ఛాతీ ఆసుపత్రి తరలింపుపై జోక్యం చేసుకోం: హైకోర్టు
- ఛాతీ ఆసుపత్రి తరలింపుపై జోక్యం చేసుకోం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఆసుపత్రిని తరలిచాలన్న నిర్ణయం ఎలా చట్ట విరుద్ధమవుతుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణ యం చట్ట విరుద్ధమని నిరూపించినప్పుడే తాము జోక్యం చేసుకోగలమని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాలను మూసివేస్తున్నట్లు తెలిపింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛాతీ, టీబీ ఆసుపత్రిని ఎర్రగడ్డ నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను సోమవారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ కేసులో వాదనలు వినేందుకు నాగం జనార్దన్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. నాగం తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు.
వారసత్వ సంపదకు ఆధారాలు చూపండి..
ఎర్రగడ్డలోని ఛాతీ, టీబీ ఆసుపత్రిని అక్కడి నుంచి తరలించి, దాని స్థానంలో సచి వాలయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ ఆసుపత్రుల ప్రాంగణంలో చారిత్రక భవనాలు ఉన్నాయని, అందువల్ల సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు బి.మద్దిలేటి, తెలంగాణ నవ నిర్మాణ సేన అధ్యక్షుడు కె.వెంకటయ్య దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనలు విన్న తర్వాత ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలోని చారిత్రక భవనాలకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ ఉంటే చూపాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.