు హైకోర్టు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకపు జీవోను నిలుపుదల చేయాలా? వద్దా? అన్న విషయంపై హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించనున్నది. పార్లమెంటరీ కార్యదర్శుల చట్టాన్ని, ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, జలగం వెంకటరావు, వి.శ్రీనివాస్‌గౌడ్, జి.కిషోర్‌కుమార్, వి.సతీష్‌కుమార్, కోవా లక్ష్మీలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలను గురువారం మరోసారి విచారించింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం రాజ్యాంగ విరుద్ధమని, నియామకాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు.
ఈ వాదనలను అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి తోసిపుచ్చారు. పార్లమెంటరీ కార్యదర్శులు మంత్రులు కాదని, వారికి మంత్రి హోదా మాత్రమే ఉంటుందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామంటూ విచారణను వాయిదా వేసింది.